కిరాతార్జునీయం-.17
దశమ సర్గ -3(చివరి భాగం )
అర్జునునిపై అప్సరసలు నిల్పిన చూపులో రసభావాలు లేనేలేవు .చేతులు అభినయించలేదు .చూపు అర్జునునిపైనే నిలిచిపోయింది తప్ప మరో పక్క కి తిరగలేదు –‘’ప్రకృత మను ససార నాభి నేయం –ప్రవిక సదంగులి పాణిపల్లవం వా –ప్రథమ ముప హితం విలాసి చక్షుః-సితతురగే న చచాల నర్తకీనాం ‘’.పాదాల లాక్షారసం నేల ముద్రలుగానే మిగిలాయి .వాటిని చూసిన తుమ్మెదలు నవవికసిత కమలం అనే భ్రాంతి తో వాటిపై మూగాయి .పాదాలలత్తు కకు కడిమి పూల కేసరాలు అంటుకొని ,అప్సరసల అనురాగ వేడిలో కరిగి మనసులోని ప్రేమ మూర్తీభవించినదా అని పించింది .అడుగుల గుర్తుల్లో లాక్షారసం వాళ్ళ మనోగత అనురాగమే అనే ఉత్ప్రేక్ష .ఒక అచ్చర అతడిఎదురుకు రాగానే ,చెలుల చాటు నుంచి ,తన విపరీత అనురాగాన్ని దాచే ప్రయత్నం చేసింది .దాస్తే కోరికలు పెరుగుతాయని తెలీదేమో !-‘’స్ఫుట మభిలషితం బభూవ వధ్వా –వదతి హి స౦వృతి రేవ కామితాని ‘’.బాగా వీచే గాలికి మరో ఆమె వస్త్రం నడుము నుంచి జారి సిగ్గులమొగ్గ అయింది .ఆమె తొడలను చూసి సవతులే ఆశ్చర్యపోయారంటే మిగతా వాళ్ళ సంగతి చెప్పాలా ?మరో ఆమె మన్మథ తాపం తో తామరకాడలను కంకణంగా పెట్టుకొని ,చేతుల్లో గంధం పూసుకొన్న ముఖం పెట్టుకొని మద్యం తాగకున్నా ,మత్తెక్కే కళ్ళతో తదేకంగా అర్జునమునిని చూస్తోంది .మరో ఆవిడ తనమనసు మనసులోలేక అన్యమనస్కత అయి ‘’మనః స౦గమం ‘’అనే మన్మథావస్థ ప్రదర్శించింది .మన్మథ తాపం తో నోరు ఎండి ఏమీ చెప్పలేకపోయింది.మరో స్త్రీ .కళ్ళనుండి జాలువారే కన్నీరు చూసి చెలికత్తెల మనసులు దుఖం తో బరువెక్కాయి .ఇది మూర్ఛావస్థ.మెత్తని పూలపాన్పు వదిలేసి ,చిగురాకులనేలపై పడుకొంది.విరహం భరించలేక సుఖం చల్లదనం ఇచ్చే అతడి ఒడి చేరాలను కొన్నది .ఇది ‘’అరతి జాగరం ‘’అనే మన్మథావస్థ.’’కృశించిన మా నాయిక కోర్కె తీర్చు .ఆమె అన్నీ వదిలి నీ పొందే కోరుతోంది’’అని ఆమె చెలికత్తె మునికి ఫిర్యాదు చేసింది .’’కాఠిన్యం వదిలి మాట్లాడు .మునుల మనసు మెత్తగా ఉంటుంది కదా .!’’అని విన్నవి౦చు కొన్నది .అదృష్ట హీనులు తమకు చేరిన మంచిని కూడా ఉపయోగించుకోలేరు .ఇవన్నీ విప్రలంభ శృంగార౦ లోని వ్యభి చారీ భావాన్ని తెలియ జేసేవే –‘’ఉపగత మవ ధీరయ౦త్య భవ్యాః-స నిపుణ మేత్యకయాచి దేవ మూచే ‘’.మరో అప్సర విలాసంగా నడుమాడిస్తూ ,ఒక చేత్తో తలవెంట్రుకలు ముడుచు కొంటూ కటాక్షం అనే మన్మథ బాణం మునిపై ప్రయోగించింది .-‘’సురపతి తనయే పరా నిరాసే-మనసిజ జైత్ర శరం విలోచనార్ధం ‘’.
విశాల స్తనభారం తో కొద్దిగా వంగిన ఒక అప్సర పుష్పించిన మామిడి చెట్టును పట్టు కొని విలాసంగా నిలబడింది .సగం వంగిన ఆమె శరీరం అల్లెత్రాడు లాగిన మన్మథ ధనుస్సులాగా ఉంది.అ౦గా౦గ ప్రదర్శనతో లోబరచుకొనే ప్రయత్నం చేసిందని భావం .మరో అప్సర చీర ముడిజారిన నీలం రంగు చీర పట్టుకొని , వెళ్ళాలని లేకపోయినా ,సిగ్గు ముంచెత్తి బయల్దేరి ,జారిన మొలనూలు అడ్డు కొన్నట్లు నటించి ముని ముందు నిలిచిపోయింది .ఒకామె ‘’నీ మనసులోశాంతి నిజంగా ఉంటే ధనుస్సు ఎందుకు ధరించావు .వంచకుడివి .విషయాభిలాష ఉన్నవాడివి. నీకు కావాల్సింది ముక్తికాదు.నీమనసులో నీ ప్రాణేశ్వరి దాగి ఉంది.ఇతరులను ఇష్టపడటానికి ఒప్పుకోవటం లేదు అందుకే మమ్మల్ని అవహేళన చేస్తున్నావు ‘’అని దెప్పింది .ఒకామె కింది పెదవి ఈర్ష్యతో కదిల్తే ,కోపంతో అర్జునమునిని చూస్తూ ,మానమర్యాదలు సిగ్గూ ఒగ్గేసి ,పెద్దలనే గౌరవం కూడా లేకండా చెవి అలంకారంగా ఉన్న కలువతో అతడి వక్షస్థలం పై కొట్టింది –‘’ఇతి విషమిత చక్షుషా భి ధాయ –స్ఫూర దధరోష్టమసూయయా కయాచిత్ –అగణిత గురు మాన లజ్జ యాసౌ –స్వయమురసి శ్రవణోత్పలేన జఘ్నే’’.ఇంకో అచ్చర వినయంతో హావభావాలు ఒలకబోస్తూ దగ్గరకొచ్చి చిరు నగవుతో తన కణతలఅందాన్ని పెంచుతూ ,చెవిదాకా వ్యాపించిన కళ్ళతో తదేకంగా ఔత్సుక్య భావం తో చూసింది .
ఏమీ చేయలేక చేతు లెత్తేసి, తెల్లజండా చూపిస్తున్నట్లుగా దీనం గా ,సిగ్గు వదిలి ఏడ్చారు .కోపంతో ఉన్న ప్రియుని పొందుకు ఇదే చివరి అస్త్రం .అరకన్నులతో చూడటం ,సిగ్గు ,అలసట విరహం, పాలి పోయిన దేహం, దుఖించటం అనే అలంకారాలు ధరించారు. మన్మథుడు కల్పించిన ఈ అవస్థలే వారి అందాల్ని పెంచుతున్నాయి .మెల్లని నడక హంస నడకలను మించింది జఘన భారం తో వంపు చూపులు వ్యర్ధమైనాయి –‘’స్థిత మురు జఘన స్థలాతిభారా –దుదిత పరిశ్రమ జిహ్మి తేక్షణం వా ‘’.గాఢంగాగుచ్చుకొన్న మన్మథ బాణాల వలన పలికే మాటల్లో స్పష్టత లేదు .కళ్ళు తెరచి ,కనుబొమలు ఎగరేస్తూ చూసే చూపులు మనోహరంగానే ఉన్నాయి ‘’అధిక వితత లోచనం వధూనా –మయుగప దున్నమిత భ్రువీక్షితం చ ‘’.వారి హావ భావ చేష్టలు మనసు హరి౦చేవే అయినా ,స్థిర సమాధి గతుడైన అర్జునముని విషయం లో వ్యర్ధమయ్యాయి .రౌద్ర -శృంగాలు విరోధి రసాలు .మనస్వికి మనసులో పరిశోధన జ్వలిస్తూ ఉంటుంది .అందుకే సుఖాపేక్ష ఉండదు .’’రుచికరమపి నార్థవత్ బభూవ –స్తిమిత సమాధి శుచౌ పృథాతనూజే –జ్వలయతి మహతాం మనా౦స్య మర్షే –న హి లభతేవసరం సుఖాభి లాషః’’.అర్జున ముని తీవ్ర తపస్సుతో మహే౦ద్రుని ఆరాధించి ,శత్రు నాశనం చేసి ,రాజ్య లక్ష్మిని పొందాలనే కాంక్షతో ఉండటం చూసి ,తమ ప్రణయ ప్రార్ధన వ్యర్ధం కావటం తో ,ఉద్వేగ మనస్కులై అప్సరసలు గంధర్వులతో కలిసి మళ్ళీ తమ స్వస్థానానికి వెళ్ళారు .
‘’స్వయం సంరాధ్యైవ౦ శత మఖ మఖండేన తపసా –పరో చ్ఛిత్యా లభ్యామభి లషతి లక్ష్మీం హరి సుతే –మనోభిః సోద్వేగైః ప్రణయ విహతి ధ్వస్త రుచయః –స గంధర్వా ధామ త్రిదశ వనితాః స్వంప్రతి యయుః’’.
సశేషం
మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -2-12-20-ఉయ్యూరు