కిరాతార్జునీయం-.21
పదకొండవ సర్గ -4(చివరి భాగం )
అర్జునుడు ముసలి తాపసి వేషంలో ఉన్న ఇంద్రునితో ఇంకా చెబుతున్నాడు ‘’మనిషి అభిమానం తో ఉన్నంతకాలం సంపద నిలుస్తుంది .కీర్తికూడా స్థిరంగా ఉంటుంది .మానహీనుడు యశోహీనుడు ,సంపత్ హీనుడౌతాడు.వాడికి లోకం లో ఇంకేమీమిగలదు .—తావదాశ్రీ యతే లక్ష్మ్యా –తావదస్య స్థిరం యశః -పురుష స్తావదేవాసౌ యావన్మానాన్నహీయతే ‘’ .దట్టమైన అడవులున్న బాగా ఎత్తైన పర్వతాలనైనాచేర వచ్చు కాని పరాక్రమ శీలి ,అభిమానవంతుడు మాత్రం ఎవరికీ సాధ్యమయ్యే వాడు మాత్రం కాదు.-‘’దురాసదన వన జ్యాయాన్ గంయస్తు౦గోపి భూధరః –నజహాతి మహౌజస్కం మాన ప్రాంశు మలంఘ్యతా ‘’.వంశానికి ప్రతిష్ట తెచ్చే వారి వల్లనే భూమికి ‘’వసుంధరా ‘’అనే పేరు సార్ధకమైంది వారునిష్కలంక కీర్తితో చంద్రమండలాన్ని సిగ్గుపడేట్లు చేస్తారు.’’గురూం కుర్వ౦తి తే వంశ్యానన్వర్దా తిర్వసు౦ధరా-యేషాం యశాంసి శుభ్రాణి హరిప యంతీ౦దు మండలం .’’ఎండిన కర్రను పిడుగుపడి కాల్చినట్లు ,కోపాన్ని శత్రు సంహారం లో ప్రదర్శించే వారు వారే అంతటి వారుకావాలని ఆశీర్వచానాలలో ఉదహరిస్తారు .అంటే మనస్విత వదలకూడదు అని భావం –‘’ఉదాహరణ మాశీః షు ప్రథమే తే మనస్వినాం శుష్కేఆశని రివా మర్షోయైరారాతి షుపాత్యతే ‘’.నేను చంచల సుఖాలకోసం తపస్సు చేయటం లేదు .ధనసంపాదనకోసం కాదు .అస్త్రాలకు భయపడి మోక్షం కోరటం లేదు .శత్రువుల కపటంవలన అంటిన బురద అనే అపకీర్తి ని ,విధవలైన శత్రు స్త్రీల కన్నీటితో కడిగి తొలగించాలన్నదే నా కోరిక –‘’పరమార్ష్టుమయశః పంక మి చ్ఛేయంచద్మనాకృతం-వైధవ్య తాపితారాతివనితా లోచనా౦బుభిః’’.లోకం లో సజ్జనులు నన్ను పరిహాసం చేయచ్చు లేక భ్రాంతిలో ఉన్నాననవచ్చు .కానీ నువ్వు చేసిన మోక్షరూప ఉపదేశం నిష్ఫలమై౦దని సిగ్గు పడకు.శత్రు నిర్మూలనం చేసి వంశ పరంగా వస్తున్న రాజ్య లక్ష్మిని ఉద్ధరించకుండా వచ్చే మోక్షం కూడా విజయశ్రీకి అడ్డుగానే భావిస్తాను .’’వంశ లక్ష్మీ మనుధృత్య సాము చ్ఛేదేనవిద్విషాం-నిర్వాణ మపిమన్యేహమంతరాయ౦ జయశ్రియం ‘’.శత్రువులు అపహరించిన కీర్తిని బాణం తో మళ్ళీ సాధించాలి .అలా చేయకపోతే పుటక వ్యర్ధమే .చచ్చినవాడితో సమానం .గడ్డిపోచ విలువకూడా పొందలేడు-‘’ఆజన్మా పురుష స్తావ ద్గతాసు స్తృణమేవ వా -యావన్నేషుభిరా దత్తేవిలుప్త మరిభి ర్యశః ‘’.
శత్రువుపై తప్పక ప్రతీకారం తీర్చుకోవాలి .అలా చేయకపోతే దోషమే .ముసలి మునీ !నువ్వే చెప్పు- శత్రు సంహారం లేకుండా మనిషి కోపం శాంతిస్తుందా ?శత్రు సంహారం చేయని వాడిని పురుషుడు అనవచ్చా ?’’అని ప్రశ్నించాడు –‘’అనిర్జయేన ద్విషతాం యస్యామర్షః ప్రశామ్యతి-పురుషోక్తిః కథం తస్మిన్ బ్రూహి త్వం హి తపోధన ‘’.పురష జన్మతో చెప్పబడే పురుష శబ్దం తో ఏమీ కాదు .పశు ,పక్ష్యాదుల్లోనూ పురుష జాతి ఉంది .గుణ గ్రహణపారీణులు ప్రశంసించి ,వెంటనే ఆదర్శం గా తీసుకోబడే వాడే పురుషుడు .-‘’కృతం పురుష శబ్దేన జాతి మాత్రావలంబినా –యో౦గీకృత గుణైః శ్లాఘ్యః సవిస్మ యముదా హృతః ‘’.సభలలో సంభాషణలలో గౌరవంగా తీసుకోనబడే వాడు వినే వాళ్ళ తేజస్సు ను కూడా మింగేసే వాడూ ,శత్రువుల చేతకూడాఅభినందింపబడే వాడూ అతడే అభిమాన వంతులలో గణనీయుడైన పురుషుడు అవుతాడు .-‘’గ్రసమాన మివా౦ జసి సాదసా గౌర వేరిత౦ –నామ యస్యాభి న౦ద౦తి ద్విషోపిస పుమాన్పుమాన్ ‘’.మారాజైన ధర్మ రాజు మా శత్రువులపై ప్రతీకారం తీర్చుకోవటానికి నన్నేకోరాడు .దాహం వేసిన వాడు దోసెడు నీళ్ళుకోరినట్లు నన్ను కోరాడు .-‘’యథా ప్రతిజ్ఞంద్విషతాంయుధి ప్రతి చికీర్షయా –మమైవా ధ్యేతి నృపతిస్తృష్యన్నివ జలాంజలె
జలా౦జలేః’’.యజమాని ఆపదలో ఉంటె అతడిఆజ్ఞ పాలి౦చని వాడుతన నిర్మల వంశానికి చంద్రునిలో మచ్చ లాగా కుల ఘాతకు డౌతాడు.అంటే ధర్మరాజు ఆజ్ఞ నాకు శిరో దార్యం ..-‘’స వంశస్యావ దాత స్య శశాంక స్యేవ లాంఛనం-కృఛ్చ్రేషువ్యర్ధయా యత్ర భూయతే భర్తు రాజ్ఞయా’’.సరేకానీ గృహస్థాశ్రమానికి ముందే ధర్మానికి విరుద్ధమైన ముని వృత్తి నాకు ఎందుకు ఉప దేశిస్తున్నావు సామీ ? బ్రహ్మ చర్య ,గృహస్థాశ్రమ, వానప్రస్థ,సన్యాసం కదా వరుస .నేనింకా గృహస్థుడినే అని భావం .శత్రు ప్రతీకార భారం ఇంకా నామీద ఉంది మా అమ్మగారు కుంతీదేవి కూడా మాదగ్గరలేదు .అన్న ధర్మరాజు గారే మాకు అన్నిటికీ పెద్ద ఆయన ఆచార నిష్ఠ ఉన్నవాడు .ఈ మూడు కారణాలవలన నేను స్వతంత్రంగా ఏమీ చేయకూడదు .అందుకే గృహస్థాశ్రమ ధర్మాలు ఎన్నోఆచరించ లేకపోతున్నాను .అభిమానవంతులు తమపని ధర్మాన్ని తాము చేస్తారు .దాన్ని ఉల్లంఘించరు.శత్రువుతో అపకారం పొందినవాడు యుద్ధం నుంచి దూరం కాడు. ప్రతీకారం తీర్చుకోనేదాకా శ్రమిస్తాడు-‘’స్వధర్మ మను రుంధంతే నాతిక్రమ మరాతిభిః-పలాయంతేకృతద్వంసా నాహవా న్మాన శాలినః ‘’.సుడిగాలితో చెల్లా చెదరైన మేఘం లాగా ,ఇంద్రకీలాద్రి పై నేనూ విలీనమౌతాను లేదా ఇంద్రుడిని మెప్పించి అపకీర్తి ముల్లుతొలగిస్తాను .ఇదే నా నిశ్చిభిప్రాయం’’ అని ఇంద్రతనయుడు అర్జునుడు ,ముసలి ముని వేషం లో వచ్చిన ఇంద్రుడికి చెప్పాడు –‘’విచ్చిన్నాభ్రవిలాయం వా విలీయే నాగ మూర్ధని –ఆరాధ్య వా సహస్రాక్షమ యశః శల్య ముద్ధరే ‘’.
తన మనో నిశ్చయాన్ని నిర్భయంగా చెప్పిన అర్జునుడికి ఇంద్రుడు తన నిజరూపం తో ప్రత్యక్షమై ,రెండు చేతులతో గట్టిగా ఆలింగనం చేసుకొని,అతడి అభీష్ట సిద్దికీ ,సంసారం లో సరిగమలు సరిదిద్దుకోవటానికీ ,పాపాలను తొలగించే పరమేశ్వరుని గురించి తపస్సు చేయమని ఉపదేశించాడు .-‘’ఇత్యుక్త వంతం పరి రభ్యదోర్భ్యాం తనూజ మా విష్కృత దివ్య మూర్తిః-అఘోపఘాత౦ మఘవా విభూత్యై భవోద్భావా రాదన మాది దేశ ‘’.అర్జునుడి తో ఇంద్రుడు ‘’శివుడు నీ తపస్సుకు ప్రసన్నుడవగానే, లోక పాలకుల౦దరి తో కూడా నేను గొప్ప శక్తిని ప్రసాదిస్తాను .దాని ప్రభావం తో నువ్వు శత్రు రాజ్య లక్ష్మిని నీకు అనురాగవతిగా చేసుకోగలవు ‘’అనిచెప్పి , అంతర్ధానమయ్యాడు.
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -7-12-20-ఉయ్యూరు