కిరాతార్జునీయం-.36
16 వ సర్గ -3(చివరి భాగం )
అర్జున సర్పబాణ సముదాయం వలన సిద్ధులు ,పక్షులు సంచరించే మార్గం ఆగిపోయి ,అగ్ని అన్ని వైపులకు వ్యాపించటం చేత దిక్కులు పొగతో నిండిపోయాయి .శత్రువులు ముట్టడించిన నగరం లాగా ఆకాశం కనిపించింది .-’’’వృతం నభో భోగి కులైరవస్థా౦-పరోపరుద్ధస్య పురస్య భేజే ‘’.శివుడు వెంటనే గారుడాస్త్రాన్నిసర్పాల బాధ ను ,న్యాయ రీతిగా శత్రువ్యూహం విఫలం చేసినట్లు ప్రయోగించాడు ‘’నేతా నయనేవ పరోపజాతం –నివారయామాస పతిః పశూనాం ‘’.అనిమేషులైన స్వర్గలోక వాసుల నేత్రాలకు కల్గిన అవరోధాన్ని గారుడ పక్షుల సమూహం మెరుపు వేగం తో ప్రకాశం కలిగించి౦ది.-‘’ప్రతిఘ్న తీభిఃక్రుతమీలితాని –ద్యులోక భాజామపి లోచనాని –గరుత్మతాం సంహతి భిర్వి హాయః –క్షణ ప్రకాశాభి రివావతేన ‘’ .గరుడ పక్షుల రెక్కల విచిత్ర కదలిక తో గాలి ,అడవి చెట్ల ఆకులు రాలుస్తూ ,వాటిని ఆకాశం లో అల౦క రించటానికా అన్నట్లు మోసుకెళ్ళింది.మనః శిలల ముక్కలకాంతి తో వెనకాల విశాల వక్షస్థలం తో అడ్డు కాబడిన ఆకాశ మండలం గరుడ పక్షుల ముందు పరిగెత్తుతున్నట్లుగా ఉంది .వేడిగా వీస్తున్న గాలులవలన కదులుతున్న శిఖరాల హిమవత్పర్వతం ,మదిర లాగా ఎర్రగా ప్రకాశిస్తున్న గరుడ పక్షి రెక్కల కాంతిని, గుహాముఖాలతో తాగి ,మత్తుగా కదలింది –‘’దరీ ముఖారాసవ రాగ తామ్రం-వికాసి రుక్మచ్ఛదధామ పీత్వా –జ్వనలా ఘూర్జిత సాను జాలో –హిమాచలః క్షీణ ఇవాచ కంపే ‘’ .రాత్రి,పగలు కలిసిన సంధ్యాకాలం లాగా ప్రకాశిస్తూ భూమ్యాకాశాలను పసుపు రంగుగా మారుస్తూ,,సూర్యుని కప్పేసే ఆ గరుడ పక్షులు ,నాలుగు వైపులా అడవులలోని నీడను లేకుండా చేశాయి . .-‘’ప్రవృత్త నక్తం దివా సంధి దీప్తై-ర్నభస్థలం గాం చ పిశంగ యద్భిః-అంతర్హితార్కైఃపరితః ,పతద్భి-చ్ఛాయాఃసమాచి ,క్షిపిరే వనానా౦’’.సర్ప సమూహం గరుడ సమూహం తో,మహా యజ్ఞం లో కర్మలోపం జరిగినప్పుడు ప్రాయశ్చిత్తం తో శాంతించినట్లు శాంతించింది –‘’మహాధ్వరే విధ్యపచార దోషః –కర్మాంత రే ణేవ మహోదయేన’’.
సర్పాస్త్రం సమాప్తికాగా అర్జునుడు ఇంధనం లేకుండా ప్రజ్వలించే ఆగ్నేయాస్త్రం సంధించాడు –‘’అనిన్ధనస్య ప్రసభం సమన్యుః-సమాదేస్త్రం జ్వలనస్య జిష్ణుః’’.అన్నివైపులకు వ్యాపిస్తూ ,మంటలతో మేఘాలను దాటి,వేట కోసం సింహం దూకినట్లు ప్రాణ సంహార కాంక్షతో అగ్నిపైకి ఎగసింది –‘’ఆయస్త సింహాకృతి రుత్పపాత- ప్రాణ్యంత మిచ్ఛన్నివ జాత వేదాః’’.తన తేజస్సుతో సూర్యకాంతిని ఛేదిస్తూ ,నిప్పురవ్వలు రాలుస్తూ బండరాళ్ళు బద్దలయ్యే ధ్వనితో అగ్ని మండింది .అగ్నికి గాలి తోడై బంగారు ప్రాకారాల్లా , ఎత్తైన శిఖరాల పర్వతాల్లాగా ,సువర్నమయమైన పురంవెల, మోదుగు చెట్లు వనాల్లా అన్ని చోట్లా వ్యాపించింది .కాటుక లాంటి నల్ల మేఘాలు కదిలే చిగురాకులు లాగా యెర్రని అగ్ని మంటలలో మాడి,ముత్యాల్లా శుభ్రంగా కనిపిస్తున్నాయి .ప్రళయాగ్ని లా లోకాన్ని మింగటానికి చాచిన నాలుకలలాగా,కదిలే అగ్ని సమూహాన్ని చూసి ,మేఘాలను పిలిచినట్లు శివుడు వారుణాస్త్రం వేశాడు –పినాకినా హుత మహా౦బు వాహ మస్త్రం పునః పాశ భ్రుతః ప్రణిన్యే’’.వారుణాస్త్రం పెద్దపర్వతాకార౦ తో ,మెరుపులతో ఉన్న మేఘాలు నేలకు జారే ఆకాశ గంగలాగా ఎడతెరిపి లేని ధారలు కురిపించాయి –‘’అధోముఖాకాశసరిన్నిపాతినీ-రసః ప్రసక్తం ముముచుః పయోముచః ‘’
జల వృష్టి తో అగ్ని జ్వాలలు చల్లబడి ,ప్రచండ తేజస్సు నశి౦చగా అగ్ని శరీరం పై ,జలధారలు వేడి చేసిన ఇనుము పై పడి ధ్వని చేసినట్లు ధ్వనించాయి –‘’కృతాస్పదా స్తప్త ఇవా యసి ధ్వనిం –పయోనిపాతాః ప్రథమే వితేనిరే’’.త్వరలోనే ఆ జలధారలు పాకం పొంది నురగలై ,తడికట్టె మండి,పొగ వ్యాపించినట్లు వ్యాపించాయి –‘’వ్రజద్భిరార్ద్రే౦ధన వత్పరిక్షయం జలై ర్వితేనేదివి ధూమ స౦తతిః’’.ఎరుపు నీలం తెలుపు రంగులు కలిగిన తమ జెండాలతో ,ఇంద్ర ధనుస్సు కాంతిని మించిన అగ్ని కాంతులు కలిసి విచిత్రమైన అస్థిరమైన పట్టు బట్ట అందాన్ని పొందాయి –‘’ స్వకేతుభిః పాండు రనీల పాటలైః-సమాగతాః శక్ర ధనుః ప్రభా భిదః-అసః స్థితా మాదధిరే విభావసో –ర్విచిత్ర చీనా౦శుక చారుతాం త్విషః’’.మండుతున్న అగ్ని వర్ష ధారలకు మరంత గంభీర ధ్వని చేస్తోంది .మెరుపులతో కలిసి కాంతి పెరిగింది .అంటే శాంతిస్తున్న అగ్ని అంతకు ముందున్న దానికంటే ఎక్కువై కనిపించింది .
సముద్ర అలల్లాంటి జలరాశులతో చీలి ,అగ్ని కణాలు సాయంసంధ్యాకాంతిపొందిన మేఘ శకలలలాగా కనిపించాయి –‘’ఉపాత్త సంధ్యారుచిభిః సరూపతాం –పయోద విచ్ఛేదలవైః కృశానవః ‘’.గొప్ప పరాక్రమ వంతుడైనా ,సమూలంగా నష్టపోతే మళ్ళీ కోలుకోవటం జరిగే పని కాదు. అగ్ని కూడా ఆ నీటితో అలాగే కుప్పకూలిందని భావం –ఉపైత్యనంత ద్యుతిరప్య సంశయం –విభిన్న మూలో నుదయాయ సంక్షయం –తథా హి తోయౌఘ విభిన్న సంహతిః-న హవ్య వాహః ప్రయయౌ పరాభవం’’.ఆకాశం లో నల్లని కాంతి సమూహంకలమేఘాలు విడిపోగా అగ్ని దహనం చెందిన ఆకాశం వికసించిన నల్లకలువ కాంతి తో శోభించింది –‘’వికసడమల ధామ్నాంప్రాపు నీలోత్పలానాం-శ్రియ మధిక విశుద్దాం వహ్ని దాహాదివ ద్యౌః.
అనేక ఉపాయాలతో అర్జునుడు కిరాత శివుని ఓడించాలని వేసిన అన్ని రకాల అస్త్రాలను శివుడు నీతి నిష్టుడైన వాడి పరాక్రమానికి ప్రతికూల దైవం నష్టం కలిగించినట్లు నస్ట పరచాడు.-‘’ఇతి వివిధ ముదాసే సవ్య సాచీ యదస్త్రం –బహు సమయ రనయజ్ఞః సాదయిష్యన్నరాతిం –విధిరివ విపరీతః పౌరుషం న్యాయ వృత్తేః-సపది తదుపనిన్యేరిక్తతాం నీల కంఠః’’.శివుడి చేత తన అస్త్రాలన్నీ నిరుపయోగం కాగా ,శక్తి తగ్గినా మళ్ళీ బలం పుంజుకొని అర్జునుడు ,అధిక వర్షం కురవటంకోసం,నదీ తటాకాలలోని నీటిని సూర్యుడు గ్రహించినప్పుడు జనం నీటికోసం బావులు చలమలు త్రవ్వి సహాయం తీసుకొన్నట్లు అర్జునుడు తన భుజ బలాన్నే సహాయంగా భావించాడు –‘’వీత ప్రభావ తనురప్య తను ప్రభావః –ప్రత్యాచ కాంక్ష జయినీం భుజ వీర్య లక్ష్మీం –అస్త్రేషు భూతపతి నాప హృతేషు జిష్ణుః-వర్షిష్యతాదిన కృతేవ జలేషు లోకః ‘’
సశేషం
ముక్కోటి ఏకాదశి శుభా కాంక్షలతో
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -25-12-20-ఉయ్యూరు . ,