కిరాతార్జునీయం-.10
అష్టమ సర్గ -1
తమకోసం నిర్మించుకొన్న గ౦ధర్వ నగరం లో అప్సరసలు వనవిహారం చేయాలని బయల్దేరారు .ఆనగరం నానా వర్ణాలతో ఇంద్ర ధనుస్సును తలపిస్తోంది .-‘’సురా౦గనా గోపతి చాప గోపురం –పురం వనానాం విజి గీర్షయా జహుహ్ ‘’తమ ప్రియులైన గంధర్వులతో వనవిహారం చేస్తుంటే వాళ్ళ కాంతి పర్వత శిఖరాలపైఉన్న వృక్షాలు,తీగలపై ప్రసరించి విద్యుత్ కాంతులతో మెరుపు లేమో అనిపించాయి .అప్సరలు భూమిపై సంచరించటం వలన ఆకాశ గమనం కంటే ఎక్కువ సంతోషం పొందారు .నేలపై నడవటం తో ఎత్తైన పాలిండ్ల శ్రమ ,జఘన పరిశ్రమ కూడా తొలగి పోయింది .కంకణాది కాలి అందేల ధ్వని కూడా అందం పెరగటానికి కారణమైంది .చెట్లు వంగి వారిపై పుష్ప వృష్టి కురిపిస్తున్నాయి .వాళ్ళ శరీర అ౦గ రాగాల పరిమళాలకు ఆకర్షింపబడి తుమ్మెదలు వాళ్ళనే ముసరు తున్నాయి .లత్తుక ఉన్న అరచేతులు ,చిగురాకులు గా ఉన్న గోళ్ళకాంతులు పూల గుత్తులేమో అనుకొని తుమ్మెదలు వాళ్ళ మీద వాలుతున్నాయని భావం .అశోక వృక్ష౦ కొమ్మపై తుమ్మెదలు పూల మకరందం తాగుతుంటే చిగురాకులు అల్లాలాడు తుంటే అప్సరలు ఆనందంగా చూశారు .ఈ దృశ్యం ప్రియుడు అధరోస్టం పానం చేస్తూ కొరికితే చేతులతో దులపరించుకొనే నాయిక లా కనిపించింది .-‘’విదంబ యంతీ దదృశే వధూ జనైహ్ –రమంద దష్ఠ కరా వధూనాననం ‘’.ఒక అచ్చర మరో అప్సరసతో ‘’చిగురాకుల్లా మనోహరంగా ఉన్న చేతుల్ని అనవసరంగా ఎందుకు విదిలిస్తావ్ ?తుమ్మెదల బారు కల్పలత అనే భ్రాంతితో నీ దగ్గరకు చేరింది భయం అక్కర్లేదు ‘’అన్నది .ప్రాణాయా కోపంతో ఉన్న నాయిక చెలి ‘’కోపం వదిలి ప్రియుని చేరు .మనసు చంచలమైనది .తర్వాత పశ్చాత్తాపం పడతావు ‘’అని చెప్పి ప్రసన్ను రాలిని చేసింది .
ఆ వనం లోని నదులు ఎత్తుగా పెరిగిన కాశ గడ్డి అనే వస్త్రాలను చుట్టుకొన్నాయి .ధ్వనిస్తున్న బెగ్గురుపక్షుల బారు మొలనూలుగా ఉంది .ఎత్తైన తీర ప్రాంత ఇసుకతిన్నెలే పిరుదులు .ఎత్తునుంచి పడే నీటి బిందువులు ముక్కలుగా చెదరి అన్ని వైపులకు వ్యాపింఛి ముత్యాల్లా స్వచ్చంగా ,ప్రియుని చల్లని ఒడి గా ఉన్నాయి.వనం యొక్క హాసమా అన్నట్లు తెల్లగా ప్రకాశిస్తున్నాయి –‘’ప్రియాంక శీతాః శుచి మౌక్తిక త్విషో-వన ప్రహాసా ఇవ వారి బిందవః ‘’నిశ్చలంగా ఉన్న తుమ్మెదలేకాటుకగా ఉన్న పుప్పొడి ,పుష్పాలు అనే నేత్రాలతో తమ ప్రియ చెలికత్తెలను నమ్రభావంతో చూస్తున్నాయా అన్నట్లు వంగి ఉన్న తీగలు వనానికి శోభ కూరుస్తున్నాయి .-‘’స్థిర ద్విరేఫా౦జన శారి తోదరై-ర్విసారిభిహ్ పుష్ప విలోచనై ర్లతా ‘’.
చందన వృక్షాలను మద గజాలు గండ స్థలాలతో రాసు కొంటుంటే ,అవి శ్యామల వర్ణంపొంది పర్వత పైభాగాలకు చేర్తున్నాయా అని పించాయి .వీటికి అప్సరసలు ఆన౦దించారు .అందుబాటులో పూలున్నా ప్రియ రాళ్లకోసం గంధర్వులు తామే కోసి సంతోషం కలిగిస్తున్నారు .ఒక గంధర్వుడు పూలు కోస్తూ మరో నాయిక పేరు పలకగా నాయిక నీరు నిండిన కళ్ళతో పాదాలు నేలకేసి రాసి,కోపం ప్రకటించింది .ఒక అప్సరస ప్రియుడితో మాట్లాడుతూ చూపు అతనిపైనే లగ్నం చేసింది .కొకముడి ఊడినా గుర్తి౦చ లేదు .వేరే వస్త్రమూ కట్టుకోలేదు చేతులు వృధాగా పూలపై పడటమూ గమనించలేదు .ప్రియునిమాటలు ,రూపాలకు ఆమె మత్తెక్కి పోయి౦దన్నమాట .ప్రియుడు పూలదండకట్టి ఇస్తే తలలో తురుముకొని ఒకనాయిక అతనికి చనులతో, విశాలమైన పిరుదులతో గట్టి ఆలింగన సౌఖ్యం కలిగించింది .ఒకావిడ లావైన పిరుదులతో లేవటం తో, కొకముడి వీడి వ్రేలాడింది .పై వస్త్రం జారిపోయి స్తనాల అందం బయట పడింది. శరీరం సాగి పొట్టపై ముడతలు మాయమై నూగారు స్పష్టంగా కన్పించింది .పైపొట్ట ను చాచ న౦దున తో పొట్టిదై౦ది .పూలుకోసే నెపంతో ప్రియుడిని అంగాంగ సౌందర్యం ప్రదర్శిస్తూ కవ్విస్తోంది ఒకామె . నాయిక కంట్లో పుప్పొడి పడగా ప్రియుడు తొలగించటానికి నానా హైరానా పడ్డాడు .ఆమె ఎత్తైన లావైన పాలిండ్లతో అతడిని కుమ్మేసింది ..అప్సరసలు వనం లోని ఆకులు పూలు అలంకరించుకొనగా వనలక్ష్మి శోభ వారినే వరించింనిపించింది .
ఇప్పటిదాకా మనల్ని చెట్లూ చేమలూ నదులు ఇసుకతిన్నెలచుట్టూ తిప్పి అప్సరసల కామ చేష్టలను విపులంగా వర్ణిస్తూ ,అర్జునుడు ఏమయ్యాడో ఆ గోడే పట్టించుకోకుండా అతనిపై చూపాల్సిన ఈ మన్మధ వికారాల్ని ఇక్కడే ఇప్పుడే తమలో తాము చూపుకొంటూ ,చూపుతూ ‘’ట్రయల్ రన్’’ గా చూపిస్తూ , వర్ణలతో కమ్మేసి ,కుమ్మేశాడు కవి భారవి .తర్వాతైనా కధ ఒక అర౦గుళమైనా కదుల్తుందేమో రేపు చూద్దాం .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -25-11-20-ఉయ్యూరు