మహా భక్త శిఖామణులు
22-కూర్మ దాసు -1
పంగుం లంఘ యతే గిరీం
ఇలపావులూరి వెంకట సుబ్బయ్య అనే కూర్మ దాసు బాగా బీద వాడు విద్యా శూన్యుడు ,సుందర దేహుడు .తండ్రి శ్రీనివాసులు ,తల్లి ఆదెమాంబ . సోదరులు వెంకట కృష్ణయ్య ,సీతారామయ్య .19వ శతాబ్దం లో దాసు జననం .జన్మతోనే కుంటి వాడు .నివాసం కందుకూరు తాలూకా సింగమనేని పల్లె ..అక్షరాభ్యాసం తోనే భక్తి బీజం మొలకెత్తి,క్రమంగా పూలు పళ్ళూ కాసి స్థిరపడింది .ఉపనయన వేడుకా జరిగింది .భజన మండలి స్థాపించి నిత్య భజనలు చేస్తూ రామ, కృష్ణ ,నరసింహ జయంతులు జరిపేవాడు .
వెంకట కృష్ణయ్య కూర్మదాసు అవటం
ఆకాలం లో మహాద్భుత తరంగ గానం చేసేవాడు ఏలేశ్వరపు సీతారామాంజనేయులు .ఈయన్ను కలవాలని కోరిక ఎక్కువగా ఉండేది.డబ్బు లేదు కాళ్ళూ లేవు .దేవుడిపై భారం వేసి చంకకర్రల సాయం తో ,నడిచి మజిలీలు చేస్తూ ,ఒంగోలు రైల్వే స్టేషన్ లో ఒక ఉదారుని సహాయం తో వెల్లటూరు చేరి ,అక్కడ మల్లాది సుబ్బావదానులుచేసే సప్తాహం లో పాల్గొనటానికి వెడుతున్న సీతారామాంజనేయులు గారిని కలిసి ఆయనతో వల్లభాపురం వెళ్లి సుబ్బదాసు గారినిదర్శించి ఆయన అభిమానం పొందభక్తి ,ఇతడి తత్పరతకు సుబ్బదాసు గారు ఆశ్చర్యపడి హస్తమస్తక న్యాయంగా ఆశీర్వ దించి ,అలనాటి పాండురంగని భక్తుడైన కూర్మ దాసు లాగా ప్రసిద్ధి చెందమని ‘’కూర్మ దాసు ‘’అనే పేరు పెట్టి పిలవటం ప్రారంభి౦చగా లోకం అంతా కూర్మదాసు అనే పిలవటం మొదలెట్టారు . సుబ్బదాసు గారు బాలకృష్ణ లీలా తరంగాలతో మైమరపించారు పొద్దు గుంకి చాలా సేపయింది ఎవరికీ బాహ్య జ్ఞానం లేదు అందరూ అంతర్ముఖులై దివ్య గాన లీలలో తన్మయు లయ్యారు .అందరి చేత స్నానాలు చేయించి కొత్త బట్టలు ఇచ్చి షడ్రసోపేత భోజనం పెట్టి చందన తాంబూలాలతో సత్కరించి ,సుఖా సీనుల్ని చేసి సుబ్బదాసు గారు కూర్మ దాసుతో ‘’’నాయనా !నా లాంటి కుటుంబీకుడు ఇలాంటి సప్తాహాలు నిర్వహించటం కష్టం .నువ్వు కుంటి అని దిగులు పడకు . అది దేహానికే కాని మనసుకు కాదు నువ్వు ఈ సప్తాహ కాలక్షేపం నిర్వహిస్తూ దేశం లో పేరు పొందాలి ఇదిగో నిరతాన్న దాన శిరోమణి వరంగల్లు వరమ్మ గారు .వారి ఆశీస్సులు పొందు శుభం జరుగుతుంది ‘’అనగా ఆమెకు నమస్కరింఛి ఆశీస్సులు పొందాడు కూర్మ దాసు .
పాండురంగ సప్తాహం
పాండురంగ సప్తాహం జరపాలని కూర్మ దాసుకు అనిపించగా వరమ్మగారి సహాయంతో పండరీపురం వెళ్లి పాండురంగ స్వామిని దర్శించి ,సప్తాహ దీక్షలు నిర్విఘ్నంగా జరిగేట్లుదీవించమని ప్రార్ధించి ,కొన్ని రోజులుండి,అక్కడి నుంచి తెనాలి చేరి ,తురగా కృష్ణయ్య గారింట్లో జరిగిన భజనలో పాల్గొని ,ఈమని చేరి నేలనూతుల సుబ్బావధానులు గారింట బస చేసి,ఉపవాస దీక్ష చేసి బ్రహ్మ సత్రం చేయటానికి సిద్ధార్ధి సంవత్సర ఆషాఢశుద్ధ పంచమి శుభ ముహూర్తంగా ఏర్పాటు చేసుకొని ఊరివారికి తెలియ జేయాలను కొంటె అక్కడ వైదిక ,నియోగి తగాదాలు తీవ్రంగా ఉండటం తో,చందాలు ఇచ్చేవారెవరూ ముందుకు రాకపోతే ఇక మూడే మూడు రోజులు గడువు ఉందనగా ,ప్రజలేకాక వాతావరణమూ అనుకూలంగా లేకపోగా ఆ రోజు స్వప్నం లో శ్రీరామ లక్ష్మణులు వైష్ణవ వేషం లో సాక్షాత్కరించి ,ముహూర్తాన్ని నవమికి మార్చి కరపత్రాలు పంచిపెట్టమని ,మిగిలిన పనులు తామే చూసుకొంటామని అభయమిచ్చారు .
ప్రోగ్రాం పేపర్లు ముద్రించటం ,పందిళ్ళు వేయించటం సుబ్బావదానులుగారు ఖర్చుతో పూర్తి చేశారు .పెద్దిరాజు మహాలక్ష్మమ గారిని మొదటి రోజు కు ఉభయం ఇమ్మని కోరితే బదులు చెప్పకుండా తలూపి వెళ్ళింది .నిరాశ పడిన దాసు గారు ,మండపం నిర్మించి అర్చా మూర్తులను ఏర్పాటు చేశారు .అర్ధరాత్రి దాటాక వరలక్ష్మమ్మ గారు అయిదు వందల రూపాయల పళ్ళెం తో వచ్చి అంద జేసి ,రామాజ్ఞతో మిగులు తరుగు బాధ్యతలన్నీ తనవే అని చెప్పి వెళ్లి పోయింది .మర్నాడు నుంచి బ్రహ్మ సత్రం మొదలై రోజూ ఎవరో ఒకరు ఉభయ౦ ఇవ్వటానికి ముదు కురాగా కొత్తపల్లి ,నిడమానూరు ,మైనం పాడు నుంచి వచ్చిన భక్త బృందాలకు ఘన సత్కారాలతో బ్రహ్మ సత్రం దిగ్విజయంగా ముగిసింది .దాసుగారి సప్తాహాలలో జాతి కులమత విచక్షణ లేదు అన్ని క్రతువులలో పాళీ భక్త బృందమే పాల్గొనేది
ఒంగోలు సప్తాహం
ఒంగోలు సప్తాహం లో మూడవరోజు నృసింహో పాసకురాలైన కైవారం బాలాంబ గారిని శా౦తపరచటానికి 108బిందెల పానకం ,బస్తా వడ పప్పు నైవేద్యం పెట్టగా యాత్రికుడికి ఒక గిద్దెడు మాత్రమే పానకం లభించింది అంటే ఎంతమంది వచ్చారో ఊహించ లేము లక్షలాది జనం వచ్చారని భావించారు .ఆరోజుల్లో ఉచ్చిష్ట పాత్రలను తొలగించటానికి రెండు రెండెడ్ల బళ్ళు అనుక్షణం పని చేసేవి .రెండవ రోజు తరంగ గాన భజనలో ఒళ్ళు మరచిబ్రహ్మానంద పరవశంతో నృత్యాలు చేశారు.దాసు గారు అక్కడికి రాగానే కోటి సూర్య ప్రకాశమైన ఆత్మజ్యోతి కూర్మ దాసుగారిని ముంచేసి ,ప్రేక్షకులు చూస్తుండగా అజ్ఞాన అంధకారాన్ని పటాపంచలు చేసింది .ఈ అద్భుత సంఘటన చూసిన నీలంరాజు బాలాంబ గారు ,చలపతి రావు దంపతులు మిగిలిన నాలుగు రోజుల ఉభయానికి 6 వేల రూపాయలు దాసుగారికి సమర్పించి కృతతకృత్యులై క్రతు సమాప్తికి గొప్పగా తోడ్పడ్డారు .బ్రహ్మ సత్రం లో రోజుకు రెండు నీలిమందు కళాయీల నెయ్యి ఖర్చయ్యేది .దాసుగారు ఎక్కడ సత్రం నిర్వహించినా ఇంతభారీగా జరిగేవి .ప్రజల స్పందనా తోడ్పాటు కూడా వర్ణించ నలవికానిదిగా ఉండేది .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -6-1-20-ఉయ్యూరు