వేద వ్యాసమహర్షి ధర్మరాజుతో ఇంకా ఇలా చెబుతున్నాడు –‘’నీ శత్రువులు అపకారం చేసినాఏమీ మాట్లాడకుండా శాంతంగా ఉండటం వలన నీ ప్రజ్ఞా సౌశీల్యాలు లోకానికి తెలిశాయి .వాళ్ళు అట్లా అపకారం చేసి ఉండకపోతే లోకానికి నీ గొప్పతనం తెలిసేది కాదు .కనుక వాళ్ళ అపకారం నీకు ఉపకారం అయింది అంటే శత్రువులుకూడా ఒక్కోసారి ఉపకారులౌతారన్నమాట .శత్రువులకు చిక్కిన రాజ్యం పరాక్రమం తో తిరిగిపొందటం సాధ్యంకానీ ,వేరే దానివలన సాధ్యంకాదు .ప్రబల శత్రువును చంపాలంటే అంతకంటే బలపరాక్రమ౦ , సాధన సంపత్తి కావాలి .అస్త్రబలాదిక్యత ,వీరత్వం ఉంటేనే సాధ్యం .కనుక ముందు ఈప్రయత్నం చేయాలి మీరు .
‘’ముందుగా శత్రువుల ఆదిక్యం చెబుతా విను .అక్కడ భీష్ముడున్నాడు .అంతటి యుద్ధపాటవం ఎవరికీ లేదు .అతని గురువు పరశురాముడు 21సార్లు రాజులను చంపిన వీరుడు .అస్త్ర విద్యకు మూల విరాట్టు.అతడే భీష్ముని చేతిలో ఓడిపోయాడు .శౌర్యాది గుణాలు ఆశ్రయ పురుషుని ఆధిక్యాన్ని బట్టి వస్తుంది .అలాంటి భీష్ముని పరాక్రమాన్ని ఎదిరించటం సాధ్యమా.ఆయన్ను ఓడిస్తేకాని నీకు రాజ్యం రాదు .ఆయన్ను ఓడించే సమర్ధుడు నీ పక్షాన ఎవరున్నారో చెప్పు .స్వచ్చంద మరణ వరం పొందిన ఆయన్ను చూసి యముడే సంహరించేశక్తిచాలక పరాభూతుడౌతున్నాడు . జగదేక వీరుడు రౌద్రమూర్తియై యుద్ధం లో ధనుస్టంకారం చేస్తే వీరులంతా గడగడ వణకాల్సిందే .మరి అతన్ని నిర్జించే యోదుడెవరున్నారు నీవైపున !
‘’లోకాలన్నీ కబళించే ప్రళయాగ్నిజ్వాలలుగా ,మహాఘోరాకారం తో బాణ జాలాన్ని పుంఖాను పు౦ఖ౦ గావర్షింఛి ,సైన్యాన్ని సర్వ నాశనం చేసే ద్రోణాచార్యుని ఎదుర్కొనే సత్తా ఉన్న వాడు మీలో ఎవరున్నారో చెప్పు .
‘’నిరక్ష్య స౦రంభ నిరస్త ధైర్యం –రాధేయమారాధిత జామదగ్న్యం
అసంస్తు తేషు ప్రసభం భయేషు –జాయేత మృత్యోరపి పక్షపాతః ‘’
కోపంతో రౌద్రమూర్తియై చూడంగానే ధైర్యాన్ని పోగొట్టేవాడు , ,పరశురాముని సేవించి నిఖిలాస్త్రశస్త్రాలు పొందిన , కర్ణుని చూసి మృత్యువే భయపడి పారిపోతుంది .అలాంటి కర్ణ పరాక్రమాన్ని అడ్డగించి ,నిర్జించే మొనగాడు మీకు ఎవరున్నారో చెప్పు .భీష్మ ద్రోణ కర్ణులు ముగ్గురూ ముగ్గురే .దివ్యాస్త్రాలున్న వారుసామాన్యులచే జయి౦ప బడరు .కనుక వారిని జయించాలంటే దివ్యాస్త్రాలు సంపాదించాలి .దానికి ఈశ్వరానుగ్రహం కావాలి కాబట్టి శివునికి తపస్సు చేయాలి.అందుకే అర్జునునికి మంత్రోప దేశం చేయాలని పిస్తోంది .మంత్రోపదేశం పొందకుండా తపస్సు ఫలించదు ,కనుక అర్జునునిచే శివుని తపస్సు చేయించి ,పాశుపతం మొదలైన అస్త్రాలు ,వరాలు పొందితే భీష్మాదులను చంపటం తేలిక .అలాంటి మంత్రం ఉపదేశించటానికే ఇక్కడికి వచ్చాను .ఆమంత్రం మహా ప్రభావం కలది. దాన్ని జపిస్తే అన్నీ లభిస్తాయి .ఇంద్రాది దేవతలుకూడా అనుగ్రహిస్తారు .ఆమంత్రాన్ని స్వీకరించటానికి నువ్వుతప్ప ఇతరులకు అర్హత లేదు .వీత స్ప్రుహుడవైన నువ్వే అర్హుడవని నీకుపదేశించాలని నేనే స్వయంగా వచ్చాను .ఆమంత్రం ఉపాశించి అభీష్ట సిద్ధి పొంది ,దుష్ట శిక్షణ ,శిష్ట రక్షణ చేసి రాజ్యాన్ని సాధించి సుఖభోగాలు అనుభవించు .’’అని చెప్పిన వ్యాసమహర్షి మాటలకు స్పందించి ధర్మరాజు అర్జునుని పిలిచి వ్యాసమతానుసారం ప్రవర్తిచమని కోరాడు .అర్జునుడు అన్నమాట ఔదలదాల్చి అత్యంత వినయంతో వ్యాసర్షి ని సమీపించాడు.
‘’నిర్యాయ విద్యాథ దినాది రమ్యా –ద్బి౦బాదివార్కస్య ముఖాన్మహర్షేః
పార్థాననం వహ్ని కణావ దాతా-దీప్తిస్ఫురత్పద్మ మివాభి పేదే’’
ప్రాతః కాల సూర్య తేజం పద్మలో ప్రవేశించినట్లు ,వినయంగా దగ్గరకొచ్చిన పార్ధునికి మంత్రోప దేశం చేయటానికి వ్యాస రుషి అతనికి ఉపదేశించగా 24తత్వాలరహస్యం తెలిసి , అఖిలాజ్ఞానభంజకమై ,ఉపదేశార్హతకల యోగానికి అర్హతకల అర్జునునికి మహాతపశ్శాలి వ్యాసమహర్షి వెంటనే తనప్రభావం చేత వశమయేట్లు చేశాడు .మహాభాగ్య సూచకం ,ఉత్సాహగుణంకార్య సమర్ధత కల అర్జునుని చూసి మహర్షి ‘’నేను ఉపదేశించిన మంత్రాన్ని యోగంతో మహాతేజశ్శాలివై ,ఒంటరిగా ఆయుధ హస్తుడవై జప ఉపవాస స్నానాదులతో ,మహర్షులు చేసినట్లు తీవ్రంగా చేయి .ఇలాంటి తపస్సుకు ఇంద్రకీల పర్వతం శ్రేష్టం .అక్కడికి నిన్ను ఈ యక్షుడు తక్షణమే తీసుకువెడతాడు .అక్కడ ఇంద్రుని గూర్చి నేను చెప్పినట్లు తపస్సు చెయ్యి ‘’అని చెప్పి అంతర్ధానమయ్యాడు వ్యాసర్షి .వెంటనే యక్షుడు అర్జునుని సమీపించి నమస్కరించి ,మైత్రీభావం చూఫై తీసుకు వెళ్ళాడు .
సూర్యుడు రాత్రిభాగం లో నివశించి మళ్ళీ ఉదయి౦చటానికి మేరుపర్వతాన్ని వదిలేస్తే ,అక్కడ చీకట్లు ప్రవేశించినట్లుగా ,శ్రేయస్సాధనకోసం అర్జునుడు తమల్ని విడిచి వెళ్ళగా ,పాండవులకు నెమ్మదిగా దుఖం ప్రవేశించి అధికమైంది .తాత్కాలికంగా దుఖం పొందినా ,కార్యభారంతో పోగొట్టుకొన్న ,సోదర స్నేహంవలన మళ్ళీ దుఖావేశం వచ్చినా ,వివేకవంతులుకనుక ఆ దుఖం బాధ కలిగించలేదు .విశ్వాసపాత్రుడైన వ్యాసమహర్షి ,ఆయనకు తమశత్రువులపై తీవ్రకోపం ,అర్జునుని అధిక ప్రతాపం తెలిసిన సహజ ధైర్యవంతులు కనుక భ్రాతృ వాత్సల్యం చే దుఖం కలిగినా స్థిరంగా నిలబడలేదు .సూర్య కా౦తిచేత పగటిపూట ప్రకాశం పొందిన చీకటి , కృష్ణ పక్షపు రాత్రిని పొందినట్లు,పాండవులకు కలిగిన దుఖం తాత్కాలికమై ,వాళ్ళను వదిలి మొత్తంగా ద్రౌపదిని చేరింది .ఆమె దుఖాన్ని ఎలా అనుభవి౦చి౦దో తర్వాత తెలుసుకొందాం .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -5-2-20-ఉయ్యూరు