కిరాతార్జునీయం-.39 17వ సర్గ -3(చివరి భాగం )

కిరాతార్జునీయం-.39

17వ సర్గ -3(చివరి భాగం )

ప్రతీకార  సమర్ధుడైన పార్ధుని చేయి ఆ సమయం లో  సాయ పడకపోయినా ,పూర్వపు ఉపకారం తలచుకొని అమ్ములపొది నుంచి అతి కష్టంగా వేరు పడింది .కృతజ్ఞుడైన సత్పురుషుడు మొదట ఉపకారం చేసిన వాడైనా ,తత్కాలం లో ఉపయోగపడని మిత్రుడిని వదలటం సహజమే .-‘’పరాన్ముఖత్వేపి కృతోపకారా—త్తూణీ ముఖాన్మిత్ర కులాది వార్యః ‘’.గత్య౦తరం లేక ఆ రెండు పొదులను దూరం చేయటం ఉపకారమే అయింది .యోగ్యత లేని సేవకుడు వ్యర్ధం ,అనుచితం ,సాహసమే అవుతుంది .-‘’సంభావనా యామ ధరీ కృతాయం-పత్యుః పురః సాహస మాసి తత్త్వం ‘’.ఇది గమనించిన కిరాత శంకరుడు రెచ్చి పోయి ,ఉక్కు బాణాలతో అర్జున మర్మావయవాలకు తీవ్ర బాధ కలిగించాడు .తత్వ చర్చమధ్యలో  ప్రతివాది నిరుత్తరుడైతే , అతడి పెద్దపెద్ద లోపాలను చూసి బాగా బాధ పెట్టినట్లుంది అర్జునుడి స్థితి.-‘’త౦ శంభు రాక్షిప్త మహేషు జాలం –లోహైఃశరైర్మర్మశునిస్తు తోడ-హృతోత్తరం .తత్వ విచార మధ్యేవక్తేవ దోషై ర్గురు భిర్విపక్షం ‘’.శంకర బాణాలు మణులు కూర్చిన అర్జున కవచాన్నిపగల కొట్టాయి.ప్రచండ వాయువు విద్యుత్తు తో ప్రకాశించే మేఘ శకలాలు తొలగించి సూర్యుడిని ప్రకాశింప జేసినట్లు గా ఉంది –‘’చండఃపతంగాన్మురుదేక నీలం –తడి త్వతః ఖండ మివా౦బుదస్య ‘’. కవచం లేని క్రీడి శోభ ఒరనుండి లాగిన సానబెట్టిన ఖడ్గం లాగా,కుబుసం విడిచిన పాములాగా ,శత్రు ఏనుగును చూసి ముఖావరణం తొలగించిన ఏనుగు లాగా ,పర్వత గుహ నుంచి బయటికొచ్చిన సింహ౦లా,రాత్రి ప్రకాశించే పొగలేని అగ్నిలా అయింది .-‘’విబోధితస్య ధ్వనినా ఘనానాం –హరేరపేతస్య చ శైల రంద్రాత్ –నిరస్త దూమస్య చ రాత్రి వహ్నే –ర్వినాతను త్రేణ రుచిం స భేజే ‘’.కవచం పడిపోయి ,రెండు తూణీరాలు నేలపై పడికూడా ఆపదలో ఉన్న యజమానికి ఏమీ సహాయం చేయలేకపోతున్నామే అన్నట్లు అచేతనమైనాయి –‘’అచిత్త తాయామపి నామ యుక్తా –మనూర్ధ్వతాం ప్రాప్య తదీయ కృచ్ఛ్రే-మహీం గతౌ  తా విషుధీతదానీం  విన వ్రతు శ్చేతన ఏవ యోగం ‘’..పులిమీద పుట్ర లాగా అర్జునుడిపై శివుడు  ఆకాశం లో విశ్వకర్మ సూర్యుడిని చిత్రికపట్టినట్లు శాస్త్రాలతో గాయపరచాడు –‘’స్థితం విశుద్ధే నభసీవ సత్వే –దామ్నా తపోవీర్య మయేన యుక్తం –శస్త్రాభి ఘాతై స్తమజస్రమీశ –స్త్వస్టావివస్వంత మివోల్లి లేఖ ‘’.కోపావేశామున్నా అర్జునుడు వేదన పొందలేదు .శంకరబాణాలను పడగొట్టలేదు .క్రోధమే అతడి ఉక్కు కవచంగా మారింది –‘’సంరంభ వేగో జ్ఘిత వేదనేషు –గాత్రేషు బాధిర్య ముపాగతేషు-మునేర్బభూ వాగణితేషు రాశే-ర్లౌహస్తిరస్కార ఇవాత్మ మన్యుః’’.

   తర్వాత గో పుచ్ఛాకారం లో పొడవైన గుండ్రటి భుజాలున్న అర్జునుడు ,శరీరం రక్తం తో తడిసిపోతున్నా ,పాదాలు నేలకేసి కొడుతూ ,గంభీరంగా అరుస్తూ ,శంకరుని వైపుకు పరిగెత్తాడు .ఇంద్రుని వజ్రాయుధం లాంటి ,చంద్ర రేఖలాగా తెల్లనైన ధనుస్సుతో,ఏనుగు దంతం తో స్తంభాన్ని కూల్చినట్లు, శంకరుడిని  కొట్టి  పడెయ్యాలనుకొన్నాడు .-‘’మహా వేగంగా పడుతున్న ఆ వింటి బద్దను శివుడు తనలోనే వేగంగా దూసుకొస్తున్న గంగానదిని జహ్ను మహర్షి తనలో ఇముడ్చుకున్నట్లు కలుపుకొన్నాడు  -‘’రయేణ సా స౦  నిదధతే పతంతీ-భావోద్భవేనాత్మని చాప యష్టిః-సముద్ధతా సింధు రనేక మార్గా-పరే స్థితే నౌజాసి జహ్నునేన ‘’.చేతిలోచాపం లేని కిరీటి దానం చేయని వాడి సత్కారం లా ,యుద్ధం చేయలేక పోయాడు .శంకర కిరాతకుడు బాగా తగిలే బాణాలతో క్రీడిని దూరంగా నెట్టేశాడు –‘’ విచిక్షిపే శూల భ్రుతాసలీలం –స పత్రిభిర్దూర మాదూర పాతైః’’.అస్త్రలాభం మొదలైన శుభాలు కనపడే తపస్వి అర్జునుడు  తపసు ఉపవాసం మొదలైన నియమాలు పాటించి నట్లుగా యుద్ధం అనే ఆశ్రమ ధర్మాలను ధైర్యం తో పాటిస్తూ ,శివ బాణ బాధ సహించాడు –‘’ఉపోఢ కల్యాణ ఫలోభిరక్షన్ –వీర వ్రతం పుణ్య రణాశ్రమస్థః-జపోపవాసై రివసంయతాత్మా –తేపే మునిస్తైరిషుభిః శివస్య ‘’.ఆపదలో రక్షణ స్థలాన్ని వెదుక్కున్నట్లు ,ప్రతాపానికి ఆశ్రయమైన ఖడ్గాన్ని యుద్ధానికి రూపు దాల్చిన ఆహ౦కార౦ గా వాడాడు .ఖడ్గం తో శివ బాణాలు ముక్కలు చేస్తూ సూర్య కిరణాలతో ఉద్దీప్త తరంగాలు కల సముద్రం లాగా భాసి౦చాడు – ‘’హస్తేన నిస్త్రింశ భ్రుతా సదీప్తః –సార్కా౦శునా  వారిధి రూర్మి ణేవ’’.సూర్యుడు తన మార్గం లో ఉంటూనే నీటిలో ప్రతి బింబ రూపంగా కనిపించినట్లు ,అర్జునుడు ఖడ్గయుద్ధ గతి భేదాలతో ఆకాశం లో, నేలపైనా ప్రకాశించాడు –‘’తథా నభస్యాశు రణస్థలీషు –స్పష్ట ద్విమూర్తి ర్దదృశే స భూతైః’’.శివబాణ౦  తో తెగిపడ్డ అర్జున ఖడ్గం మేఘం నుంచి జారిన మెరుపు యొక్క అగ్నిలా ప్రకాశించింది –‘’జ్వలన్నసి స్తస్య పపాత పాణే-ర్ఘనస్య వప్రాదివ వైద్యుతోగ్నిః’’.కవచం ధనువు బాణాలు ఖడ్గం కూడా విరిగి పోవటం తో అవమానం పొందిన అర్జునుడు ఉద్యానవనం లో చెట్లు నరికేస్తే శూన్యం అయినట్లున్నాడు –‘’రిక్తః ప్రకాశ శ్చబభూవ భూమే –రుత్సాది తోద్యాన ఇవ ప్రదేశః ‘’

     వెనకడుగువేయని ఫల్గుణుడు తన భుజమే సహాయంగా చేసుకొని వడగళ్ళ వాన కురిసినట్లు రాళ్ళ వర్షం కురిపించాడు స్థాణుడిపై.శివుడు తన బాణాలతో వాటికి బదులు చెప్పాడు .క్రీడి చెట్లు విరిచి భూనభో౦తరాలు నిండేట్లు విసిరాడు .శివుడు వాటిని ముక్కలు ముక్కలు చేసేశాడు .భయపడని భీభత్సుడు బంగారు శిల వంటి శివుని వక్షస్థలాన్నితన భుజాలతో గట్టిగా దెబ్బ కొట్టాడు –‘’గాండీవి కనక శిలానిభం భుజాభ్యా –మాజఘ్నే విషమ విలోచనస్య వక్షః ‘’.కీర్తికి ,లక్ష్మి కి సాధనమైనదీ శత్రు సేనకు పొందరాని పరాక్ర౦  కోర్తున్న అర్జునుడిని,తన తొడమీద కూర్చున్న శిశువు  మంచి వస్తువు కావాలని మారాం చేస్తే ఎలా సహిస్తాడో  శివుడు అలా సహించాడు –‘’  అభిలషత ఉపాయం విక్రమం కీర్తి లక్ష్యో-రసుగమమరి సైన్యైర౦క మభ్యాగతస్య –జనక ఇవ శిశుత్వేసుప్రియస్త్యిక సూనో –రవినయనమపి సేహే పాండవస్య స్మరారిః’’ .

   సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -28-12-20-ఉయ్యూరు

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.