కిరాతార్జునీయం-.18
పదకొండవ సర్గ -1
ఇంద్రకీలం నుంచి జండా ఎత్తి స్వర్గం వెళ్లి ఇంద్రునితో అర్జునముని జితేన్ద్రియత్వాన్ని చెప్పగా, ఆయన చాలా సంతోషంపొంది ,ఆశ్రమానికి వృద్ధముని రూపం లో చేరాడు ..’’అజగామాశ్రమంజిష్ణో ప్రతీతః పాక శాసనః ‘’ .ఇంద్రుని అర్జునుడు చూశాడు .తెల్ల వెంట్రుకలు జడలు కట్టి,అస్తమయం లో సంధ్యలాఉన్నాడు.-‘’పృక్త ఏందు కరైరహ్నః పర్యంత ఇవ సంధ్యయా ‘’.కళ్ళను తెల్లని కనుబొమలు మూయగా మంచు కురిస్తే ,వాడిన కమలం లా కనిపిస్తున్నాయి .అతడు కమలాలున్న కొలనులా ఉన్నాడు .బాగా బరువుగా వంగిన నడుముతో ,పొట్ట కనిపిస్తూ కర్ర తో నడిచే ముసలాడి గా కనిపించాడు .మారు వేషం లో ఉన్నా ,కొద్దిపాటి మేఘాలు కప్పిన సూర్యునిలా ప్రకాశమానం గా ఉన్నాడు.-‘అ౦శు మానివ తన్వ భ్రపటలచ్ఛన్న విగ్రహః ‘’.ముసలి ఇంద్రుడు ఆశ్రమ శోభను పెంచుతున్నాడు .ఇంద్రుని చూసి ఇంద్రతనయుడు ఆదర స్నేహాలతో చాలించాడు .బంధువు విషయం లో బంధుత్వం తెలీక పోయినా ,మనసు మాత్రం బలంగా ఆనందిస్తుంది .-‘’అవిజ్ఞాతేపి బన్ధౌ హి బలాత్ప్ర హ్లాదతే మనః ‘’.కొడుకిచ్చిన ఆతిధ్యానికి సంతృప్తి చెంది ,ఆసనంపై కూర్చుని’’ యవ్వనం లో తపస్సు మొదలుపెట్టి ,మంచి పనే చేస్తున్నావు .మా లాంటి వృద్ధులు కూడా విషయసుఖాలకు ఉవ్విళ్ళూరు తుంటాం .నీలాంటి యువకుల సంగతి ఏం చెప్పాలి .’.నీ సుందర శరీర సంపదకుతపోరూప గుణం కలిసి పోయింది .రూప సంపద చాలాచోట్ల ఉంటుంది కాని గుణ సంపద ఉండటం దుర్లభం .యవ్వనం శరత్తు మేఘాలనీడలాగా చంచలమై వెళ్లి పోతుంది .విషయ సుఖం తాత్కాలికమే చివరికి దుఖాన్నే ఇస్తుంది .ప్రాణులకు ఎప్పుడూ ఆపదలే .జనన ,జీవన మరణాలు తప్పు అని తెలుసుకొన్న వాడు మోక్షం కోసం ప్రయత్నిస్తాడు కనుక నీ పని మంచిదే .నీ మనసు మంచిది .ఈ శుభ ఆలోచన రావటం విశేషం .కానీ నీ వేష అనుమానంగా ఉంది .-‘’విరుద్ధః కేవలం వేషః సందేహ యతిమే మనః ‘’.నీ వేషం యుద్ధానికి తయారైన వాడిలా కవచం ఉంది.మునులు సాధారణంగా జింక చర్మం నార బట్టలు కడతారు –‘’మహే షుధే ధనుర్భీమం భూతానా మనభి ద్రుహః ‘’
మోక్షాని కోరే నువ్వు రెండు అమ్ములపొదులతో ధనుస్సు ఎందుకయ్యా ?జంతు హింస నీకు నిషిద్ధం కదా .-ప్రపి త్సోఃకిం చ తేముక్తిం నిఃస్ప్రుహస్య కలేవరే –మహేషుధీ ధనుర్భీమం భూతానామనభి ద్రుహః ‘’.నీ ఖడ్గం చావుకు మరో భుజంగా ,ప్రాణులకు భయంకలిగించేదిగా ఉంది .అది తపస్సుకు శాంతి కలిగించదు కదా .-‘భయంకరః ప్రాణ భ్రుతాంమృత్యోర్భుజ ఇవా పరః –అసిస్తవ తపస్థస్యన సమర్ధ యతేశమం ‘’.పూజ్యుడవైన నువ్వు శత్రువుపై జయం కోరుతున్నావు.శాంత పురుషులైన తపోధనులెక్కడ ? కోపానికి చిహ్నమైన ఆయుధ మెక్కడ ?కనుక నీ వాలకం పరస్పర విరుద్ధంగా ఉంది .-‘’జయమత్ర భవాన్నూన మరాతి ష్వభిలాషుకః –క్రోధ లక్శ్మక్షమా వంతః క్వాయుధం కవ తపోధనాః ‘’.మోక్షానికి ఉప యోగ పడే పనులు హింసకు ఉపయోగించిన వాడు మూర్ఖుడు .అలసటను తొలగించే తేట నీటిని బురదగా మార్చే వాడితో సమానం –‘’యః కరోతి వధో దర్కానిః శ్రేయస కరీః క్రియాః-గ్లాని దోష చ్ఛిదః స్వ చ్ఛాః స మూఢః పంకయత్యపః ‘’.హి౦సాది దోషాలకు మూలం అర్ధ, కామాలే .వాటికి బలం చేకూర్చద్దు.ఈ రెండూ తత్వజ్ఞానానికి లొంగేవికావు.-‘’మూలందోషస్య హింసా దే రర్ధ కామౌ స్మమా వపుః-తా హితత్వావ బోధస్య దురు చ్ఛేదావుపప్లవౌ’’.
సశేషం