కిరాతార్జునీయం-
అయిదవ సర్గ-1 .
హిమాలయం చేరిన అర్జునుడు అది మేరు పర్వతాన్ని జయి౦చా లనే కోరికతో అంటే దిగంతాలకు వ్యపించాలనే ఉత్కంఠ తో అంతటి ఎత్తుకు ఎదిగిందా అని పించింది .దానికి మూడు కారణాలు కనిపించాయి అతనికి .ఒక వైపు సూర్య కిరణాలతో ప్రకాశిస్తూ,మరో వైపు దట్టమైన చీకటి ఆవరించి ఉంది .ముందువైపు అట్టహాసంతో ప్రకాశిస్తూ ,వెనకవైపు గజచర్మ ధారి శివునిలాగా కనిపి౦చి కను విందు చేస్తోంది . .-‘’తపన మండల దీపిత మేకతః –సతత నైశతమో వృతత మన్యతః –హసిత భిన్న తమిస్ర చయం పురః –శివ మివానుగత౦ గజ చర్మణా’’
హిమపర్వత౦ లో భూలోక వాసులు ,ఆకాశం లోని వారూ ,స్వర్గం లోనివారూ కూడానివాసమున్నారు .కనుక వారికి తన వ్యాపకత్వాన్ని తెలియ జేయటానికి తన ప్రతినిధిగా దీన్ని శివుడు ఏర్పాటు చేశాడా ?అని పించింది అంటే స్వర్గ మర్త్య ఆకాశాలను ఆవరించి ఔన్నత్యం చూపింది –‘’క్షితి నభఃసురలోక నివాసిభిహ్ –కృత నికేతన మదృస్టపరస్పరైహ్ –ప్రధయితుంవిభుతా మభి నిర్మితం –ప్రతినిదిం జగతామివ శంభూనా ‘’
హిమవత్పర్వతం శేషుని తో సమానమైన తెలుపు రంగుతో మిన్ను నంటినది .బంగారు రేఖలతో ప్రకాశించే సానువులు ఉండటం తో ఆకాశం లోని మేఘాలను తిరస్కరిస్తున్న శిఖరాలతో ఎంతో ఉన్నతం గా ఉంది .-‘’భుజగరాజ సితెన నభః శ్రితా-కనకరాజి విరాజిత సానునా –సముదితం నిచయేన తడిత్వతీం-లంఘయితా శరదంబుద సంహతిం ‘’
హిమాలయానికి మణి కాంతులే వస్త్రాలు .దేవతాస్త్రీలు అనుభవించటానికి తగిన పొదరిళ్ళున్నాయి .ఎత్తైన బండ రాళ్ళ మధ్య ఉన్న విశాల ప్రదేశాలే పురద్వారాలుగా ఉన్నాయి .పుష్పవనాలతో అంతటా ఉండటం వలన పర్వత ప్రాంతమంతా నగరాలు నిండి ఉన్నాయా అని పించింది .వర్షాకాలం వెళ్లి పోయింది కనుక నీరు లేని మేఘాలు ,ఉరుములు లేకుండా తెల్లగా వేలాడు తున్నాయి .వజ్రాయుధం తో ఇంద్రుడు నరికిన రెక్కలు మళ్ళీ మొలిచాయా అని పించింది –‘’’’ఉదిత పక్ష మివార తనిహ్ స్వనైహ్ –పృధు నితంబ విలంబి భి రంబుదైహ్’’’’
పర్వతం లోని ఏనుగులు దంతాలతో సానువులను పొడవగా నీరు వచ్చి ఏర్పడిన చెరువులు గా ఏర్పడ్డాయి .స్నానాదులకు అనుకూలమై నిండుగా ఉన్న నీటితో నదులు వేగంగా ప్రవహిస్తున్నాయి .కడిమి చెట్లు పూలతో శోభిస్తున్నాయి .తమాల వృక్ష వనం దట్టంగా ఆవరించింది .కొంచెం మంచు బిందువులు పడుతున్నాయి .అందమైన ముఖాల మదపు టేనుగులు నిరంతర సంచారం చేస్తున్నాయి .హిమాలయం లో రత్నాలు లేని శిఖరాలు ,పొదరిళ్ళు లేని గుహలు ,అందమైన కమలాలు ఇసుక తిన్నెలు లేని నదులు ,పూలు లేని చెట్లూ లేవు .ఇసుక తిన్నెలు పిరుదులుగా,కమలాలు ముఖాలుగా నదీ స్త్రీలున్నారు వారి విహారాలకు రత్న శిఖరాలు వెలుగునిస్తే ,గుహల ముందున్న పొదరిళ్ళు సేదతీరటానికి ఉపయోగంగా ఉన్నాయి –‘’రహిత రత్న చయా న్న శిలోచ్చయా –నపలత భవనా న దరీ భువః – విపులా౦బురుహా న సరిద్వధూ-రకకుసుమా౦ ధతం న మహీ రుహః ‘’
హిమాలయం అందమైన మొల త్రాళ్ళతో ఉన్న దేవతా స్త్రీల పిరుదులతో అడ్డు కో బడి,నెమ్మదిగా ప్రవహించే నదులతో ,మనోహరాలైన తీగలు, పొగడలు ఆకర్షిస్తే చేరిన పాములు అంతటా వ్యాపించి అందంగా ,మరో స్వర్గం లా భాసించింది –
‘’పృదిత సింధు మనీ రశనైహ్ శనైహ్-అమరలోక వధూ జఘనై ర్ఘనైహ్-ఫణ భ్రుతా మభితో వితతం తతం –దయిత రమ్య లతా వకులైహ్కులైహ్’’
అనేక రకాల మణుల కాంతితో శుభ్రమైన మంచు శిఖరాలు ఇంద్ర ధనుస్సు కల్గిన మేఘాల్లా ఉన్నాయి .కాని ఒక్క సారి గర్జించటం తో అవి శిఖరాలుకావు మేఘాలే అనే నిజం తెలుస్తోంది .ఎప్పుడూ వికసించే కమలాలతో రాజ హంస లతో నిర్మలజలం ఉన్న మానస సరో వరం అక్కడ ఉన్నది ఒకప్పుడు ఈర్ష్యతో కోపించిన పార్వతితో కలహించిన ప్రమధ గణ౦ కూడా అవిద్యాది దోష రహితుడైన శంకరుడు నివాసంగా ఉన్నాడు –‘’వికచ వారిరుహం దధతంసరః –సకల హంస గణం శుచి మానసం –శివ మగాత్మజయా చ కృతేర్ష్యయా –సకలహం స గణం శుచి మానసం ‘’
హిమవంతం చంద్ర సూర్యాదుల దేవయానాలను ప్రకాశింప జేస్తూ ,ఓషధుల రాపిడి వలన కలిగిన అగ్నితో దేదీప్యమానంగా ఉంది .శివ గణాలు ప్రతి రాత్రీ ఆ మంటలను చూసి ఈ శ్వరుడు చేసిన త్రిపుర దాహ వృత్తాంతాన్ని గుర్తుకు తెస్తోంది –‘’
‘’గ్రహ విమాన గణాభితో దివం –జ్వలయతౌషధి జేన కృశానునా –ముహురను స్మరయ౦తమను క్షపం –త్రిపుర దాహ ముమాపతి సేవినః ‘’
హిమవత్పర్వత శిఖరాలలో గంగానది ఉంది .ఎత్తైన రాళ్ళు తిప్పలు అడ్డురాగా వాటిపై నుంచి పారే ప్పుడు తుపుర్లు తు౦పుర్లు గా ఎగసి పడుతోంది ఆ దృశ్యం గంగానది తెల్లని చామరం వీస్తున్నట్లు గా ఉంది –‘’దధత మున్నత సాను సముద్ధతాం-ధృత సిత వ్యజనామివ జాహ్నవీం ‘’
ఈ పర్వత వైభవం చూసి అర్జునుడు పొంగిపోయి ,యక్షుడితో ఇలా అన్నాడు (.అడగకుండా చెప్పటం వినేవాడు ఉంటే బాగానే ఉంటుంది కదా) –‘’స జగదే వచనం ప్రియమాదరా –న్ముఖరతా వసరే హాయ్ విరాజతే ‘’
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -18-11-20-ఉయ్యూరు