కిరాతార్జునీయం-
అయిదవ సర్గ-2.
యక్షుడు అర్జునునితో ‘’తెల్లని మంచు తో ఉన్న హిమవన్న గ శిఖరాలు ఆకాశాన్ని అనేక భాగాలుగా చేస్తున్నాయి .అంటే ఈ పర్వతాన్ని చూసిన వారి పాపాలు తొలగిస్తోంది .పర్వతం మధ్యభాగం లోని వృక్షా లెక్కిచూసి దాన్ని కొంచెం గా నే వర్ణించ గలం.వేదాలు కూడా పరమాత్మను కొంచెమే పరిచయం చేయగలవు .బ్రహ్మ మాత్రమే దీన్ని వర్ణించ గల సమర్ధుడు –‘’ఇహ దురధిగమైహ్ కించి దావాగమైహ్ –సతత మసుతరం వర్ణ యంత్యంతరం –అము మపి విపినం వేద దిగ్వ్యాపినం –పురుష మివ పరం పద్మయోనిహ్ పరం ‘’.ఇది భర్త్రు సంగమం తో తృప్తి చెందినా ,మానవతులైన స్త్రీలు అక్కడి చిగురాకులు ,పూల పూలదరిళ్ళు,సుందర సరోవరాలు ప్రేరేపిస్తే మళ్ళీ భర్త సమాగమాన్ని కోరుతున్నారు .నీతి గల భాగ్య శాలికి ఇది ఎప్పుడూ సులభమైనదే నవనిదులున్న కుబేరునీ ప్రసన్నం చేస్తుంది అత్యంత ధన సంపదలతో ఇది పరిపూర్ణ మైంది .కనుకనే భూ, స్వర్గ పాతాళాలను కూడా అధిగమించి శోభిస్తోంది –‘’సులభైహ్ సదా నయత వతా యవతా –నిధి గుహ్య కాధిపరమైహ్ వరమైహ్ –యమునా ధనైహ్ క్షితి భ్రుతాతి భ్రుతా –సమతీత్య భాతి జగతీ జగతీ ‘’.
‘’ముల్లోకాలూ దీనితో సరి తూగలేవు .ప్రజలు గుర్తించని వైభవం గల శివుడే ఇక్కడ సదా ఉంటున్నాడు కనుక ధర్మ క్షేత్రం కూడా ఇది .’’అధి వసతి సదా యదైనం జనై-రవిదిత విభావో భవానీ పతిహ్’’.పునర్జన్మ ,ముసలితనం భయాలు లేని బ్రహ్మజ్ఞానం అంటే ముక్తి పొందగోరే ముముక్షువులకు శాస్త్ర జ్ఞానం లాగా హిమాలయం అజ్ఞానం పోగొట్టి, తత్వజ్ఞానం కలిగిస్తుంది .కనుక భోగభూమి మాత్రమె కాదు ఇది యోగభూమీ ,ముక్తిప్రద పుణ్య క్షేత్రం కూడా .-
‘’వీత జన్మ రసం పరం శుచి –బ్రహ్మణః పద ముపైతు మిచ్ఛ తాం-ఆగమాదివ తమోపహాదితః –సంభవ౦తి మతయోభవచ్ఛిదః’’
ఇక్కడ దేవతాస్త్రీల కోసం పూలపాన్పులు వారి వివిధ సురత విధానాలను సూచిస్తున్నాయి .కాలి లత్తుక రసం అక్కడ ముద్రిత మైంది వాడిన పూలహారాలు రాలి పడ్డాయి .పొర్లటం తో ఏర్పడ్డ మడతలు వారి కామోద్రేకాన్ని ,ఆశతో జరిపిన సురత క్రియ విశేషాలను తెలియ జేస్తున్నాయి .ఈ పర్వతం లోఓషధులు నీతిగల రాజు విషయంలో రాజ్య లక్ష్మి సదా నివసించి నట్లు ,ఈ క్షేత్ర గుణాన్ని పొంది ,రాత్రిం బగళ్ళు వెలుగుతున్నాయి .-‘’నయశాలిని శ్రియ ఇవాధి పతౌ –విరమంతి న జ్వలితు మౌషధయః ‘’.ఇక్కడి గోరువంకలు అరుస్తున్నాయి .పూల బరువుతో చెట్లు వంగాయి .సరస్సులు కమలాలతో శోభాయమానంగా ఉన్నాయి .విశాల మైన కొమ్మలతో చెట్లున్నాయి .వేడిని తగ్గించే నదులు ఏనుగులకు ప్రీతి కల్గిస్తున్నాయి .తుమ్మెదలున్న మామిడి పూ గుత్తి గంధం తోసమానమైన మద జలం కారుస్తూ పరిమళం వెదజల్లుతున్నాయి .దేవతా గజేంద్రాలుతమ కపోలాల దురద పోగొట్టు కోవటానికి మామిడి చెట్లను రాసు కొంటుంటే వసంతం రాకపోయినా ,కాలం కాని కాలం లో కోయిలలు ఆ పరిమళానికి ఆకర్షింప బడి మదాన్ని పొందాయి –‘’సదృశ్యం గత మపనిద్ర చూత గంధై-రామోదం మదజల సేకజం దధానః –ఏతస్మి న్మదయతికోకిలా న కాలే -లీనాలిహ్ సుర కరిణా౦ కపోల కాషః’’
‘’అప్సరసల కటి ప్రదేశాలతో అందమైనదీ ,కలకలారావం చేసే నదాలతో హిమవంతం ,పాతాళ లోక రక్షకుడైన వాసుకి కి అత్యంత ప్రీతి పాత్రమైన అమృత౦ చాలాకాలం గా ఉండటం వలన ఇక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకొన్నాడు .అంటే పాతాళ ,భూలోకాల్లో అమృతం లేదు,ఇక్కడే ఉంది అని భావం –‘’మతా ఫణవతోవతో రసపరా –పరాంత వ సుధాసుధాధివసతి ‘’.హిమాలయాలలో అందమైన పొదరిళ్ల భవనాలు ,ప్రకాశించే ఓషధులే దీపాలు .హరి చందనం అంటే కల్ప వృక్ష చిగురాకులే పడకలు ,సురత శ్రమ పోగొట్టే కమల వనాల వాయువులు దేవతా స్త్రీలకు స్వర్గాన్ని కూడా గుర్తు చేసుకో నివ్వటం లేదు .అంటే స్వర్గ సుఖాలన్నీ ఇక్కడే లభిస్తున్నాయి .ఇక్కడే పార్వతి చాలాకాలం నీళ్ళల్లో ఉండి తపస్సు చేసింది నీటిలో ఎగిరే చేపలను ఆమె చంచల నేత్రాలతో చూసింది .అలాంటి పార్వతిని చెమట బిందువులు కారుతున్న వేళ్ళున్న చేతులతో శివుడు పట్టు కొన్నాడు .చెమట సాత్విక భావం .ఇక్కడ శివ పార్వతీ కల్యాణం శోభాయమానంగా జరిగింది –
‘’ఈశార్ద మంభసి చిరాయ తపశ్చరంత్యా –యాదో విలంఘన విలోల విలోచనాయాః-ఆలంబతాగ్ర కరమత్ర భవో భవాన్యాః-శ్చోతన్నిదాఘ సలిలితాంగు లినా కరేణ’’
దేవ దానవులు అమృతం కోసం ఈ మందరాన్నే కవ్వం గా,వాసుకిని తాడుగా చేసి సముద్రం చిలికారు .మధన సమయం లో నీరు అటూ ఇటూ నాలుగు వైపులా యెగిరి పడటం తో పాతాళలోకం స్పష్టంగా కనిపించింది .అప్పు డేర్పడిన గుర్తులు మందరానికి ఇప్పుడూ కనిపిస్తాయి. మందరం ఎత్తైన శిఖారలతో ఆకాశం చీలినట్లు కనిపిస్తుంది .ఇక్కడి సూర్య కిరణాలతో వ్యాపించి ఇంద్ర నీల మణులు ఉండటం చేత బాగా ఉత్కర్ష పొంది ,హంసలతో పోలిక ఉన్న స్పటిక వెండి గోడలు మధ్యాహ్నం కూడా వెన్నెల భ్రాంతి కలిగిస్తోంది .ఈ పర్వతం పై వ్యాపించిన అనేక రత్నాల కాంతుల వ్యాపనం వలన ప్రాకారాల మధ్య గట్టి గోడలు నిర్మించినట్లు అనిపిస్తుంది .కానీ వాయు చలనం వలన ఆ భ్రాంతి తొలగి పోతోంది .కొత్త గడ్డి ప్రదేశాలు మనోహర కాంతితో ఉన్నాయి నల్లకలువల వనాలు కొత్తగా శ్యామల వర్ణం పొందుతున్నాయి .అనేక రంగుల పుష్పాల వృక్షాలు ఆకులు పండినా రాలటం లేదు .లేళ్ళు కొరకగా మిగిలిన మొదళ్ళతో మొలిచిన లేత పచ్చిక ,సూర్య కాంతితో మరకత మణుల కాంతులు కలిసి పోయి బాగా ప్రకాశిస్తున్నాయి .ఆ లే బచ్చిక లేత చిలకల రెక్కల్లా మెత్తగా ఉంది. లేళ్ళు ఆ కాంతుల్ని లేత పచ్చిక అనుకోని నాకి వదిలేస్తున్నాయి .మెట్టతామర వనం నుంచి ఆకాశం లోకిసుడి గాలితో ఎగిరి,ఆకాశం లో మండలాకారంగా వ్యాపించిన కమల పుష్పాలలోని పరాగం బంగారు ఛత్రం లాగా శోభించింది –
‘’ఉత్ఫుల్ల స్థల నలినీవ నాద ముష్మా –దుద్ధూతః సరసిజసంభవః పరాగః –వాత్యాభి ర్వియతి వివర్తితః సమంతా-దాధత్తే కనకమయాత పత్ర లక్ష్మీం’’’-ఇక్కడి గంగాతీరం లోని పద పంక్తి పార్వతీ పరమేశ్వరుల అర్ధ శరీరాల కలయికను తెలుపుతోంది .ఆ పాద ముద్రలో ఒకటి లత్తుక ముద్ర కలిగి చిన్నది గా ఉన్నది కనుక .ఉదయ సంధ్య లో ప్రదక్షిణాల వలన పద పంక్తి పరి వర్తనం చెందింది –‘’ఇహ స నియమయోహ్సురాపగాయా –ముషసి సయావక సవ్య పాద రేఖా –కధయతిశివయోహ్ శరీర యోగం –విషమ పదా పదవీ వివర్త నేషు’’
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -19-11-20-ఉయ్యూరు ,
—