19వ శతాబ్ది తొలిస్త్రీ హక్కు ఉద్యమకారిణి –రమాబాయ్ రానడే (విహంగ -జనవరి 2021 )

19వ శతాబ్ది తొలిస్త్రీ హక్కు ఉద్యమకారిణి –రమాబాయ్ రానడే (విహంగ -జనవరి 2021 )

25-1-1862న కుర్లేకర్ కుటుంబంలో మహారాష్ట్ర సాంగ్లీ జిల్లా దేవ్రస్ట్రే గ్రామం లో రమాబాయ్ రానడే జన్మించింది .బాలికా విద్య నిషిద్ధమైన ఆకాలం లో తండ్రి ఆమె ను చదివించలేదు .భారత సా౦ఘికసంస్కరణోద్యమ మార్గ దర్శకుడు,మహా విద్యావేత్త ,ఆదర్శవాది , జస్టిస్ మహాదేవ గోవింద రానడే కు ఈమెనిచ్చి 11ఏటనే తండ్రి పెళ్లి చేశాడు . అత్తవారింటిలోనూ స్త్రీ విద్యకు ఆదరణ లేకపోయినా, భర్త రానడే మాత్రం భార్య రమాబాయ్ విద్యకు సర్వవిధాలా సాయం చేసి తనకు సాంఘిక ,విద్యా సంస్కరణలకు తోడ్పడేట్లు ఆదర్శంగా తీర్చి దిద్దాడు .భర్త ప్రేరణతో రమాబాయ్ మహిళా విద్యకు స్వావలంబనకు ,ఆర్ధిక స్వాతంత్ర్యానికి జీవితం అంకితం చేసింది.

రానడే బొంబాయి ఎలిఫిన్ స్టన్ కాలేజి లో ఇంగ్లిష్ ,ఎకానమిక్స్ ప్రొఫెసర్. ‘’ప్రిన్స్ ఆఫ్ గ్రాడ్యుయేట్స్’’అని గౌరవంగా అనిదరి చేతా పిలువబడేవాడు .అలాంటివాడు చదవటం రాయటం కూడాతెలీని నిరక్షరాస్యురాలు రమబాయ్ ని పెళ్లి చేసుకొని అక్షరాలతో సహా అన్నీ నేర్పి విద్యావంతురాలినీ మహిళా సంస్కరణోద్యమ నాయకురాలినిగా తీర్చి దిద్దాడు .సమాజంలోని చెడును సహించే వాడు కాదు .అస్పృశ్యత ,బాల్యవివాహం ,సతీ సహగమనాలకు వ్యతిరేకి .తన ఆదర్శాల ప్రచారం ,అనుసరణకోసం ‘’సర్వ జనిక్ సభ ‘’స్థాపించి సా౦ఘికాభి వృద్ధికి ఎన్నో ఉద్యమాలు నడిపాడు .ముప్పై ఏళ్ళ వయసులోనే రానడే మహారాష్ట్ర౦ లో గొప్పపేరు ప్రఖ్యాతులు పొందాడు .అత్యధిక ఆలోచనాతత్వం ,క్రియాశీలమైన దృష్టి,సంఘం పట్ల అంకితభావం భార్య రమాబాయ్ ని ఉత్తేజితం చేసి ,భావి సాంఘిక కార్యక్రమాలకు బాట వేసింది .

సంస్కరణ ముందు తనతో ప్రారభం కావాలని తానూ విద్యనేర్చి భర్తతో సమాన స్థాయి సాదిస్తేనే సమాజం తన మాటవిని విలువనిస్తుందని గ్రహించింది.దీనికి ఆమె కుటుంబం అత్తవారిల్లు ఎన్నో అడ్డంకులు కలిపించినా ,మొక్క వోని ధైర్యం తో ముందుకే మును ముందుకే సాగింది .భర్త రానడే ఆమెకు ముందు మరాఠీ భాష చదవటం రాయటం నేర్పాడు .తర్వాత చరిత్ర భూగోళం లెక్కలు ఇంగ్లిష్ నేర్పాడు .వార్తా పత్రికలన్నీ చదివించి ,వాటిలో ఉన్న ఆనాటి విషయాలపై తనతో చర్చించటం నేర్పాడు .క్రమ౦గాఉత్తమ విద్యార్ధినిఅయి తర్వాత కార్యదర్శి గామారి,నమ్మకమైన స్నేహితురాలు అయింది .1882లో పండిత రమాబాయ్ విధవరాలుగా పూనా వచ్చినప్పుడు,రానడే దంపతులు ఆమెకు అన్నిరకాల సహాయం చేసి ,తమ ఇంట్లోనే పండిట్ రమాబాయ్ కి క్రిస్టియన్ మిషనరీ లేడీ తో ఇంగ్లిష్ పాఠాలు బోధి౦ప జేశారు .

మొదటి సారిగా రమాబాయ్ నాసిక్ హైస్కూల్ లో ముఖ్య అతిధిగా ప్రజలలో కనిపించింది .ఆమె ఉపన్యాసాన్ని భర్త రానడే రాసిచ్చాడు .తర్వాత ఆమె స్వయంగా బహిరంగ సభలలో బాగా మాట్లాడటం ప్రారంభించి మరాఠీ ,ఇంగ్లీష్ లలో అద్భుత ప్రసంగాలు చేసి అందరి హృదయాలను ఆకర్షించింది .ఆమె ప్రసంగాలు స్పష్టంగా మనసుకు హత్తుకోనేట్లు ఆకర్షణీయంగా ఉండేవి .తర్వాత బొంబాయి లోని ప్రార్ధన సమాజ్ లో పని చేసింది .ఆర్య మహిళా సమాజం సంస్థను స్థాపించింది .1883నుంచి 1901వరకు ఎనిమిదేళ్ళు సాంఘిక సేవా కార్యక్రమాలలో ఉద్ధృతంగా పాల్గొని , బహుళ ప్రచారం పొందింది .’బొంబాయ్ లో ’హిందూ లేడీస్ సోషల్ అండ్ లిటరరి క్లబ్ ‘’స్థాపించి భాషలలో ,జనరల్ నాలెడ్జి లో ,టైలరింగ్ ,చేతి పనులలో అనేక తరగతులు నిర్వహించి శిక్షణ నిచ్చింది .

1901లో భర్త రానడే మరణించాక రమాబాయ్ బొంబాయి నుంచి పూనా కు మకాం మార్ఛి ,పూనా మార్కెట్ దగ్గరున్న పాత వారసత్వ ఇంట్లో ఉంటూ ఒక ఏడాది ఒంటరి జీవితం గడిపింది .తర్వాత జనజీవన స్రవంతి లో కలిసి ,మొదటి సారిగా బొంబాయి లో ‘’భారత్ మహిళా పరిషత్ ‘’స్థాపించింది .భర్త చనిపోయాక 23ఏళ్ళు జీవించి కాలమంతా సాంఘిక జాగృతికోసం ,బాధితుల ఓదార్పు సాయం లో బాదితుల పునరావాసం కోసం, సేవ సదన్ నిర్మాణం లో క్షణం తీరిక లేకండా అంకిత భావంతో పని చేసింది .భర్త ఉండగానే 1878లోనే సేవారంగం లో కాలుపెట్టిన రమాదేవి, భర్త 1901లో చనిపోయాక పూర్తిగా మహిళాసేవా కార్యక్రమాలలో మునిగి పోయింది .తరచుగా సెంట్రల్ జైలు సందర్శిస్తూ ,అందులో ముఖ్యంగా మహిళా విభాగం లో జరిగే విషయాలు స్వయంగా తెలుసుకొనేది .బాలుర సంస్కరణ స్కూల్ కు కూడా వెళ్లి ,బాలురతోమాట్లాడుతూ యోగక్షేమాలు కనుక్కొంటూ ముఖ్యమైన పండుగ రోజులలో స్వీట్స్ పంచి పెట్టేది .స్థానిక ఆస్పత్రులను సందర్శించి రోగుల వైద్య సదుపాయాల విషయం అడిగి తెలుసుకొంటూ వారికి పండ్లూ ,పుష్పాలు ,పుస్తకాలు అందించేది .

1913లో గుజరాత్ కధియవాడి లకు వెళ్లి ,క్షామ బాధితులకు పునరావాస సౌకర్యాలు కల్పించింది .చివరి రోజుల్లో కూడా ఆనందికి వెళ్లి ఆషాఢి,కార్తీక ఉత్సవాలలో పాల్గొన్నది .తనతో పాటు సేవాసదన్ కార్యకర్తలను తీసుకు వెళ్లి సంత్ జ్ఞానేశ్వర్ దేవాలయం సందర్శించే మహిళా యాత్రికులకు సహాయం చేయించింది .అనేక కొత్త తరహా మహిళా సాంఘిక సేవాకార్యక్రమాలు ప్రారంభించింది .రామ కృష్ణ గోపాల భండార్కర్ ,భజేకర్ ల అభ్యర్ధన మేరకు రమాబాయ్1904లో బొంబాయి లో జరిగిన అఖిలభారతీయ మహిళా సదస్సుకు అధ్యక్షత వహించింది .

పార్సి సాంఘిక సంస్కర్త బి.ఎం .మల్బరీ ,దయారాం గిడుమాల్ లకు మహిళలకు నర్స్ ట్రెయినింగ్ సెంటర్ ప్రారంభిస్తే ప్రయోజనకరంగా ఉంటుందని ఆలోచన వచ్చి రమాబాయ్ ను కలిసి మార్గదర్శనం చేయమని కోరగా బొంబాయి లో సేవాసదనం ప్రారంభించింది .1915లో పూనా సేవాసదన్ ను ఆమె ఆధ్వర్యం లో సొసైటీగా రిజిస్టర్ చేయించింది .ఈ సొసైటీ పాత విద్యా విధానం తోపాటు అనేక కొత్త పద్ధతులు కూడా ఉండేట్లు విద్యా శాఖలు ,ఏర్పాటు చేసింది .తర్వాత వుమెన్స్ ట్రెయినింగ్ కాలేజి,మూడు హాస్టళ్ళు ఏర్పరచింది .అందులో ఒక హాస్టల్ మెడికల్ విద్యార్ధులకు ,మరొకటి ప్రోబేషనరి నర్సులకు ఉపయోగకరంగా చేసింది .1924నాటికి పూనా సేవాసదనం వివిధ శాఖలలో వెయ్యిమందికి పైగా మహిళలకు శిక్షణ నిచ్చింది .ఇంత అభివృద్ధి జరగటానికి రమాబాయి దూర దృష్టి, నిరంతర పర్యవేక్షణలే కారణం .ఉచిత నిర్బంధ ప్రాధమిక విద్య బాలికలందరికి అందజేయటం ఆమె సంకల్పం .బొంబాయి ప్రెసిడెన్సి లో మహిళలకు ఓటు హక్కు కోసం పెద్ద ఉద్యమాలు 1921-22లలో నిర్వహించింది .

మహాత్మా గాంధీ రమాబాయిమరణించినపుడు ఆమె సేవాతత్పరతను ప్రశంసిస్తూ ‘’ The death of Ramabai Ranade is a great national loss. She was the embodiment of all that a Hindu widow could be. She was a true friend and helpmate of her illustrious husband in his lifetime..’’ After his death she chose her husband’s reform activities as her life’s aim. Justice Ranade was a reformer and deeply concerned about the uplifting of Indian womanhood. Ramabai put her heart and soul into Seva Sadan. She devoted her whole energy to it. The result is that Seva Sadan has become an institution with no second of its kind throughout India.”అన్నాడు.

సేవాసదన్ లో మొదట చేరిన విద్యార్దినులంతా విధవరాళ్ళే.ఒకసారి సేవాసదన్ వార్షిక సమావేశం జరిగినప్పుడు బహుమతి ప్రదాన ఉత్సవానికి రమాబాయ్ ఆ నాటి సంప్రదాయ భారతీయ విధవరాలు ఎలా ఉంటుందో అదే విధంగా బోడిగుండుతో ,ఎర్రచీరతో ,కొంగు నెత్తి మీద పూర్తిగా కప్పుకొని హాజరైంది .వేదిక ఎక్కుతున్నప్పుడు విద్యార్ధులంతా పిల్లికూతలు అరుపులు చప్పట్లు తో గేలి చేశారు .ఆమె ఒక్కసారిగా ‘’మీరు కాలేజి విద్యార్ధులు. ఈ గందరగోళం చూస్తె విద్యార్దులేనా అని అనుమానం గా ఉంది .సమాజపు కట్టుబాట్లలో నలిగి పోతున్నమీ సోదరీమణులకు మీరిచ్చే మర్యాద ఇదేనా ?ఇదేనా మీ సంస్కారం ?వారి దయనీయ స్థితికి మీరు జాలిపడరా ?మీ ఇళ్ళల్లో ఇలాంటి విధవ ఆడపడుచులు, తల్లులూ లేరా ?కనీస గౌరవ మర్యాదలు వారికి చూపలేరా ?”’అని తీవ్రస్వరం తో మాట్లాడగా అందరు సిగ్గుతో తలదించుకొని మౌనం వహించారు ఆమె మాటలు వాళ్లకు హంటర్ కొరడా దెబ్బలే అయినాయి .

రమాబాయి బాల్య వివాహాలకు వ్యతిరేకంగా తీవ్రంగా కృషి చేసింది .ఆమె స్థాపించిన సేవాసదన్ లు ఎందరెందరో నిర్భాగ్య మహిళలకు ఆసరాగా ఉన్నాయి .పూనా సదన్ ను తన పూర్వ స్వగృహం లోనే ప్రారంభించింది .ట్రెయినింగ్ కాలేజీలు ,వృత్తి విద్యా కేంద్రాలు ,అమ్మకాల సెంటర్లు మొదలైనవన్నీ ఏర్పరచింది .రమాబాయ్ అంటే సేవా సదన్ కు మారుపేరు అయి ప్రఖ్యాతి చెందింది .మధ్యతరగతి స్త్రీలసంక్షేమమమే ఆమె ధ్యేయం .గవర్నర్ ఏర్పాటు చేసిన వార్ కాన్ఫరెన్స్ లో పాల్గొని భారతీయ స్త్రీల గురించి వివరించింది .ఫిజి ,కెన్యా దేశాలలో భారతీయ కూలీల సంక్షేమం కోసం కృషి చేసింది .స్త్రీల వోటు హక్కుకోసం నిరంతర పోరాటం చేసింది .అలుపు లేకుండా ఇన్ని సేవాకార్యక్రమాలు చేసిన రమాదేవి తాను తనభర్త మహాదేవ గోవింద రానడే గారి నీడ నే అని వినయంగా చెప్పేది .నిరంతర సేవా కార్యకర్త,చిరస్మరణీయురాలు,మహిళా మాణిక్యం రమాబాయ్ రానడే 62వ ఏట 25-1-1924న మరణించింది.

-గబ్బిట దుర్గాప్రసాద్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~adu~~

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.