కిరాతార్జునీయం-.22
పన్నెండవ సర్గ -1
ఇంద్రుడు అంతర్ధానమయ్యాక,ఇంద్ర తనయుడు సంతోషం తో అలసట లేకుండా శంకరుడిని మెప్పించటానికి తపస్సు ప్రారంభించాడు .సూర్యునికి ఎదురుగా ఒంటికాలిపై నిలిచి ,బాహ్యాభ్యంతర శుచితో జయమే లక్ష్యంగా ,నిరాహారుడై ఎన్నో రోజులు దీక్షగా తపస్సు చేశాడు –‘’అభి రశ్మి మాలి విమలస్య ,ధృత జయ ధృతేరానాషు షః-తస్య భువి బహు తిథాస్తిథయః.ప్రతి జగ్మురేక చరణం నిషీదతః .శరీరం ,ఇంద్రియాలను తపి౦ప జేస్తూ,దుఖాలు సహిస్తూ ,పర్వతం లాగా నిశ్చేష్టుడై స్థిరంగా ఉన్నాడు.గొప్ప వారి ధైర్యం ఊహించనలవి కానిది-‘’వ్యాప నగపతి రివ స్థిరతాం,మహతాం హి ధైర్య మవిభావ్య వైభవం ‘’.పండి పరిమళాలు వెదజల్లే ఫలాల మీద , చల్లని నీటిపై ఆకర్షితుడు కాలేదు .పుణ్యాత్ములకు తపస్సు అమృతమవుతుంది .-‘’న పపాత సన్నిహిత పక్తిసురభిషు ఫలేషు మానసం –తస్య శుచిని,శిశిరే చ పయస్యమృతాయతే హి సుతపః సుకర్మణా౦.అంత గొప్ప తపస్సు చేశానని ఆశ్చర్యపోలేదు .ఫలితం ఆలస్యమౌతుందని విషాదమూ లేదు .అలసటా లేదు .శక్తి తగ్గినా ,రజస్తమో గుణాలు అతని సత్వ గుణాన్ని తగ్గించ లేకపోయాయి .పరాక్రమం ఏ మాత్రం సడలలేదు .-‘’న విసిస్మియే న విషాద ముహురలసాం న చాదదే-సత్వ మురు ధృతి రజస్తమసీ,నహతః స్మతస్య హత శక్తి పేలవే .’’.శరీరం కృశించింది.అయినా ముల్లోకాలు జయించాడు .అతని శరీరాన్ని చూసి తత్వజ్ఞులు కూడా భయపడతారు .మాన ధనులకు సాధ్యం కానిది లేదు లోకం లో .-‘’త్రాస జననమపి తత్వ విదా౦ కిమి వాస్తి యన్న సుకరం ,మనస్విభిః’’.అర్ధరాత్రి మండే అగ్నికంటే తేజస్సుగా ,సముద్రం కంటే గంభీరంగా ,పర్వతం కంటే ఔన్నత్యంగా భాసిం చాడు .-‘’జ్వలతో నలాదను నిశీథ మదిక రుచిర మంభసాంనిధేః-ధైర్య గుణ మవజయ న్విజయీ దదృశే సమున్నతరః స శైలతః ‘’.ఏకాంతంగా జపిస్తుంటే ,ముఖం సూర్య మండల ప్రకాశం పొందింది. దంతకాంతి చుట్టూ ప్రసరించి పరి వేషంగా సూర్య శోభ పొందింది .కవచం ధరించి ,యజ్ఞోపవీతం ఉన్న భుజం పై ధనుస్సు ఎక్కు పెట్టి ,ఇంద్రతనయుడు ,ఇంద్ర ధనుస్సు ఆవరించిన మహారణ్యహిమాలయం లా ఉన్నాడు .-కవచ స భిభ్ర దుపవీత పదనిహిత సజయ కార్ముకః –శైల పతిరివ మహేంద్ర ధనుః పరివీత భీమ గహనో విదిద్యుతే.’’.చిక్కిన శరీరంతో స్నానానికి వెడుతుంటే అతడి ప్రతి అడుగు భారానికీ హిమవత్పర్వతం కుంగి పోతోంది .శరీరభారం తగ్గినా అర్జునుని అంతః సారం ప్రాధాన్యం వహించిందని భావం .
ఊర్ధ్వబాహుడై ,తపస్సు చేస్తుంటే విస్తృతమైన తేజస్సు అతని శిరస్సు చుట్టూ నేకాక ,భూ నభో౦త రాలలో కూడా వ్యాపించి,మునులకు ,దేవతలకు దుర్ధర్షమై ఇబ్బంది పెట్టింది –‘’పరికీర్ణ ముద్యుత భుజస్య భువన వివరే దురాసదం –జ్యోతి రుపరి శిరసో వితతం జగృహే నిజాన్ముని దివౌకసాం పథః’’.తపస్సు తేజస్సుకు కృష్ణ పక్షం లోని రాత్రులలో కూడా చీకటి లేనేలేదు అందుకని చంద్రకాంతి ఆకాశాన్ని వదలలేదు –‘’రజనీషు రాజ తనయస్య బహుల సమయే పిదామభిః-భిన్న తిమిర నికరం న జహే శిశిరస్మి సంగమ యూజ నభఃశ్రియా ‘’.శిరస్సు నుంచి వెలువడిన తపస్సు యొక్క తేజో కిరణాలవిపరీత కాంతి వలన ,ఆకాశ సూర్యుడు సిగ్గుతో మ్లానుడై ప్రకాశించటం లేదు –‘’మహతా మయూఖా నిచ యేన శమిత రుచి జిష్ణు జన్మనా –హ్రీతమివ నభసి వీత మలే న విరాజతే స్మవపు రంశు మాలినః ‘’
ఎర్రని జటల తేజో కిరణాలు వెలువడ్డాయి .ధనుస్సు ఎక్కు పెట్టాడు .ఇది చూసి అసురనగరాలను కాల్చటానికి సిద్ధపడిన రుద్రుడేమో అనుకొన్నారు జనం . పరీక్షించి చూసి ,కంటి మంట లేదుకనుక రుద్రుడు కాదను కొన్నారు-‘’తముదీరితా రుణ జటాంశుమధి గుణ శరాసనం జనాః –రుద్ర మనుదిత లలాట దృశ్యం దదృశుర్మిమ౦థిషు మివా సురీః పురీః’’.అర్జునుడు సాధారణ మానవుడు కాదు దేవేంద్రుడో ,సూర్యుడో ,మంటల అగ్ని దేవుడో అనుకొన్నారు జనం .ఇంతటి ఘోర తపస్సు మామూలు మనిషి చేయలేడు అని భావించారు .-‘’మారుతం పతిః స్విదహిమాంశు రుత పృథుశిఖః శిఖీ తపః –తప్తు మసుకర ముపక్ర మతే న జనో య మిత్యవయయే న తాపసైః’’.అర్జున తపో తేజం అంతటా వ్యాపించినా ,అగ్నిలాగా చెట్లను కాల్చటం లేదు ,సూర్యునిలా నీటిని ఆవిరి చేయటం లేదు కాని సిద్ధ చారణ గణాల తపస్వులకు సహించటం కష్టం గా ఉంది .అంటే అతడి తపస్సు అలౌకికం అని భావం .ఔదార్యం మొదలైన గుణాలు వినయాన్ని ఆశ్రయించినట్లు ,నీతి దుర్నీతినితొలగించి వివేకాన్ని ఆశ్రయించినట్లు, నిర్దిష్ట సమయాలు ప్రమాణాన్ని చేరినట్లు ,శరణు లేని మహర్షులు శివంకరుడైన శివుడిని శరణు కోరటానికి ఆయన వద్దకు వెళ్లారు –‘’వినయం గుణా ఇవ వివేక మపనయభిదం నయా ఇవ –న్యాయ మవదయ ఇవా శరణాఃశరణం యయుః శివ మథో మహర్షయః ‘’.అరుణ తపో తేజస్సనేకిరణాలతో కండ్లు మూసుకు పోతున్న మహర్షులు వెంటనే శివుడిని చేరలేకపోయారు .కాసేపాగి చేరి శివ స్తోత్రాలు చేశారు .అందమైన శరీరం త్రినేత్రాలతో ఉన్న శంకర దర్శనం చేశారు .అంటే శివుడు ప్రత్యక్షమయ్యాడు అని భావం .మొదటి శ్లోకం లో విశాలమైన నందీశ్వరుని మూపు పై చేతులు ఉంచి ,పార్వతీ దేవి కుఛ సౌభాగ్యాన్ని స్పర్శ సుఖాన్ని అనుభవిస్తున్నట్లు శివుడు ఉన్నాడని వర్ణించారు .-‘’కకుదే వృషస్యకృత బాహు మకృశ పరిణాహ శాలినీ –స్పర్శ సుఖ మనుభవం తముమా కుఛ యుగ్మ మండల ఇవార్ద్రచందనే ‘’.
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -8-12-20-ఉయ్యూరు
.