కిరాతార్జునీయం- ఆరవ సర్గ -1.

కిరాతార్జునీయం-

ఆరవ సర్గ -1.

ఇంద్ర కీల పర్వతం చేరిన ఇంద్ర తనయుడు అర్జునుడు బంగారు రంగు చరియలతో ఉన్న శిఖరాన్ని చూసి ,గంగానదికి ఎదురుగా వెడుతూ విష్ణుమూర్తి గరడుని పై అధిరోహించినట్లు   అధిరోహించాడు.తుమ్మెదల ఝ౦కారమే  జయజయ ద్వానాలుగా, గాలికి వంగి ఊగుతున్న  పూల చెట్లే వంది మాగధుల్లా పూలతో అభిషేకించాయి .-‘’పవనేరి తాకుల విజిహ్మ శిఖా –జగతీరుహో వచ్చా కరుహ్ కుసుమైహ్’’.ఇంద్ర కీలంప సానుకూలంగా గాలులు వీచాయి. తుమ్మెద ఝ౦కార౦  స్వాగతం అనిపించింది. కమలాల పరాగ పరిమళం  వెద జల్లగా, సన్నని గంగాజల బిందువులు చల్లదనం కలిగించాయి .మిత్రులు తమ స్నేహితులురాగా ఎదురేగి కౌగలించి సంతోష పరచినట్లు గాలి వీచింది –‘’’’అవధూత పంకజ పరాగ కణా –స్తను  జాహ్నవీ సలిల వీచి భిదః-పరి రేఖిరే భి ముఖమేత్య సుఖాః-సుహృదః సఖాయ మివ త౦ మరుతః ‘’

పైనుండి పడే బండరాళ్లు చూర్ణం అవుతున్నప్పటి ధ్వని ,కిందికి జారుతూ పారే నీటి గలగలధ్వని అర్జునునికి శుభ మంగళ వాద్య ధ్వని గా  భాసి౦చాయి..ఎత్తైన దేవదారు వృక్షాలను కూల్చేవేగంగా పారే గంగానది లో నీటి ప్రబ్బలి చెట్ల సమూహం ప్రణామం చేస్తున్నట్లు అనిపించాయి .ప్రవాహ వేగానికి వంగి ఆచేట్లు, వేగం తగ్గగానే నిటారుగా లేస్తాయి .అవి వినయవంతుల్లా అనిపించాయి .-‘’స దదర్శ వేతసవనా చరితాం-ప్రణతిం బలీయసి సమృద్ధి కరీం ‘’.గంగానదిలోకమలాల పుప్పొడి తో ఎర్రనైన గంగా నది జాలానికి  కలహంస సమూహం నదికి పైట లాగా అనిపిచింది –‘’సరి దుత్తరీయ మివ సంహతి మ-త్స తరంగరంగి కలహంస కులం ‘’   .ఏనుగులు దంతాలతో పోట్లాడు కొంటున్నాయి వాటి మదజలానికి తుమ్మెదలు ఆకాశం లో ఝ౦కార౦   చేస్తున్నాయి .దీన్ని చూస్తూ అలా ఉండి పోయాడు పార్ధుడు .గొప్పవారి విరోధమూ గొప్ప ఆనందాన్నే కలిగిస్తుంది .ఏనుగుల విరోధం తుమ్మెదలకు ,అర్జునుడికీ వినోదం కలిగించిందని భావం –‘’అధికాం సరోధసి బబంధ ద్యుతిం –మహాతే రుజన్నపి గుణాయ మహాన్ ‘’.ఆడ చక్రవాకం తన మగ జంట కోసం గంగా నది అలలలో వెతుకుతూ దీనాలాపం చేస్తోంది. దాని ప్రేమను అభినందించాడు క్రీడి .గంగా తరంగాలలో మణుల కాంతి ప్రతి ఫలించగా ,నదిలో మణులున్నాయేమోననుకొన్నాడు .ఏనుగును వెతకటానికి వెయ్యి కళ్ళతో చూస్తోందా నది అనిపించింది .

  నదీ తీరం లోనోరు తెరచిన ఒక  ముత్యపు చిప్పనవ వధువును మేల్కొల్పి ఆవులిస్తూ ,ఆనందాశ్రువులు రాలుస్తున్నట్లు ఉంది .ఇసుక మేట పడకగా ,చిప్ప తెరచుకోవటం ఆవలింతగా  ,ముత్యాల వరుస దంత పంక్తిగా జలబిందువులు ఆనంద బాష్పాలుగా ఉండటం అర్జునుని మనసు పరవశం చెందింది .-‘’ప్రతి బోధ జ్రు౦భణ విభిన్నముఖీ –పులినే సరోరుహ దృశా దదృశే –పతదచ్ఛ మౌక్తిక మణి ప్రకరా –గలదశ్రు బిండురివ శుక్తి వధూహ్’’.నదిలోని పగడపు తీగలు కామోద్రేకం కలిగించే దంతకాంతి గల ప్రియురాలి క్రింది పెదవి లా ఉండి,ఆ అనుభవాన్ని గుర్తుకు తెస్తోంది .నదిలో ఈదే గజాల మద గంధాన్ని ఆఘ్రాణించి ,నీటిపైకి లేచిన ఏనుగులు తమపైకి వచ్చే ఏనుగులేమో అనే భ్రమపడిన దృశ్యాన్ని చూశాడు .ఆకాశామంతా ఎత్తుకు ఎగిరే జలాన్ని చూసి ఆశ్చర్యపోయాడు .హఠాత్తుగా తనపైకి ఎగిరే బుసలు కొట్టే పాములాగా శరత్తులోని మేఘం లాగా తెల్లగా గుండ్రం గా ఉంది .-‘’ప్రహితం దివి ప్రజవిభి శ్వసితైహ్-శరదభ్ర విభ్రమ మపాం పటలం ‘’.తీరం లోని ఇసుక తిన్నెలు చేపలు నాలుగు వైపులా ఎగరటమే నేత్రాలుగా ,దేవలోక గంగ ను చేరుతున్నాయి. విశాల పిరుదులు,చంచల ఆకర్షణీయనేత్రాలు  ఉన్న సఖుల లాగా ఆ నదులను దాటి ముందుకు వెళ్ళాడు .

 ఇంద్రకీల పర్వత మధ్య వనాన్ని పార్ధుడు చేరాడు .పుష్పించిన చెట్లు వంగి ,అలంకారమైన తీగలు చుట్టూ ఉండి,అక్కడి భూమి అత్యంత పవిత్రంగా ,వనభూమి మనసు ఆకారం పొందిందా అన్నట్లు పరమ ప్రశాంతంగా ఉన్నది –‘’మనసః ప్రసత్తిమివ మూర్ధ్ని గిరేహ్-శుచి మాససాద స వనాంతం ‘’

  ఇంద్రకీల పర్వత వనం మధ్యలోకిఅర్జునుడు ప్రవేశించాడు అది నిర్జనంగా తపస్సుకు అత్యంత ఆనుకూల్యంగా ఉందని పించి,ఉత్సాహం కలిగింది .అక్కడ యోగ శాస్త్రాను సారం అర్జునుడు బుద్ధిని స్వాధీనం చేసుకొని ,దుష్కర తపస్సు చేయటం మొదలు పెట్టాడు .తపోనియమ కస్టాలు ఏవీ అనిపించలేదు  జి తేన్ద్రియులు దుఃఖ కారకం ఏదీ ఉండదు కదా !

‘’ప్రణిధాయ తత్ర విధినా ధధియం నాథ ధియం –దధతః పురాతన మునేర్ము నితాం-శ్రమ మాదదాధ సుకరం న తపః –కిమివావ సాదకర మాత్మ వతాం’’.ఇంద్రియ జయమే ముఖ్యసాధనంగా ,పవిత్ర గుణాలతో అజ్ఞానాన్ని అణచి  ప్రతిరోజూ వృద్ధి పొందే కళలున్న చంద్రుడిలా తపస్సు వృద్ధి చేశాడు .వివేకం తో తత్వాన్ని గుర్తించి ,కామక్రోధాది వికారాలు లేకుండా ,శాంతి సుఖాన్ని అనుభవిస్తూ ,విఘ్నాలు కలిగించే విషయ వాంఛలను విసర్జించి తీవ్ర తపస్సు చేశాడు –‘’ప్రతి ఘాతినీం విషయ సంగ రతిం –నిరుపప్లవః శమ సుఖాను భవః ‘’.త్రికరణ శుద్ధిగా ఇంద్రుని మెప్పించే తపస్సులో మగ్నమానసుడైన అర్జునుడు స్వభావ సిద్దాలైన వీర శాంత రసాలకు పుష్టి చేకూర్చే తేజస్సులను ఒకే సారి ధరించాడు .అంటే వీరోచిత శస్త్రాస్త్రాలు ఉన్నా ,అహింస ,శాంతి మొదలైన తాపస గుణాలను ధరించి ,ఉపాసన చేబట్టాడు .-‘’సహ జేతరౌ జయ శమౌ దధతీ-బిభారాం బభూవ యుగ ప న్మహసీ ‘

  మరకత మణి శరీర ఛాయతో ,నియమ  నిష్టలవలన ఎరుపు రంగు జడలు తలనిండా వ్యాపించి అర్జునుడు తమాల వృక్షం లాగా కనిపిస్తున్నాడు –‘’ఉపమాం యయావరణ దీదితి భిహ్ –పరి మృస్ట మూర్ధని తమాల తరౌ ‘’.ఆయుధ ధారి అయినా ,శాంతం తో సామాన్య మునిజనాన్ని మించి పోయాడు .రజో గుణం లేనందున మృగాలకూ విశ్వాస పాత్రు డైనాడు .దయా దాక్షిణ్యాలు ఎవరినైనా వశం చేసుకొంటాయి .పరిశుద్ధ ప్రవర్తనే విశ్వాసానికి కారణమౌతుంది –‘’రమయాం చకార విరజాః స మృగాన్-కమి వేశతే  రమయితాం న గుణాః’’.వాయువు మెల్లగా వీచి సుగంధం వెదజల్లుతూ సహకరిస్తూ గ్రీష్మం లోని వేడిని తగ్గించి చల్లగా స్పర్శనిస్తోంది తపస్సు చేస్తున్న అర్జునుడికి ‘’.’

‘’అనుకూల పాతిన మచండ గతిం .కిరతా సుగంధి మభితః పవనం –అవదీరితార్తవ గుణం సుఖతాం –నయతా రుచాం నిచయ మంషు మతః ‘’

  సశేషం

మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -21-11-20-ఉయ్యూరు

‘’-

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.