కిరాతార్జునీయం-.14
నవమ సర్గ -3(చివరి భాగం )
ప్రియునితో కొత్త కలయికతో ఒక నాయిక ఒళ్ళు గగుర్పొడిచి,చెమట పొటమరించి ,అలాగే గుండెపై పడుకొన్నది .అలంకారం చెదిరినా అదేఅల౦కార మయింది .మద్యం మత్తు సిగ్గు పోగొట్టి ,ఆపని మన్మధుడు చేశాడా లేక మదమా అనే అనుమానం కలిగింది .రెండూ వారిని ఆపలేక పోయాయి అంటే సరి పోతుంది .ఒక దూతిక ఒక కామునితో తన నాయికచూపు అతని కోసంగుమ్మం లోనే ఉందనీ ,అరచేతుల్లో కణతలు చేర్చి అతడి గురి౦ చే ఆలొచిస్తోందనీ ,ఒక్క మాటలో ఆమె జీవితం అతడి పైనే ఆధార పడి ఉందనీ ,కలహాలెందుకు? అన్నది ఆమెకల హా౦తరిత అన్న మాట .మొదట ఓరగా చూసి ,ప్రియుని గుండెపై పడుకోవటాన్ని అడ్డుకొనగా సిగ్గు అందాన్ని కలిగించింది. ప్రియ సంగమం లో సిగ్గు పారిపోయింది .ప్రియుడి తప్పు ప్రియురాలికి తెలిసి కోపిస్తే ,ఆ సాకుతో వాడు వెళ్లి పోవాలని ప్రయత్నిస్తే ,వేదనతో కన్నీరు పెట్టుకొనగా ఆగిపోయాడు .ఈమె అధీర ఖండిత .విశ్వాసం లేని నాయకుడిని గూర్చి నాయిక ఏడుస్తుంది అయినా వాడిని ప్రేమించినట్లు ,పొందుకోరుతున్నట్లు ,పులకాంకిత దేహం తెలుపు తోంది .ఈమె కూడా అధీరా ఖండిత నాయికయే .
చంచల దృష్టి తో చూస్తున్న ప్రియురాలి ముఖాన్ని అకస్మాత్తుగా ప్రియుడు ముద్దు పెట్టుకొన్నాడు .ఆమె చీరముడి వీడి చీర కూడా సిగ్గుతో జారిపోయింది .జారిన చీరను మొలనూలు వద్ద ఆగిపోగా ,ప్రియుడు ఆమాత్రం అడ్డంఎందుకని పూర్తిగా లాగేశాడు .ఆమె తన స్తూల చనుగవతో వాడిని గుండ్రంగా చుట్టుకొని కంట పడనీయ లేదు .రతిక్రీడలో గట్టి కౌగిలింతలు ,నఖ క్షతాలు ,చుంబనాలు దంత క్షతాలు జోరుగా సాగాయి .మన్మధుడు తన సౌకర్యం కోసం సంయోగం లోనూ వియోగం లోనూ క్రూరత్వాన్నే ప్రదర్శిస్తాడు .-‘’సౌకుమార్య గుణ సంభ్రుత కీర్తి –ర్వాను ఏవ సురతేశ్వరపి కామః ‘’.సంభోగం లో అప్సరసలు డగ్గుత్తిక పొంది ,సరిగా మాటలు రావటం లేదు. చేతులు ఆడిస్తూ ,ఛీఛీ అంటూ ,కళ్ళు సగం మూస్తూ ,ఆనంద పారవశ్యం పొందారు .ప్రియులైన గంధర్వులు అచ్చరల ఆధార పానం, మద్య పానం కోరి అనుభవించారు .దీనితో రతి అడ్డూ ఆపూ లేకుండా సాగి కొత్త అనుభూతులనిచ్చింది .కలయిక లలో అలకలు మాయమయ్యాయి .మద్యం తో వివాదం పోయింది .అలా సంతృప్తి చెందిన జంటలపై కాముడు బాణ ప్రయోగం చేయ లేక పోయాడు –‘’మానినీ జన ఉపాహిత సంధౌ –సందధే ధనుషి నేషు మన౦గః’’.కోపం తో ఉంటేఅనునయిస్తూ ,సపర్యలతో స్వాధీనం చేసుకొంటూ ,కలిసి మద్యం తాగుతూ హాయిగా రమించారు .సిగ్గు, బద్ధకం వదిలి చాతుర్య ప్రదర్శన చేశారు .తాముతాగి ప్రియులకు అందించారు .కలిసి పుచ్చుకొన్నారు .మాటిమాటికీ రుచిమారి అనుభవం పెరిగింది .మద్యం లోని లేత మోదుగాకులు ,కలువ పూ రేకులు కనుబొమమలకు కొత్త అందాన్ని ఇచ్చాయి. మద్యం సాకుతో ప్రియురాలి పెదవి నొక్కి హాయి పొందారు .ప్రియులు ఇచ్చిన మద్యం ప్రియు రాళ్ళకు మరీ మధురం అని పించింది .గుణం ఉన్న వస్తువు ఆశ్రయాన్ని బట్టి మరింత గుణాన్ని పొందుతుంది కదా –‘’ప్రాప్యతే గుణ వతాని గుణానాం-వ్యక్త మాశ్రయవశేన విశేషః – ‘’తత్తధాహి దయితానన దత్తం –వ్యానశే మధు రసాతిశ యేన’’ .స్ఫటిక పాన పాత్రలలో ప్రతిబింబించిన దంతక్షతాలను చూసుకొని సంబరపడ్డారు .తెగతాగటం వలన పెదవుల లత్తుక కరగి క్షతాలు బాగా కనిపించాయి .అవి గాడ్హాను రాగానికితీపి గుర్తులు .అందుకే ‘’ఆన౦దో బ్రహ్మ’’ గా ఉన్నారు .కళ్ళకు ఎరుపుదనమిచ్చి,పదవుల ఎర్రదనం హరించి ,ముఖాలకు తమ పరిమళాలనిచ్చి ,ముఖగందాన్ని తాము తీసుకొని ఈ వారుణి ఆ స్త్రీల గుణాలను కావాలనే తీసుకోన్నదా,లేక భ్రమతో ఒకదానికొకటి తీసుకొందాతెలియటంలేదు .ఒక నాయిక కళ్ళలో సమాన అలంకారంగా ఉన్న కర్నో త్పలం వ్యర్ధమై౦దని,పనికిరాదని గ్రహించి మద్యం వలన వచ్చిన ఎరుపుదనం మిత్రునిలా తన రంగును నల్లకలువపై ప్రసరింప జేసింది .అందుకే కలువ చెవి అల౦కార౦ గానే మిగిలిపోయింది .మందు బాగా కొట్టటం తో పెదిమల రంగు పోయి ,ప్రియుడి దంతాల నొక్కులు బాగా కనిపిస్తున్నాయి .అదీఅలంకారంగానే ఉంది .మత్తు కాంతి ఒళ్ళంతా వ్యాపించినా ,ఎరుపు కళ్ళలో ,పగడం రంగున్న కణతల్లో అద్దం లో ప్రతిఫలించినట్లు వ్యాపించింది .కోపపుస్త్రీల వికారం పురుషులకువశీకరణం గా ఉంది .మద్యం ప్రవర్తనలో మార్పు తెచ్చినా ,అదే మగాళ్ళకు మేలు చేసింది .ఇద్దరూ ఫుల్ గా మందుకొట్టటం వలన ఒకే వర్గంవారైనారు .మద్యం మత్తు లో రవిక చీర ఊడినా శారీరక బాహ్య స్పృహే లేదు .సిగ్గు విలవిల లాడింది వారి ప్రవర్తన చూసి ,వదిలి పోలేకపోయింది .మద్యంకిక్కు చెలులు ఉన్నారన్న జ్ఞానం కూడా లేకు౦డా చేసింది .మద్యపాన మత్తు అనేక కొత్త రకాల సిగ్గును అనుకరించింది .కౌగిలిలో చేష్టలు లేకపోవటం ,సిగ్గులోనూ ,మద్యం లోనూ కలిగే సమాన గుణాలు .అందుకే వీటి పోలిక అనుకరణ లాగా అనిపించింది ..అభిమానవతి అయినా ,ప్రియుడి ఒడిలో కూరుకు పోయింది .చంచలస్వభావ మద్యం గుణ దోషాల విషయం లో రహస్యాలను బయట పెడుతుంది అనేది నిజం —‘’కారయిత్య నిభ్రుతా గుణ దోషే –వారుణీ ఖలు రహస్య విభేదం ‘’.మద్యం కిక్కుతో రాతి క్రీడమహా మాధుర్యం పొందింది .ఆ ఆన౦దాతి శయం వలన మదనోదయం ఉద్రేకం తో పాటు కొత్త రూపం కూడా పొందింది .
మద్యం మత్తులో ఉంటే ప్రియుడు ఇంకో దానితో ‘’జంప్ జిలానీ’’అవుతాడేమో అనే అనుమానం తో’’ తీర్ధం పుచ్చుకోటం’’ తగ్గించారు .ప్రేమలేకపోతే భయం ,అనుమానం కలగటం సహజమే.-‘’యోషితో న మదిరాం భ్రుశ మీషుహ్-ప్రేమ పశ్యతి భయాన్య పదేపి’’.ఏకాంతం ,మన్మధుడు ,మధుపానం మత్తు ,చంద్రుడు, సంభోగం మరో లోకానికి తీసుకు వెడతాయి .అందుకే ఈఅప్సరసలకు హద్దు అనేదే లేదు- ‘’చిత్త నిర్వృతి విధాయి వివిక్తం-మన్మధోమధు మదః శశి భాసః –సంగమశ్చ దయితైహ్ స్మనయ౦తి –ప్రేమ కామపి భువం ప్రమదానాం ‘’.పురుషాతనం తో సహా సకల విధ రతి క్రీడలు సిగ్గూ లజ్జా లేకుండా చేసి అనుభవించగా వాడి వత్తలైన పూల దండలు పడక అంతా పరచుకోగా మన్మదుడికే మత్తెక్కినట్లు అనిపించింది .ఇస్టమైనవారు చేయలేని పని ఉండదు అనిపించింది –‘’మానినీ రతివిధౌ కుసుమేషు –ర్మత్తమత్తఇవ విభ్రమ మాప ‘’.
స్త్రీలు రతి రసాస్వాదనలో మునిగి పోగా మగాళ్ళు రెచ్చిపోయి వారిస్టంవచ్చినట్లు ప్రవర్తించి ,అన్ని చోట్లా అంటే స్థానం కాని స్థానాలలో కూడా చు౦బన తాడనాలతో విజ్రు౦భిం చారు .అదీ అందంగానే ఉంది .ఇలా మాంచి ఊపులో ఉండగా వైతాళికుల మంగళ ధ్వానాలు వినిపించాయి .అర్ధరాత్రి దాటిందని తెలిసింది .వాళ్లకు రాత్రి బాగా సంకోచి౦చి౦దని పించింది.మొత్తం మీద రాత్రంతా ఆగమాగ౦ చేసి ఇక లేవక తప్పదని తెలిసి ,ఎడబాటుకు కుంగుతూ ,మళ్ళీ’’ ఇన్నింగ్స్’’ప్రారంభించి,మరింత స౦తృప్తి చెంది లేవటానికి సిద్ధపడ్డారు .సంభోగ శ్రమతో అలసిన అర్ధనిమీలిత స్త్రీలకు శరీర మర్దన ద్వారా సేవ చేయటానికా అన్నట్లు ప్రాతః కాలపు మంద పవనాలు సౌదాల్లోకి ప్రవేశించాయి .అక్కడి నలిగినపూల పరిమళం , మద్యం వాసన ,చందనాదుల అంగాంగ రాగాల గంధాన్ని ఆ వాయువులు అన్ని చోట్లా వ్యాపింప జేశాయి .ఇంకా కొద్దిగా మత్తు ఉన్నా అందంగానే ఉన్నారు స్త్రీలు .కళ్ళు కాళ్ళు నిలవటం లేదు .ఆ స్త్రీల విరహ వ్యాకులత పోగొట్టటానికి రాత్రి సంభోగ చిహ్నామైన నఖక్షతాది లక్ష్మీ సంపద విడువని చెలికత్తెలాగా వారి శరీరాన్ని అంటుకొనే ఉంది. అ౦గ రాగాలు గోటి నొక్కుల్లో మిగిలాయి .మద్యపానం, ఆధర పానం వలన పెదవుల ఎరుపు పోయింది .వాటి శోభా లక్ష్మి యే ఆ స్త్రీలను పట్టుకొని ,చెలి కత్తెల్లాగా సాంత్వన చేకూర్చాయని కవి భావం –‘’గతవతి నఖ లేఖా లక్ష్యతా మంగరాగే –సమద దయిత పీతా తామ్ర బి౦బా ధరాణా౦ –విరహ విదుర మిస్టా సత్సఖీ వా౦గ నానాం -హృదయ మవలలంబే రాత్రి సంభోగ లక్ష్మీహ్ ‘’
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -29-11-20-ఉయ్యూరు