కిరాతార్జునీయం-
నాల్గవ సర్గ- 2.
యక్షుడు శరదృతు వైభవాన్ని అర్జునుడికి అడగకపోయినా వివరించాడు ‘’శుభం భాగ్యం ఇచ్చే ఈ శుభ సమయం లో పనుల ఫలితం కలిగి కృతర్ధత లభిస్తుంది .నిర్మలమైన నీరు ,నీరు లేని మేఘాలున్న ఈ శరత్తు మీకు జయం చేకూరుస్తుంది అర్జునా !ఇప్పటిదాకా వర్షర్తు గొప్ప ప్రేమతో లోకాన్ని ముంచింది .ఇప్పుడు శరత్తు ఎక్కువ కాలం ఉండక పోయినా ఆ ప్రేమను స్థిరం చేస్తుంది-‘’నవైర్గుణ్యై సంప్రతి సంస్తవ స్థిరం –తిరోహితం ప్రేమ ఘనాగమ శ్రియః ‘’
‘’వర్షాకాలం లో తెల్లని కొంగల బారులు ,ఇంద్రధనుస్సుతో ఉన్న మేఘాలు ఆకాశానికి అందం కలిగిస్తాయి ..ఇవేవీ లేకపోయినా శరత్తు నిర్మలాకాశం తో ఆకర్షణీయ శోభ పొందుతుంది.అందమైన వస్తువుకు అల౦ కారసామగ్రి అక్కర్లేదు కదా –‘’తధాపి పుష్ణాతినభః శ్రియం వరాం –న రమ్య మాహార్య మపేక్షతే గుణం’’
‘’ఇప్పుడు దిక్కులన్నీ తెల్లబడ్డాయి .నీరు లేకపోయినా మేఘాలు ఆనందాన్నిస్తున్నాయి .వర్షర్తు అనే భర్త విరహాన్ని భరించలేక దిగ్వదువులు పాలిపోయి తెల్లని రంగుల్ని దుర్బలమైన పాలిండ్లు గా ,జారిన మొలత్రాళ్ళు కృశించినా అందంగానే ఉన్నాయి –‘’’’ఇదం కదంబానిల భర్తు రత్యయే –న దిగ్వధూనాం కృశతా న రాజతే ‘’
‘’ప్రజలు శరత్తు లో మాధుర్యం కోల్పోయి ,నెమళ్ళ క్రీ౦ కారాల పై ఆసక్తి లేకుండా ,మదించిన కలహంసల కూజితాల పట్ల ఆదరం చూపుతున్నారు .గుణం వలన ప్రీతి కలుగు తుందే కానీ ,పరిచయం వలన కాదు ‘’.వరిపొలాల్లో కంకులు బాగా నిండుగా ఉండి,పంటలు సమృద్ధిగా పండాయి పసుపురంగు తిరిగి చేలు పంటబరువుకు ఒంగిపోతున్నాయి .పొలం నీటిలో వికసించిన నల్ల కలువ పూల వాసన చూడటానికా అన్నట్లు వంగాయి .(నాలుగు శ్లోకాలతో ఒకే విషయాన్ని వర్ణించ టాన్ని’’ కలాపం’’ అంటారు).కొలను నీరు పద్మ పత్రాలతో ఆకుపచ్చ గా ఉంది .కమలాల ఎరుపు కాంతి శోభగా ఉంది.నివ్వరి దాన్యకేసరాలతో కలిసి అటూ ఇటూ ఊగుతూ ఇంద్ర ధనుస్సులా ఉంది –‘’మృణాళినీ నామను రంజితం త్విషా—విభిన్న మంభోజ పలాశ శోభయా –పయః స్ఫుర చ్చాలి శిఖాపి శంగితం –ద్రుతం ధనుష్ఖండ మివాహి విద్విషః’’
గాలికి చెట్లు ఊగుతున్నాయి వాటి పుప్పొడి పుష్పం లాగా వ్యాపించింది .పువ్వులతో శోభిస్తున్న వృక్షాలు ఆ పుప్పొడిని పట్టు కొంటున్నాయా అని పిస్తున్నాయి .కాముడు కాముని పైట లాగగా ,ఆయువతి క్రీగంట చూసి ,పైట సరి చేసు కొన్నట్లుగా అందంగా ఉంది –‘’అనా విలోన్మీలిత బాణ చక్షుషః –స పుష్ప హాసా వనరాజీ యోషితః ‘’
‘’అగ్ని లేకుండానే కళ్ళు మిరుమిట్లు గొలిపే మెరుపు ,తెల్లని మబ్బు తునకలు వ్యాపించి ఎండను అడ్డు కొన్నట్లుగా ఉంది .కొద్దిగా నీటి తు౦పుర్లు కురుస్తుంటే ఆకాశం కమలాల సుగంధం తో వాయువు వ్యాపించింది ..వరిపొలాల్లోని నీటిని వనపంక్తి రూప వనితా జనాన్ని ,ఆకాశ మార్గం లక్ష్యంగా పరిగెత్తే తెల్లని రెక్కల హంసల కలకూజితాలు మేఘాలతో దిక్కులు పరస్పరం మాట్లాడు కొంటున్నట్లు గా ఉన్నది –‘’సితచ్చదానామ పదిశ్య దావతాం-రుతైరమీషా గ్రధితాః పతత్రిణా౦ –ప్రకుర్వతే వారిద రోధ నిర్గతాః-పరస్పరాలాపమివామలా దిశః ‘’
సాయం వేళ మేతను౦డి ఇంటికి తిరిగి వచ్చే ఆవులు ఒకదానినొకటి తప్పించు కొంటూ కొట్టాలు చేరుతుంటే ,తమ దూడలు జ్ఞాపకం రావటం తో పొదుడుగులనుంచి అప్రయత్నంగా పాలు కారి పోతున్నాయి .ఆ పొదుగులు దూడలకు బహుమానంగా ఉన్నాయా అని పిస్తున్నాయి .కోస్టాలు చేరి పాలు, పెరుగు ,వెన్నె నెయ్యి, మొదలైన హోమ ద్రవ్యాలతో పవిత్ర మయ్యేజగత్తుకు కారణమైన ఆ ధేనువులు దూడల్ని కలుసుకొని ఆప్యాయంగా పాలిస్తున్నాయి .నెమళ్ళ కంటే మధురంగా పాడే గోపికలు పాటలకు అడ లేళ్లు ఆకర్షింప బడి బాగా ఆకలితో ఉన్నా ,మేత మెయ్యాలనే కోరిక లేకుండా ఉన్నాయి .నివ్వరి ధాన్యం బాగా పండి నేలకు ఒరిగి తలయెత్తినిలబడ్డ కమలాలు ఉన్నాయి .పొలాలలో నీరు ఆరిపోయింది .నివ్వరి ధాన్య నాయకుడు తలవంచి ప్రార్ధించినా, మెత్తపడని కమలం అనే నాయిక ,నాయికా విరహంతో పాలిపోయిన నాయక డి లా ఉన్నారు-‘’ఉపైతి శుష్య న్కలమః సహా౦భసా మనో భువా తప్త ఇవాభి పాండుతాం’’’.కమలాల పుప్పొడి సుగంధం వ్యాపించగా వర్షపు చినుకుల చల్లదనం తో వాయువు చేత ఆకర్షింప బడిన తుమ్మెదలకు మరో దారి లేకపోయింది .రాజ భయంతో ఎలా తప్పించు కోవాలో తెలియని దొంగల్లా ,దోషుల్లా ఉన్నాయి తుమ్మెదలు –‘’ఉపాగమే దుశ్చరితా ఇవా పదా౦ –గతిం న నిశ్చేతు మలం శిలీ ముఖాః’’
‘’పగడం లాగా ఎర్రగా ఉన్న నోళ్ళతో పసుపు రంగు పండిన నివ్వరి ధాన్యం కంకులను పట్టుకొన్న శిరీష పుష్పం లాంటి పచ్చని చిలుకలవరుస అనేక రంగులతో ఇంద్ర ధనుస్సులా ఉన్నది –‘’ముఖై రసౌ విద్రుమ భంగ లోహితైహ్-శిఖాఃపిశంగీహ్ కమలస్య విభ్రతీ-శుకావలి ర్వ్యక్త శిరీష కొమలా –ధనుహ్ శ్రియః గోత్ర భిదోను గచ్ఛతి’’’’అని యక్షుడు అర్జునునికి శరత్ శో వర్ణించి చెప్పాడు .ఇంతలో సూర్యుని కూడా కప్పి వేసేంత ఎత్తులో హిమాలయ పర్వతం చూశాడు .అది కాంతివంతమైన మేఘ సముదాయంగా ఉంది .అరణ్యాలతో నల్లని రంగు పొంది ,ఉన్న ఆ ప్రాంత భూమి ,పైన తెల్లని మంచు కప్పిన శిఖరాలతో ఉన్న అక్కడికి చేరి అర్జునుడు మదిర మత్తు వదిలిన బలరాముడిని స్మరించాడు .ఆయనా తెల్లని వాడే ఆయన ధరించిన వస్త్రం మాత్రం నల్లనిది .కనుక బలరాముడి లా పర్వతం ఉ౦దనే భావన .’’తమతను వనరాజి శ్యామితో –నగముపరి హిమానీ గౌరమాసాద్య జిష్ణుహ్-వ్యపగత మదరాగస్యాను సస్మార అక్ష్మీ –మసిత మధర వాసో బిభ్రతః సీర పాణేహ్’’
సశేషం
మీ– గబ్బిట దుర్గాప్రసాద్ -17-11-20-ఉయ్యూరు