కిరాతార్జునీయం-.
సప్తమ సర్గ -1
దేవేంద్రుడికి నమస్కరించి అప్సరసలు తమ నివాసాలకు బయల్దేరారు .ప్రభు సన్మానం తో వారి సహజ సౌందర్యం మరింత పెరిగింది .ఆ అందం చూడటానికి సహస్రాక్షుని కళ్ళు చాలటం లేదు.
ఇంద్రుని సహచర గంధర్వులు ,అప్సరసలకు రక్షకులుగా అలంకరించిన రధాలు ,ఏనుగులతో బయల్దేరారు .ఆ ధ్వని విమానాల్లోంచి ప్రతిధ్వనించి మృదంగ ధ్వనిగా వ్యాపించి వారి ప్రయాణ శోభను చాటింది –‘’శ్రీ మద్భిహ్ సరధ,గజైహ్ సురా౦గ నానాం –గుప్తానా మధ సచివై స్త్రిలోక భర్త్రుహ్ –సమ్మూర్చన్నలవిమాన రంధ్రభిన్నః –ప్రస్దానం సమభి దదే మృదంగ నాదం ‘’
సూర్య మండల౦ పై నుంచి వెడుతున్న అప్సరసలకు గొడుగుల అవసరం లేకపోయింది .సూర్యకిరణాలే సోకనప్పుడు గొడుగు లెందుకు అని భావం –రామాణాముపరి వివస్వతః స్థితానాం –నా సేదే చరిత గుణత్వమాతపత్రైహ్’’.గాలి ప్రతికూలంగా వీచటం తో వారి కణతలలో ఎర్రదనం ఏర్పడి ,అది మదిరాపాన వలన ఏర్పడిన ఎరుపుతో సమానంగా ఉంది .ప్రతికూల వాయువు అనటం వలన వారి ప్రయత్నానికి ప్రతికూల ఫలితమే లభిస్తుంది అనే సూచన ఉన్నది. ‘దూతానా మభి ముఖ పాతిభిహ్ సమీరై –రాయాసాద విశద లోచానోత్పలానాం –అనిన్యే మదజనితాం శ్రియం వధూనా-ముష్ణా౦శుద్యుతి జనితః కపోల రాగః ‘’.దేవతలప్రభావం తో కిందపడకుండా ఆకాశం లో నిలిచి ,వేగంగా లాగే గుర్రాల రధ సమూహం ఆకాశం లో నిరాధారం గా ఉండటం తో చక్ర భ్రమణం లేక విమాన పద్ధతినే అనుసరించి నట్లని పిస్తోంది .దేవా౦గనల చమట క్రమంగా స్తన మండలం చేరి అక్కడి గంధపు పూతను కరిగించి పులకా౦కురాలు కలిగించాయి.నుదుటి బొట్టు చెరిగి౦ది. చమట బిందువులు ముత్యాల శోభ కలిగించాయి .అందమైన వారికి వికారం కూడా అందంగా మారుతుంది –‘’సంపేదే శ్రమ సలిలోద్గమో విభూషాం—రమ్యాణా౦ విక్రుతరపిశ్రియం తనోతి ‘’
జండాల ఎరుపు కాంతి పొడుగ్గా సాగదీసినట్లున్నది .ఆకాశపు మెరుపు కాంతి ఒరిపిడి రాయి వలన కలిగిన బంగారపు పొడి కాంతి లో ఉంది .పూలకంటే సుకుమారులైన అప్సరసలు సూర్యకిరణ వేడికి తట్టుకొనగలగటం గంధర్వులకు ఆశ్చర్యం కలిగించి,బ్రహ్మదేవుని సృష్టి వైచిత్రికి అబ్బుర పడ్డారు –గంధర్వైరధిగత విస్మయైహ్ ప్రతీయే-కళ్యాణీ విదిషు విచిత్రతా విధాతుహ్ ‘’’’శరీరం లోని సప్త రంధ్రాల ద్వారా మద జలం కారుస్తున్న ఏనుగులు మేఘాల్లా ఉన్నాయి .వాటి ముఖంపై ఉన్న సిందూరం సూర్యకాంతి తో ప్రకాశిస్తోంది. బంగారు శ్రు౦ఖల మెరుపులాగా ,మదదార వర్షం లా ఉంది .-‘’సిన్దూరైహ్ కృత రుచయః సహేమ కక్ష్యాః-స్రోతోభిస్త్రిదశ గజా మదం క్షరంతః –సాదృశ్యం యయురా రుణా౦ శురాగభిన్నై-ర్వర్షద్భిహ్ స్పురిత శత హ్రదైహ్-పయదైహ్’’
దేవా౦గనల సేన పైనుంచి గంగాతీరం చేరి౦ది. గంగా నది దిక్కులనే స్త్రీలు అల్లిన జడ లాగా కనిపించింది –‘’ఆకాశాముప రచితా మివైక వేణీం –రమ్యోర్మిం త్రిదశ నదీ౦ యయుర్బలాని ‘’.పూ దేన తాగట౦ తో మత్తిల్లిన తుమ్మెదలు ఒకే చోట చేరటం తో పరాగం తో కలిసిన గాలి కమలాలను కదిల్చి ,గంగా తరంగ చల్లదనాన్నీ పొంది అప్సరసల శ్రమ తాపాన్ని పోగొట్టింది .-‘’ఆమత్త భ్రమర కులాకులాని దున్వ –న్నుద్ధూత గ్రదిత రజాంసి పంకజాని –కా౦తానాం- గగన నదీ తరంగ శీతః –సంతాపం విరమయతి స్మ మాతరిశ్వా’’.నుదుటి తిలకాలను తడిపి పోగొట్టినా ,వారి అలసట తీరినందున మేఘాలు వాళ్లకు సన్మాన యోగ్యమయ్యాయి .చిన్నతప్పు పెద్ద మేలును తుడిచేయలేదు కదా .అశ్వాలు గజాలు నీటిలో దిగి జలక్రీడ చేస్తు౦టే,మందాకినీ తరంగాలు పైకెగసి పైనున్న విమానాలను తాకి ,వెనక్కి వస్తున్నాయి .ఇలాంటి అనుభవం అంతకు ముందు జరగలేదు .ఆకాశానికి ఒడ్డు ఉండదు. విమానాలు అడ్డుకోవటం తో మొదటి సారే జరిగిందని భావం –‘’తత్పూర్వం ప్రతి విదధే సురాపగాయాః-వప్రాంత స్ఖలిత వివర్తనం పయోభిహ్’’.సూర్యాది మండలాల ను దాటి రధ చక్రాల అంచులకు తగిలి ,దేవతలా అరుగులు కూలుస్తూ అప్సరసల రధాలు ముందుకు వెళ్ళాయి.మేఘాలను దాటుతూ అక్కడి నీటిని కలచి వేస్తూ అడ్డు లేకుండా సాగాయి ..ఏనుగు దంతాల ఒరిపిడి తో నీటి బిందువులు రాలుస్తున్న మేఘాలు ,ఎండతాకిడి పొందిన దేవలోక ఏనుగులకు మంచి ఆనందాన్నే కలిగిస్తున్నాయి .సత్పురుషులు తాము బాధ పడుతూ కూడా ఇతరులకు ఉపకారం చేస్తూ ఉంటారు .-‘’యుక్తానాం ఖలు మహతాం పరోపకారే-కళ్యాణీ భవతి రుజత్స్వపి ప్రవ్రుత్తిహ్ ‘’.వేగంగా వీస్తున్న గాలి కాముకుడు లాగా అప్సరసల అందమైన వస్త్రాలు తొలగిస్తూంటే , వారి మణి మేఖలల (మొల త్రాళ్ళ )కాంతులు ,రెండు తొడలు కనిపించకుండా ఆవరించి ,లో దుస్తుల్లా (అండర్ వేర్ ) లా మారాయి .తరంగాల గుర్తులతో అందమైన ఇసుక ప్రదేశాల లాగా కనిపించే నీరు లేని మేఘాలు చెదిరిన కారణంగా, ఇంద్ర ధనుస్సు సరిగ్గా కనిపించటం లేదు .కాని వారు ధరించిన మణుల కాంతి ప్రసారం చేత హరివిల్లుకు సంపూర్ణత్వం సిద్ధించింది ..అక్కడ పనులు ఎలా చేయాలని మాట్లాడుకొంటూ అప్సరసల సమూహం పక్షులు సంచరించే ఆకాశ మార్గం దాటి ఇంద్రకీల సానువు చేరింది .అక్కడ నీరు లేని తెల్లని మబ్బులు మాత్రమే ఉన్నాయి .ఇంద్రకీలం చేరిన అప్సరసలు ఆకాశ గంగ లాగా ప్రకాశించారు .వారి ముఖాలు విప్పారాయి .వారి మాటలే మద్దెల మోతగాఉంది .వారు ఆకాశ గంగనే తలపించారు –సాతూర్యధ్వని త గభీర మా పతంతీ-భూ భర్తుహ్ శిరసి నభో నదీవ రేజే ‘’.ఆకాశ మేఘాలు కప్పులాగా ఉండగా ,కిందికి దిగే రధాల,గుర్రాల ,కళ్ళాలు లాగి పట్టు కోవటం తో వాటి శరీరము౦దుభాగం కుంచించుకు పోయినట్లు కనిపించింది. తలలు వంచి అతికష్టం మీద గుర్రాలు భూమిపైకి చేరాయి –‘’అనిన్యు ర్నియమిత రశ్మి భుగ్న ఘోణాః- కృచ్ చ్రేణ క్షితి మవనామి నస్తురంగా ‘’.ఇంద్రకీలం పై దిగుతున్న దివిజ గజాలు రెండు ప్రక్కలా మేఘాలతో సముద్రం లోని మైనాకం మొదలైన పర్వతాల్లా కనిపించాయి –‘’మహేంద్రం నగమభితః కరేణు వర్యాః-పర్యంత స్థిత జలదా దివః పత౦తః –సాదృశ్యం నిలయన నిష్ప్రకంప పక్షై-రాజ గ్ముర్జ నిధి శాయి భిర్ణ గేంద్రైహ్’’
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -23-11-20-ఉయ్యూరు