కిరాతార్జునీయం-.11
అష్టమ సర్గ -2(చివరి భాగం )
చిగురాకులు కోయటం తో అచ్చరల చేతులు ఎర్రబడ్డాయి .పుప్పొడి అంటి పాలిండ్లు పసుపు రంగు పొందాయి. పూల వాసనతో శరీరాలు పరిమళం పొందాయి .తమ సౌందర్యం పెంపు కోసం సామగ్రి అంతా చెట్ల నుండే పొందారు .ఇంద్రకీలం లో ప్రతి అడుగులోనూ త్రుళ్ళి పడుతున్నారు. ఏనుగు తొండం లా లావైన తొడల వలన నడక లో శ్రమ పడ్డారు .కొత్త చిగుళ్ళ వంటి పాదాలు నడవ లేక తడ బడుతున్నాయి ఈ తుళ్ళింత మధుపానం వల్లనేమో అనిపిస్తోంది .(బహుశా అర్జున మౌని ముందు కూడా ఈ తడబాటు జరుగుందేమో నని సూచన కావచ్చు నని నా ఊహ ).మొలనూలి మణి కాంతులు నితంబాలకాంతిని వెలువరిస్తున్నాయి .అవి గంగనీటి నుండి అప్పుడే బయట పడిన ఇసుక మేటల శోభను జయి౦చినట్లున్నాయి .పాదాల ముద్రలు ఇసుకలో ముద్రింప బడినాయి .నాభి ప్రదేశాలు వికసిత కమలాల మొగ్గలఅందాన్ని కలిగి ,కొకముడి దగ్గర ఆకట్టుకొనే శోభ పొందాయి .పొట్ట మధ్య భాగం లో వలి త్రయం అందం గా ఉంది .జఘనం పై ఉన్నత ,విశాల స్తనాలు బరువు తో పొట్ట పైభాగం లోపలి కి వంగింది .కళ్ళకు చెమట ఆవరించటం తో పూర్తిగా కళ్ళు తెరవ లేకపొతున్నారు .ఆకళ్ళు మంచు తో స్పష్టంగారేకులు కనిపించని కమలాల్లా ఉన్నాయి .ముఖాలు కూడా అలానే ఉన్నాయి –‘’సమాన కాంతీని తుషార భూష నైహ్-సరోరు హైరస్ఫుట పత్ర ప౦క్తి భిహ్ –చితాని ఘర్మా౦బు కనైహ్ సమంతతో-ముఖాన్యనుత్ఫుల్ల విలోచనాని చ ‘’
నెమ్మదిగా నడుస్తున్న అప్ససరల అంగాంగ సౌందర్య చేష్టలు చూస్తున్న గంధర్వులు అదే మొదటి సారిగా చూసిన అనుభూతి పొందారు ..పూలు కోశాక, గంగానది ని చూశారు .చేపలతో కదల్చబడి ప్రసన్నంగా ఉన్న పద్మం కలది ,బురద లేని తీరాన్ని తాకుతున్న అలలు అనే చేతులతో ,రాయంచల కలకలారావాలతో పిలుస్తోందా అని పించింది .అంటే గంగ అనే స్త్రీ స్నానానికి రమ్మని పిలుస్తున్న భావన కలిగించిందని భావం .మందమారుతం వీచింది అది తరంగాలపై వస్తూ తుమ్పురుల చల్లదనం పద్మాల పరిమళం పొంది వేడిని కూడా తగ్గించి, వారికి ఆలింగన సౌఖ్యం కలిగించింది .విలాసమైన నడకలతోహంస నడకలను ,పిరుదుల వైశాల్యం తో ఇసుక తిన్నెలను ,విశాల నేత్రాల ముఖాలతో పద్మాలను సామ్యగుణ౦ తో అప్సరసలు నిరసించారు .వీరికున్న నేత్రాలు పద్మాలకు లేనందున గుణ నిరసన జరిగింది .
గంధర్వులు ముందు నదిలో దిగి దారి చూపారు .తర్వాత దేవా౦గనలు భయభయంగా మొదటి సారి అన్నట్లు గంగలోదిగారు .వారు నీటిలో దిగగానే తరంగాలు చీలి తీరం దాకా వ్యాపించాయి తీరానున్న నీటి పక్షులు భయంగా పారి పోయాయి .గట్టిగా ఉన్న గంధర్వుల వక్ష స్తలాలతో విశాల చనుల అప్సరసల తాకిడితో నీటి తరంగాలు ముక్కలై తీరమంతా వ్యాపించి అల్లకల్లోలమైంది .గంగ వీళ్ళ జలక్రీడలకు కోపించి క్షోభించినట్లు గా ఉంది –తటాభి నీతేన విభిన్న వీచినా –రుషేవ భేజే కలుషత్వ మంభసా ‘’.తల వెంట్రుకలు చెదిరి ,పూదండలు జారి ,చందనాదులు కరగి పోగా అప్సరసలకు తాము చేసిన అపరాధం వల్ల ఇలా జరిగిందా అని భయపడి నట్లు నీటి తరంగాలు మాటిమాటికీ వణకు తున్నాయి –‘’అతి ప్రసంగా ద్విహితాగసో ముహుహ్ –ప్రకంప మీయుహ్ సభయా ఇవోర్మయః ‘’
నఖక్షతాలు సవతులకు కనిపించకుండా గంధం వంటివి పూస్తే ,అవి నీటిలో కరిగి బయటపడ్డాయి .ప్రియుల ప్రేమకు చిహ్నాలైన వాటిని మిగిలిన కుంకుమ తో మధురస్మృతులు పొందారు .చెలికత్తెలు రెండు తుమ్మెదలు వాలిన పద్మపత్రాలా లేక తమ నాయకి చంచల నేత్రాలా ,చెలి కేశపాశామా లేక తుమ్మెద సమూహమా అని ఆశ్చర్యపోయారు .చిరు నవ్వు దాచుకోనందున బయట పడిన దంతాలు అనే కేసరాలున్న ముఖమా ,లేక వికసిత పద్మమా అంటూ పద్మవనం లో దాగిన తమ చెలికత్తెను మిగతా స్త్రీలు చాలా సేపటికి గుర్తించారు .నాయిక నేత్రాలు తుమ్మెదలు వ్రాలిన పద్మ పత్రాల్లా ,ముడిచిన జుట్టుతుమ్మెదల బృందం గా ,దంతకా౦తు లే కేసరాలుగా ఉన్న ముఖంగా ఉన్నది అని భావం .
ఒక నాయిక సవతి చూస్తుండగానే ప్రియుడు కూర్చిన పూలదండను పాలిండ్లపైధరించి నీటిలో తడిసి వాడినా తీసి పారెయ్యలేదు . అంటే ప్రేమకున్న ప్రాధాన్యం దండకు లేదని భావం .కళ్ళ చుట్టూ ఉన్న ఎర్రదనాన్నికాటుక అడ్డు కొంటో౦ది .నీటిలో కాటుక కరిగిపోయినా ,కనుల ఎరుపుదనం నేత్రాల తెలుపు దనాన్ని పోగొట్టిందే కాని కళ్ళ అందాన్ని పోగొట్టలేదు ఎర్రదనం కళ్ళకు అలంకారంగా మారిందని భావం .పూల మాలలు గంగానదీ వేగానికి తేలుతూ కొట్టుకుపోయాయి .ధనాది కారాల ఆశతో దుష్టులు వెళ్ళ గొడితే మంత్రుల పరిస్థితి లా ఉంది .ఆ మంత్రులు కూడా స్థాన భ్రస్టులై చులకన కావటం లాంటిదే ఈ పూలదండలు నలిగి నీటిలో కొట్టుకొని తేలిపోవటం కూడా –‘’ద్యుతం వహంతో వనితా వతంసకా –హృతాః ప్రలోభాదివ వేగి భి ర్జలైహ్ –ఉప ఫ్లుతా స్తత క్షణ న శోచ నీయతాం –చ్యుతాది కారాః సచివా ఇవా యయుహ్ ‘’
శరీరాలకు అల౦కార౦ కోసం పూసుకున్నవన్నీ నీటిలో కరిగే పోయినా ,సహజ సౌందర్యం అలానే ఉంది .అప్సరసలు వస్తువులకే అలంకారం తెస్తారని వారి ప్రియులు భావించారు .నదిలో స్నానించిన సవతుల నఖ క్షతాలుల చూసి సవతులు భగ్గుమన్నారు .అప్సరసల అలంకారాలన్నీ గంగ నీటిలో ఉండటం చేత వీళ్ళ ఆదిక్యంఏమీ కనిపించలేదు .గంగార్పణం .చేతులతో నీటిని కదలిస్తుంటే మద్దెల మోతగా స్తనాలు కదుల్తున్నాయి .చలితో వణుకుతూ నృత్యం చేస్తున్నాయా అని పించాయి .—ముహుహ్ స్తనైస్తాల సమం సమాదదే-మనో రమం నృత్యమివ ప్రవేపితాం ‘’.వారి ముఖాలు నీటిలో ప్రతిబింబించాయి స్త్రీలకూ సంతోషం కలిగించేట్లు గంగానది అత్యంత స్వచ్చంగా ఉంది .నిర్మల మనస్కులు పరోపకారులౌతారు –‘’కృతాను కూల్యా సురరాజ యోషితాం-ప్రసాద సాఫల్య మవాప జాహ్నవీ ‘’.
వారి తొడలను చేపలు తాకగా భయపడి,చేతులు అటూఇటూ కదిల్చారు .చేపతాకిన అప్సరస భయంతో ప్రియుడిని వాటేసుకొని సంతోషం కలిగించింది. కృతక చేస్టలకంటే సహజ ప్రేమ ను ప్రకటించే చేస్టతో స్త్రీలు ప్రియుల మనసు దోచుకొంటారు కదా –‘’అకృత్రిమ ప్రేమ రసాహి తైర్మనో –హరంతి రామాః కృతకైరపీహితైహ్’’.నీటిలో మునిగి స్నానం చేయటం వలన తలవెంట్రుకలు చెదిరి ముఖాలపై పడి,తుమ్మెదలు మూగిన పద్మాలనిపించాయి .ఒక అప్సరస నీటిలో మునిగినట్లు నటించి, భయం లేకుండా ప్రవర్తించి, ప్రియుడినిఅల్లుకొని ఆన౦దించి ,చెలికత్తెలకు మాత్రం భయంతో ఆధారంగా అతడిని పట్టుకొన్న భావన కలిగించింది .ప్రియులు చేతులతో నీటిని ప్రేయసులమీద చల్లుతుంటే విలాసంగా నవ్వుతూ చేతులు అడ్డు పెట్టు కొన్నారు .దీనితో ఉచ్చ్వాస నిశ్వాసాలు ఎక్కువై స్తనాలు వణుకుతున్నట్లు కదుల్తున్నాయి .తియ్యటిమాటలతో ప్రియురాళ్ళను ప్రియులు అనున యిస్తున్నారు .కనురెప్పలు కిందకు వాల్చి నీటి బి౦దువు లున్న కనురెప్పలను మూసుకొంటున్నారు .దోసిలి నిండిన నీటితో ప్రేయసి ప్రియుడిపై చల్లబోతుంటే ,అతడు పట్టుకొని ఆమె పైనే చల్లగా,ఆమె నీవీ బంధం ఊడగా, మొలనూలుకాపాడింది .కాటుకలేనికళ్ళు,లాక్షారసం లేనిపెదవుల కంపం ,నుదుటి ముడతలు వారికి అందాన్ని కలిగించాయి .అర్ధనిమీలిత నేత్రాలతో ఒకామె ప్రియుడిని కవ్వించిన ప్రేయసి కంపం కలిగి స్తనాలు ఊగి ,మన్మధ వికారం అని పించింది .సవతిని నీటితో సరదాగా తడపటం చూసి ఒక నాయిక సహించలేక పోయింది .ఇలా ఇస్టాపూర్తిగా జలక్రీడ పూర్తి చేసి ,తీరం చేరారు .స్త్రీల విరహం తాళలేక ముందుకు నది సాగిపోతోందా అని పించింది .ఆప్తులు దూరమైపోతుంటే కొంత దూరం సాగనంపటం ఆనవాయితీ –‘’ఉత్సర్పి తోర్మియ లంఘిత తీర దేశ –మౌత్సుక్య నున్నమివ వారి పురః ప్రతస్థే ‘’.వీరు తీరం చేరగానే చక్రవాకాలు వేరే తీరానికి వెళ్ళాయి .కమలశోభ తగ్గింది .ఆకాశ గంగా జలంతో వాళ్ళ హారాలమాలిన్యం వదిలిపోయి ప్రకాశించాయి.వాళ్ళు నక్షత్రాల వెన్నెల రాత్రుల్లా శోభించారు –‘’సంరేజిరే సురసరిజ్జల దౌత హారా –స్తారా వితాన తరలా ఇవ యామవత్యః’’.అప్సరసల అంగరాగ చందనం కలిసి గంగాజలం రంగుమారింది తొందరలో తెగిన హారాల మణుల కాంతి చేరటం తో అనేక రంగుల హ౦గు ,పొంగు పొందింది .నది దేవకాంతల పుక్కిలి౦పులతో అలలేర్పడ్డాయి .వీటన్నిటితో నది శయనీయ పడక శోభ పొందింది .-‘’సంక్రాంత చందన రసాహిత వర్ణ భేదం –విచ్చిన్న భూషణ మణి ప్రకరాంశు చిత్రం –బద్ధోర్మి నాక వనితా పరి భుక్త ముక్తం –సింధోర్బ భార సలిలం శయనీయ లక్ష్మీం ‘’
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -26-11-20-ఉయ్యూరు