కిరాతార్జునీయం-.9
సప్తమ సర్గ -2(చివరి భాగం )
ఇంద్రకీలం పై సమతల నదీ తీర ప్రదేశం మీదఇసుకలో గుర్రాలు దిగాయి .ఆకాశ గమనం లో ఆరితేరినవి కనుక వాటికి సమతలం చేరటం సులభమే .ఇసుకలో వాటి గిట్టల గుర్తులు స్పష్టంగా కనిపించాయి .ధ్వనిస్తూ పారే నదుల తో పర్వతం పైభాగాన ప్రతిధ్వని విన్న నెమళ్ళు మేఘ గర్జన భ్రాంతి తో తలలు పైకెత్తి ఆసక్తిగాచూస్తున్నాయి –‘’ఉద్గ్రీవై ర్ఘన రవ శంకయా మయోరైహ్ –సోత్కంత ధ్వని రుపశుశ్రు వే ర ధా నాం ‘’.పైన ఉన్న నీల మణుల నుండి నిరంతరం ప్రసరిస్తున్న కాంతులతో పైనుండి పడే జలధార బాగా నీలం రంగుపొంది ఆకాశం మధ్యలో పగిలిందా అని అచ్చరలు అచ్చెరువుతో చూశారు .-‘’విచ్ఛిన్నా మివ వనితా నభో౦తరాలే-వప్రామ్భః స్రుతి మవలోక యాంబభూవుహ్ ‘’.దిగ్గజాలు అడవిలోని మదపు టేనుగుల్ని చూసి ,కోపం తో మావటి వాడిని కూడా లెక్క చేయకుండా తమ ఆడ ఏనుగులపై మనసు పడి ముందుకు సాగాయి .రధ చక్రాల వలన ఎగసిన యెర్రని ధూళి తో దేవతా స్త్రీల సేన అడవుల్లో వ్యాపించింది .వర్షాకాలం మొదట్లో యెర్రని నీరు గల గంగానదిలా సేన కనిపిచింది .-‘’అతేనే వనగహనానివాహినీ సా –ఘర్మా౦తక్షుభిత జలేవ జహ్ను కన్యా ‘’.
గంగా తీర అందమైన వాస యోగ్యమైన ప్రదేశం లో అందరూ బస చేశారు .మణులకాంతి లాంటి ఇసుకతిన్నెలు ,చెట్ల నుంచి రాలిన పూలతో నిండిన ,దట్టమైన పచ్చిక పరచిన ప్రదేశం అది .ఇంద్రకీల౦ పై గ౦ధర్వ సేన ,పూర్వం ఎరుగని శోభ పొందారు .మహాత్ముల సంబంధం వలన సమకూరనిది ఏముంటుంది ?-‘’సమసక్తౌ కిమ సులభం మహోదయానా-ముచ్ఛ్రాయాంనయతి యదృచ్ఛయాపి యోగః ‘’.పరిమళ భరిత పూల చెట్ల శోభ ,నిర్జన ప్రదేశం ,కొత్తగాచిగిర్చిన తీగల సంపద ఉన్న ప్రదేశమది .ఆ సౌఖ్యం అప్సరసలుఅనుభవి౦చటం తో అది సాఫల్యం పొందింది .ఇతరులకుపయోగించేదే సంపద .-‘’సాఫల్యం యయు రమరా౦గనొప భుక్తాః-సా లక్ష్మీ రుపకురుతే యయా పరేషాం’’.అలసిన ఆస్త్రీలు చందన వృక్షాలున్నా చల్లదనం పొందలేకపోయారు .ఆ చెట్ల కొమ్మల్లో ఉన్న పాముల శ్వాస తో చిగురాకులు కదులుతుండగా భయపడ్డారు .చెడ్డ వారిని చేర దీసిన రాజు కూడా దూరంగా ఉంచదగిన వాడే కదా .-‘’క్లా౦తోపి త్రిదశ వధూ జనః పురస్తా –ల్లీనా హిశ్వసి త విలోల పల్లవానాం –సేవ్యానాం హత వినయై రివా వృతానాం-సంపర్కం హత వినయై రివా వృతానాం-సంపర్కం పరి హరతి సమ చందనానాం ‘’.
మావటి వాళ్ళు ఏనుగులపై ఉన్న ధ్వజ, కవచ, గుడార సామాను నేలపై దించి ,ఏనుగుల్ని సమప్రదేశం లో వదిలారు .ప్రళయ కాలం లో వీచే గాలి చెట్టు, చేమలను కూల్చగా బోడిగా కనిపించే పర్వతాలలాగా ఆ ఏనుగులు నేలపై పడుకొని కనిపించాయి –‘ ‘’అక్షిప్తద్రుమ గహనా యుగాంత వాతైహ్ –పర్యస్తా గిరయః ఇవ ద్విపా విరేజుహ్ ‘’.ఒకగాజరాజు ప్రయాణపు బడలికతో వచ్చే నిద్రను వదిలి ,మదజలం తో బురదగా మారిన ఆచోటును వదిలేసింది .అప్పుడే మద వాసనకు ఆకర్షితమైన తుమ్మెదలు అక్కడికి చేరాయి .ఆదృశ్యం తొందరలో ఏనుగు లేచినప్పుడు తెగిన కట్టేసే త్రాడా అన్నట్లుగా తుమ్మెద పంక్తి కనిపించింది .-‘’శయ్యాంతే కులమలినా౦ క్షణం విలీనం –సంరంభ చ్యుత మివ శ్రుమ్ఖలం చకాశే ‘’
లేచిన ఏనుగు కు గంగా ప్రవాహం అడ్డు పడింది .అంకుశంతో బలంగా తలపై మావటి పొడిచినా లెక్క చేయలేదు .గంగ నీరు తాగి,తొండం తో మావటికి భయపడుతూనే నీరు పైకి చిమ్మింది .ఆ నీరు యెర్రని మదధారలుగల గండ స్థలం నుంచి కిందికి జారుతూ గంగనీరూ ఎరుపెక్కింది .మరో ఏనుగు దాహంగా ఉన్నా ,ఏనుగు మద జలం తో కలిసిన ఆ నీటిని తాగటానికి ఇష్టపడక ,వాసన చూసి కోపం తో రెండవ తీరం వైపు కళ్ళు తిప్పి చూసి ,అది చల్లని నీరే అయినా తాగలేదు .గంగలో జలక్రీడ చేస్తున్న ఏనుగులు మదజలం తో గంగనీటిని పరిమళ భరితం చేసి ,కమలాల పచ్చని కేసరాలతో గండ స్థలం పై ఉన్న యెర్రని మద రేఖలను కప్పుకొని ,ఒడ్డుకు చేరాయి –‘’కింజల్క వ్యవహిత తామ్రదాన లేఖై-రుత్తేరుహ్ సరసిజ గన్ధిభిహ్ కపొలైహ్ ‘’.సేన ధూళి గంగనీటిపై చేరి ,తరంగాలు తీరాన్నితాకుతూ ,ఏనుగులు తు౦చేసిన తామర పూల పుప్పొడి పచ్చగా వ్యాపించి నదికి మా౦జిస్ట(Rubia cordifolia Linn)-(ఎరుపు ,పసుపు రంగుల సమ్మేళనరంగు ) రంగు కల వస్త్రం లా శోభ కూర్చింది .మాన్జిస్ట రక్తశుద్ధికీ ఉపయోగపడే వనౌషధ తీగ-‘’మతన్గోన్మధిత సరోజ రేణుపింగం –మాంజి స్టం వసన.మివాంబునిర్బభాసే ‘’
ఇరుగుడు చెట్లకు కట్టబడిన ఏనుగులు వెనక పాదాలూ భుజాలూ కదిలిస్తూ ముందు వెనుకలకు ఊగుతున్నాయి. మద ధారలు కారుతున్నాయి .చూడటానికి అవి నీటి ధారలతో తడిసి పర్వత గండ శిలలు జారి పడుతున్నాయా అని పించాయి .-‘’సంప్రాప్తే నిస్తృత మదా౦ బు భిర్గజైహ్ –ప్రస్యందిప్రచలిత గండ శైల శోభా ‘’.సప్త నాడుల ద్వారా యెడ తెరిపి లేకుండా మదాన్ని వర్షిస్తుంటే నేలపై దుమ్ము అణగిపోయింది .ఆమదజల పరిమళం ఏలకు తీగల వాసన లాగా ఉంది .వాయువు ఈ సుగంధాన్ని అంతటా వ్యాపింప జేస్తోంది .దిగ్గజాల ఘీ౦కారాలను విన్న సింహాలు నిద్ర చెదిరి సంక్షోభం పొందాయి. చకోరాలు నెమళ్లు మేఘ గర్జన అని భ్రాంతి చెందాయి –‘’అకేతను శ్చకిత చకోర ,నీలకంతాన్-కచ్చాంతా నమర హేభ బృంహి తాని ‘’.దీవ సేన విడిది చేసిన ప్రదేశం చక్కగా అలంకరించ బడి,ఉద్యానవన శోభ పొందింది అప్సరసలు మార్గాయాసం పోగొట్టుకోవటానికి వస్త్రాలు, ఆభరణాలుతీసేసి చెట్ల కొమ్మలకు తగిలించారు .చెట్ల నీడలో సేద తీరుతూ ఆ ఉద్యానవన శోభలో మైమరచారు .
సశేషం
మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -24-11-20-ఉయ్యూరు