కిరాతార్జునీయం-
ఆరవ సర్గ -2.
పూల కోసం చిగురాకుల దోసిళ్ళతో చెట్లను వంచుతూ ,పడుకోవటానికి కొత్త మెత్తని లేబచ్చిక తో భూమిని కప్పుతూ అనుకూల వాతావరణం ఏర్పాటు జరిగింది .మేఘాలు లేని ఆకాశం నుంచి జారే నీటి బిందువులు నేలపై దుమ్మును అణచి వేశాయి .తపో నిమగ్నుడైన క్రీడికి అన్నీ ప్రశాంత వాతావరణం కలిపిస్తున్నాయి .శుభ శకున రూపంగా ఎదురుగా ఉన్న పుష్పాన్ని చూసి ఆశ్చర్యపడలేదు .జితే౦ద్రియులకు ఫలప్రాప్తి రూప అనుభవం కూడా ధైర్యాన్ని సడల నీయదు-‘’స జగామ విస్మయ వశం వశినాం-న నిహ౦తి ధైర్య మనుభావ గుణః ‘’
ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే తపోఫలం అనుభవిస్తున్న ఆర్జునుడిని చూసి అసూయ పడిన దేవతలు ఇంద్ర పదవి కోసం చేస్తున్నాడేమో అని భయపడి అమరావతికి వార్త తెలియ జేయటానికి వెళ్ళారు-‘’ఉపతస్ధు రా స్థితవిషాద ధియః –శతయజ్వనో వనచరావసతిమ్’’.
వనదేవతలు వెళ్లి నమస్కరించి తమపనిలో జరిగిన శైదిల్యం గురించి ఇంద్రునికి చెప్పారు .’’మహేంద్రా !పవిత్ర వల్కలాలతో ఇతరులకు అసాధ్యమైన తేజస్సుతో ఒక పుణ్య పురుషుడు ఇంద్రకీలం పై తీక్ష్ణ తపస్సు చేస్తున్నాడు .ఆ తపశ్శక్తికి లోకం తల్లడిల్లు తోంది .ఏదో గొప్ప కార్య సాధనకోసమే తపస్సు చేస్తున్నట్లు తెలుస్తోంది –‘’మహాతే జయాయ మనఘన్ననఘః –పురుషస్తపస్యతి తపం జగతీం ‘’ .అతడు భయం గొలిపే సర్పాల వంటి భుజాలతో శత్రు భయంకరమైన ధనుస్సుతో ఉన్నాడు .మహాతపస్సుతో మహామునులనూ అతిశయించాడు .
‘’అమలేన తస్య ధృత సచ్చరితా –శ్చరితేన చాతశయితా మునయః ‘’
అతనితపస్సుకు పంచభూతాలు అనుకూలమై భక్తులా అన్నట్లున్నాయి. గాలి శుభంకరంగా ,భూమిపచ్చికతో ,ఆకాశం నిర్మలంగా ఉంటూ ,నీటి తుమ్పురులతో ధూళి అణచబడింది –‘’గుణ సంపదాను గుణతాం గమితః –కురుతేస్య భక్తి మివ భూత గణః’’.అ తపస్వికి మృగాలు కూడా కలహాలు మాని గురువుకు శిష్యుల్లా మెలగు తున్నాయి .పూల చెట్లు వంగి కోసుకోవటానికి వీలు కలిగిస్తున్నాయి .నీకు ఎలా స్వాదీనమైందో ఇంద్ర కీలాద్రి, అతనికీ అలానే స్వాధీన మైంది –‘’ఇతరేతరా నభి భవేన మృగా –స్తముపాసతే గురు మివా౦త సదః –వినమంతి చాస్య తరవః ప్రచయే –పరవాన్ స తేన భవతేవ నగః ‘’
ఘోర తపస్సులో ఉన్నా అలసట చెందటం లేదు .అందం పెరిగి శరీరం విజయ సూచకంగా ఉంది .అతడిని సందర్శించే జనం ఆ తపో వైభవానికి భయపడుతున్నారు .-‘’శామినోపి తస్య నవ సంగమనే –విభు తాను షంగి భయమేతి జనః ‘’.అతడు రుషి వంశ సంజాతుడో దైత్యుడో,రాజవంశీకుడోమేము చెప్పలేము .,సమర్దులమూ కాము .నీ వనం లో అతని వాలకం ఏమిటో అర్ధం కాలేదు ..అనేక రకాలుగా ఆలోచించి మీకు చెప్పాలో చెప్పకూడదో తెలీక ,అల్పజ్ఞానులమైన మేము ,వివేక వంతులైన ఋషులతో పోల్చుకోలేము కదా –‘’అసధ ప్యదః సహితు,మర్హసి నః –క్వ వనేచరాః క్వ నిపుణా యతయః ‘’
మహేంద్రుడు ఆ యక్షులు చెప్పిన మాటలతో తన ప్రియ పుత్రుడు అర్జునుడే తపస్సు చేస్తున్నాడని గ్రహించి సంతోషించాడు .కానీ ఆన౦దాన్ని పైకి తెలియ నీయలేదు .ప్రభువుల ఆలోచనా రీతి నీతి మార్గాను సారంగా ఉంటుంది .-‘’అధిగమ్య గుహ్యక గణాదితిత-న్మనసః ప్రియం ప్రియసుతస్య తపః –నిజగోప హర్ష ముదితం మఘవా –నాయవర్త్మగాః ప్రభవతాం హి ధియః ‘’.సమాధి స్థితిలో అర్జునుడే అని నిర్ధారణ చేసుకొని ,అతని నియమ నిస్ట లను తెలుసుకోవాలని దేవ కన్యలతో ఒక పన్నాగం పన్ని వాళ్ళతో ఇలా అన్నాడు –‘’ఉపలబ్దు మస్య నియమ స్థిరతాం సుర సుందరీతి వచోభి దధే’’
‘’మర్మాన్ని భేదించే అస్త్రాలు మా దగ్గర లేవు .మీలా సుకుమారంగా ఎంతదూరమైనా వెళ్ళగలిగే నిష్ప్రయోజనం కాని ,ప్రతీకారం లేని మన్మధ విజయాన్ని చేకూర్చే దీ లేదు .’’అంటే అలాంటి గుణాలన్నీ మీవద్దనే ఉన్నాయని భావం –అవిపక్ష మస్త్ర మపరం కతమ-ద్విజయాయ యూయమివ చిత్తభువః ‘’.యోగుల రజో గుణం తొలగించే తత్వజ్ఞానమే నీరు .అలాంటి యోగులు కూడా మీ ఓర చూపుతో యోగాన్ని వదిలేస్తున్నారు .మహా వైరాగ్యులే మీకు గులాములైతే మామూలు మనుషులు లెక్కే లేదు మీకు ‘’-పరిపీడ మానమివ వో సకలై-రవసాద మేతినయనా౦జలిభిహ్ ‘’.లోకం లోని అందాలన్నీ రాశీభూతం చేసి బ్రహ్మ మిమ్మల్ని సృస్టించాడు .అందుకే మీకోసమే,మీ పొందుకోసమే జనం స్వర్గానికి వస్తారు .గాంధర్వం మొదలైన కళలలోనేర్పరులైన మీరు ,గంధర్వాదులతో కలసి వెళ్లి ,అతడి తపస్సు భంగం చేయండి .మీకు వశం కాని వారెవరూ ఉండరు-‘’హృత వీత రాగ మ’’నసాంనను వహః –సుఖ సంగినః ప్రతి సుఖా వజితః’’ఆ తపస్వి స్త్రీ సుఖం కోసమే తపస్సు చేస్తున్నాడు తప్ప సంసార బంధన విముక్తికి కానే కాదు .కారణం ధనుస్సు ధరించి ఉండటమే .ముక్తి హింసతో రాదు కనుక అతడు ముముక్షువు కాదు.మీపని తేలికే ‘’-అవి మృష్య మేతదఖిల ష్యతి స –ద్విషతాం వధేన విషయాభి రతిం-భవ వీతయే న హి తధాస విధిహ్ –క్వ శరాసనం క్వ చవిముక్తి పధః’’.ఆ తేజస్వి ఇతరమునులు లాగా కోపం తో శపిస్తాడు అనే అనుమానం వద్దు.యశస్సు కాపాడాలను కొనే వారు స్త్రీల విషయం లో హి౦సా మార్గం అవలంబించరు.కనుక భయం వద్దు .-‘’స్వయం శా౦సి విక్రమవతామవతాం –న వధూ ష్వ ఘాని విమృశంతి ధియః’’
తమను ఎంతగానో ప్రశంసించిన ప్రభువు ఇంద్రుని ఆజ్ఞతో ఆనందంగా అప్సరస బృందం అర్జున తపోభంగానికి సమాయత్తమై బయల్దేరారు –ప్రభువు ఆదరం పొంది నియోగించిన పనిలో నిబద్ధంగా ప్రవర్తించే సేవకులు తేజో వృద్ధి పొందటం సహజమే –
‘’లేఖే పరాం ద్యుతి మమర్త్య వధూ సమూహః –సంభావనా హృది కృతస్య తనోతి తేజః ‘’
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -22-11-20-ఉయ్యూరు
‘’