కిరాతార్జునీయం-.29
చతుర్దశ సర్గ -3
అర్జున శరీరకాంతి మరకత మణి లా పచ్చగా ఉంది .ఉదార ఆకారం అన్నిటినీ తిరస్కరిస్తుంది నీటి తరంగాలపై ప్రకాశించే సూర్యుడిలా ఉన్నాడు .బదరీ వన నారాయణ సహచరుడైన నరునిలా ఉన్నాడు –‘’మానుష్య భావే పురుషం పురాతనం –స్థితం జలాదర్శ ఇవా౦శు మాలినీం ‘’.సుకృత ఫలితం తో విశ్వ విజయ పరాక్రమం తో భాసిస్తున్నాడు .అలాంటి అర్జునుడి దగ్గరకు గ్రీష్మం చివర నీటితో నిండిన మేఘాలు ఆకాశాన్ని కమ్మేసినట్లు శివ సైన్యం వచ్చింది .’’గణాఃసమాసేదుర నీల వాజిం –తపాత్యయే తోయ ఘనా ఘనా ఇవ ‘’.సేనలో ప్రతివాడూ ఈ అర్జునుని జయిస్తానని ప్రగల్భాలు పలుకుతున్నాడు.కానీ చూడంగానే ప్రతాపం చల్లారి పోయింది .ఏం చేయాలో తోచలేదు .మహానుభావత్వం పౌరుషాన్ని నశి౦ప జేయటం సహజమే కదా –‘’యయుఃక్షణాదప్రతిపత్తి మూఢతాం –మహాను భావః ప్రతి హంతి పౌరుషం ‘’.గణాలు పరస్పర సహకారం తో అర్జునిపై తలపడ్డారు .పనులసిద్ధికి సహాయ సహకారాలు కావాలికదా గోప్పవారుకూడా సంఘ వృత్తి నే ఆశ్రయిస్తారు –‘’మహోదయానామపి సంఘ వృత్తితాం-సహాయ సాధ్యాః ప్రది శ౦తి సిద్ధయః ‘’ సైన్యం నుంచి ఒకేసారిగా అందరి బాణాలు ప్రయోగింప బడి అర్జునునిపై దూసుకొచ్చాయి .వనం నుంచి వేరొక వనానికి వెళ్ళే పక్షుల సముదాయంగా ఉంది ఆ బాణ పరంపర.గుహల ప్రతిధ్వనితో ధనుష్ఠ౦కారాలతొ దిక్కులు పిక్కటిల్లే ధ్వని కలిగింది.అడవి చెట్లను కంపి౦ప జేస్తూ భూమి ఆకాశాలను కప్పేస్తూ బాణ వర్షం కురుస్తోంది .సుడిగాలితో వర్ష ధారగా ఉంది .అర్జునుడు సామదాన భేద ఉపాయాలతో సమానమైన బాణాలు వేస్తున్నాడు .అవి శత్రువుల చూపులకు అందటం లేదు. ఎంతైనా దూరం వెళ్లి ఫలితాన్నిచ్చేవి, ప్రతీకారం తీర్చుకొనేవి .అందంగా విశాలం గా ఉన్నవిఆ బాణాలు . –‘’గతైఃపరేషామ విభావ నీయతాం –నివార యద్భిర్విపదంవిదూరగైః-భ్రుశం బభూవోపచితో బృహత్ఫలైః-శరైరుపాయైరివ పాండు నందనః ‘’..ఆ బాణాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో, తెలీక కిరాతులు తెల్లమొహాలు వేస్తున్నారు. ఆకాశం భూమి దిగ్మండలం లను నుంచా అనుకొని చివరికి అర్జునుడి శరీరం నుంచే వస్తున్నాఏమో అనికూడా అనుకొన్నారు .అక్కడ ఎంతమంది సైనికులున్నారో అంతమందినిగురిచూసి కొట్టిన అర్జున బాణ సమూహం శంకర సైన్యాన్ని తల వాల్చుకొనేట్లు చేసింది .చంద్ర కిరణాలు సోకగానే పద్మవనం ముడుచుకున్నట్లుగా ఉంది –‘’సముజ్ఘితా యావదరాతినిర్యతీ –సహైవ చాపాన్ముని బాణ స౦హతిః-ప్రభా హిమాంశోరివ పంకజావలిం –నినాయ సంకోచ ముమాపతే శ్చమూం ‘’.చంపటం నరకటం పడేయటం మొదలైన వాటికీ వేరువేరు గా వ్యర్ధం కాని వేగం కల సూటిగా లక్ష్యాన్ని తాకే బాణ ప్రయోగానికి కిరాత సైన్యం ప్రతీకారం తీర్చుకోలేక పోయింది .అనేక చోట్ల ఉన్న శివ సైనికులు ఒక్క చోటనే ఉన్న అర్జున వేడి బాణాలకు అనేక చోట్ల ఉండే ప్రజలు ఒకే చోటు నుంచి వేడి కిరణ ప్రసారం చేస్తున్న సూర్యుడిలాగా ఉన్నాడు –‘’శివధ్వజిన్యః ప్రతి యోధ మగ్రతః –స్ఫురంత ముగ్రేషు మయూఖ మాలినం –తమేక దేశస్థ మానేక దేశగా-నిదధ్యురర్కం యుగవత్ప్రజా ఇవ ‘’.అర్జున బాణ సేనతో శివసేన సుళ్ళు తిరిగి కూలి ,వేగంగా వీచే సుదడిగాలి తో గ్రీష్మ ధూళి అంటి సుళ్ళు తిరిగినట్లుగా ఉంది .శివ సేన తమలో తాము’’ఈముని తపోబలం తో అదృశ్య శరీరం పొంది ,అన్ని వైపులనుంచి బాణాలు కురిపిస్తున్నాడా ?లేక మన బాణాలే మళ్ళీ వెనక్కి తిరిగొచ్చి మనపై ‘’బూమరాంగ్ ‘’అయి పడుతున్నాయా ?ఏమీ అర్ధం కావటం లేదు ‘’అని మైండ్ బ్లాంక్ అయి నిర్వీర్యం పొందారు –‘’తపో బలేనైవ విధాయ భూయసీ –స్తనూర దృశ్యాః స్విదిషూన్నిరస్యతి-అముష్య మాయా విహతంనిహంతి నః –ప్రతీపమాగత్య కిము స్వమాయుధం ‘’
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -16-12-20-ఉయ్యూరు