మనమెరుగని మహా భక్తులు -3 2-నిరతాన్నదాత ,మహా భక్త శిఖామణి-బందా పరదేశి

మనమెరుగని మహా భక్తులు -3

2-నిరతాన్నదాత ,మహా భక్త శిఖామణి-బందా పరదేశి

17వ శతాబ్దం లో నియోగి కుటుంబం లో  గుంటూరు జిల్లా వేటపాలెం లో పుట్టిన బందా పరదేశి కరణీకం చేసేవాడు .ఎవ్వరినీ చెయ్యి చాచిన వాడు కాదు .భార్యకమలాంబ  కూడా చక్కగా సహకరించేది .నిత్య అన్నదానం తో దంపతులు తరించేవారు .ఈ వంశం వారు ఇప్పటికీ చీరాల ,వేటపాలెం లో ఉన్నారు .వీరిలో బందా వెంకట నరసయ్యగారు ఒకరు .బందాదంపతులు ఒక్క రోజు కూడా అన్న దానం చేయని రోజే లేదు .ఏకాదశి వ్రతం తప్పని సరి .ద్వాదశినాడు 12మందికి తక్కువకాకుండా ,108కి మించకుండా అన్న సంతర్పణ చేసేవారు .వ్రతం రోజు జాగరణం చేసేవారు .భోజనం చేసి వెళ్ళే వారిని పంపలేక పంపలేక పంపించే వారు .ఇలా నిత్యఖర్చుతో ఉన్న ఆస్తి అంతా హారతి కర్పూరమై హరించి చివరికి భార్య మెడలో మంగళ సూత్రం కూడా అమ్మే పరిస్థితి కలిగింది .

చేతిలో చిల్లి గవ్వ లేని నిర్భాగ్యం బందా దంపతులను ఆవహించింది .భార్యను వెంటపెట్టుకొని అర్ధరాత్రి ఇల్లు వదిలి బాపట్ల తూర్పు సత్రం చేరి జరగవలసినదాన్ని గురించి భార్యా భర్తలు ఆలోచిస్తున్నారు .ఆ రోజు ఉదయమే ఆ సత్రం లోదిగిన  నిరుపేద స్త్రీ ఆకలితోఅలమటిస్తున్నతనపిల్లలకు ‘’ఇదుగో సెనగపప్పు మాత్రమమే ఉంది తిని నీళ్ళు తాగి పడుకోండి.రేపు పొద్దున్న పదింటికి  వేటపాలెం లో  బందా పరదేశి గారింటికి వెడితేఅమృతాన్నం పెడతారు ఆ మహాదాతలైన దంపతులు ‘’అని ఊరడిస్తుండట౦  బందాగారి చెవిన పడింది .వెంటనే భార్యకు చెప్పితమింట్లో ఒక కుందీ ,రోలు ఉన్నాయికనుక వాటిని అమ్మేసి ఆ పేద స్త్రీకి పిల్లలకు భోజనం ఏర్పాటు చేద్దామని చెప్పి ,వారు వచ్చే లోపే తాము ఇంటికి చేరాలని తొందరబెట్టి అప్పటికప్పుడు ఇద్దరు నడిచి వేటపాలెం చేరారు  .బొమ్మి శెట్టి సుందర రాజం అనే వైశ్యునికి ,రోలు రెండు రూపాయలకు అమ్మేసి,బియ్యం పప్పుఉప్పూ కూరలు తెచ్చి వంట చేసి సిద్ధంగా ఉండగా  అతిధులు రాగా వారికి ఆప్యాయంగా వడ్డించి తినిపించి  సాగనంపి ,తమ బీద స్థితి తెలియజేసి ,సంతృప్తి చెందారు బందా దంపతులు . రోలును తీసుకోనిపోమ్మని వైశ్యునికి కబురు పంపారు .అతడు వచ్చి ఆ రోలు తీసే ప్రయత్నం లో ఉండగా దానికింద మొహరీల బిందె కనిపించింది .

వైశ్యుడు ఆబిందేను చూసి దాన్ని పరదేశి గారికి ఇవ్వబోగా ,ఆయన  తన ఇంట్లో అలాంటి బిందేకాని మొహరీలు కానీ ఎప్పుడూ లేవు అని నిజం చెప్పి  రోలుతో సహా ఆ మోహరీ బిందె కూడా వైశ్యుడిదే అని నిష్కర్షగా చెప్పారు .ధర్మాత్ముడైన వైశ్యుడు రోలుమాత్రమే తనది బిందె తనదికాదని చెప్పి రోలు తీసుకు వెళ్ళాడు .శ్రీ రామచంద్ర ప్రభువే తమ నిరతాన్న దానానికి ఇలా మొహరీల బిందె ఏర్పాటు చేశాడని ఆ దేవదేవుని వేనోళ్ళ స్తుతించి మళ్ళీ సంతృప్తిగా నిరతాన్న దానం చేయటం మొదలు పెట్టారు .బందా పరదేశి దంపతుల పేరు దేశం లో  గ్రామగ్రామాన మారు మోగింది .ఇది విన్న కొందరు అసూయా పరులు ప్రభుత్వానికిఫిర్యాదు చేశారు .అమరావతి ప్రభువు వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడు నిరతాన్న ప్రదాత కనుక ఈ ఫిర్యాదును లెక్క చేయలేదు .దీనితో బందా దంపతులకీర్తి ఆసేతు హిమాచలపర్యంతం వ్యాపించింది .

క్రీ.శ.1670లో వచ్చిన గంగానది పుష్కర స్నానానికి వాసి రెడ్డి ప్రభువు గురువుగారితో కలిసి కాశీ వెళ్ళారు .పుష్కర స్నానం చేస్తూ ప్రభువు  బ్రాహ్మణులకు విపరీతంగా దాన ధర్మాలు చేసి అందరి ప్రశంసలు పొందాడు .అక్కడి వారు  ‘’ నిరతాన్నదాత బందా పరదేశి గారు ఉండే ఆంద్ర దేశపు ప్రభువు  వెంకటాద్రి నాయుడుగారు ‘’అని చెప్పుకోవటం రాజుగారు విని ,మహా సంతోషించి ,ఆయనకు తన రాజధానిలో ఘన సత్కారం చేయాలని సంకల్పించుకొన్నాడు .యాత్ర ముగించి రాజధాని అమరావతి  చేరి బందా వారిని నోటీసు ఇచ్చి పిలిపించి ,’’నాకు  తెలియ కుండా వేట పాలెం విడిచి  వెళ్ళ వద్దు’’అని ఆంక్ష విధించాడు .రాజాజ్ఞ కనుక ఒక ఏడాది అమరావతిలోనే ఉండిపోయారు .

ఒక ద్వాదశి నాడు ఉదయం కాలినడక లో వెడుతుంటే ఒక  ఇంటిముందు వందలకొద్దీ బ్రాహ్మణులూ చేతులు కడుక్కోవటం చూశాడు .ఏమిటి విశేషం అని వారిని అడుగగా పరదేశి గారి ద్వాదశి పారాయణ భోజనం ఆహ్వానానికి వచ్చినట్లు చెప్పారు .పరమ సంతోషం వెలిబుచ్చి వేటపాలెం వెళ్ళగా పరదేశిగారి భార్య కమలాంబ గారు చేసే అన్నదానం కనులారా చూసి ,ఆ అమ్మ భిక్ష  తాను  కూడా చేయదలచినట్లు కబురుపంపి ,సపరి వారంగా వెళ్లి సంతోషంగా భోజనం చేసి ,సత్కారం పొందాడు వెంకటాద్రి ప్రభువు .ఆమెకు సంతోషంగా కృతజ్ఞతలు చెప్పగా ఆమె ‘’అన్నగారూ! తోబుట్టువును మరవ కండి ‘’అని చెప్పింది .ఉబ్బి తబ్బిబ్బై ప్రభువు అమరావతి చేరాడు .పరదేశిగారి తో ‘’మిమ్మల్నిఅనవసరంగా కష్టపెట్టాను .క్షమించండి ‘’అని విన్నపాలు చెప్పి ,అర్ధ సింహాసం మీద తనప్రక్కన కూర్చో బెట్టి విలువైన బహుమతులతో సత్కరించాడుప్రభువు .ఇంతగా అన్నదానం చేయటానికి ద్రవ్యదాత ఎవరని ప్రశ్నిస్తే అద్దేపల్లి సుబ్బయ్య శ్రేష్టి అని చెప్పగా ,ఆయన్ను పిలిపించి ‘’పరదేశిగారి అన్న సంతర్పణకు మీరు ఇచ్చిన డబ్బు యెంత ?’’అని అడుగగా ‘’ప్రభూ !పరదేశిగారికి తిరిగి తీసుకొనే ఉద్దేశ్యంతో నేను డబ్బు ఇవ్వలేదు .కనుక పద్దు రాయలేదు .కాబట్టి  యెంత ఇచ్చానోచేప్పలేను ‘’అన్నాడు .దిమ్మతిరిగి బొమ్మ కనిపించి వెంకటాద్రి నాయుడు ‘’ఔదార్యం అంటే ఇలా ఉండాలి ‘’అనుకోని ‘’నాకు తెలీకుండా ఆయనకు డబ్బు ఇచ్చే అధికారం నీకు ఎక్కడిది ?అనుమతిలేకుండా చేశావు .అయినా క్షమిస్తున్నా.ఆయనకిచ్చిన డబ్బు అంతా నేను నీకు ఇచ్చేస్తా తీసుకో’’అన్నాడు .శ్రేష్టి ‘’మీరిచ్చే శిక్షకంటే ,భగవంతుడు ఇచ్చే శిక్ష పెద్దది .సత్సంకల్పానికి పాపకూపంలో పడి పోతానేమో నని భయంగా ఉంది మన్నించండి ‘’అన్నాడు వినయంగా .’’సరే నువ్వు చెప్పింది కూడా బాగుంది .నేను పరదేశిగారికి నువ్వు ఇచ్చిన డబ్బు అంతా తిరిగి నీకు ఇచ్చేస్తా తీసుకో .ఆయనకు ఘన సన్మానం చేస్తాను. నువ్వుకూడా పాల్గొని ఆ డబ్బు ఆయన సన్మానానికి ఖర్చు చెయ్యి .ఇద్దరం ధన్యులమవుతాం ‘’అన్నాడు సెట్టి సమ్మతించాడు .

అన్నప్రకారమే వెంకటాద్రి నాయుడు బందా పరదేశి గారికి  ఘన సన్మానం చేసి ,కమలా౦బ గారిని పిలిపించి కాశీలో ఆంద్ర ప్రభుత్వం నిర్వహించే అన్నదాన సత్రానికి పరదేశిగారిని అధికారిగా చేయటానికి ఆమెను ఒప్పింఛి వేటపాలెం సత్రానికి కమలాంబ గారిని అధికారిని చేశాడు .వారణాశిలో తన బాధ్యతలు అత్యంత సమర్ధంగా సంతృప్తిగా నిర్వహించి పరదేశిగారు ,వేటపాలెం చేరి ,క్రీ శ 1785లో ఆ విశ్వేశ్వరుని లో ఐక్యమయ్యారు  .రెండేళ్ళ తరువాత భార్య కమలాంబ గారు కూడా కైవల్యం చెందారు .

బందా పరదేశి గారి గురించి నిరతాన్నదాత అపర అన్నపూర్ణ శ్రీమతి డొక్కాసీతమ్మ గారి లాగా    ఆంద్ర దేశంలో పెద్దగా ఎవరికీ తెలియదు .సత్రం సంఘటన ఇద్దరి జీవితాలలొ చోటు చేసుకోవటం తమాషా గా ఉంది .అమరావతి ప్రభువు ఈయనను ఆదరిస్తే ,పిఠాపురం రాజా ఆమెను గుర్తించారు .ఇద్దరూ కారణ జన్ములు.ఆంధ్రులకు ప్రాతస్మరణీయులు .

ఆధారం –శ్రీ పంగులూరి వీర రాఘవుడు గారి రచన ‘’ఆంద్ర మహా భక్త విజయం ‘’

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -1-12-20-ఉయ్యూరు

 

 


About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.