మహా భక్త శిఖామణులు
23-భద్రాద్రి ‘’అన్నపూర్ణ సత్ర’’ నిర్వాహకుడు -వెంకట రమణ బ్రహ్మ చారి
జనన విశేషాలు
గుంటూరు జిల్లా అలవలపాడు లో ఆరు వేల నియోగుల కుటుంబం లో పుట్టిన వెంకట రమణ బ్రహ్మ చారి తండ్రి సుబ్బ రామయ్య .పొట్టిగా సన్నగా ,ఎప్పుడూ ధావళీ గోచీ తో మాత్రమే తిరిగేవాడు .గోదావరి నుండి నీళ్ళు మోసుకొని వచ్చి ,తన సత్రానికి అందించే వాడు .ఆసత్రానికి యజమాని వంటవాడు నీళ్ళవాడు ,పూజారి సేవకుడూ అన్నీసుబ్బ రామయ్యే .ఆల్ ఇన్ వన్.15వ ఏట భార్య చనిపోతే కొడుకును తీసుకొని భద్రాచల సీతారామ కల్యాణం చూడటానికి వెళ్లి చూసి ఆన౦దం పొంది అక్కడే ఉండి పోవాలనుకొని ,భిక్షా పాత్ర చేబట్టి వచ్చేదానితో తానూ కొడుకు జీవిస్తూ అతిధి అభ్యాగతులను కూడా ఆదరిస్తూ ,కొంతకాలానికి చనిపోయాడు .
భద్రాద్రిఅన్న పూర్ణ సత్రం
అన్న పూర్ణ ఉపాసకుడైన వెంకట రమణ తండ్రి మార్గం లోనే,శునక సూకరాలకూ ఇంతపెడుతూ జీవిస్తూ ధన్యుడయ్యాడు.21వ ఏట ‘’అన్నపూర్ణ సత్రం ‘’అనే పేరుతొ ఒక కుటీరాన్ని యాత్రికులకు ఒక పాకను నిర్మించి ,దేవమందిరంగా మరో గుడిసె వేసి అన్నదానం నిర్విఘ్నంగా సాగిస్తూ క్రమంగా సత్రాన్ని పెద్ద అన్న దాన సత్రంగా మార్పు చెందించాడు .వంటపాత్రలు మొదలైన సామగ్రి కూడా బాగా సమకూర్చాడు .బ్రహ్మ చారి చేతిలో చిల్లి గవ్వ లేదు .ఆ వూరు వదలి ఎక్కడికీ వెళ్ళే వాడు కాదు .సత్రం అరణ్య౦ దగ్గరలో ఉండటం ,ధనవంతులు అక్కడ లేకపోవటం ఇబ్బందే కానే సత్రం మూడు పూలు ఆరుకాయలుగా దిన దినాభివృద్ధి చెంది అందరికీ ఆశ్చర్యం కలిగించింది .తూము నరసింహదాసు గారు పూజించిన అర్చా మూర్తుల పూజ ను బ్రహ్మ చారి గారు భక్తీ శ్రద్ధలతో అర్చిస్తున్నారు .
శ్రీరామమహిమ
ఒకసారి సీతారామ కల్యాణానికి అనుకోకుండా వేలాది యాత్రికులు వచ్చి గోదావరీ స్నానం చేసి ఈ సత్రానికి భోజనాలకు వచ్చారు .వండిన పదార్ధాలు చాలా స్వల్పం గానే ఉన్నాయి .అంతమందికి చాలవని భయపడుతూ వంటవాళ్లు భగవరాదనలో ఉన్న బ్రహ్మ చారి గారికి .ఆయన చాలా నిబ్బరంగా వంట శాలకు వెళ్లి ‘’శ్రీరామానుగ్రహం ఉంటే మనకు తరుగు లేదు .ముందు వడ్డన పని మొదలు పెట్టండి ‘’అని చెప్పి ,ఆ పదార్ధాలపై ఒక వస్త్రం కప్పి , చేతులు జోడించి నందీశ్వర సాన్నిధ్యం పొంది ‘’భగవానుని గుణగానం చేసి ,నరసింహదాసు గారి అర్చా వైభవం ఎవరు పొందారో ,నా పూర్వజన్మ సుకృతం తో నాకు నాపూజలో ఆత్మ స్వరూపుడుగా ఉన్నడో,ఆ శ్రీ రామ చంద్ర మూర్తి ఈ అన్నోదకాల చేత భూత సంతృప్తి గావించి అనుగ్రహించుగాక ‘’అని చెప్పి యాత్రికులతో –
‘’తక్కువ లేదు నాకు నిరతంబు సుదర్శన చక్ర ధారియై –ప్రక్కల నిల్చి లోపముల బారగా దోలుచు ,సౌఖ్య సంతతుల్ –మిక్కిలి కూర్చు మించు దయ మేలు లొనర్చెడి రాము డుండ –నాకెక్కడి లేము లెక్కడివి,ఇష్ట ఫల వ్యతి రేక సంగతుల్ ‘’అని చెప్పి వడ్డన మొదలుపెట్టమని వంటవారికి చెప్పి తన పూజా మందిరం లోకి వెళ్లి స్వామికి మంత్రం పుష్పం చెప్పి పూజ ముగించారు .పంచ భక్ష్య పరవాన్న విందు భోజనాలు తృప్తిగా ఆరగించి బ్రహ్మచారి గారి ప్రభావాన్ని స్తుతిస్తూ సీతారామ దర్శనం చేసి కల్యాణ౦ చూసి ,నిత్యం ఈ సత్రం లోనే భోజనం చేసి ,బ్రహ్మచారి గారి సత్కారాలుపొంది సంతృప్తిగా స్వగ్రామాలకు వెళ్లి పోయారు .
మారు వేషాలలో రామ లక్ష్మణ దర్శనం
ఇంకో సారి ఉత్సవాల రోజుల్లో ఒఅ రోజు పగలు రెండు జాములవరకు వంట పదార్ధాలు లేకపోవటం తో వంటవాళ్లు భయపడి పారి పోయారు ,రామపాదాలపై వ్రాలి ‘’ఈ కష్టాన్ని ఎలా తీరుస్తావో నీదే భారం ‘’అంటూ స్తోత్రగానాలు చేసి –‘’తిరు రేఖ లేర్పడ తిరునామములు బెట్టి –దౌత వస్త్రంబులు దనర గట్టి –తులసి పేరులు మెడ దులకరి౦పగ దాల్చి-ననెమ్మేన గంధంబు నెరి దగిల్చి -వెడ నుత్తరీయముల్ నడుములకు న్జుట్టి-పూల దండలు శిఖ వ్రేలగట్టి –కుడి చేత జపమాల కొమరొప్పగా బూని – ఎడమచే బళ్ళెము లెనగ న౦ది –గక్ష భాగంబుల బుస్తకముల బూని-నలుపు నెరుపు గల మేను లరచు చుండ –బొడుగు గల వైశ్యు లిరువురు వడివడిగ వచ్చి – రా భూసురోత్తమ వసతి కడకు ‘’ వారిద్దరూ బ్రహ్మ చారి దగ్గరకు వెళ్లి నమస్కరించి ‘’అయ్యా !ఒకసారి సీతారాములకు మా ఆపద తీరితే రెండు వందల రూపాయలు మొక్కు చెల్లిస్తామని మొక్కుకొని అది తీర్చు కోవటానికి ఇప్పుడు వచ్చాం’’అని చెప్పి ఒకపళ్ళెం నిండా ఉన్న ఆడబ్బు రెండు కొబ్బరి కాయలు తాంబూలం కర్పూరం సమర్పించగా బ్రహ్మ చారి గారు పరమానందం తో కొబ్బరికాయలు కొట్టించి హారతిప్పించి ,కట్నం చదివించి ,వారిద్దరిని అన్నప్రసాడం భోజనం చేసి వెళ్ళమని కోరి వారిది ఏవూరో చెప్పమంటే ‘’మేము తూర్పు దేశ వైశ్యులం కుటుంబం తో సహా వచ్చి గోదారి తీరాన మీ కుటీరం లో ఉన్నాం .మొక్కు తీర్చుకొని స్వామి దర్శనం చేసి వెడతాం .మా వాళ్ళు మా కోసం ఎదురు చూస్తుంటారు ‘’అని చెప్పి అదృశ్యమయ్యారు .ఆ ధనం తో పదార్ధాలు తెప్పించి వంటవాళ్లు లేకపోవటం తో తాననే గరిటకు పని చెప్పుదామని అనుకొంటుంటే –‘’పవిత్ర గోదావరి స్నానం చేసి నుదుట విభూతి తో పిలక జుట్టు నీర్కావి ధోవతి తడిపొడి బట్టలతో ,అన్గోస్త్రాలతో చేతులలో ఉదకపాత్రలతో వేదపనసలు చదువుతూ సత్రం ఎక్కడుంది అని వెతుకుతూ ఇద్దరు వచ్ఛి ‘’బీదవాళ్ళం వంట చేస్తాం .మీ సత్రం లో వంట పని మాకు ఇవ్వండి .మాపని మీకు ఎప్పుడు ఇష్టం లేకపోతె అప్పుడే వెళ్ళిపోతాం ‘’అని చెప్పి బ్రహ్మ చారి చేతిలో ఉండే రెండు జలపాత్రలనూ చేరోకటి తీసుకొని స్నానానికి గోదావరికి వెళ్ళారు .బ్రహ్మచారి గారు పూజామందిరం లో భగవంతుని లీలకు కృతజ్ఞతలు చెప్పుకోనగా ,వారిద్దరూ వచ్చి అద్భుతంగా వంటలు చేయాగా ,స్వామికి సహస్రనామార్చన చేసి నైవేద్యం పెట్టి ‘’రంగ!ఆరగింపు ‘’అని వేడగా ,ఎక్కడి నుంచో ఒక పాము సర్రున వచ్చి నైవేద్యాన్ని ఆఘ్రాణించి బ్రహ్మ చారి గారి తొడపై కెక్కి హాయిగా ఆడింది ,భోజనాలు పూర్తయ్యాయి .ఆ ఇద్దరు వంట కుర్రాళ్ళు గోదావరికి వెళ్లి వస్తామని చెప్పి మళ్ళీ రాలేదు .సర్పమూ మాయమైంది .
అంటూ భోజనం చేయకుండానే రామ మంత్రం జపిస్తూ ,తెల్లవార్లూ జాగారం చేశారు .మర్నాడు ఉదయం ఈ వార్త తెలుసుకొన్న పురజనులు వచ్చి శ్రీరామ దర్శనం పొందిన ఆయనను అభినందించారు .
గోదారి నీరే నెయ్యి
మరో సారి ఒక బ్రాహ్మణ సమారాధనకు నెయ్యి లేదు .అభ్యాగతులను భోజనానికి కూర్చోమని చెప్పి ,ఇద్దరు వంట వాళ్లకు చెరో నేతిపాత్రలిచ్చి ‘’’గోదావరికి వెళ్లి ఈ రెండు పాత్రలనిండా నెయ్యి అప్పుగా ఇవ్వమని చెప్పి నీటిని నింపుకొని రండి ‘’అని పంపారు .వాళ్ళు ఇంటికి వచ్చేలోపు నీరు నెయ్యిగా మారిపోయి ఆశ్చర్యం కలిగించింది .దానితో వడ్డన పూర్తి చేసి అందరికీ సంతృప్తిగా అన్న సమారాధన జరిపించారు .
గురు- శిష్యులు
ఈ సత్రం లోనూ ,మరికొన్ని చోట్లా ఊరు పేరు లేని ఒక పిచ్చి వాడు తిరిగే వాడు .సన్నగా పొడుగ్గా చామనచాయతో చింపిరి బట్టలతోమూట, చిళ్ళ పెంకుల హారం తో ఉండేవాడు .బ్రహ్మ చారిగారు అతడిని అత్యధికంగా ప్రేమించేవారు .ఆయన ఎవరు అని ఎవరైనా అడిగితె ‘’నా గురువు ‘’అనిచేప్పేవారు .అతడిని అడిగితే ‘’బ్రహ్మ చారి నా శిష్యుడు ‘’అనేవాడు అతడికి భోజనం పెడితే కానీ ,బ్రహ్మ చారిగారు భోజనం చేసేవారు కాదు .అతడు అన్నం తింటుంటే వెంట రెండు కుక్కలు ఉండి అవికూడా తినేవి .ఇలా నిరతాన్న దానాన్ని వెంకట రమణ బ్రహ్మచారి 40 ఏళ్ళు నిర్విఘ్నంగా నిర్వహించి ,ఈ భారమంతా వకీలు తుంగతుర్తి నరసింహారావు గారికి అప్పగించి క్రీ శ.1919లో శ్రీరామ రంగైక్యం పొందారు .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -8-1-21-ఉయ్యూరు