మహా భక్త శిఖామణులు
21-తూము లక్ష్మీ నృసింహ దాసు
జననాది విశేషాలు
భక్తీ సంగీత సాహిత్యాలకు ఆలవాలమైన సద్వంశం లో క్రీ శ 1790ప్రాంతం లో తూము లక్ష్మీ నరసింహదాసు అప్పయ్య ,వెంకమాంబ దంపతులకు జన్మించాడు .గోల్కొండ వ్యాపారులు ఆపసంభ సూత్రులు యజుశ్శా ఖాధ్యాయులు .వశిష్ట ,శక్తి,పరాశర త్రయార్షేయ పరాశర గోత్రీకులు ,తాత వెంకట కృష్ణయ్య గుంటూరుజిల్లా బాపట్లతాలూకాపొన్నూరులో ఉంటూ శ్రీ భావనారాయణ స్వామి సేవలో తరించాడు .ఈయన కుమారుడైన అప్పయ బుద్ధి ,దేహబలం తో రాజగౌరవం పొంది,వెంకమా౦బ ను పెళ్లి చేసుకొని ,గుంటూరులో స్వంతఇల్లు కట్టుకొని కాపురం పెట్టాడు .ఈ దంపతులకు నరసింహదాసు ,కృష్ణ దాసు, రుక్మాబాయి సంతానం .రుక్మాబాయిని జఘాలరావు వంశం వారికిచ్చి పెళ్లి చేశారు .దాసు ద్వయం తెలుగు సంస్కృతాలు నేర్చి రామభక్తులుగా ఉన్నారు .సంబ్రాజు వంశానికి చెందిన లక్ష్మీ బాయమ్మను నరసింహదాసుకు ,సీతమ్మను కృష్ణదాసుకు ఇచ్చి వివాహం చేశారు .
నరసింహ దాసు దంపతులకు సంతానం కలగలేదు .దాసు గారు చనిపోయాక భార్య మరిదికొడుకు రామదాసు ను పెంచి ,వైదేహి అనే అమ్మాయితో పెళ్లి చేసింది .వీరికీ పిల్లలు పుట్టలేదు .భర్త చనిపోయాక వైదేహమ్మ కూడా లక్షణ రాయడు ను పెంచుకొని పెళ్లి చేసింది వీరి సంతానం ఇప్పటికీ భద్రాద్రిలో ఉన్నారు .
భద్రాద్రి రామభక్త దాసు
రామభక్త నరసింహ దాసు బాల్యం నుండి మాట్లాడే ప్రతిమాటకు వేసే ప్రతిఅడుగుకు రామ రామ అనటం అలవాటు చేసుకొన్నాడు .దాసు ఇరవై వ ఏట తండ్రి చనిపోవటం తో కుటుంబ భారం మీద పడి,పొన్నూరులో పేష్కారు జీతం తో జీవనం సాగించాడు .రామభజన అతిధి సత్కారం, కవితా రాధన నిత్యకృత్యం . భక్తికి ఉద్యోగానికి లంకె కుదరక ఉద్యోగం మానేసి ,ఇంట్లోనే రామ మందిరం నిర్మించి ,భద్రాద్రి సీతారామ విగ్రహాలు పెట్టుకొని నిత్య భజన చేస్తూ ,గద్య పద్యాలు రాస్తూ ,భక్తిశతకాలు గేయాలు రాశాడు .
శ్రీ రంగ క్షేత్ర దర్శనం
నరసింహ దాసు క్రీ శ 1818-19 బహుధాన్య సంవత్సర కార్తీక మాసం లో శ్రీరంగ క్షేత్రానికి వెళ్లి ,పరవశంతో రంగ శాయిని దర్శించి ‘’శ్రీరంగ శాయి తారహారం’’ మకుటం తో27 సీస పద్యాలు రాసి స్వామికి సమర్పించి ,ఇంటికి తిరిగి వచ్చాడు .
భద్రాద్రి రామ దర్శనం ,కాశీయాత్ర
1820-21లో తల్లీ, భార్య ,తమ్ముడు లను సమాధాన పరచి ఒప్పించి ,విక్రమ సంవత్సరం చైత్ర శుద్ధ పాడ్యమి శనివారం రేవతీ నక్షత్రం లో ఆప్త మిత్రులతో కలిసి గుంటూరు నుంచి నడిచి అమరావతి వెళ్లి, కృష్ణా స్నానం చేసి అమరలింగేశ్వర దర్శన భాగ్యం పొంది ,అక్కడినుండి కాలినడకన భద్రాద్రి చేరి సీతారామ దర్శనం తో పులకించి –‘’అర్దికిచ్చిన ధన౦ బపుడెమరచెదట-పదిలమోహో రామ బహు పరాకు ‘’అనే అనేక సీస పద్యాలతో పరాకు పల్కి ,మళ్ళీ ప్రయాణం సాగించి అశ్వారావు పేట ,కొవ్వూరు ,రాజమండ్రి ,మీదుగా పిఠాపురం చేరి కుంతీ మాధవ స్వామిని దర్శించి ,సింహాచలం వెళ్లి వరాహ నృసింహ స్వామికి పూజ చేసి ,శ్రీకూర్మం చేరి కూర్మావతార విష్ణు సేవ చేసి ,పూరీ జగన్నాధం వెళ్లి బలరామ సుభద్రా సహిత జగన్నాధ స్వామి ని సేవించి మార్కండేయాది పుణ్య తీర్ధ స్నానాలు చేసి ,పంచ చామర వృత్తంలో –‘’పరాకు శ్రీ రమా౦గ నాస్య పద్మ పద్మ బాంధవా –పరాకనంత పద్మజాండవారపూరి తోదరా ‘’ అంటూ పొగడి అయిదు రాత్రులు గడిపి ,చాలా కష్టమైన ప్రయాణం చేసి జాజిపురం వెళ్లి అక్కడి నదిలో పితృ కార్యం నిర్వహించాడు .అప్పటికే బాగా అలసి పోవటం తో కాశీ యాత్ర చేయగలనో లేనో అనే సదేహం కలిగింది .కల కన్నాడు దాన్ని పద్యాలలో బంధించాడు –‘’బ్రహ్మాదులకు నైన బడయ సాధ్యముకాని-అప్రత హత శక్తుడైన నీవు –దురితాత్ముడంచునం ద్రోయగా జూడక –యతి దీను డీతడ౦ చాత్మ నెరిగి —- దాశరధ కుమార రామ భద్రాద్రి ధామ ‘’అని స్తుతిస్తే స్వామి అభయమివ్వగా భయం పోయిందని స్వయంగా దాసు గారే చెప్పాడు .
శ్రీరామ దయతో అభయం తో నూతనోత్సాహం కలిగి ,మర్నాడే బయల్దేరి బుద్ధ గయ వెళ్లి ,ఫల్గూ నదిలో పవిత్ర స్నానం చేసి ,విష్ణు స్వామిని దర్శించి గయా శ్రాద్ధం తో పితృదేవతలకు తృప్తి కలిగించి ,పుణ్య రాశి కాశీ చేరి పవిత్ర గంగాస్నానం విశ్వనాథ దర్శనం తో పులకించి నరసింహదాస మహోదయుడు –‘’రజతాద్రి ఇచటికి రాబోలు నేమొకొ-కాదు కాశీ సౌద కా౦తిగాని –‘’అని భక్తిగా ఆర్తిగా వర్ణించి నృత్యం చేసి ,-‘’తారక బ్రహ్మ మంత్రంబు దయ నొసంగు –హరుని కాపురమగు కాశి నరయగంటి ‘’అని తన జన్మ ధన్యమైందని ,అనుకొన్నట్లుగా రామానుగ్రహం తో కాశీ దర్శించగలిగాననీ పరమానంద పడ్డాడు .అక్కడి బిందుమాధవ ,డుంఠి గణపతి దండాయుధ కాలభైరవ అన్నపూర్ణ విశాలాక్షి దేవులను దర్శిస్తూ నిత్యగంగాస్నానం,పితృ తర్పణం తో పులకించాడు
అగస్త్య మహర్షిలాగా కాశీని విడువలేక విడువలేక విడిచి పడమరగా బయల్దేరి ,ప్రయాగ త్రివేణీ సంగమ పవిత్ర స్నానం చేసి ,విధులు నిర్వహించి మళ్ళీ కాళ్ళకు పని చెప్పి గుంటూరు అనే గర్తపురి చేరి ,తల్లి వెంకమాంబ పాద పద్మాలకు నమస్కారం చేసి గంగాజలంతో అభిషేకం చేసి ఆశీస్సులుపొంది తనరాకకోసం ఎదురు చూస్తున్న పురజనుల క్షేమం అడిగి తెలుసుకొని కొన్ని రోజులు గుంటూరులో ఉన్నాడు .
ప్రతి చైత్రం లో భద్రాద్రి రామ దర్శనం
ప్రతి చైత్రమాసం శ్రీరామనవమికి లో భద్రాద్రి వెళ్లి తన కులదైవం శ్రీ సీతారామ దర్శనం,చేసి కళ్యాణ శోభ చూసేవాడు .వృష నామ సంవత్సరం లో తమ్ముడు కృష్ణ దాసుతో కలిసి చైత్ర శుద్ధనవమికి భద్రాచలం చేరి,గోదావరీ స్నాన పులకితగాత్రుడై శ్రీరాముడికి హృదయం సీతమ్మకు కాన్కలు హనుమయ్యకు మ్రొక్కులు సమర్పించి-‘’గాయయందు నిప్పాసి కనులకు భవదంఘ్రి నీక్షింప జేసినదీవ కావె—గంగాది యాత్రలీ కలుషాత్ము జేతజే-యించి రక్షించిన దీవ కావె’’అంటూ అనేక పద్యాలతో భద్రాద్రి రామ స్తుతి చేసి మళ్ళీ గుంటూరు చేరాడు .
దక్షిణ దేశ యాత్ర
సంపదలు శరీరం బుద్బుదాలని ,సత్కార్యాచారణం చేయాలని ,తీర్ధ యాత్రలతో జ్ఞాన సౌద నిర్మాణం చేయాలనీ తల్లికీ తమ్ముడికి ధైర్యం చెప్పి మళ్ళీ దక్షిణ దేశ యాత్రకు1821-22 వృష సంవత్సర ఆషాఢ శుద్ధ విదియనాడు గుంటూరులో బయల్దేరి పొన్నూరు చేరి. భావనారాయణ స్వామిని దర్శించి పొన్నూరు వెళ్లి అక్కడి భావనారాయణ స్వామి ఆశీర్వచనం పొంది నరసింహ దాసు నెల్లూరు చేరి రంగనాథ స్వాముల దర్శనం పూజ చేసి , తిరువలిక్కేలి వెళ్లి పార్ధసారధి దర్శనం తో తృప్తి చెంది ,మద్రాస్ మీదుగా మధ్యలో ఉన్న తీర్దాలుక్షేత్రాలు చూస్తూవానకు తడుస్తూ ఎండకు ఎండుతూ చలికి వణకుతూ చిదంబర క్షేత్రానికి వెళ్లి చిదంబరేశ్వరుని దర్శనం తో ఆనందం పొంది ఆకాశలింగ దర్శనం ,నమక చమకాలతో అభిషేకం ,బిల్వదళ పూజ చేసి ,శియాళి వెళ్లి శివదర్శనం చేసి ,గౌరీ మయూరం దర్శించి ,పంచవటం చూసి, కావేరీ తీరం చేరిపుణ్యస్నానం చేసి ,మహేశునర్చించి ,కుంభకోణం లో ద్వాదశ తీర్ధాలలో స్నానించి ‘’కు౦భేశ హరహరా శంభో ‘’అని పులకితగాత్రుడై ,పంచ నాథ శివ దర్శనం చేశాడు .
నాదబ్రహ్మ త్యాగరాజస్వామి దర్శనం
,నాద బ్రహ్మ త్యాగయ్యగారి మహిమలు తెలుసుకొని దర్శన౦ తో జన్మ ధన్యమైందని భావించి ఆయన ఆదరణ పొంది ,త్యాగబ్రహ్మ తాము రచించిన కృతులను స్వయంగా గానం చేయగా పరవశింఛి , తూము నరసింహ దాస భక్తాగ్రణిఆనంద పారవశ్యంతో ‘’చేతుల దాళము పట్టుక -చేతో మోద౦బు తోడ సిగముడి వీడన్-బాతర లాడుచు మింటను –గీతము నారదుడు వాడె గృష్ణా యనుచున్ ‘’ అని పోతన గారు భాగవతం లో రాసినట్లు నారద మహర్షిలాగా నృత్యం చేశాడట నరసింహ దాసు .పాముకాళ్ళు పామే ఎరుగున్ అనే సామెత లాగ దాసు గారు త్యాగయ్యగారిని నిజంగా చూశాడా అని అనుమాన పడే వారికి ఆయనే ‘’కేవలానంద సంకీర్తనావళి వింటి –భావ సిద్ధియు శుద్ధ భక్తి గంటి –భక్తులు శిష్యులు బలసి కొల్వగ గంటి-వాజ్మాధురీ వైభవంబు గంటి –వినయ సత్సం పద్వివేకమున్ కనుగొంటి –శ్రీరామ పద భక్తి చెల్వు గంటి-యజున కందగరాని యనుభవంబును గంటి-దన్మయత్వ౦ బాత్మ దనరగ గంటి –నరసి కనుగొంటి ద్యాగరారార్యునందు-నీల సద్గుణ పుంజమి౦ కెన్నియైన –దివ్య మహిమాతి శయములు దేజరిలుట –గంటి హర్షాబ్ధినోలాడు చుంటి మదిని ‘’..త్యాగయ్య గారి సన్నిధానం లో కొన్ని రోజులు గడిపి త్యాగరాజ భక్తికి పరవశుడైనాడు –‘’‘’ . .’’రామ పదభక్తి కీ త్యాగరాయ వరుని –సమముగా నేర నెవ్వారీ క్ష్మాతలమున –బ్రేమ నా ఘను డొకసారి పిలిచె నేని –రాము డోహో యటంచు మార్పలుకునంట’-అట్టి ఘనుని యాజ్ఞనంది యచ్చోటు వాసి –కడు రయంబుతోడ గదలి సాగి – పరగ రాజిలు నవ పాషాణ మహిమంబు –నాలకించి ముదుకరిగి యరిగి ‘’ అని తన త్యాగరాజ దర్శనాన్ని చక్కగా చిత్రించాడు రికార్డ్ చేశాడు చరిత్రలో శాశ్వతంగా. భక్తులమనసు భక్తులకే తెలుస్తుంది .నరసింహదాసు త్యాగయ్యగారి చే సత్కారం పొంది దక్షిణ సముద్రం ,నవ గ్రహ శిలలు ,చక్ర తీర్ధం ,స్వేతా రంభ స్థలం ,భైరవాది తీర్ధ సందర్శనం చేసి రామేశ్వరం చేరాడు .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -3-1-21-ఉయ్యూరు ,