కిరాతార్జునీయం-.13
నవమ సర్గ -2
చంద్రుడు దగ్గరకు రావటంతో కిరణ సముదాయం వక్రత్వం పోగొట్టుకొని నిటారుగా దిగంతాలకు పాకింది .అది లోకమంతా శ్వాస పీల్చుకొన్నట్లున్నది .అంటే చంద్ర కాంతి తో లోకం ఆనంది౦చి౦దని భావం –‘’నిహ్ సృతస్తిమిరభార నిరోధా –దుచ్చ్వసన్నివ రరాజ దిగంతః ‘’.స్వచ్ఛ పగడ కాంతి కళలతో నాలుగువైపులా అంధకారాన్ని దూరం గా పైకి తరిమేశాడు .పూర్వం అది వరాహం కోరతో భూమిని సముద్రం లో నుంచి పైకితోసినట్లున్నది .చంద్ర కళ ఆది వరాహం కొమ్ము కోర గా భావించాడు కవి –‘’లేఖయా విమల విద్రుమ భాసా –సంతతం తిమిర మిందు రుదాసతే –దంష్ట్రయా కనక టంపిశంగ్యా –మండలం భువ ఇవాది వరాహః ‘’.కిరణాలతో ఆకాశాన్ని ప్రకాశింప జేస్తూ ,కు౦కుమ రాగ స్తనమండలం లాగా ప్రకాశిస్తూ ,,తూర్పు సముద్రం నుండి చంద్రుడు పైకి వచ్చాడు .బంగారు కలశం లాగా భాసించాడు –‘’హేమకుంభ ఇవ పూర్వ పయోధే –రున్మమజ్జ శనకై స్తుహాయ్ నా౦శుహ్’’.ఇంకా కొంత చీకటి ఉండి,రాత్రిని ముఖం పై కప్పుకొన్న ముసుగు తొలగించినా ,సిగ్గు తో ముడుచుకొన్న కొత్త పెళ్లి కూతుర్లా లోకం తృప్తి చెందకుండా చూస్తూనే ఉంది –‘’వ్యంశుక స్పుట ముఖీ మతి జిహ్మాం-వ్రీడయా నవ వధూ మివ లోకః ‘’.పర్వతాలలో ఇంకా చీకటే ఉంది .దిక్కుల మొదళ్ళలో కాంతి వ్యాపించలేదు అయినా రాత్రిమాత్రం అందంగా ఉన్నది –దిజ్ముఖేషున చ దామ వికీర్ణం –భూషితైవ రజనీ హిమ భాసా ‘’.నెమ్మదిగా ఆకాశం చేరిన చంద్రుడు విరహ స్త్రీల వేడికన్నీటి చూపులను సహిస్తూ ,భయపడినట్లు నెమ్మదిగా ప్రయాణిస్తున్నాడు –‘’మందమంద ముదితః ప్రయయౌ ఖం –భీత భీత ఇవ శీత మయూఖాః’’.కిరణాల చేతులతో నక్షత్ర నాయిక కంతాలపైప్రసరింప జేసి ,ఆలింగనం చేసుకొన్నాడు .అతని ఎరుపుదనం నక్షత్రాల చుట్టూ వ్యాపించి,అంగరాగ శోభ కలిగించింది .మొత్తం చీకటిని పోగొట్ట్టిన చంద్రుడు క్షీర సముద్రాన్ని మధించినప్పుడు అందులోని పాలు పైకి ఉబికి ఎత్తైన చెట్ల వనాలను ము౦చినట్లుంది –‘’క్షీర సింధురివమందరభిన్నః –కాననాన్య విరలోచ్చ తరూణి’’.వృక్షాల కింది భాగం లోఆకుల మధ్య నుండి చంద్ర కిరణాలు వ్యాపించి నేలపై తెల్లని ముగ్గులతో అలంకరించిన నివాస గృహాలా అని పించాయి .పగటి ఎండలో భార్యతో కలిసి ఆడిన చక్రవాకం ,రాత్రి చంద్ర కిరణాలను సహించలేక పోయింది. దుఖం లో ఉంటె ప్రతిదీ సహి౦చరానిదే అవుతుంది.-‘’ఆతపే ధృతి మతాసహా వధ్వా – యామినీ విరహిణావిహగేన-సేహిరే న కిరణా హిమరశ్మే-ర్దుఖితే మనసి సర్వ మసహ్యం ‘’.
నీటి తు౦పురులను ,కలువల గంధాన్నీ ,పరాగాన్నీ వెదజల్లుతున్నరాత్రి గాలి సుఖం గా నిద్రిస్తున్న పక్షులున్న చెట్లను కొద్దిగా కదిలిస్తోంది .కాముడు పరిమళ ద్రవ్యాలు పూసుకొన్న చేతి తో ప్రియురాల్ని తనవైపు ఆకర్షించి నట్లు ఉన్నదని భావం .-అదుధావ పరిలీన విహంగా –యమినీ మరుదపాం వనరాజిహ్ ‘’.రాత్రి అనే రమణి మన్మధుడికి పట్టాభి షేకం చేయటానికి ఎత్తిన వెండి కలశం లాగా చంద్రుడు పైకొచ్చాడు .ఆ కలశం లో మంచు కిరణాలే నీరు .చంద్రునిలోని మచ్చ నల్లకలువ పూవు .-‘’సంవిధాతు మభి షేక ముదాసే –మన్మధస్య లసదంశు జలౌఘః –యామినీ వనితయా తత చిహ్నః -సోత్పలో రజత కుంభ ఇవేందుహ్’’.ఎంత పరాక్రమం ఉన్నాసాయం చేసే వాడు లేకపోతె రాణించ లేడు .అందుకే మన్మధుడు చంద్ర కిరణాలే బాణాలుగా సాయం తీసుకొని ధనువు వంచాడు –‘’ఓజసామపి ఖలు నూననుమనూనం –నా సహాయ ముపయాతిజయశ్రీహ్-యద్విభుహ్ శశి మయూఖః స-న్నాదదేవిజయ చాప మనంగః’’.
సురత క్రీడకు సమయమైనదని అప్సరసలు ,మళ్ళీ మళ్ళీ అలంకారం చేసుకొంటున్నారు .ప్రియులరాకకోసం దూతికల్ని పంపటం, ఆరా తీయటం చేస్తున్నారు .ప్రియ విరహం తో వారి అలంకారాలు,క్రీడా గృహ అలంకారాలు వారికే నచ్చటం లేదు .విరహం సహించలేక తామే బయల్దేరారు ..ఒకామె ఆ ఇంటికి వెళ్ళకు అక్కడ నీ సవతి ఉంది అని హెచ్చరి౦చినా మద్యం మత్తు లో మాట వినక మనసు శరీరం దుర్బలం చేసుకొన్నది .అదే సహాయం ,ఆసరా అనుకొన్నది .-‘’మానినీభి రప హస్తి త ధైర్యః –సాదయన్నపి మదో వలల౦బే’’ .ప్రియులు ప్రియురాళ్ళ ఇళ్ళకు చేరారు దారి మర్చిపోలేదు .మన్మధుని వలన బుద్ధి నశించినా ,ఆ మరుపు మేలే చేస్తుంది –‘’మన్మధేన పరిలుప్త మతీనాం –ప్రాయశః స్ఖలిత మాప్యుపకారీ ‘’.త్వరగా ప్రియుడిని పొందాలని తానే వాడి ఇంటికి వెళ్లి ఒక స్త్రీ కణతలపై పులకా౦కురాలు కలిగి ,చెమటతో పత్ర రచన తిలకం చెదరి పోయింది .కాని సహజ సౌందర్యం తో చంద్రుని జయించింది –‘’నిర్జగాయ ముఖ మిందు మఖండం-ఖండ పత్ర తిలకా కృతి కాంత్యా ‘’.నాయిక చెలి తో ‘’ఆ దూర్తుని సంగతి అంతా నాకు చెప్పు .వాడిని అనుమానం లేకుండా నిందించు ‘’అంటే చెలి ‘’భర్త విషయం లో పౌరుషం మాటలు పనికి రావు ‘’అన్నది .నాయిక ‘’ఐతే బతిమాలి ఓదార్చి తీసుకురా ‘’అంటే ‘’అపకారాలు చేసిన వాడిని బ్రతి మాలడం ఎలా?’’అంది .’’ఒసే అందాలరాసీ ! ప్రియుడి విషయం లో కోపం దేనికే ?’’అంటూండగానే ప్రియుడు వచ్చి,ఆ మాటలు విని బహురస ధైర్యాన్నిపొందారు .అంటే నవ్వు ,దాష్ణీకం ,ప్రేమ ,మనం ఏం చేసినా ఫర్లేదు అనే ధైర్యం కలిగింది భావం . క్రీడా గృహం లో ఏయే వింతలు విశేషాలు ప్రదర్శిస్తారో తెలుసుకోవాలంటే రేపటి దాకా ఆగాలిగా మరి, అంతేగా మరి !
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -28-11-20-ఉయ్యూరు