జారిపోయిన జ్ఞాపక శకలాలు -1.
మల్లయ్య గారి మిల్లు
‘’ఊసుల్లో ఉయ్యూరు ‘’అనే నా జ్ఞాపకాల తేగలపాతర లోనుంచి కొన్ని జ్ఞాపకాలు జారిపోయాయి .ఇప్పుడిప్పుడే అవి మళ్ళీ స్మృతి పథ౦ లో మెదుల్తున్నాయి .వాటిని తవ్వి తీయటమే ఇప్పుడు నేను చేస్తున్నపని .అందులో మొదటి శకలమే ‘’మల్లయ్య గారి మిల్లు ‘’.
ఉయ్యూరు రావి చెట్టు బజారులో ,మా శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయానికి ఎదురుగా ,సూరి వారి బజారునానుకొని మేము హిందూపురం నుంచి 1950లో ఉయ్యూరు వచ్చే నాటికే ‘’వెంట్ర ప్రగడ మల్లయ్య’’ గారి వడ్ల మిల్లు ఉన్నది .మల్లయ్య గారిని నేను చూసిన దాఖలా లేదు .కానీ వారి పెద్దబ్బాయి వెంకటేశ్వరరావు ,ఆయన ఇద్దరు తమ్ములు మిల్లు ను నడపటం బాగా గుర్తు .అది అప్పటికే చాలా పెద్ద మిల్లు .వందలకొద్దీ వడ్ల బస్తాలు రావటం వాటిని బియ్యం ఆడటం లారీలలో ఎగుమతి చేయటం బాగా జ్ఞాపకం .వెంకటేశ్వర రావు గారు నల్లగా హుందాగా తెల్లని మల్లు పంచె తెల్ల షర్ట్ తో ,నుదుట యెర్రని నిలువు బొట్టుతో అనుక్షణం నవ్వుతూ ఉండేవారు .మాంచి యాజమాన్యం లో మిల్లు నడిచేది .కనీసం పది మంది వర్కర్లైనా ఉండేవారు .మిల్లుకు దక్షిణాన ఊక రాసి చిన్న కొండంత పెరిగి ఉండేది .మిల్లులో బియ్యం అమ్మే వారో లేదో నాకు గుర్తులేదు. చిట్టూ,తౌడు మాత్రం అమ్మేవారు .ఊక కావాలంటే అడిగితే ఫ్రీగానే ఇచ్చేవారని గుర్తు .ఆయన ఇద్దరు తమ్ముళ్ళు ఆయనకంటే నలుపు రంగు .వ్యవహార దక్షులు కూడా .ఈ ఇద్దరూ పాంట్ షర్ట్ తో ఉండేవారు .మల్లయ్య గారి ఇల్లు అంటే అప్పటికే డాబా రావి చెట్టు ఎదురు సందులో విశ్వ బ్రాహ్మణ బజారు మొదట్లో కుడివైపున సత్రానికి అవతల ఉండేది చాలా క్లాస్ గా ఉండేది .
వెంకటేశ్వరరావు గారికి మా నాన్న గారు బాగా పరిచయం .నేను ఎప్పుడు వెళ్ళినా పంతులు గారు అనో మేష్టారు గారనో పలకరించేవారు .ఆయన కొడుకు ఉయ్యూరు హైస్కూల్లో నా శిష్యుడు .పేరు గుర్తులేదు పొట్టిగా నల్లగా ఉండేవాడు .మాశ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం పునః ప్రతిష్ట నాటికే వెంకటేశ్వరరావు గారి అన్నదమ్ములు ఎవరి భాగం వారు తీసుకొని విడిగా రావి చెట్టుకు ఉత్తరాన కోమటి బజారు అని పిలువబడే మెయిన్ రోడ్ కు కలుపబడే దారి వీధిలో ఉండేవారని జ్ఞాపకం .మా ఆలయ ప్రతిష్ట తర్వాత వెంకటేశ్వరావు గారబ్బాయి ,కోడలూ ప్రతి రోజూ గుడికి వచ్చేవారు .చాల భక్తీ శ్రద్ధలున్నవారు ఆ దంపతులు .ఒక పిల్లాడో,పిల్లో పుట్టారు కూడా ..తర్వాత ఏమైందో తెలీదు కాని కోడలు చనిపోయింది .ఆ ఇంటి వైభవం మసకబారింది .కొడుకు ఒంటరిగా కొంతకాలం అందులో ఉండేవాడు తర్వాత అతడు ఆ భవనం అమ్మేశాడని తెలిసింది ఎక్కడి కి వెళ్ళాడో తెలీదు .ఆ చాప్టర్ అక్కడితో క్లోజ్ . వెంకటేశ్వరరావు గారి తమ్ములు మాత్రం అప్పుడప్పుడు కనబడే వారు .
మల్లయ్యగారి మిల్లులో లెక్కలు, డబ్బు వ్యవహారాలూ చూసే కనుపూరి శర్మ గారు ఉండేవారు .పూర్తి పేరు హనుమంత శర్మ అని గుర్తు .అందరూ శర్మ గారూ అనే పిలిచే వారు .నిలువెత్తు మనిషి .హుందాగా తెల్లటి ఖద్దరు అంచుల పంచ తెల్ల చొక్కాతో ఉండేవారు సంస్కారం ఉట్టి పడేది .ఆయన ఉయ్యూరు కాలేజీ దాటాక వచ్చే గరుగు మీద కాపురం .వ్యవసాయం కూడా ఉండేదేమో ? ఆయన మా ఇంటికి దక్షిణాన ఉన్న బెల్లం కొండ సుబ్బయ్యగారి పెద్ద కుమారుడు లక్ష్మీ నారాయణ గారి భార్య రాజమ్మ గారికి స్వయానా తమ్ముడు .మిల్లు లెక్కా డొక్కా అంతాపకడ్బందీ గా ఉండేది ఆయన చేతిలో .సైకిలు మీద వచ్చేవాడు గరుగు మీద నుంచి మల్లయ్య గారి మిల్లుకు .ఈయన దగ్గర బంధువే బహుశా మేనమామ కావచ్చు బెజవాడ లో జైహింద్ టాకీస్ కు వెళ్ళే దారిలో ఉన్న వివేకానంద హోమియో స్టోర్స్ .ఇక్కడ నిఖార్సైన హోమియో మందులు దొరుకుతాయని అందరికి మంచి నమ్మకం .వన్ టౌన్ లో రాదా కృష్ణా సైకిల్ షాప్ రోడ్డులో రామ కృష్ణా హోమియో స్టోర్స్ కు గొప్ప పేరుంది. దాని తర్వాత దీనికి పేరు .వివేకానంద స్టోర్స్ లోనే నేనెప్పుడు హోమియో మందులు కావాల్సి వచ్చినా కొనేవాడిని .శర్మగారు ఈ షాప్ ను నాకు పరిచయం చేశారు .ఆషాప్ ఓనర్ పేరు కూడా శర్మగారు అని గుర్తు .వెడల్పు ముఖం నవ్వుతూ చక్కగా పలకరించేవారు ఉయ్యూరు పరిచయం ఉన్దికనుక చాలా గౌరవం చూపేవారు ఆయన చనిపోయాక భార్యా పిల్లలు స్టోర్స్ నిర్వహణ చూసేవారు .
గరుగు మీదే ఉండే ఇంకో కనుపూరు అయన ఉయ్యూరులో చిన్న చిన్న కాంట్రాక్ట్ పనులు చేసేవాడు .లావుగా బొద్దుగా ఉండేవాడు .రోడ్లు వేయటం మరమ్మత్తులు చేయటం చేసేవాడు శర్మగారికీ ,ఈయనకూ బంధుత్వం ఉందేమో నాకు తెలీదు .ఈయన కూతురు ఉయ్యూరు హైస్కూల్ లో నా శిష్యురాలు .పేరు గుర్తు లేదు .
మేము ధాన్యాన్ని బందరు రోడ్డులో ఉన్న ,ఆదిరాజు చంద్ర మౌలీశ్వరరావు గారి మిల్లు ,లేక కంతేటి విశ్వనాథం మిల్లు లేక కాటూరు రోడ్డులో ఉన్న పొగాకు ముసలయ్య మిల్లు లో మర పట్టించే వాళ్ళం .మల్లయ్యగారి మిల్లు ధాన్యం చిల్లరగా అడే వారు కాదేమో ?కానీ చివర్లో మల్లయ్యగారిమిల్లులో కూడా మరపట్టించిన గుర్తు కొద్దిగా ఉంది .ఇదీ జారిపోయిన మల్లయ్యగారి మిల్లు జ్ఞాపక శకలం .
ఆత్మీయులు శ్రీ మైనేని గోపాల కృష్ణ గారికి నాకంటే ఎక్కువగా మల్లయ్యగారి మిల్లు గురించి తెలిసి ఉండవచ్చు వారి జ్ఞాపకాలు దీనికి జోడిస్తే సంతోషిస్తానని వారికి ఇందుమూలంగా తెలియ జేస్తున్నాను
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -2-1-21-ఉయ్యూరు