కిరాతార్జునీయం-.16
దశమ సర్గ -2
అన్ని దిశలా అర్జున పుష్పాలు వికసి౦చటం తో దాని పరిమళం వ్యాపించి ,అంతా కామ వికారం పొంది ,ధైర్యం సడలి కొత్త అనుభవం పొందింది .దుఖితులను కూడా సంతోష పడేట్లు పండిన నేరేడు పళ్ళను తిని ఆడకోయిల కొత్తరాగాలతో గళమెత్తిగానం చేస్తోంది –పరి భ్రుత యువతిః స్వనం వితేనే –నవనయోజిత కంఠరాగ రమ్యం ‘’.కడిమి చెట్ల గాలి ,మత్తెక్కే నెమళ్ళ క్రేంకారం సామాన్యులని ఆకర్షించింది .మహాత్ముల సమాధిని భగ్నం చేయటం అంత తేలికకాదనిపించింది –‘’జన ఇవ న ధృతేశ్చ చాల జిష్ణు –ర్నహి మహతాంసుకరః సమాధి భంగః ‘’.వధూ వరుల సమాగమం లా వర్షర్తు, శరత్తులసంధికాలం శోభించింది. బాణం ధరించినందువల్ల క్షత్రియ స్త్రీ ధ్వనించింది .శరత్ స్త్రీ తామర తూళ్ళు అనే కంకణాలు ధరించింది.కలువ సమూహం వస్త్రాచ్ఛాదన అయింది .నీల ఝ౦టి అనే చెట్టు పూలనే బాణాలుగా ధరించి రాగా ,వర్షర్తు అనే వరుడు తెల్ల తామర చేతులు చాపి ఆలంబన మిచ్చాడు .-‘’ధృతబిస వలయా వలిర్వహంతీ-కుముద వనైకదుకూల మాత్త బాణా-శరదమలతరే సరోజ పాణౌ-ఘన సమయేన వధూరివా ల లంబే…నెమళ్ళకేమ్కారాలు ,హంసల మనోహర స్వరాలూ కలిసిపోయాయి .కలువ పంక్తులు ,కడిమి పూల వర్షం తో కలిసి శోభ పెంచాయి అధిక గుణాల పదార్ధాలు కలిసి మరింత శోభనివ్వటం సహజమే –‘’సమద శిఖి ఋతాని హంస నాదైః –కుముద వనాని కదంబ పుష్ప వృష్ట్యా-శ్రియ మతి శయనీం నమేత్య జుగ్ము –ర్గుణ మహతాం మహాతే గుణాయ యోగః ‘’.దగ్గరలో ఉన్న కదంబ పుష్ప, రాలిన మొగలిపూల మకరందం వదిలి తుమ్మెదలు బాగా మకరందమున్న ఇప్ప పూలపై వాలి వాటిని నల్లగా చేశాయి తొడిమ మాత్రమే నల్లగా ఉండే ఇప్పపువ్వు పూర్తి గా నలుపుగా మారిందని భావం .’’ప్రియ మధుర సనాని షట్పదాలీ-మలినయతి స్మవినీల బంధనాని ‘’.నీటి బిందువులతో ఉన్న పచ్చిక పై ఇంద్ర గోపాల అనే యెర్రని పురుగులు ముడుచుకొన్న దిరిసెన పూల యెర్రని కాంతి పొందాయి .-‘’అవిరల వపుషః సురేంద్ర గోపా –వికచ పలశచయ శ్రియం సమీయుః’’.కాలం కాని కాలం లో వచ్చిన హేమంతం వలన ప్రియంగు వృక్షాలు గుత్తులు గుత్తులుగా పూశాయి .వికషిత మల్లెల పరిమళం తో గాలి వీస్తే ,దట్టంగా మంచు బిందువులు కురిశాయి .లవంగ లతలు లొద్దుగపూలు వికసించటంతో వాటి సుగంధం మోస్తున్న గాలి అందరికీ సంతోషం కలిగిస్తోంది .కాని అర్జునుడి మనసు మాత్రం చలించలేదు .జయమే లక్ష్యం గా ఉన్నవారి మనసు నీతిబాహ్యం కాదు కదా .-‘’వికృతి ముపయయౌ స పాండు సూను-శ్చలతినయాన్న జిగీషతాం హి చేతః ‘’.హేమంతం చివర శిశిరం ప్రారంభం సంధికాలం లో మామిడి చెట్లు కొన్ని పూశాయి .కొద్దిగా మంచు పడుతోంది .వావిలి చెట్లు వికసించాయి .వీటన్నిటి పరిమళం కామునికి సహకారిగా మారింది .
పూల వనాలు చేరాలనుకొన్న వసంత లక్ష్మి చిగురించిన మామిడి కొమ్మను పట్టుకొని తుమ్మెద రొద అందెల రవళికాగా పద్మ వనాలను వదిలింది .’’క్వణదాలికుల నూపురా నిరాసే – నలిన వనేషు పదం వసంత లక్ష్మీః’’.వికసించిన పూల పెదవి కదలిస్తున్న గోరంత చెట్లనే మధువును చూస్తూ ,కొత్తగా చిగిర్చిన అశోక చెట్టు పై బాణం ధరించిన మన్మథుడిని అప్సరసలు చూసినట్లు భావించారు .మెల్లగా వీస్తున్న మలయానిలం తో కదల్చబడిన తామర ముఖాలనే పద్మాలపై తుమ్మెదలు చేరి ముంగురుల అందాన్ని కలిగించాయి .-‘’ముహురనుపతా విధూయ మానం –విరచిత సంహతి దక్షిణా నిలేన –అలికుల మలకాకృతిం ప్రపేదే-నలిన ముఖాంత విసర్పి పంకజిన్యాః’’.సాల వృక్షం కొమ్మ అనే వధువు పుష్పమనే ముఖాన్ని ,చిగురు అనే పెదవిని ,మకరందమనే మధువును కలిగి గాలితో కదులుతూ కోపించినట్లు కనిపించింది .తుమ్మెద అనే ప్రియుడు మాటి మాటికీ దాన్ని సమీపించి కోపం తగ్గించటానికి చేరినట్లు భావన .
జితేంద్రియత్వం ఉన్నంత వరకు అతడిని శత్రువు జయించలేడు.ముల్లోకాలూ జయించినా వసంతం జితేంద్రియ ఆర్జునుడిని జయించలేకపోయింది –‘’ప్రభవతి న తదాపరో విజేతుం –భవతి జితే౦ద్రియతా యదాత్మ రక్షా –అవజిత భువన స్తథా హిలేభే-సిత తురగే విజయం న పుష్పమాసః ‘’సితతురగుడు అంటే అర్జునుడు . వసంత ,హేమంతాలలాగే గ్రీష్మఋతువూ నువ్వు కూడా అర్జునుడి చేత తిరస్కరింపడినావుకదా . లోకం లో నీ గౌరవం మాత్రం ఏమి ఏడ్చింది లే .మల్లెలు వికసించాయి అని అర్ధం .బలమున్నవైనా తమలో తమకు స్పర్ధ ఉంటె ఆసైన్యం శత్రువులను జయించలేదు .లోకాలన్నీ జయించిన ఋతువులు ఆర్జునుడిని క్షణకాలమైనా జయించ లేకపోయాయి.కానీ అప్సరసలమనసుల్లో కాముని ప్రవేశ పెట్టగాలిగాయి .తమ ఆయుధం శత్రువులపై కాక తమపైనే ప్రయోగి౦చు కొన్నట్లు అయిందని భావం ..-‘’అవిహిత హరిసూను విక్రియాణి-త్రిదశ వధూషు మనోభవం వితేనుః’’..గ౦ధర్వ వీణాగానం ,ఋతు విజ్రు౦భణ కూడా ఏమీ చేయలేక పోయాయి . అప్సరసల కళ్ళు అర్జునుని అంగ ప్రత్య౦గాల లోనే నిమగ్నమయ్యాయి .వికసిత మల్లెలు వారికి ఆకర్షణ కాలేదు .అంటే వారికి కలిగింది చక్షు ప్రీతి మాత్రమే .అందం తో ఆర్జునుడిని వశం చేసుకోవాలని వచ్చారు .కాని అర్జునుడే వారిలో మన్మధ వికారాలు కలిగించి ఉల్టాపల్టా చేశాడు .-‘’ముని మఖి ముఖతాం నివీషవోయాః-సముపయయుః కమనీయతా గుణేన-మదన ముప దధే సఏవ తాసాం –దురదిగమనా హి గతిః ప్రయోజనాం’’.
సశేషం
మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -1-12-20-ఉయ్యూరు