కిరాతార్జునీయం-.41(చివరి భాగం )
18 వ చివరి సర్గ -2(చివరి భాగం )
అర్జునుని సఫలత చూసిన ప్రమథగణం అతని తపస్సును ఫలితం మహా గొప్పదని కీర్తించారు –‘’తపసికృత ఫలే ఫలజ్యాయసీ –స్తుతిరివ జగదే హరేఃసూనునా ‘’.అర్జునుడు ప్రత్యక్ష మహా దేవుని స్తుతించటం మొదలుపెట్టాడు –‘’ఓ శంకరా !పరమ దయామతివి ,భక్తసులభుడవు ,,శరణమిచ్చే వాడివి .నిన్ను పొందిన వారు మృత్యువును జయిస్తారు .దేవదానవ లొకం లో భయం కలిగితే ,నిన్నే శరణు కోరతారు ‘’-‘’శరణం భవ౦త మతి కారుణికం –భవభక్తి గమ్యధిగమ్యజనః –జిత మృత్యవో జిత !భవంతి భయే –ససురాసురస్య జగతః శరణం ‘’.నీకు నమస్కరించనంతవరకు మనిషి మృత్యు ఆపదలో ఉంటాడు. కోరికలు సఫలం కావు .ఇతరులూ అలాగే .-‘’విపదేతి తావదవ సాదకరీ –న చ కామ సంపదభికామయతే –న నమంతి చైక పురుషం పురుషా –స్తవ యావదీశ !న నతిఃక్రియతే ‘’..దానాది పుణ్య కార్యాల స్వభావమున్న వారు జన్మ మృత్యు మొదలైన్ కస్టాలను చూసి ,ముక్తి కోరుతూ నిన్ను ఆరాధించటం లో చిత్రమేమీ లేదు .అయినా తమకోసమే నిన్ను ఆరాధించే వాళ్ళను నిస్పృహ పొందికూడా ఫలాన్నివ్వటం నీకారుణ్య ఫలితమే .ఇందులో నీ ప్రయోజనం ఏదీ లేకపోవటమే చిత్రాచి చిత్రం –‘’సంసేవంతో దానశీలా విముక్త్యై-సంపశ్యంతో జన్మ దుఖం పుమా౦సః-యన్నిఃసంగస్త్వం ఫలస్యాన తేభ్య-స్తత్కా.రుణ్యం కేవలం న స్వకార్యం ‘’.ఏ తీర్ధం దూరం వెళ్ళకుండా ప్రాప్తిస్తుందో ,పరలోకం వెళ్ళకుండానే ఫలమిస్తుందో ,మోక్షప్రదమో ,అన్ని కోరికలూ తీర్చెదో ఆ తీర్ధం నువ్వు కాక మరొకటి కానే కాదు –‘’ప్రాప్యతే యదిహ దూర మగత్వా-యత్ఫలస్య పరలోక గతాయ –తీర్థమస్తి న భావార్ణవ బాహ్యం –సార్వ కామిక మృతే భవత స్తత్ ‘’.నీ భక్తీ తో కైవల్యంపొందుతాడు .వ్యతిరేకి ఘోర నరకం అనుభవిస్తాడు.నిష్కళంక మూర్తీ !ఇది చాలా దుస్తరమైనది .కార్యకారణ భావ శక్తి మహిమ .నీకు భక్త ,అభక్త భేదమే లేదు –‘’వ్రజతి శుచి పదం త్వయి ప్రీతిమాన్ –ప్రతిహత మతి రేతిఘోరాం గతిం-ఇయ మనఘ నిమిత్త శక్తిః పరా –తవ వరద న చిత్త భేదః క్వచిత్ ‘’.హే దయాళూ!భక్త వశాను వర్తిని ,కల్యాణాన్నీ చేకూర్చే నీ మూర్తిని గుర్తించలేక పోయినా రాగద్వేషాలతో ఉండే ప్రాణి భక్తితో నీ స్మరణ చేస్తే చాలు సంసారసాగరం దాటగలడు.’-‘’దక్షిణా౦ ప్రణత దక్షిణ మూర్తిం –తత్వతః శివ కరీ మవిదిత్వా –రాగిణా మపివిహితా తవ భక్త్యా –సంస్మృతిర్భవ భవత్య భవాయ ‘’.జ్ఞాన దృష్టితో తత్వాన్ని గ్రహించి అనుకూలమైన ఆచరణ చేస్తూ విఘ్నాలు బాధలు లేకుండా మోక్షం పొందుతారు .పరమాత్మగా నిన్ను దర్శించి సమ్యక్ జ్ఞానం తో ఆరాధించేవాడు కర్తవ్య పాలకుడు ఔతాడు –‘’దృష్ట్యా దృశ్యా న్యాచర ణీయాని విధాయ –ప్రేక్షాకరీ యాతి పదం ముక్త మపాయైః-సమ్యగ్దృష్టిస్తస్య పరం పశ్యతి యస్త్వాం –యశ్చోపాస్తే సాదు విధేయం స విధత్తే’’.వ్యాస వాల్మీకాది మునులు యోగ మహిమతో ప్రజలకు విధి ,నిషేధ రూప ఉపదేశాలు చేసి ఉపకారం చేశారు. నీ మహిమ ఊహింప వీలు లేనిది .నిన్ను శరణు పొందిన వారి పుణ్య పాపకర్మలన్నీనాశనం చేయగలవు –‘’యుక్తాః స్వ శక్త్యా మునయః ప్రజానాం –హితోప దేశై రుపకార వంతః –సముచ్ఛినత్సి త్వమచిన్త్య ధామా –కర్మాణ్యు పేతస్య దురుత్తరాణి’’
‘’నీ మాయను జయించి పుణ్య పాపాలతో బంధింప బడి ,ఇతరులు చేధించటానికి వీల్లేని భయంకర నరక యాతనను దూరం చేయటానికి అద్భుత లీలా రూపం ధరించావు – ‘’స౦ నిబద్ద మపహర్తు మహార్యం –భూరి దుర్గతి భయం భువనానాం –అద్భుతా కృతిమిమా మతిమాయ –స్త్వంభిభర్షి కరుణామయ మాయాం’’.నీ చిత్తం విరాగ మైనదే .నీశరీరం లో అర్ధ భాగం లో స్త్రీ ఉన్నా,మన్మథవికారం లేని వాడివి .ఉదయ సంధ్యలో బ్రహ్మను ఆరాదిస్తావు .నీ చేష్టలు జటిలమైనవి ,అర్ధం కానివి –‘’న రాగి చేతః పరమా విలాసితా –వధూః శరీరే స్తినచాస్తి మన్మథః-నమస్క్రియా చోషసి ధాతు రిత్యహో –నిసర్గ దుర్బోధ మిదం తవేహితం ‘’.వెంట్రుకలతో ఉన్న గజ చర్మాన్ని కప్పుకొన్నావు.మణితో ఉన్న సర్పం నీ మొలతాడు .కపాలమాల అలంకార దండ .చితా భస్మం చందనం అయినా ఈ అలంకారాలు శిరసుపై ఉన్న చంద్ర రేఖతో సమానంగా ప్రకాశిస్తున్నాయి –‘’తవోత్తరీయం కరి చర్మ సా౦గజం –జ్వలన్మణిః సారసనం మహానహిః-స్రగాస్య పంక్తిఃశవ భస్మ చందనం –కలాహిమాంశోశ్చసమం చకాసతి ‘’.నువ్వు ఆశరీరుడివే.అసాధారణ అర్ధ నారీశ్వర రూపం నీకే ఉంది .విరుద్ధ వేష ,అలకారాలున్నా ,మహా అందంగా ఉంది .లోకం లో ఇంకెవరికీ ఇలా లేనేలేదు .నీ మహిమ అవర్ణ్యం.-‘’అవిగ్రహస్యాప్యతులేన హేతునా –సమేత భిన్నద్వయ మూర్తి తిష్టతః –తవైవ నాన్యస్య జగత్సు దృశ్యతే –విరుద్ధ వేషాభరణ్య కా౦తతా ‘’.జనన మరణ రహితుడవు నీకు ఉపమానమే లేదు ఉపమేయమూ లేదు.అంటే వర్ణించలేము –‘’ఆత్మ లాభ పరిణామ నిరోధై-ర్భూత సంఘ ఇవ న త్వముపేతః –తేన సర్వ భువనాతిగలోకే –నోపమానమసి నాప్యుపమేయః ‘’
‘’చరా చర ప్రపంచ సంహారకుడివి. నీవల్లనే విశ్వం సృష్టింపబడి ,జీవిస్తుంది .యోగులకే కర్మ ఫలాన్నిస్తావు .సమస్త జగత్తు కారణానికే కారణం నువ్వే –‘’త్వమంతకః –స్థావర జంగమానాం –త్వయా జగత్ప్రాణి దేవ విశ్వం –త్వం యోగినాం హేతు ఫలే రుణత్సి-త్వం కారణం కారణ కారణానాం ‘’..ఈ సంసారం లో రాక్షసులు ,దేవ ,మనుష్యులు,దైత్యులు ఏయే సామ్రాజ్యాలు పొందారో ,వాటన్నిటికీ శరణాగతుల దుఖాన్ని పోగొట్టే నీకు చేసిన నమస్కార మహిమే కారణం ‘’-‘’రక్షోభిః సురమనుజైర్దితేః సుతైర్వా-యల్లోకే ష్వవికల మాప్త మాధిపత్యం –పావిన్యాఃశరణాగతార్తి హారిణే త-న్మాహాత్మ్య౦ భవ భవతేనమస్క్రియాయాః’’.శంకరుని అష్ట మూర్తుల్లో వాయు మూర్తి ఒకటి .దాన్నిఅర్జునుడు ‘’ వాయు బలం తో లోకాన్ని ప్రాణవంతం చేస్తుంది .వాయువు ప్రేరణ తో అక్షరరూప బ్రహ్మ పలుక బడుతుంది .అదే అన్ని పాపాలు పోగొట్టి శుద్ధిచేస్తుంది .అలాంటి వాయు రూప శివా !’’అని స్తోత్రం చేశాడు –‘’తరసా భువనాని యో భిభర్తి –ధ్వనతి బ్రహ్మ యతః పరం పవిత్రం –పరితో దురాని యః పునీతే –శవ తస్మైపవనాత్మనే నమస్తే ‘’
తర్వాత అగ్నిరూప శివ స్తోత్రం చేశాడు పార్ధుడు –యోగ సాధన కోసం యోగాసనం లో కూర్చుని నిన్ను స్మరించే యోగుల సంసార దుఖాలకు కారణమైన కర్మలను దహిస్తుంది .అనేక జ్వాలలతో ప్రకాశించే నీ అగ్ని మూర్తికి నమస్కారం –‘’భవతః స్మరతా౦సదాసనే –జయిని బ్రహ్మ మయే నిషేదుషాం –దహతే భవ బీజ సంతతిం –శిఖినే నేక శిఖాయ తే నమః ‘’.జలమూర్తి శివ స్తోత్రం –సంసార బీజానికి కారణమైన శివా !ఆధ్యాత్మిక ,ఆది భౌతిక ,ఆది దైవిక ,ఆది భౌతిక రూప తాపత్రయాలలు మరణం మొదలైన వాటి వలన కలిగే భయరూప మంటలను ఉన్న సంసారాగ్ని లో చాలాకాలంగా బాధ పడే వారు నిన్నాశ్రయిస్తే చాలు వారికి జీవదానం చేయగల జలమూర్తి వైన నీకు నమస్కారం –‘’అబాధా మరణ భయార్చిషా చిరాయ –ప్లుష్టేభ్యోభవ మహతా భవానలేన-నిర్వాణం సముపగమేన యచ్ఛతే తే-బీజానాం ప్రభవ నమోస్తు జీవనాయ ‘’నభో మూర్తి శివ స్తోత్రం –భవా! విభువు ,సంపూర్ణ జగత్తూ ఆవరించిన వాడూ ,ఎవరి చేతా ఆచ్చాదనం లేనివాడు ,ఆది అంతం లేని వాడు ,ఇంద్రియాతీతుడు తెలియబడని నీ ఆకాశ మూర్తికి నమస్కారం –‘’యః సర్వేషా మావరీతా వరీయాన్ –సర్వైర్భావైర్నావృతోనాది నిష్టః-మార్గాతీతా ఏంద్రియాయాణా౦ నమస్తే –విజ్ఞేయాయ వ్యోమ రూపాయ తస్మై ‘’.దేవా !సూక్ష్మాతి రూపం తో విశ్వాన్ని ధరిస్తూ ,అంతర్యామిగా అందరికీదగ్గరౌతావు .మాట మనసుకూ అతీతుడవైనా వాటికి అధిపతి వైన నీకు నమస్కారం ‘’.-అణీయసేవిశ్వ విధారిణేనమో –నమో౦తిక స్థాయ నమో దవీయసే –అతీత్య వాచాం మనసాం చ గోచర౦ –స్థితాయ తే తత్పతయే నమో నమః ‘’అన్ని విద్యలకు స్వామివి .అజ్ఞానంగా శస్త్ర సంధాన దుశ్చర్యకు పాల్పడిన నన్ను క్షమించు .అజ్ఞానం తో విరోధించి ,మళ్ళీ నిన్ను చేరిన దుర్మార్గు డికి కూడా నువ్వే శరణ మయ్యావు ‘’-అసం విదానస్య మమేశ సంవిదాం –తితిక్షితుం దుశ్చరితం త్వమర్హసి –విరోధ్య మొహాత్పునరభ్యుపేయుషాం-గతిర్భవానేవ దురాత్మనాపి ‘’.
స్తోత్రాలన్నీ చేసి చివరకు అర్జుండు శివుడిని వర౦ కోరుతున్నాడు-‘’ధర్మపాలకా !ఆస్తి బుద్ధితో వైదిక ధర్మాన్ని ఆచరిస్తున్న మా అన్న ధర్మరాజు గారికి .అపకారులైన శత్రువులపై మేము ఏ విధంగా శస్త్రాస్త్ర సమృద్ధిగా విజయం పొందుతామో దాన్ని మాకు ప్రసాదించు –ఇదే నా ప్రార్ధన –‘’ఆస్తిక్య శుద్ధమవతః ప్రియ మార్గ ధర్మం –ధర్మాత్మజస్య విహితాగసి శత్రు వర్గే –సంప్రాప్నుయా౦ విజయ మీశ యయా సమృధ్యా –తాం భూతనాథ విభుతాంవితరాహవేషు ‘’అని కోరి శివుని పాదాలపై పడిన ఆర్జునుడిని శంకరుడు ఓదార్పు మాటలు పలికి అగ్నిజ్వాలావృతమై, రుద్రదేవకాత్మమైన పాశుపతాస్త్రాన్ని,దానికి సంబంధించిన ధనుర్వేదాన్నీ అనుగ్రహించాడు –‘’ఇతి నిగదిత వంతం సూను ముచ్చైర్మ ఘోనః –ప్రణత శిర సమీశః సాదరం సాంత్వ యిత్వా –జ్వలదనల పరీతం రౌద్ర మస్త్రం దధానం –ధనురుప పద మస్మైవేదమఖ్యాదిదేశ’’.
ఆధనుర్వేదం శివుని చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేస్తూ,దేవతలు స్తోత్రాలు చేస్తుండగా అర్జునుడి ఎదుటకు వచ్చింది .ఎర్రని నేత్రాలతో అందం గా ఉంది సర్వ లోక పూజనీయం ప్రకాశమైన ధనుస్సుభయంకర శరీరం ధరించింది .మూడు శిఖల త్రిశూలంతో సంబంధం కలిగి ఉన్నది పచ్చని రంగుతో సూర్యుడు మేఘాన్ని చేరినట్లు ఆర్జునుడిని చేరింది –‘’స పి౦గాక్షః శ్రీమాన్ భువన మహనీయేన మహసా – తను౦ భీమాం భిభ్ర త్రిగుణ పరివార ప్రహరణః-పరీత్యేశానం త్రిః స్తుతిభి రూప గీతః సుర గణైః-సుతం పాండోర్వీరం జలదమివ భాస్వాన భియయౌ ‘’.తర్వాత ఇంద్రాది దేవతలు ఈశ్వరుని అనుమతి పొంది పూర్ణ కాముడైన అర్జునుడికి ఫలదాయకాలైన ఆశీస్సులు పలికారు .విజయ ప్రదాలైన అనేక అస్త్రాలు అర్జునుడికి ప్రదానం చేశారు –‘’అథశశధర మౌలే రభ్యనుజ్ఞా మవాప్య –త్రిదశ పతి పురోగాఃపూర్ణ కామాయ తస్మై –అవిథతఫలమాశీర్వాదమారోపయంతో-విజయి వివిధ మస్త్రం లోక పాలా వితేరుః-‘’
జయశీలుడైన అర్జునుడు పాశుపతాస్త్ర లాభం తో అభ్యుదయం పొంది దురాత్ముల వినాశానానికీ ,లోక రక్షణకు తపస్సు వలన కలిగిన శోభతో ప్రత్యేక తేజస్సుతో అద్వితీయ సూర్య ప్రకాశంగా ప్రకాశించాడు .దేవతలు అర్జున యశోగానం చేసి ఉత్సాహ పరచారు –‘’అసంహార్యోత్సాహం జాయిన ముదయంప్రాప్య తరసా –దురం గుర్వీ౦ వోఢుం స్థితమనవ సాదాయ జగతః –స్వధామ్నా లోకానాం తముపరి కృతస్థానమమరా –స్తపో లక్ష్మ్యా దీప్తం దిన కృతమివో చ్చైరుప జగుః’’
శివ భగవానుడు అర్జును డితో’’వెళ్ళు శత్రువులను జయించు ‘’అని ఆజ్ఞ ఇవ్వగా పాదాలకు నమస్కరించి బయల్దేరాడు పార్ధుడు .దేవతలు కొని యాడగా విజయలక్ష్మితో ఇంటికి చేరి ,ప్రేమాదరాలతో ఎదురు చూసున్న అన్న ధర్మరాజుకు నమస్కరించాడు –‘’వ్రజ జయ రిపులోకం పాద పద్మానతః సన్-గదిత ఇతిశివేన శ్లాఘి తో దేవా సంఘైః-నిజ గృహమథగత్వా సాదరం పాండు పుత్రో –ధృతగురు జయలక్ష్మీ ర్ధర్మసూనుం ననామ ‘’.
భారవి మహాకవి మహాకావ్యం ‘’కిరాతార్జునీయం’’ సమాప్తం .
ఆధారం –భారవి మహా కవి కిరాతార్జునీయం సంస్కృత కావ్యానికి శ్రీ శ్రీపాద వేంకట రమణ దైవజ్ఞ గారు రాసిన తెలుగు వ్యాఖ్యానం ఆధారంగా అంతర్జాలం లో కిరాతార్జునీయాన్నిమాఘమాసం 25-1-20 న ప్రారంభించి ,7-2-20నాటికి14 ఎపిసోడ్ లతో 3 సర్గలు వారి వ్యాఖ్యానం మూడు సర్గలకే ఉండటం వలన అంతవరకే రాసి ,ఆపేశాను .తర్వాత సర్గల వ్యాఖ్యానం కోసం ఈలోపు గాలించి ,గాలించి మా అబ్బాయి శర్మ ఎమెస్కో వారు ప్రచురించిన డా. సుందరాచార్య సంపూర్ణ కిరాతార్జున వ్యాఖ్యానం కొని పంపించగా దసరాలలో సరిగ్గా సరస్వతీ పూజ రోజున నాకు 21-10-20న అందింది . .మళ్ళీ కార్తీకమాసం 16-11-20న 4వ సర్గ నుంచీ డా .కె.వి.సుందరాచార్యులు వారి సుందర తెలుగు వ్యాఖ్యానం ఆధారంగా ప్రారంభించి ఈరోజు మార్గశిర బహుళ పాడ్యమి 30-12-20నాటికి 41ఎపిసోడ్ లతో సుమారు నెలన్నర కాలం లో ,18వ సర్గ వరకు మొత్తం కావ్యాన్ని పూర్తి చేయగలిగాను .మొత్తం 55ఎపిసోడ్ లు గా ,కిరాతార్జునీయ౦ పూర్తయింది.ఇది నాకు సంతృప్తినీ ఆనందాన్నీ కల్గి౦చికావ్యం .నాజన్మ చరితార్ధం –
మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -30-12-20-ఉయ్యూరు