కిరాతార్జునీయం-.34
16 వ సర్గ -1
కిరాత వేష శివుని అసాధారణ రణనైపుణ్యాన్ని చూసిన అర్జునుడికి కోపం వచ్చి,తాను యుద్ధం లో గెలవక పోవటానికి కారణాలు ఊహించటం మొదలు పెట్టాడు -ఇలా అనుకొన్నాడు ‘’ఈ యుద్ధంలో మదజలం కారే పర్వతాలవంటి,యుద్ధ కష్టం తెలిసిన ఏనుగులు కనిపించటం లేదు .ఎత్తైన పతాకాలతో రంగులతో సూర్యకాంతిని నానా రంగులుగా మార్చే గంభీర ధ్వని ఉన్న రథ సమూహాలు లేవు .ప్రాసకుంతం వంటి యుద్ధ ఆయుధాల అలల్లాగా చామరాలు అనే నురగ వంటివి అయిన అశ్వరాశి సముద్ర జలరాశి లా మర్యాద దాటి చెలియలికట్టను కప్పివేయటం లేదు .,’’చంపండి నరకండి ‘’అంటూ భీకరంగా అరచే యోధులు శత్రువులపై వదిలే శస్త్రాస్త్రాలు సూర్యకిరణాలతో కలిసి ప్రతిఫలించి మెరుపుల్లా ఆకాశం లో వదలటం లేదు .వీరుల్ని చంపటానికి వచ్చే యముడి ఎడతెగని పొగ లాగా ,అంతటా వ్యాపించిన కాంతి సమూహంతో ధూళి గుర్రాల ,రథాలవేగం తో యెగిరి ఆకాశం లో చేరటం లేదు .గాడిద రంగు భూ ధూళి కంటి చూపును అడ్డుకోగా ,పరాక్రమ వీరుల్ని వరి౦చాలనే ఉత్సాహమున్న దేవాగనలకు పగలే రేయి అనే భ్రాంతి కలగటం లేదు .రథ చక్ర ఘురఘుర ధ్వని ,గుర్రాల సకిలింపులు ,మదగజ ఘీంకారం , ధ్వని చేస్తున్నభయంకరంగా లేదు .భేరీ వాద్యాల ధ్వని కూడా ప్రతిధ్వని ఇవ్వటం లేదు .యుద్ధం లో కీర్తి ,పౌరుష లోభమున్నవారు శత్రువులచే ఛాతీపై గాయపడిన వారికి యుద్ధ విఘ్నం కలుగ కుండా వర్ష ధారల్లాంటి చల్లదనాన్ని ఏనుగులు తొండం తో చిమ్మే తుపుర్లు పోగొట్టటం లేదు .అంటే అవి మాటికీ చిమ్మటం వలన వారికి స్వస్థత కలిగిందని భావం .రక్తపుటేరులు పారుతూ సేన మార్గానికి ఇబ్బంది కలిగిస్తున్నాయి .కొన్ని ఎండిన బురద గుంటల్లాగారక్త ప్రవాహం పైకి కనపడటం లేదు –‘’ఆసృఞదీనా ముపచీయ మానై-ర్విచార యద్భిఃపదవీ౦ ధ్వజిన్యాః-ఉచ్ఛ్రాయ మా యాంతి న శోణితౌఘైః-పంకైరివాశ్యానఘనైస్తటాని’’.ఏనుగు దంతాలతో గాయపడిన సాహస వీరులకు ప్రియురాలి ఒడిలాగా చల్లగా ,ఉండే ఆకాశం నుంచి వక్షస్థలం లో పడిన మందార మాల శాంతి కలిగించటం లేదు –నేహ ప్రమోహం ప్రియ సాహసానాం –మందార మాలా విరలీ కరోతి’’ఏనుగు తొండాలనుంచి పడిన నీటి తుంపర్లు మావటి వాళ్ళ కవచాలలోని మణికాంతులతో కలిసి ఇంద్ర ధనుస్సు ఏర్పడటం లేదు –‘’అర్క ద్విషో న్మీలిత మభ్య్యు దేతి,- న ఖండ మాఖండల కార్ముకస్య ‘’. , ,
రెక్కలున్న మైనాక పర్వతం లాగా శత్రువుల ఏనుగు మధ్యలో ప్రవేశిస్తే ,అటూ ఇటూ పారిపోయే సేన ,సముద్రం తో సమానంగా తరంగాలుగా విడిపోయి కోలాహలం కలిగించటం లేదు .గజ సైన్యం పైకి వేగం గా దూసుకొస్తున్న రథికుల మార్గాన్ని సమూలంగా నరకబడిన ఏనుగుల తొండాలు అడ్డు పెట్టటం లేదు –‘’అమూల లూనై రతి మన్యు నేవ –మాతంగ హస్తైర్వియతే న పంథాః.’’.తోమర వాద్యానికి కట్టిన నెమలి ఈకల కట్ట ,పద్మ మాలాలంకారమైన ప్రియురాలి కేశాలంకారంగా ఉండి,మావటి వాళ్ళ వక్షస్థలాన్ని కప్పేయటం లేదు .ప్రళయం లో లెక్కలేని వీరులు చనిపోతే ,నాలుక ఆడిస్తూ ముల్లోకాలను కబళించే మృత్యు దేవత నోరు తెరవటం లేదు –‘’’’ఉజ్ఘత్సుసంహార ఇవాస్త సంఖ్య-మహ్నాయ తేజస్విషు జీవితాని –లోక త్రయాస్వాదన లోల జిహ్వాం – న వ్యాద దాత్యాననమత్ర మృత్యుః’’.’’నా శక్తి ఎంతటి పరాక్రమ వంతుడి నైనా ధ్వస్తం చేసేది .మరి హీనకిరాత యుద్ధం లో చంద్రుని కాంతి లో సూర్య ప్రభ లాగా ఎందుకు క్షీణించింది ?’’-శక్తిర్మమా వస్యతి హీన యుద్ధే –సౌరీవ తారా దిపధామ్నిదీప్తిః’’.’’లేకపోతే ఇదేమైనా మాయా ?నా భ్రమా ?నా పరాక్రమం నశించిందా ?నేను నేనేనా ?గాండీవ బాణాలు ఇదివరకటిలా పరాక్రమం చూపట్లేదేమిటి ?-‘’మయా స్విదేషామతి విభ్రమోవా –ధ్వస్తం ను మే వీర్య ముతాహమన్యః –గాండీవ ముక్తా హియథా పురా మే పరాక్రమంతే న శరాః కిరాతే’’.’’ఈ కిరాతుడు ధనుష్ఠంకారం తో ఆకాశాన్ని రెండుగా చీలుస్తున్నాడు .ఇతడుకిరాతుడు అయి ఉండడు.వేషభాషలు మాత్రం అలానే ఉన్నాయి చేష్ట మనిషి రూపం దాల్చినవాడిదిగా ఉంది .’’నూనం తథా నైష యథాస్య వేషః –ప్రచ్ఛన్య మాప్యూహతే హిచేస్టా’’
అతడి ధనువు తో రోషం ధ్వనించింది .అల్లెత్రాడు ఒక్కసారి మాత్రమే లాగి నట్లుంది అమ్ములపోదిలోంచి బాణం తీయటం, సంధించటం ఏకకాలం లో జరిగినట్లుది .పిడికిలి పట్టి ప్రయోగించినట్లు కూడా లేదే ?-‘’ధనుః ప్రబంధ ధ్వనితం రుషేవ-సకృద్వికృష్టావితతేవ మౌర్వీ –సంధాన ముత్కర్షమివ వ్యుదస్య –ముష్టేరసంభేద ఇవాప వర్గే ‘’.అతడి భుజాలు కిందికి వంగినా మెడ ఏమాత్రం కదలటం లేదు, ప్రయాస లేదు .ముఖ వికారాలు లేకుండా చంద్రకాంతి లా ఉన్నాడు –‘’అమ్సావ వష్ట బ్ధనతౌ సమాధిః-శిరోధరాయా రహిత ప్రయాసః –ధృతా వికారా స్త్యజతా ముఖేన –ప్రసాద లక్ష్మీఃశ్శ లాంఛ నస్య ‘’.యుద్ధం లో కాళ్ళు అటూ ఇటూ మార్చినా శరీరం చలనం పొందటం లేదు .చలనమున్నా లేకపోయినా బాణాల లక్ష్యం ఒకే రకంగా ఉంది .శత్రువు లోటుపాట్లు తెలుసుకోవటం ,తన లొసుగులు గుర్తించి వెంటనే సరి దిద్దుకోవటం అనే రెండు గొప్ప గుణాలు భీష్మ పితామహునిలో ,గురు ద్రోణాచార్యునిలో కూడా లేవే !అలాంటప్పుడు ఒక కిరాతుని విషయం లో ఎలా సంభవించింది ?’’-‘’పరస్య భూయాన్వివరే భియోగః –ప్రసహ్య సంకర్షణ మాత్మ రంధ్రే-భీష్మేప్యసంభావ్య మిదం గురౌ వా –న సంభవత్యేవ వనే చరేషు ‘’.ఈ రకంగా అసాధారణ పరాక్రమ శీలి ,యుద్ధమదోన్మత్తుడుఅయిన కిరాతుని పరాక్రమాన్ని దివ్యాస్త్రసంధానంతోనే నివారించాలి .చిన్న శత్రువైనా ,రోగం లాగా అపకారమే కలుగుతుంది .ఇతడు గొప్ప శత్రువు కనుక ఉపేక్ష పనికి రాదు అని భావం .అర్జునుడికి మైండ్ బ్లాంక్ అయి ఇన్ని రకాలుగా ఆలోచించాడు . తర్వాత ఎలాంటి ప్రత్యేక అస్త్రం ప్రయోగించాడో పార్ధుడు రేపు తెలుసుకొందాం .-‘’ అప్రాకృత స్యాహవ దుర్మదస్య –నివార్య మస్యాస్త్ర బలేన వీర్యం-అల్పీయసో ప్యామయ తుల్య వృత్తే-ర్మహాపకారాయ రిపోర్వి వృద్ధిః. ‘’
సశేషం ‘
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -23-12-20—ఉయ్యూరు .