కిరాతార్జునీయం-.37
17వ సర్గ -1
ప్రయోగించిన అస్త్రాలన్నీ వ్యర్ధం కాగా ,తనప్రియ గాండీవం ద్వారా ధైర్యాన్ని పెంచుకొన్న అర్జునుడిపౌరుషం బాగా అతిశయించింది –‘’ధృతం గురు శ్రీర్గురుణాభి పుష్యన్ –స్వపౌరు షేణేవ శరాసనేన ‘’.గొప్ప పరాక్రమ శీలితో తాను యుద్ధం చేస్తున్నందుకు సంతోషించాడు కాని శత్రువు వృద్ధి బాధించింది .పర్వతం పై మండే అగ్నిలా కనిపించాడు .పొగ బాగా వ్యాపించి ఉండటం తో కిరాత శివుని రూపం స్పస్టాస్పస్టంగా కనిపించింది .-‘’స్పస్టోప్యవి స్పష్టవపుః ప్రకాశః –సర్పన్మహాదూమ ఇవాద్రి వహ్నిః’’.శత్రువులచే తిరస్కరి౦పబడని తన ధైర్యాన్నే అర్జునుడు కరావలంబనమే చేసుకొన్నాడు .’’అసాదయన్న స్ఖలిత స్వభావం –భీమే భు జాలంబ మివారి దుర్గే ‘’.కులశీలాదులచేత తనయందు అనురాగ వతి అభిమాన వతి అయిన కారణంగా ప్రాణాలకంటే ఎక్కువైన కీర్తి తన యెదుటనే శత్రువు అపహరించాలి అనుకొన్నప్పుడు అర్జునుడు అలాంటి గుణాలే కలిగిన కాంత ను గురించి బాధ వంటి బాధ అనుభవించాడు –‘’వంశోచిత త్వాదభిమాన వత్యా-సంప్రాప్తయా సంప్రియతా మనుభ్యః –సమక్షమాది త్సితయా పరేణ-వధ్వేన కీర్త్యా పరితప్య మానః ‘’.హిమాలయాన్ని బద్దలు కొట్టే వేగంతో వచ్చే గంగానదిని శివుడు పూర్వం నిగ్రహించినట్లు ,ఇప్పుడు అర్జున పరాక్రమాన్ని నిష్ఫలం చేశాడు –‘’పతిం నగానామివ బద్ధ మూల –మున్మూలయిష్య౦ స్తరసా విపక్షం –లఘు ప్రయత్నం నిగృహీత వీర్య –స్త్రిమార్గగా వేగ ఇవేశ్వ రేణ’’.విజయం కోసం మళ్ళీ తన శరాలనే ఆశ్రయించాడు విజయుడు .శరప్రయోగం లో అభ్యాసమూ ,దానికి సంబంధిన అనేక గుణాలు ఉన్నందున హృదయాన్ని ఆనందింప జేసే శబ్దాలలాగా ఆనందించాడు –‘’జయం యదార్దేషు శరేషు పార్దః –శబ్దేషు భావార్ధ మివా శశంసే’’.కోపంగా ఉన్న విషసర్పం కళ్ళనుంచి విషాన్ని చిమ్మి నట్లు అర్జునుడు యుద్ధం లోనే శత్రువుకు సమాధానం చెప్పాలని ,మొదటి సారి ఓటమి వలన కలిగిన బాధతో క్రోధోద్రిక్తుడై ,కన్నీరు కార్చాడు అధిక సంతోషం లోనూ కోపం లోను ,కన్నీరు కారటం సహజమే .-‘’భూయః సమాధాన వివృద్ధ తేజా-నైనం పురా యుద్ధమితి వ్యథావాన్-స నిర్వ వామాస్ర మమర్షనున్నం –విషం మహా నాగ ఇవేక్షణాభ్యాం’’.యుద్దాయాసం లో క్రీడి జడలు విడిపోయాయి .కళ్ళు రాగిలాగా ఎర్రబడ్డాయి క్రోధం వలనముఖం పై చెమట ,వేడిని చల్లారుస్తున్నట్లు కమ్మి౦ది.-‘’నిర్వాప యిష్యన్నివ రోష తప్తం –ప్రస్నాపయామాస ముఖం నిదాఘః .’’మేఘ మండలం లో చిక్కుకున్న మూడు సూర్యుని ఊర్ధ్వ కాంతి రేఖలు వర్షానికి సూచన అయినట్లు ,అర్జునుడు కనుబొమలు చిట్లించిన ముఖం లో మూడు రేఖలు పైకి వ్యాపించాయి –‘’క్రోధాంధ కారాంతరితో రణాయ – భ్రూ భేద రేఖాః స బభార తిస్రః –ఘనోప రుద్ధః ప్రభావాయ వృష్టే-రూర్ధ్వా౦శు రాజీరివ తిగ్మ రశ్మిః.’’దిగ్గజం తొండం తో పర్వత శిఖరాన్ని చరచి ధ్వనింప జేసినట్లు ,అర్జునుడు మేఘం లాగా ధ్వని చేసే ధనువు ను చేతితో లాగి ,శంకర కి౦కరులపై బాణాలు ప్రయోగించాడు .
అర్జున బాణాలు శాస్త్ర నిష్ఠ గల బుద్ధి విషయం లో హితోప దేశం లాగా,వైరాగ్యం ఉన్నవాడిలో గుణాలు ,వాజ్మానస అగోచరమైన బ్రహ్మ విషయం లో వేద వాక్కు వ్యర్ధమైనట్లు , శివుని శరీరం లో కలిసిపోయాయి.అంటే శివుడిని ఏమీ చేయ లేకపోయాయని భావం –‘’సద్వాదివాతేభిని విష్ట బుద్ధౌ –గుణాభ్యసూయేవ విపక్ష పాతే-అగోచరే వాగివ చోప రేమే –శక్తిఃశరాణాం శితికంఠకాయే ‘’.అర్జునబాణాలు ఆయన్నమీ బాధించలేదు .హేమంతం లో సూర్య కిరణాలు హిమవంత ప్రదేశాన్ని తాకనట్లే ఆబాణాలు శివుడిని బాధించలేదు –‘’అభ్యుత్థిత స్యాద్రి పతేర్నితంబ –మర్కస్య పాదా ఇవ హైమనస్య ‘’.అర్జున పరాక్రమాన్ని శివుడు దిగ్గజం పోట్లను హిమవత్పర్వతం సహి౦ఛినట్లు ఆనందిస్తూనే, సహించాడు.’’విషాణ భేదం హిమవాన సహ్యం – వప్రానతస్యేవ సురద్విపస్య .బ్రహ్మాడులకే కారణ భూతుడైన శివుడు శివుడు తన పరాభవాన్ని చాలాకాలం సహించాడు.-‘’చిరంవిషేహే భిభ వస్తదానీం –సకారణానా మపి కారణేన’’.శత్రువుతో ఓడినా ,ఏ వ్యక్తి ఉత్సాహం తో తనకంటే పరాక్రమ వంతునితో పోరాడుతాడో వాని కీర్తి సూర్యకాంతి లా ప్రకాశిస్తుంది –‘’తేజా౦సి భానోరివ నిష్పతంతి-యశా౦సి వీర్యజ్వలితాని తస్య ‘’.ఒక వ్యక్తి మహత్కార్యం ప్రత్యక్షంగా చూసి ,అతడి శత్రువర్గం భయ పడుతుంది .భయపడితే తేజస్సు నశిస్తుంది తేజస్సు లేని వాడిని ఉత్సాహం వదిలేస్తుంది .అది ఆరిన దీపం లాగా ప్రకాశ హీనమౌతుంది –‘’దృష్టావదానాత్ వ్యథతే రిలోకః-ప్రధ్వంస మేతి వ్యథితాచ్చ తేజః –తేజో విహీనం విజహాతి దర్పః –శాంతార్చిషం దీపమివ ప్రకాశః ‘’.ఉత్సాహం మదం ఆత్మాభిమానం దెబ్బతిన్న వాడు తనను జయించిన వాడిని ఓడించటానికే ప్రయత్నిస్తాడు .తనకిష్ట మైన ఏనుగు ,మదవాసనలతో ఆకర్షింప బడిన ఏనుగు తనకు ఎదురుగా వచ్చే ఏనుగుల సమూహాన్ని ఎదుర్కొని ఓడించినట్లు ,శత్రు పరాజయం కోసమే యత్నిస్తాడు .-‘’తతః ప్రయాత్యస్త మదావలేపః –స జయ్య తాయాః పదవీం జిగిషోః-గంధేన జేతుః ప్రముఖాగతస్-ప్రతి ద్విపస్యేవ మతంగా జౌఘః ‘’శివుడు తలలోని చంద్ర రేఖలాగా గొప్ప కీర్తి అర్జునుడికి ఇవ్వాలనుకొని జయాపజయాలు పర్యాయంగా కలిగే యుద్ధం ప్రారంభించాడు .ప్రాణులు జన్మతః వచ్చే స్వభావాలను వదులుకోలేక వాటికి వశులౌతారో అదే విధంగా ప్రమథ గణం అర్జున విచిత్ర బాణాలకు వశమైంది –‘’సహాత్మ లాభేన సముత్ప తద్భి-ర్జాతిస్వభా వైరివ జీవ లోకః .’’.భయంతో వణుకుతున్న శివ సేన అర్జున బాణవర్ష౦ తో ఏర్పడిన చీకటి బాణ ధ్వనినీ ,విన్నారు రాత్రికురిసే వర్షంలోని మేఘగర్జనలా ఉంది .శబ్దాన్ని మాత్రమే విన్నారు .అంటే చూడటం కానీ ఏమీ చేయటం చేయ లేకపోయారు అని భావం .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -26-12-20-ఉయ్యూరు