హితం పలికే శ్రీధర్
శ్రీ శ్రీధర్ ఎర్రోజు ఎవరో నాకు తెలియదు కాని ఆయన రాసిన ‘’ఈశ్వరమ్మ శతకం ‘’మాత్రం నాకు ఆయనే ఈ నెల 8న పంపగా బహుశా నాలుగైదు రోజుల క్రిందట నాకు అందింది కాని నేను చూడలేదు .నిన్ననే చూసి ఆయనకు ధన్యవాదాలుచేప్పాను .నాస్పందన తెలియజేయమని చిన్న నోట్ కూడా పుస్తకం లో పెట్టారు .ఇప్పుడే శతకం చదివి నా మనోభావం తెలియజేస్తున్నాను .
లెక్కలలో ఎం .ఎస్ .సి.చేసి లెక్కలమాస్టారుగా సమర్ధత చూపి,ప్రస్తుతం ,తెలంగాణా లక్సెట్టిపేట ప్రభుత్వ ఉన్నతపాఠశాల గజిటెడ్ హెడ్ మాస్టర్ గా పని చేస్తున్నారు పగోజి మల్లవరం లో పుట్టిన శ్రీధర్ .తన మాతృమూర్తి ఈశ్వరమ్మ గారికి ఈ పద్య శతకం అంకితం చేసి ఋణం తీర్చుకొన్నారు .లెక్కల మేష్టారు పద్యాలు రాయటం ఎయిత్ వండర్ అనిపిస్తుంది .పద్యం లో ఛందస్సు అంతా అక్షరాల లెక్కే కనుక అది వచ్చినవారికి ఇది అత్యంత సులువు .అందుకే చక్కగా సాగింది శతక రచన .సమకాలీన విషయాలన్నీ చోటు చేసుకొన్నాయి ‘’ఈశ్వరమ్మ సుతుడు హితము పలుకు ‘’అన్న ‘’మకుటాయ’’మానమైన శతకమిది . ఈశ్వర సుతుడుంటే వినాయకుడు ,కుమారస్వామి అందులో అమ్మకొడుకు గణపతి అయ్యకొడుకు శరవణుడు .ఈయన ఈశ్వరమ్మ సుతుడుకనుక సిద్ధి బుద్ధి లకుఅధిపతి ఐన విఘ్నేశ్వరుని పలుకు లోక హితమేకాక,లోకైకహితమూ ఔతు౦దనటం లో సందేహం లేదు .అందుకే 80పేజీల పుస్తక౦ లో సగానికి పైనే 48పేజీలలో ఆంధ్రదేశం లో లబ్ధ ప్రతిష్టు లైన కవీశ్వరుల,హితైషుల అవధాన సరస్వతుల అభినందన ఆశీః వర్షం కరిసింది .ధన్యజీవి ఈ కవి .
‘’పదము పదములోన పటిక బెల్లము నిండి-పచ్చకప్పురంపు పసను కలిగి –కాజు ,పిస్త,చెర్రి కలయిక కవనమ్ము కవనమ్ము-ఈశ్వరమ్మ సుతుడు హితము పలుకు ‘’అని కవిత్వ రహస్యం చెప్పగలిగాడుకవి .ఐతే ఇందులో ఆధునికంగా కాజు పిస్తా,చెర్రి కలిపి మాధుర్యం పె౦చాడు .ముందుగా తలిదండ్రులు, బంధువులన౦దరికీ పద్య నీరాజనం పట్టాడు .గత౦ మార్చటానికి ఘటన ఒక్కటి చాలు ,మనమే ముక్కలమైతే మతం ఎలా బతుకుతుంది ,ఆడవారి పై అలుసుభావం వద్దు ,ఒక్కపల్కరింత ,పట్టెడన్నం తో ప్రేమ పంచాలి ,పాల్తీన్ సెల్లు సొల్లు ల వ్యామోహం పై మెత్తని చివాట్లు ,గూడు మారితే గుణ౦ మారదు ,రైతన్న అన్నదాత ,గద్దె నెక్కి జనుల గతులు మరవటం ,జలం గరళమైతే జనుల మనుగడ ఎలా సాధ్యం ,అనే జవాబులేని ప్రశ్నా సంధానం చేశాడు .శక్తి పొదుపు అంటే శక్తి సృష్టి ,అడవి సంపద లేకపోతె తే అభ్రం ఎలా కురుస్తుంది అన్న మౌలిక పర్యావరణ సంబంధ ప్రశ్న , ,పరువు లేనివాడి బతుకు నరకం ,మత సహనం కన్నా మతమే లేదు దేశామాతకంటే దేవత లేదు అనే సుద్దులు చెప్పాడు .ఆలికన్నా ఆత్మీయులు లేరు ,పసుపు ముద్దకన్న పసయున్న వనరు లేదు ,ఆడవారు లేకపోతే సృష్టి ఆగే పోతుంది ,అనే నీతులూ బోధించాడు .’’కలలు కనే వేళ ,కష్టకాలం లో తల్లిభాషలోనే తల్లడిల్లే మనిషి మాతృ భాష మరువరాదని ,గాడ్జెట్ వలలో పడవద్దనీ ,ఉల్లి ధర విని ఉల్లం ఆగిపోతుందనే చమత్కారం ,అన్నిమతాలు చెప్పేది సత్యధర్మ శాంతి సహనాలే అనే విశాలభావం ,రాగి జావ చేసే చలువ రంగు నీళ్ళు చేయవనే ఎరుక ,వనాలు లేని భూమి వసుధ ఎలా అవుతుందనే ఘాటైన ప్రశ్నా ,’’నీటి పూరీ ‘’అదేనండీ పానీ పూరీ మురికి వాడల్లో తింటుంటే వ్యాధులు రాకేం చేస్తాయని ఆరోగ్యసూత్రం ,ఉచ్చ నీచాలుమరచి వెండితెర వేల్పుల ఆరాధన ,పై విసుర్లు ,ఇందులో పుష్కలం .కవిత్వానికి మరోనిర్వచనంగా ‘’రసము లెన్నొజూపు రసధార కవనమ్ము’’ఇచ్చాడు కవి .గురువు సుద్దులు నేర్పే చుక్కాని .’’వాట్సపు గురువులు’’వాస్తుతో సహా అన్నీ చెబుతుంటే అసలు గుగ్గురువులు అటకెక్కినారని ‘’మందలింపు ,కుత్సితాలు నిండి కుళ్ళిన ‘’మనసు కడుగు టెట్లుమలినమ్ము తొలగించ ‘’అనే నిర్వేదం ,సూర్యుడికి రాత్రి చంద్రుడికి పగలు అచ్చిరావు కనుక’’ వేళకాని వేళ విలువలు అలామారుతాయి అంటాడు అనువుగాని చోట అధికులమనరాదు అన్నదాన్ని గుర్తుకు తెస్తాడు .మళ్ళీ మరో సారి మాతృ వందనం ‘’అమ్మ యనిన దైవ మమ్మయె గురువురా –అమ్మలేక జీవమవని లేదు –ఆమ్మ నెట్లువిడుతు వాశ్రమముల యందు –ఈశ్వరమ్మ సుతుడు హితము పలుకు ‘’చేశాడు .122పద్యాల శతకానికి కవి చిత్రాలకు తాను రాసిన అయిదు పద్యాలను కూడా చేర్చి, కానుక చేశాడు ..ఈశ్వరమ్మ ,తల్లీ పిల్లా ,వెలుగుతున్న కొవ్వొత్తి ,సిరా బుడ్డి నెమలి ఈక కలం? తో అందమైన ముఖ చిత్రం శతకానికి మరింత వన్నె చేకూర్చింది .ధారాశుద్ధి ,,సరళ మంజుల పదజాలంతో శతకం రాణించింది మరిన్ని కవితా సంపుటాలు శ్రీధర్ వెలువరిస్తాడని ఆశిద్దాం .
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -18-12-20-ఉయ్యూరు