కిరాతార్జునీయం-.26
త్రయోదశ సర్గ -3(చివరి భాగం )
శివుడు పంపిన భిల్లుడు అర్జునుడితో ఇంకా ఇలా అంటున్నాడు ‘’సూర్య తేజస్సు ను మించిన నువ్వు వరాహాన్ని చంపిన మా నాయకుడి బాణాన్ని అపహరించటం తగిన పనికాదు.మనువు మొదలైన వారు ఉత్తమ మార్గాలను బోధించారు. నువ్వే అధర్మగా ప్రవర్తిస్తే మిగతావారి సంగతేమిటి ?ఆత్మజ్ఞానులైన యతులు జనన మరణాలు జయించి విపత్తులకు కారణమైన అపమార్గం లో ప్రవేశించకుండా సన్మార్గం బోధిస్తున్నారు .అంటే నువ్వు సన్మార్గం, సచ్చీలం ఎప్పుడూ వదలకూడదని సూచన .తపస్సులో నిరతులైనవారికి వినయం పుణ్యాన్నిస్తుంది .సుఖం కోరితే సంపదలిస్తుంది. యోగులకు ముక్తి నిస్తుంది .అంటే వినయశీలం చతుర్విధ అర్ధాలను ఇస్తుందని భావం –‘’తిష్టతాం తపసి పుణ్య మానజన్ –సంపదో సుగుణయన్ సుఖైషితాం –యోగినాం పరిణమన్విముక్తయే –కేన నాస్తు వినయః సతాం ప్రియః .నీబాణం మా యజమాని బాణం లాగానే ఉండి ఉండచ్చు .ఐతే ఇతరులబాణాన్నితీసుకోవటానికి అపసవ్యమార్గం లో ప్రయత్నిస్తున్నావు .అభిమాని, సజ్జనుడు అయిన నువ్వు నిస్పృహతో ఈ పని చేయటం తప్పు .ఇతరులు చంపిన మృగాన్ని మళ్ళీ కొట్టటం కూడా తప్పే .,సిగ్గు మాలిన పనే –‘’అన్యదీయ విశిఖే న కేవలం –నిస్పృహస్య భవితవ్య మాహృతే –వ్రీడి తవ్యమపి తే సచేతసః ‘’.మా యజమాని కిరాతపతి నీపని ఉత్కంఠ తో విని సంతోషిస్తారో ,లజ్జితులౌతారోతెలీదు .ఎవరైనా మాస్వామిని కీర్తిస్తారు .స్వామి పేరు పరిహాసంగా చెప్పటానికి సిగ్గు పడతారు అనగా మహాత్ములు తమకీర్తిని గురించి గొప్పగా వినటానికి ఇష్టపడరు అని భావం .ఆత్మ ప్రశంస నచ్చని మా స్వామి ఇతరుల దోషాలను గుణాలు అని ఎలాచేప్తారు ?అయినా అవసరం వచ్చినప్పుడు చెప్పక తప్పదు .ఒకవేళ మా స్వామి పందిని చంపక పోయి ఉన్నట్లయితే ,ఏమయ్యేదో అనే భయవార్త చెప్పరాదు .దేవుడు నీకు అలాంటి ఆపద కల్పించరాదు-‘’దుర్వచనం తదథ మాస్మభూనృగ-స్తయ్యసౌ యదకరిస్య దోజసా –నైవ మాశు యది వాహినీ పతిః-ప్రత్యపత్స్వ త శితేన పత్రిణా’’.ఇద్రుని వజ్రాయుధం లా బలీయమైన ఈ వరాహాన్ని మాస్వామి కిరాతపతి తప్ప ఎవరూ చంపలేరు-‘’కోన్విమం హరి తురంగ మాయుధ స్థేయసీం దధత మంగ సంహతిం –వేగవత్తర మృతే చమూ పతే –ర్హంతు మార్హృతి శరేణ దంష్ట్రిణ౦’’
మా కిరాత ప్రభువు ప్రాణ సంకటం లో కూడా ఉపకారం చేస్తాడు .అసలు ఆయన నీ మిత్రుడే అన్న సంగతి నీకు తెలుసా ?అతనితో విరోధం పెట్టుకోవటం సజ్జనులకు ఆశ్రయమైన కృతజ్ఞత ను కాదనటమే . కృతఘ్నుడివి కావద్దు –‘’మిత్ర మిష్ట ముపకారి సంశయే –మేదినీ పతిరయం తథా చతే-త౦ విరోధ్యభవతా నిరాసి మా-సజ్జనైక పతిః-కృతజ్ఞతా ‘’.విజయం కోరేవారికి మిత్రలాభం అన్ని సంపదలకంటే గొప్పది .సంపదలు కష్ట సాధ్యాలు .సాధించినా నిలవవు .మిత్రలాభం ఉపకారం తో తేలికౌతు౦ది.రక్షించటం కష్టం కాదు .అది మనల్ని రక్షిస్తుంది .చివర్లో సుఖమిస్తుంది –‘’లభ్య మేక సుకృతేన దుర్లభా –రక్షితార మను రక్ష్య భూతయః –స్వంతమంత విరసా జిగీషతాం –మిత్ర లాభ మను లాభ సంపదః ‘’.దన సంపదలు చంచలాలు.నశి౦చేవికూడా .భూమి బలవంతులకే స్వాధీనం .స్థిరమైనవాడు ఐన మాస్వామి స్వయంగా వస్తే అవమాని౦చ వద్దు .అంతమంచి స్నేహితుడు దొరకటం నీ అదృష్టమే –‘’చంచలం వసు నితాన్తమున్నతా –మేదినీ మపి హరంత్యరాతయః –భూధర స్థిరము పెయ మాగత౦-మావ మంస్తసుహృదం మహీపతిం ‘’.
నువ్వు శత్రు సంహారానికే తపస్సు చేస్తున్నావు .మోక్షం కోరేవారికి ఆయుధాల అవసరం లేదు కదా .మా కిరాత రాజు స్నేహం చేస్తే ,నీ తపస్సు ఫలిస్తుంది .మా రాజు వద్ద గుర్రాలు పుట్టే చోటు ,ఏనుగుల ఉత్పత్తి స్థానమైన అడవి ,రత్నాల గనులు చాలా ఉన్నాయి .బంగారు బాణాలు ఎందుకు ?.మా రాజు అవమానం మాత్రం సహి౦చలేడని గ్రహించు –‘’వాజి భూమి ‘’రిభారాజ కాననం -.సంతి రత్న నిచయా శ్చ భూరిశః –కా౦చనేన కిమివాస్య పత్రిణా-కేవలం న సహతే విలంఘనం ‘’.ఇతరులు గర్వంతో దుమ్ము రేపినా,మా ఏలిక సహించలేడు .ప్రార్ధిస్తే ప్రాణాలైనా ఇస్తాడు .అతడికి ధనంతో పనేమిటి ?-‘’సావ లేప ముప లిప్సితే పరై-రభ్యుపైతివికృతిం రజస్యపి – ఆర్థితస్తు న మహన్సమీహతే –జీవితం కిము ధనంధనాయితుం ‘’.కనుక మా రాజు బాణం అయనకిచ్చి,శ్రీరామ సుగ్రీవ మైత్రి లాగా దైవికంగా కలిగిన ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవటం శ్రేయస్కరం .ఉభయుల మైత్రి మంచిది .-‘’తత్తదీయ విశిఖాతిసర్జనా-దస్తు వాంగురు యాదృచ్ఛ యాగతం-రాఘవ ప్లవగ రాజ యోరివ-ప్రేమ యుక్త మితరేతరాశ్రయం ‘’.నీతో అబద్ధం చెప్పటం మాకు ఇష్టం లేదు .తపస్వుల బాణాలు తీసుకొనే కోరికమాకెందుకు ?మా దగ్గర ఇలాంటి బాణాలు ఎన్నో ఉన్నాయి .అవివజ్రాయుధం కంటే గొప్పవి .నీ బాణాలంటివి ఆయన కావాలనుకొంటే కోకొల్లలు వచ్చి పడతాయి .నీ లాంటి మహానుభావులు మిత్రత్వం తో యాచిస్తే ,ఈ భూమండలాన్నే జయించి ఇవ్వగలడు.-‘’మార్గణై రథ తవ ప్రయోజనం –నాథ సేకిము పతింన భూభ్రుతః-తద్విధం సుహృద మేత్య సోర్ధినం –కిం న యచ్ఛతివిజిత్య మేదినీం ‘’.బ్రాహ్మణ చాపల్యం తో నువ్వు చంపిన పంది మాస్వామి ఎన్నుకొన్నది .దీన్ని మా రాజు క్షమించడు .ఆలోచన లేకుండా చేసే అపరాధం అజ్ఞానాన్ని దాచేస్తుంది .ఆ౦టే తెలివి లేని వారి తప్పు తప్పు కాదు అనిభావం . బ్రాహ్మణ కులం, కాషాయ వేషం, తపస్సు విరుద్ధమైనవి. ఇలాంటి తప్పు మళ్ళీ చేయకు .చెడు దారిలో నడిచే వారి చెడు బుద్ధి ఇహపరాలకు చేటు తెస్తుంది –‘’జన్మ మేష తపసాం విరోదినీం –మా కృథాఃపూన రమూమ పక్రియాం-అపదేత్యు భయలోక దూష ణీ-వర్తమాన పథేహి దుర్మతిం’’.
ఇప్పుడు పితృ దేవతలకు శ్రార్ధం లేదు. దేవతార్చన కూడా లేదుకదా ఎందుకు ఆపందిని కొట్టావు ?దాని మానాన దాన్ని పోనిస్తే బాగుండేది కదా .చూడటానికి సత్పురుషుడు లాగా ఉన్నావు .చాంచల్యం వదిలేయి .నీ అపకారాలు ఎప్పుడూ ఎవరు సహిస్తారు ?ప్రళయకాల వాయువులు సముద్రాలకు క్షోభ తెచ్చినట్లు ,ప్రతిసారీ చేయరాని పనులు చేస్తే, ధైర్యవంతులు కూడా క్షోభకు గురౌతారు .మా రాజు అస్త్రవిద్యలో అసామాన్యుడు .ఏదో కొండల్లో కోనల్లో ఉండేవాడు కదా అని తిరస్కరించకు .ఇంద్రుడు ఈ పర్వతాన్ని రక్షించమని స్వయంగా కోరటం వలన ఇక్కడ ఉంటున్నాడు మా రాజు .-‘’అస్త్ర వేదవిదయం మహీ పతిః-పర్వతీయ ఇతి మావా జీ గణః-గోపితుం భువ మిమాం మరుత్వతా –శైలవాస మను నీయ లంభితః ‘’.ముని విషయం లో తప్పు కాస్తాను అని మా స్వామి చెప్పాడు .కనుక నువ్వు కూడా ఆ బాణాన్ని ఇచ్చేసి స్నేహం చేసి, సకల సంపదలు పొందు .-‘’తత్తితిక్షితమిదం మయా మునే –రిత్య వోచత వచశ్చమూ పతిః-బాణ మత్రభవతే నిజం దిశ-న్నాప్నుహి త్వమపి సర్వ సంపదః ‘’.ఎవరివలన శుభాలు , సద్గుణాలు,సదాచారం అలవడుతాయో ,ఆపదలు తొలగి పోతాయో అలాంటి అనేక గుణాలున్న సత్సా౦గత్యాన్ని కల్గించే స్నేహాన్ని ఎవడు వదులు కొంటాడు స్వామీ .వాడియైన అస్త్రాలు ,సర్పాలతో కూడిన తరంగాలున్న సముద్రం వంటి మా కిరాత రాజు చెలియలి కట్ట ఆపి నట్లు, అదుగో ఆ చెట్ల చాటున సమయం కోసం నిలిచి ఉన్నాడు చూడు ‘’అని రాయబారి తన సేనాపతిని చేతితో చూపాడు –‘’ దృశ్యతామయ మనోకహాన్తరే-తిగ్మహేతిపృతనాభి రన్వితః –సాహి వీచిరివ సింధు రుద్ధతో –భూపతిః సమయ సేతు వారితః ‘’.ఓ దీశాలీ !అదుగో మాప్రభువు స్థిరంగా ఇంద్ర ధ్వజ శోభకంటే గొప్పగా ,ఆది శేషునిలాగా స్థూలంగా ఉన్న ధనుస్సు ఎక్కు పెట్టి సిద్ధంగా ఉన్నాడు .అతని కోరిక మన్నించి స్నేహం చేస్తే నీకోరికలన్నీ తీరుతాయి ‘’అన్నాడు కిరాత శివ దూత .
సశేషం
మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -13-12-20-ఉయ్యూరు