కిరాతార్జునీయం-.23 పన్నెండవ సర్గ -2(చివరి భాగం )
మహర్షులు దర్శించిన శివుడు హిమాలయం పై ఉండటం తోపర్వతాలు సముద్రాలు ఆకాశం దిక్కులు అన్నిటినీ కల్గిన ఈ విశ్వాన్ని తన ప్రకాశం తో వ్యాపించి నట్లున్నాడు .రెండు మోకాళ్ళు చేర్చి భయంకర శేషుడనే సర్పం తో చుట్టి ఉన్న శంకరుడు సూర్యకా౦తితో లోకాలోక పర్వతాల దాకా ఉన్న విశ్వంలాగా ప్రకాశిస్తున్నాడు –‘’అనుజాను మధ్య మవసక్త వితత వపుషా మహాహినా –లోకమఖిల మివ భూమి భ్రుతా రవితేజ సామవధి నాధివేష్టితం’’.మంచులాగా తెల్లగా ,శుభ్రంగా ఉన్న యజ్ఞోపవీతం గా ఉన్న శేషుడిని తన నీల కంఠం రంగుతో సమానం చేస్తూ ఉన్న శివుడు కనిపించాడు –‘’పరిణాహినా తుహిన రాశి విశద ముపవీత సూత్రతాం –నీత మురగ మనురంజయతా శితినా గలేన విలసన్మరీచినా ‘’.మలాతీ పుష్ప సమానంగా ఉన్నశుభ్రమైన కపాలం అనే కలువను వికసింప జేసే చంద్ర కిరణాలు అనే యెర్రని జడలతోవ్యాపి౦ప జేస్తున్నాడు .నాల్గు దిక్కులా వ్యాపించే ఆ జటాసమూహం గంగాజలం లో మిగులు నీటిని శిరస్సు లో ధరించినట్టుగా శివుడు భాసి౦ చాడు .-‘’ఫ్లుతమాలతీసిత కపాల కుముద మవరుద్ధ మూర్ధజం –శేషమివ సుర సరి త్పయసాం శిరసా విసారి శశిధామ బిభ్రతం ‘’.ఋషులు శంకరునికి ఎదురుగా వెళ్లి ,ఆయన నేత్ర సంజ్ఞతోనే అర్జునతపస్సు వలన లోకాలకు కలుగబోయే ఆశుభాన్ని విన్నవించారు .’’ఓ పురుషోత్తమా శంకరా !భయం కలిగించే శరీర బలం కల వృత్రాసురుడి లా ఉన్న ఒక పురుషుడు తపస్సు చేస్తున్నాడు .అతని ప్రకాశం సూర్య ప్రకాశాన్ని మించింది .అతడు రెండు అమ్ములపొదులు ,ధనుస్సు కవచం ఖడ్గం జటావల్కలాలు ధరించి ఉన్నాడు .ఇవి ముని ధర్మానికి వ్యతిరేక వస్తువులు అయినా అతనికి మహా శోభ కలిగిస్తున్నాయి .అదే ఆశ్చర్యంగా ఉంది .అతడు కదిల్తే భూమి కంపిస్తోంది. సమాధి గతుడై ఇంద్రియాలను స్తంభింప జేయటం తో దిక్కులన్నిటా వాయువు ,గ్రహ ,నక్షత్రాలు తో కూడిన ఆకాశమే స్తంభించింది –‘’చాలానే వనిశ్చలతి తస్య కరణ నియమే సదిఞ్ముఖం –స్తంభ మనుభవతి శాంత మరుద్గ్రహ తారకా గణయుతం నభ స్థలం ‘’.అతడు త్వరలోనే విశ్వాన్ని జయిస్తాడు .తపస్సుతో సాధ్యం కానిది లేదుకదా –‘’విశ్వమిదమపి దధాతి పురా కిమి వాస్తి యన్న తపసా మదుష్కరం ‘’.ముల్లోకాలు ఒకేసారి జయి౦ చాలనో ,సంహరించాలనో లేక మోక్షమే కోరుతున్నాడో అర్ధం కావటం లేదు .అతని తేజస్సును మేము సహించలేక పోతున్నాం –‘’విజిగీషతే యది ,జగంతి,యుగ పదథ సామజి హీర్షతి-ప్రాప్తు మభవ మభి వా౦ఛతి వా వయమస్య నో విషహితం క్షమా రుచః ‘’
స్వామీ శంకరా !ఇంకా ఎందుకు ఉపేక్ష చేస్తున్నారు ?కారణం ఏమిటి ?మీకు తెలీనిది ఉండదు .అభయదాతా!మమ్మల్ని రక్షించే సమర్ధులు మీరే .మీ రక్షణలో మాకు అవమానం జరుగాకుండు గాక .-‘’త్రాతు మలమ భయదార్హసి నస్త్వయి మా స్మ శాసతి భవత్పరాభవః ‘’.ఇలా మునులు ప్రార్ధించగా అ౦ధకా౦తకు డైన శివుడు నభో౦త రాళం ప్రతిధ్వని౦చేట్లు,ఉప్పొంగే సముద్ర గర్జన ధ్వనితో ఇలా అన్నాడు .’’మహర్షులారా ! బదరికాశ్రమం లో ఉంటూ లోకసృస్టి,సంహారాలు చేసే విష్ణువు అంశమే ‘’నరుడు ‘’గా పిలువబడే అర్జునుడు .సాధారణ ముని కాదు .సాక్షాత్ నారాయణా౦శ సంభూతుడు –‘’బదరీ తపోవన నివాస నిరత మవగాత మాన్యథా-ధాతు రుదయ నిదనే జగతాం నర మంశ మాదిపురుషస్య గాం గతం ‘’అతడు లోకాలకు బాధ కలిగించే వారు ,ఇంద్రుని శక్తిని లెక్కచేయని వారు అయిన శత్రువులను జయి౦చాలనే కోరికతో నన్ను ఆరాధిస్తూ తపస్సు చేస్తున్నాడు .కనుక భయపడాల్సిన పనిలేదు –‘’ద్విషతః పరాసిషురేష సకల భువనాభి తాపినః-క్రాంత కులిశ కర వీర్య బలాన్మ దుపాసనం విహిత వాన్మహత్తపః ‘’తపస్సంపన్ను డైన అర్జుండు , శ్రీ కృష్ణ భగవానుడు బ్రహ్మ ప్రార్ధిస్తే ,భూమి మీది సకల అసుర సంహారం కోసం మనుషులుగా కృష్ణార్జునులుగా జన్మించారు వారు సాక్షాత్తు నర నారాయణులే.ఈ విషయం తెలుసుకొన్న మూకాసురుడు అర్జునుడిని చంపటానికి వెడుతున్నాడు .కనుక మీరుకూడా నాతో రండి అక్కడ ఏం జరుగుతుందో చూడటానికి. అర్జున ఆశ్రమానికి వెంటనే వెళ్ళాలిమనం .క్రూర మూకాసురుడు ఏకాంతం లో ఉన్న అర్జునుడిని ఎదుర్కోవటం చేతకాక,అనుమానం రాకుండా ఉండటానికి వరాహ రూపం ధరించి ,విజయం సాధించాలని చూస్తున్నాడు –‘’వివరేపి నైన మనిగూఢ మభిభవితుమేష పారయన్-పాప నిరతి రవిశంకితయా విజయం వ్యవస్యతి వరాహ మాయయా ‘’.నేను కిరాత రాజు వేషం తో మూకాసురుడిని చంపగా ,వాడి అయిన బాణాన్ని వదిలిన అర్జునుడు వేట నియమాలను అనుసరించి నాతొ వివాద౦లొ పడతాడు –‘’నిహతే విడంబిత కిరాత నృపతివపుషా రిపౌ మయా –ముక్త నిశిత విశిఖః ప్రసభం మృగయా వివాద మయమా చరిష్యతి ‘’అర్జునుడు తపో నియమాలతో బాగా చిక్కి పోయాడు .సహాయం కూడా ఎవరూ లేని ఒంటరి వాడు .అయినా ,సహజ సిద్ధ,సాటిలేని పరాక్రమం తో ఉన్న అతడి భుజపరాక్రమ విక్రమాన్ని చూడండి –‘’తపసా నిపీడిత కృశస్య విరహిత సహాయ సంపదః –సత్వ విహిత మతులం . భుజయోర్బలమస్య పశ్యత మృధేధికుప్యతః ‘’.ఈవిధంగా మునులకు చెప్పిన పరమేశ్వరుడు నుదుట హరిచందనం అడ్డ దిడ్డంగా పూసుకొనగా ,ఒళ్ళు పులకరించి ,ఏనుగు గండస్థల ముత్యాలు కూర్చిన హారం ధరించాడు .
పొడవైన శిరోజాలున్న జడలలోవికసిత పుష్పాలు ధరింఛి ముడి వేశాడు .నెమలి కన్నుల కమ్మలు పెట్టుకొని కణతలకు శోభ చేకూర్చాడు . ఎర్రని కళ్ళతో భయ౦ కల్పిస్తున్నాడు .-‘’వదనేన పుష్పిత లతా౦త ఇయమిత విలంబి మౌలినా –బిభ్రదరుణ నయనేన రుచం శిఖి పిచ్ఛలా౦చిత కపోల భిత్తినా’’. కిరాత సేనాపతి గా మారిన శివుడు మేఘగర్జన లాగా ధ్వనించే ,బాణం తో ఉన్న ధనుస్సు ధరించి ,అందమైన మేఘంలాగా కనిపించాడు .ప్రమథ గణాలు శూల ,పరశు ,బాణం చాపం మొదలైన ఆయుధాలతో కిరాత సైన్యంగా శివుడికి సహాయంగా నిలిచారు .ఈశ్వరాజ్ఞ అనుసరించి ,వారంతా ఇంద్ర కీలాద్రి చేరి అక్కడి అడవిలో ఎవరు ఏవైపున ఉండాలో నిర్ణయించుకొని వేట నెపం తో నాలుగు వైపులా భయంకర నినాదాలిస్తూ అట్టహాసంగా బయల్దేరారు .అడవిలోని పక్షులు జంతువులూ భీతితో అరుస్తూ బయటికి రాగా , ఇంద్రకీలాద్రి గుహలు భయంతో అరుస్తున్నట్లు అనిపించింది .జాతివైరం ఉన్న మృగాలు పరస్పరం కోపం చూపలేదు .భయం తో వచ్చిన కస్టాలు సహజ శత్రుత్వాన్ని కూడాతొలగిస్తాయి .-‘’ఘ్న౦తి సహజమపి భూరి భియః సమమాగతాః సపది వైరామాపదః ‘’.వెదురు పొదల్లోని చిక్కిన చమరీ మృగాలు అందమైన తోకలు విడిపించు కోవటం లో శివగణ౦ ఆర్భాటాన్ని కూడా లెక్కచేయకుండా ధైర్యంగా ఉన్నాయి .మదజలం స్రవిస్తున్న ఏనుగులు ,జూలు విదిలిస్తున్న సింహాలు శివ సైనికులను చూసి భయపడలేదు. నదులు భయంతో యెగిరి పడే చేపలతో నిండాయి .తీరాలు బురదగా మారాయి .ఏనుగుల రాపిడికి విరిగిన యెర్ర చందనం చెట్ల రసంతో నీరు ఎర్రబడింది .చల్లని గాలి అలసట తీర్చింది .దున్నల ఘర్షణ వలన అగురు ,తమాల ,తుంగదుంపల పరిమళం గాలిలో కలిసింది .రాళ్ళలో మొలిచే శిలాజిత్తు చిలక రంగులో ఉండేపువ్వుల్ని వెద జల్లుతూ అలసట తీరుస్తోందని భావం .భయంతో పరిగెత్తే సంక్షోభం తో గ్రీష్మం లో లాగా సరస్సులు దుర్దశ పొందాయి. నీటిని జంతువులు కలచి వేశాయి .తీరం లోని అరటి చెట్లు ,నివ్వరి ధాన్యం నేలకు ఒరిగాయి .తామర తూడులు వాడాయి .ఇలా శంకరుడు ఇంద్రకీల శిఖరం పై ఉన్న వృక్ష జీవ జాలాన్ని కలచి వేస్తూ ,సంతోషంతో ఆడ లేళ్ళు కొరికిన తీగలున్న అర్జున ఆశ్రమానికి చేరాడు .తర్వాత శివుడు అర్జునునిఎదురుగా ఉన్న మూకాసురుడిని చూశాడు .వాడు మేఘంలాగా నల్లగా పంది ఆకారం లో ముట్టె తో భూమిని పెళ్లగిస్తున్నాడు .-‘’పోత్ర నికషణవిభిన్న భువం దనుజం దధాన మథ సౌకరం వపుః’’.ప్రకాశమాన శివుడు దేవనది మందాకినీ తీరం లో సైన్యాన్ని నిలిపి ,కొందరు సైనికులతో చెట్లు ,పొదలు చాటుగా మూకాసురుని అడుగు జాడలను అనుసరించి బయల్దేరాడు –కచ్చా౦తే సుర సరితో నిధాయ సేనామన్వీతః స కతిపయైః కిరాత వర్యైః-ప్రచ్చన్నస్త రుగహనైసగుల్మ జాలైః లక్ష్మీ వానను పదమస్య సంప్ర తస్థే’’.
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -9-12-20-ఉయ్యూరు