సార్ధకమైన ఆదివారం
సాహితీ బంధువులకు శుభకామనలు .నిన్న 6-12- 20 కార్తీక బహుళ షష్ఠి ఆదివారం మా ఇంటి పెరటిలో ఉన్న ఉసిరి వృక్షం క్రింద ఉదయం 9గంటల నుండి 11 గంటల వరకు నేనూ మా అబ్బాయి మూర్తి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, దశ శాంతులు సామ్రాజ్య పట్టాభి షేకంతో తో సహా చేసి, శివ అస్టోత్తర శతనామపూజ, బిల్వార్చన చేశాం .తర్వాత 11గం నుండి నేనూ మా శ్రీమతి, మా అబ్బాయి మూర్తి ,కోడలు రాణి నవగ్రహాలకూ అష్టోత్తర పూజ ,శ్రీ సత్యనారాయణ స్వామికి అష్టోత్తర సహస్రనామపూజ ,,అభిషేకం సత్యనారాయణస్వామి వ్రతం ,అయిదు కథలు తోనూ తర్వాత శ్రీ వేంక టేశ్వర దీపారాధన అష్టోత్తరపూజ, తులసి అష్టోత్తర పూజ చేసేసరికి మధ్యాహ్నం 1.45గం అయింది . బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలాలు అందజేశాం .అప్పుడు బంధుమిత్రులతో మామిడికాయపప్పు,అరటిఊచ ఆవపెట్టి కూర ,బెండకాయ వేపుడు ,నేతిబీరకాయ పచ్చడి ,దోసావకాయ ,కాలీఫ్లవర్ ఊరగాయ ,పరవాన్నం,చక్రపొంగలి పులిహోర, పులుసు ,అప్పడం ,పెరుగు లతో ఉసిరి చెట్టు కింద కార్తీక వనభోజనం చేశాం .అందరి భోజనాలు ఆయే సరికి మధ్యాహ్నం 3 అయింది . వంట అంతా మా కోడలు, ప్రక్కనున్న మామ్మగారు ,మా శ్రీమతి చేశారు .వడ్డన మల్లికా౦బగారు ,మూర్తి, రాణి ,చరణ్ ,రమ్య చేశారు .మా దేవాలయ అర్చక దంపతులు మా అన్నగారబ్బాయి రాంబాబు,దంపతులు , మా వదిన గారు ,అద్దెకున్న గోపాలకృష్ణమూర్తి గారు,, భార్య గారు ,అద్దెకుంటున్న సుబ్రహ్మణ్యంగారు అతిధులు.
మధ్యాహ్నం 3-30కు కారులో నేనూ మామనవడు చరణ్ ,మనవరాలు రమ్య బయల్దేరి కృష్ణకట్ట మీదుగా నడకుదురు శ్రీ పృధ్వీశ్వర దేవాలయ సందర్శన చేసి అక్కడ మాత్రమే పెరుగుతున్న అపురూప మైన పాటలీ పుష్ప వృక్షాలు చూసి అక్కడే నరకాసుర వధ జరిగిందన్న ఐతిహ్యం మా వాళ్లకు చెప్పాను ..అక్కడి నుంచి చల్లపల్లి మీదుగా కప్తానుపాలెం వెళ్లి అక్కడ ఉంటున్న 57 ఏళ్ళక్రితం మోపిదేవి హైస్కూల్ శిష్యుడు అడవి శ్రీరామ మూర్తి ఇంటికి వెళ్లి ,వాళ్ళమ్మ గారిని, భార్యను చూసి సత్యనారాయణ స్వామి ప్రసాదం ఇచ్చాం .అక్కడి నుంచి శ్రీరామమూర్తిని తీసుకొని అందరం చల్లపల్లి మీదుగా అమరగాయకులు శ్రీ ఘంటసాల జన్మించిన టేకుపల్లి గ్రామం చేరి అక్కడ ఎలిమెంటరి స్కూలు ఆవరణలో గానగంధర్వ బాలసుబ్రహ్మణ్యం గారి చేత ప్రతిష్టింప బడిన ఘంటసాలమాస్టారి విగ్రహాన్నిచీకట్లోనే చూశాం .అక్కడే కంచి కామకోటి పీఠం ఆధ్వర్యం లో నిర్వహింపబడుతున్న శ్రీ రామలింగేశ్వర స్వామి దర్శనం చేసి , అక్కడినుండి పెదకళ్ళేపల్లి చేరి అక్కడి శ్రీ దుర్గా నాగేశ్వరస్వామి దర్శనం చేసి ,సత్యస్తంభం చూశాం ..ఇక్కడే ప్రముఖ సాహితీ వేత్త శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రిగారు,సినీ గేయరచయిత శ్రీ వేటూరి సుందరరామమూర్తిగారు ,మహా సంగీత విద్వాంసులు శ్రీ సుసర్ల దక్షిణా మూర్తి శాస్త్రిగారు,,ఆయన మనవడు సినీ సంగీత దర్శకులు శ్రీ సుసర్ల దక్షిణామూర్తి శాస్త్రి జన్మించారు .కృష్ణా నదీతీరంలో ఉన్న కదళీవనాలు అంటే అరటి చెట్లు విశేషంగా ఉన్న కదళీ పల్లి అనే కళ్ళే పల్లి దక్షిణ కాశిగా పేరుపొందిన సుప్రసిద్ధ పుణ్య క్షేత్రం .ఇక్కడ ఓరియెంటల్ హై స్కూల్ ఉంది . 1999లో వేటూరి ఇక్కడే తమ ఇంట్లో రెండు రోజుల సాహిత్య కార్యక్రమం అన్ని ఖర్చులూతానే భరించి నభూతో గా నిర్వహించారు .మొదటి రోజున మా దంపతులం కూడా వెళ్లి వేటూరి సుందరరామ మూర్తిగారి కమ్మని షడ్రసోపేత భోజనాన్ని ఆతిధ్యాన్నిఆదరణ ను దర్శకుడు విశ్వనాద్ దేవదాస్ కనకాల దంపతులు, జంధ్యాల, నటి ,,నాట్య మయూరి సబిత ల తోపాటు అనుభవించి అనుభూతి పొందాం .ఆడిటోరియం లో జరిగిన సభలో శ్రీ బుద్ధప్రసాద్ వగైరా పాల్గొన్నారు .
కళ్ళేపల్లి నుంచి నేను 33ఏళ్ళ క్రితం అంటే 1987లో హెడ్ మాస్టర్ గా పనిచేసిన మంగళాపురం మీదుగా లక్ష్మీ పురం చేరి, అక్కడ నా దగ్గర మంగళాపురం లో ,అంతకు ముందు వత్సవాయి హైస్కూల్ లో అటెండర్ గా పనిచేసిన మేమంతా’’ బాణం’’అని పిలిచిన ప్రస్తుతం చల్లపల్లి మండల పరిషత్ లో S.O.గా పనిచేస్తున్న పోతుమూడి వెంకటేశ్వరరావు కుమారుడు వెంకట రఘు ,హరిచందన వివాహానికి హాజరయ్యాం.అతడు 15రోజులక్రితం కుమారుడితో ఉయ్యూరు వచ్చిశుభలేఖ ఇచ్చి తప్పక రమ్మని కోరితే వెళ్లాం . వత్సవాయిలో పని చేసినప్పుడు అతడు ట్రాన్స్ ఫర్ అయి వెడుతూ ,‘’సార్ మళ్ళీ మీ దగ్గరే పని చేయాలని ఉంది ‘’అన్నమాట ఉయ్యూరు వచ్చినప్పుడు జ్ఞాపకం చేసుకొన్నాడు .అలాగే మళ్ళీ మంగళాపురం లో నా దగ్గరే పని చేశాడు . నేను రోజూ ఉయ్యూరు నుంచే వచ్చేవాడిని .చాలా ఇబ్బందిగా ఉండేది ప్రయాణం చల్లపల్లి లక్ష్మీ పురం చేరటం తేలికగానే ఉండేది. అక్కడి నుంచి మంగళాపురానికి బస్ సరిగ్గా ఉండేది కాదు .రిక్షాలో వెళ్ళాల్సి వచ్చేది .నేను ముందే వెళ్లి ,బాణం ఇంట్లో కాసేపు కూర్చుని అతనిభార్య ఇచ్చిన కాఫీ లేక మజ్జిగ తాగి ,అతడి సైకిల్ పై స్కూలుకు వెళ్ళేవాడిని అదీ మా అనుబంధం .తర్వాత మూడు నెలలో నాలుగు నెలలో మంగళాపురం లో స్కూలుకు దగ్గరలోనే ఉన్న మాలెం పాటి వేణు గారింట్లో ఒకగదిలో అద్దె కున్నాను. వేణుభార్య విజయ ను ‘’అమ్మాయీ ‘’అని పిలిచే వాడిని .ఆమె మామగారు ఉండేవారు .అందరూ ఆత్మీయంగా చూసేవారు .అమ్మాయి మాత్రం నన్ను కన్న తండ్రి లాగా చూసుకొనేది. ఉదయం కాఫీ,, మధ్యాహ్నం టీ సాయంత్రం టీ, వీలైనప్పుడల్లా ఇడ్లీ గారే చేసి పెట్టేది..పెరుగు, పాలు, మజ్జిగ ఫ్రీ .ట్యూషన్ కూడా చెప్పా టెన్త్ పిల్లలకు .మా వివాహ౦ జరిగి 25ఏళ్ళు అయిన సందర్భంగా స్కూల్ లో గ్రాండ్ పార్టీ ఇచ్చాము. ఉయ్యూరునుంచి మా శ్రీమతి మా అమ్మాయి విజ్జి మా అబ్బాయిలు కూడా వచ్చారు .నన్ను చూసి తర్వాత పాండురంగా చారి అనే డ్రాయింగ్ మాస్టారు అలాంటి పార్టీ ఇస్తే ,తర్వాత అందరూ ఏదో ఒకకారణంగా పార్టీలిచ్చారు .అమ్మాయి ,వేణు ఆ తర్వాత మూడు నాలుగు సార్లు ఉయ్యూరు వచ్చారు . ఫోన్ లో మాట్లాడేవారు .వాళ్ళ అమ్మాయి పెళ్ళికి కూడా నేను వెళ్లాను . అమ్మాయిని చూడాలనుకొని బాణం కు మెసేజ్ పెడితే అతడు చదివి ఫోన్ చేసి రెండేళ్ళక్రితం విజయ చనిపోయిన విషాద వార్త చెప్పాడు .లేకపోతె వాళ్ళ ఇంటికి కూడా వెళ్లి ఉండేవాళ్ళం . నేను వచ్చినందుకు బాణం దంపతులు ఎంతో సంతోషించారు .చాలా గ్రాండ్ గా జరిగింది వివాహం .మాజీ మంత్రి శ్రీ కొల్లు రవీంద్ర కూడా వివాహానికి హాజరయ్యారు .ఆయనకు సరసభారతి ఉగాది ఆవిష్కరణ పుస్తకాలు మూడు ఇస్తే ,చాలా ఆప్యాయంగా అందుకొని ఫోటో తీయి౦చు కొన్నారు . చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రావీన్ద్రగారిని చాలా సాహిత్యసభాలలో చూశాను .ప్రభుత్వ సాహితీ పురస్కారం కూడా బెజవాడ సంగీత కాలేజిలో ఆయన ,ఇతర మంత్రుల సమక్షం లో అందుకొన్నాను .ఇవన్నీ జ్ఞాపకమోచ్చాయి .ముహూర్తం రాత్రి 7.50కి చూసి, దంపతులను ఆశీర్వదించి ,కానుక కవర్ పెళ్లి కొడుకు చేతిలోపెట్టి ,బయల్దేరగా బాణం వచ్చి చాలాసంతోషంగా ఉందని చెప్పి భోజనం చేయమని కోరితే కార్తీకమాసమని చెప్పి రాత్రి 8గం.లకు బయల్దేరి 9.కి ఉయ్యూరు చేరాం .మా కారు డ్రైవర్ కం ఓనర్ శుశీల్ బాగా,జాగ్రత్తగా డ్రైవ్ చేశాడు .
కార్తీకమాసం ఆదివారం అభిషేకం ,సత్యనారాయణస్వామి వ్రతం ,వనభోజనం ,మూడు శివ క్షేత్రాల దర్శనం ,వివాహ వేడుక కు హాగారు ల తో ధన్యమయ్యాం .
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -7-12-20-ఉయ్యూరు