మల్లినాథ సూరి వ్యక్తిత్వం
మల్లినాథుడు బహుముఖ ప్రజ్ఞాశాలి ,మహా విద్యా వేత్త .సంస్కృత భాషలోని ప్రతి శాఖ లోనూ అపార పాండిత్యజ్ఞాన సంపన్నుడు .ఆయన రాసిన వ్యాఖ్యానాలలో ఉటంకించిన అనేక రచనలు రచయితలను పరిశీలిస్తే ఎన్ని రచనలు చదివాడో ఎంతమంది కవులను అధ్యయనం చేశాడో తెలిసి ఆశ్చర్యపడతాం .ఆ రచనలు ఆకవులు మనమెప్పుడూ కనీ వినని వారే .సూరి రచనలను మనం క్రమంగా అధ్యయనం చేస్తే ,ఆయన పండిత లోకం లో సాధించిన క్రమానుగత అభి వృద్ధి ,పొందిన గుర్తింపు తెలుస్తుంది.ఆయన మొదటి వ్యాఖ్యానం సంజీవని లో సూరి తనను మల్లినాథుడు అని మాత్రమే చెప్పుకొన్నాడు యే బిరుదులూ పేర్కొనకుండా.శిశుపాల వధకు వ్యాఖ్య రచించే నాటికి సూరి మహోపాధ్యాయ ,సుధీ అయ్యాడు .భట్టి కావ్య వ్యాఖ్యానం లో సుధీ అని చెప్పుకోన్నాడే కాని అంతకు ముందు చెప్పుకొన్న కవి అనే మాట వదిలేశాడు .తప్పుడు వ్యాఖ్యానాలు రాసిన తనకు ముందున్న వ్యాఖ్యాతలను ఆయన వదిలిపెట్ట లేదు ఉతికి ఆరేశాడు .కాని ఆయన ఆరాధ్యకవి కాళిదాసు లాగా సూరి మహా వినయసంపన్నుడు..తనకున్న ప్రతిభ వ్యుత్పత్తి అభ్యాసాలను ఎప్పుడూ వదిలిపెట్టలేదు .
మల్లినాథుడు ‘’రఘు వీర చరిత ‘’వంటి కావ్యాలు రాశాడు .అది అలభ్యం .ఆయన రాసిన కవిత్వ మేకాక ,తానూ రాసిన వ్యాఖ్యానలన్నిటిలో రఘు వంశం లోని మొదటి సర్గలోని శ్లోకాలు ఉదాహరించాడు .ఏకావలి లో చంద్రోదయం లో తన శ్లోకాలే ఉదాహరణ గా చెప్పాడు కూడా. సూరి లోని మహా విద్వత్ వ్యాఖ్యాత తనలోని కవిత్వానికి నీడ అయ్యాడేమో ?
మల్లినా ధనాథుడు దురాశాపరుడు ,అత్యాశా పరుడు కానే కాదు .అత్యంత పవిత్రుడు తన నడవడిలో ,కార్యక్రమాలలో కూడా . సూరి రచనలలో ఎక్కడా మనకు ఆయన సంపన్నుడు అనికానీ ,బీదరికం లో ఉన్నట్లు కానీ సూచన కనిపించదు.మహా దైవ భక్తుడు మల్లినా థుడు .మానవమాత్రులను స్వప్రయోజనం కోసం స్తుతించి పబ్బం గడుపుకొనే తత్వమున్న వాడు కానే కాదు .ఏదో ఒక దైవాన్నిహరిని , కానీ హరుని కానీ కీర్తించే వాడు కూడా కాదు .సూరి రాసిన స్తోత్రాలను పరిశీలి౦చినా ,రఘువంశం మొదలైన ఆయన ఉదాహరించిన శ్లోకాలను పరి శీలించినా ఆయనకు హరి –హర భేదం లేదని ,అర్ధనారీశ్వరం పై ఉన్న ఆసక్తి స్పష్టమౌతుంది .
ఆధారం –విద్యా వాచస్పతి ,పండిత రాయ ,సాహిత్య విశారద ప్రొఫెసర్ ఎన్. సి. వి .నరసింహా చార్య (ఉస్మానియా యూని వర్సిటి సంస్కృత శాఖాధ్యక్షులు )రచించిన ‘’Mallinadha –A study ‘’.లో ‘’Personality of Mallinadha ‘’వ్యాసం . ఈ పుస్తకాన్ని శ్రీ నరసింహా చార్యులవారు మా మైనేని గోపాలకృష్ణ గారి ద్వారా పరిచయమై ,ఈ గ్రంధాన్ని నాకు 2-11-2016 న దీపావళి నాడు ఆదరంగా పంపారు .వారి రచనల నాధారంగా వారి గురించి గీర్వాణకవుల కవితా గీర్వాణం 2వ భాగం లో రాశాను .
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -15-11-20 ఉయ్యూరు
—