సుమారు 1957లోనే ‘’ఆంద్ర మహా భక్త విజయం ‘’అనే అమూల్య రచన చేసినవారు శ్రీ పంగులూరి వీర రాఘవుడు గారు .ఈ పు స్తక౦ పై రెడ్డిపాలెం ఆనందాశ్రమానికి చెందిన యోగి పుంగవులు శ్రీ లక్ష్మీ కాంత యోగి ఇలా వివరిచారు-‘’ఇండియాలో ఇతర దేశాలలో మహా బుద్ధిమంతులు అక్కడి మహా భక్తుల జీవిత విశేషాలను విశాల దృక్పధం తో రాశారు.అవి దివ్య జ్యోతుల్లా ప్రకాశిస్తున్నాయి .వీటి వలన భక్తీ జ్ఞాన వైరాగ్యాలు కలుగుతున్నాయి .ఆంద్ర దేశం లో అలాంటి మహా భక్తుల చరిత్ర రాయటానికి ఎవరూ సాహసించలేదు .పంగులూరి వారు ముసలితనం లో అలాంటి రచన 80 సంవత్సరాల వయసులో చేసి ధన్యులయ్యారు ‘’.రచయిత ఈపుస్తక రచనలో తన ఉద్దేశ్యాన్ని ‘’మనశ్శక్తిని ఆత్మ శక్తిగా మార్చగలవి కర్మ భక్తీ జ్ఞానాలు .ఆత్మ శక్తిని బయటికి తీసినవాడే సమర్ధుడు .భగవంతుడు శక్తి స్వరూపుడు .భక్తుని భావాన్ని బట్టి ఆ శక్తి ఆకారం దాలుస్తుంది .భక్తుడు భగవంతునిలాగా సర్వ సమర్ధుడు .ప్రత్యక్ష భగవంతుడే భాగవతోత్తముడు .భగత్స్వరూపులైన అలాంటి వారి జీవిత విశేషాలు ,వారు చేసినమహాద్భుతాలు వివరించటానికే ఈ పుస్తకం రాశాను.ముద్రణకు ధనసాయం చేసినవారందరికీ కృతజ్ఞతలు . ‘’అని చెప్పుకొన్నారు .ఈ గ్రంథం7-5-1957 న ముద్రణ పొందింది .వెల 5 రూపాయలు మాత్రమే .
కవిరచయిత అయిన వీర రాఘవుడుగారు బాపట్ల తాలూకా అప్పికట్ల గ్రామ వాసి .శ్రీమాన్ కాశీ కృష్ణాచార్యులవారు ‘’ఆంధ్రలో అనేక వర్ణాలలో పుట్టి మహా భక్తులైన వారెందరో ఉన్నారు .వారి పేర్లు సుపరిచితం అయినా వారి గురించి పూర్తిగా ఎవరికీతెలియదు.ఈలోపాన్ని పూరించిన వారు పంగులూరి వారు .అలాగే మరి కొందరి జీవితాలను బుర్ర కధలు ‘’గా మార్చి లోకానికి అందించాలి ‘’అని ప్రశంసించారు .గుంటూరుకు చెందినశ్రీ రాగం ఆంజనేయులు-పాండిత్య ,కవిత్వాల జోలికి వెళ్ళకుండా ,అనుభవోపేతమైన వాక్యాలతో భక్తుల చరిత్ర సుబోధకం గా రాశారు .దేశాభిమానం ,ఆత్మ విశ్వాసం ,ఆత్మ గౌరవం కలిగించారు ‘’అన్నారు తిరుమల తిరుపతి దేవస్థాన ఆస్థాన మహా విద్వాన్,పండిత శ్రీమాన్ వేదాంతం జగన్నాధా చార్యులు -‘’ఈపుస్తకం చదువుతుంటే ఆనా౦ద బాష్పాలు కారుతాయి ,ఆనంద పారవశ్యం కలుగు తుంది ‘’అని శ్లాఘించారు
వీరరాఘవ శర్మగారు మహా భక్త కవి వరేణ్యులు .గుంటూరు లోని శ్రీ రామనామ క్షేత్రం లో వెలసిన శ్రీ కోదండ రామ స్వామి పై ప్రార్ధనా పద్యాలు చెప్పారు .
పోతనతో ప్రారంభించి మొత్తం 43 మహా భక్తుల విజయగాధలను శ్రీ పంగులూరి వీర రాఘవశర్మ గారు ఈ భక్త విజయం లో రాశారు .
వీరి కుమారులు డా శ్రీ పంగులూరి హనుమంతరావు రావు గారు ఈ పుస్తకాన్ని ఆధునీకరించి అందమైన రంగుల ముఖ చిత్రం తో కొంత సరళభాషతో 2014 న శ్రీ కౌండిన్య పబ్లికేషన్స్ అనే తమ స్వంత సంస్థ ద్వారా ముద్రించి పిత్రూణ౦ తీర్చుకొన్నారు .నాకు సరస భారతికి ఆత్మీయులైన రావు గారు ఆ నూతన గ్రంధాన్ని నాకు పంపారు .
ఇంతకంటే వివరాలు నాకు లభించలేదు .
దీపావళి శుభా కాంక్షలతో
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -14-11-20-ఉయ్యూరు