సర్వ సమర్ధులైన ముగ్గురు మహిళా మణులు తమ కిష్టమైన కవిత్వ ప్రక్రియలో త్రివిక్రమం చూపి ,తమ సేవా భావాన్ని చాటి ,తమలోని కళా మహిమను వెలువరిస్తూ ,సాటి కళాత్మక విలువలను మెచ్చుతూ ,తమ కిష్టమైన రంగం పేరును తమ కవితా శతానికి పేరుపెట్టి’’ కవితా ‘’త్రయి’’గా 2000 డిసెంబర్ లో వెలువరించి ‘’సహస్ర కవిమిత్ర త్రిపుర సంగమం ‘’గా వెలువరించి నిన్న 10 వ తేదీ ఆదివారం నాకూ మా శ్రీమతికీ మల్లవరం చర్ల దంపతుల వృద్ధాశ్రమం లో చర్ల వారిసాహిత్య, సేవా పురస్కారం అందజేసే సందర్భంగా నాచేత ఆవిష్కరింప జేసి నాకు గొప్ప అదృష్టాన్ని కల్పించారు .ఆ ముగ్గురు విదుషీమణులే డా చర్ల సిస్టర్స్ ,శ్రీమతి నారుమంచి వాణి ప్రభాకరి డా చర్ల విదుల గారి శతకవితలు ‘’సేవా మంజరి ‘’గా ,డా చర్ల మృదులగారి కవితా శతం ‘’కవితా కలశం ‘’గా ,శ్రీమతి వాణీ ప్రభాకరి గారి వంద కవితలు ‘’సంగీత సాహిత్య రవళి ‘’గా చోటు చేసుకొని మనోల్లాసం కల్గించాయి .
1-సేవా మంజరి –లో శ్రీమతి విదులగారు-అష్టనామాలతో వెలుగొందే వెనకయ్యను స్తుతించి నారాయణ స్తుతిచేసి మానవునిలో ద్వేషభావ వ్యాప్తి జరుగుతున్నందుకు వేదన చెంది ,సత్సంగం సన్మార్గ హేతువని తెలిపి ,,నాటికీ –నేటికే ఆకాశ మంత భేదముందని చెప్పి ,నిన్ను నువ్వు తెలుసోకోమని హితవు చెప్పి ,భగవంతుని సన్నిధిలోనే సుఖ శాంతులున్నాయని బోధించి ‘’మన ఆత్మ పరమాత్మ అంశం ‘’అని ఎరుక కలిగించి ,మనిషి తలచిందే పొందుతాడన్న గీతా రహస్యం విప్పి ,భగవ౦తునికి అర్పించాల్సింది ‘’క్షమా పుష్పం ‘’అని వివరించి ,అభి షేకాలతో ఉక్కిరి బిక్కిరౌతున్న ‘’స్థాణువు’’ నిజంగానే రాయి అయిపోయాడని సానుభూతి చూపి ‘’స్వార్ధం అనే చీకటిని పారద్రోలి –నిస్వార్ధ దీపం వెలిగించి –లక్ష్య౦ అనే వెలుగులో పయనం సాగించు ‘’అని మానవుని ఉద్బోధించారు .’’కొందరికైనా అన్నం పంచాలి ‘’నా సేవఎందరికో అంకితం ‘’అంటూ తమ లక్ష్యాన్ని తెలిపారు .అమ్మ సుశీలమ్మ అనురాగాన్ని గుర్తు చేసుకొని ,వృద్ధాశ్రమం లో ఆన౦ద౦ ఆప్యాయత వెల్లి విరుస్తాయని భరోసా ఇచ్చారు .వర్షం ,ఆకాశం ,మెరుపు మనసు జీవనగతి మనసున్న మనిషి వనరుల విలువ తెలియటం ,పసి పిల్లల ప్రేమ మొదలైనవి మధురంమధురం మధురం అంటూ ‘’మధురాష్టకం ‘’చెప్పారు . వీణా ప్రాణి అయిన తనకు సంగీతకళా కీర్తి నిచ్చినందుకు కృతజ్ఞతలు ప్రకటించారు .సంగీతం కంటే సేవామార్గమే ఇష్టమని విస్పష్టంగా ప్రకటించారు .మంచితనం యెంతఉన్నా ధనం కూడా ముఖ్యమే ఏపనికైనా ,అన్నదానమే తన జీవిత గతి ,పగడం దరించి కలతలను దూరం చేసుకోమనీ ,మనసుకు పచ్చి మిర్చి బజ్జీ ఆహ్లాదకరం భార్యా భర్త ,అన్న చెల్లీ ఒకరికొకరు బంగారమే అన్నారు .’’సరస్వతీ దేవి నుండి జాలువారిన ఒక అద్భుతమే విద్య ‘’అని చక్కని అర్ధం చెప్పారు .జీవితమార్గాన్ని సుగమం చేసుకోవటానికి ఉద్యోగం సోపానం ,అని ఉద్యోగ ధర్మం చెప్పారు .తమకిష్టమైన నువ్వుండలు,పూతరేకు వడియాలు మాగాయి లను రుచులూ రేట్లు తెలిపారు .కలరాఉండలు, ఏలకుల ఉపయోగాలు మిరియాలు ములగాకు ,బిళ్ళగన్నేరు, బొప్పాయి ఆకులలో వైద్యగుణాలు తెలియజేశారు .ఆకలి ఎలా ఉంటుందంటే ‘’ప్రాణం పోయినట్లు ,నరాలులాగి మంతకలిగి ,తలనొప్పి కాళ్ళు పీకుడు కళ్ళు బైర్లు కమ్మి ,మనసు భ్రమించటం ‘’గా ఉంటుందని గొప్పగా చెప్పారు .అందర్నీ మెప్పించేది సంస్కారమే అన్నారు .తానుచదివిన ఉస్మానియా మేనియా ను అభి వర్ణించారు .జ్ఞానిగా మనిషి మెలగాలనీ బోధించి నాయక హాస్య నటుల్ని,స్టార్ ఫిష్ అందాన్ని ,పచ్చడీ సాంబారు బిర్యాని లను రొ౦బా మెచ్చి,కూర్మావతార రహస్యం విప్పి చెప్పి ,చంద్రుని కాంతి చలువదనాన్నీ వేద విజ్ఞానాన్నీ మనస్పూర్తిగా ఆరాధనాభావంగా చెప్పి ముగించారు .కాదేదీ కవిత కనర్హం అన్నది విదులగారి సిద్ధాంతం .దాన్ని సరళమైన భాషలో చెప్పి సార్ధకం చేశారు డా విదుల .
2-కవితా కలశం –లో డా చర్లమృదులకుమారి –గణపతి ప్రార్ధనతో వినాయకునీ , తమ తండ్రిగార్నీ స్తుతించి,సరస్వతీ ప్రార్ధన చేసి ,గోదారి మహిమ అభివర్ణించి వసంత మహాత్మ్యాన్ని కొనియాడి ,తనభావ జాలాన్ని ఎరిగించి ,తన అన్వేషణ ఒకలక్ష్మీ బాయి ,కస్తూర్బా ,దుర్గాబాయ్ ,గార్గీ, మైత్రేయి మొదలైన వనితా రత్నాలను అన్వేషణ చేశారు .ఆధునిక స్త్రీ ‘’కురులలో పూలు ,కంటికాటుక ,నుదుట బొట్టు,గాజులగలగల ‘’కనపడకపోవటం తో బాధ పడ్డారు .స్త్రీ ద్వాదశ రూప వైభవాన్ని వర్ణించారు .అశ్లీల సినిమాలు చూస్తే వేదనా భరితనై తపించి పోతాను’’అని తన సున్నిత హృదయం ఆవిష్కరించారు .ఇంగ్లీషు ఉగాది పై వ్యామోహం నచ్చలేదు .ఈయుగ లక్షణం అంతు పట్టలేదు .బాలిక ఈశ్వరుని పుత్రిక గా కనిపించింది .అమానుషం నశించి శౌర్య ,మానవత్వాలు పెరిగి సహన ,శాంతులు పరిఢవిల్లాలని ఆకాంక్షించారు .గ్రంథాలయం ‘’పవిత్ర దేవాలయం –జాతి మత భేదాలు పోగొట్టే పవిత్రాలయం ‘’అన్నారు .విహార యాత్రలో భేదాలు అదృశ్యం ఐకమత్యం ప్రత్యక్షం పరిశీలన సాక్షాత్కారం .యువతకు సత్యాహి౦సలే ఆకర్షణ కావాలి .ధర్మం పై ఆకర్షణ పెరగాలని ఆకాంక్షించారు .విశాఖ సాహితీ వైభవాన్ని భారతమాత ను మధురమైన బాల్యాన్ని నెమరేసుకొన్నారు .’’ఆనంద నికేతన్ గాంధీ గారు కలలుగన్న గ్రామం ‘’అని ఆరాధనాభావంతో అన్నారు .అన్నదానమహిమను ,చెబుతూ ‘’నీవు జీవిస్తూ ఇతరులను జీవింప జేయటం ‘’అనే పవిత్ర నిర్వచనం చెప్పారు .రైలులో ఆడవారి ప్రత్యేక బోగీ చివర ఉండటాన్ని తప్పు పట్టారు .మహాత్యాగి గణపతి శాస్త్రి గారినీ ,సేవా పరీణ సుశీల గారిని స్మరి౦చి పితా మాతృ నివాళి ఇచ్చారు .శ్రీరాముడు ‘’నవమి చంద్రుడు ‘’అని కొత్త భావంగా చెప్పారు .అమ్మది పరవళ్ళు తొక్కే ప్రేమ .గాంధీని సచివుడుగా ఉన్న తండ్రి ని వ్యాస వాల్మీక కాళిదాసు ల మూర్తి స్వరూపమని కీర్తిస్తూ ‘’విలువైన భారతీయసంస్క్రుతిని –ఆర్ష ధర్మ సూత్రాలలో పొందు పరచి -‘ఆంధ్రావనిలో కీర్తి గాంచిన పుణ్య మూర్తి ‘’అని కీర్తి కిరీటం పెట్టారు.’’విద్య దానమే నా లక్ష్యం ‘’అని స్పష్ట పరచి ఆనాటి మరచెంబు బూరెలు ,బొప్పాయి పండు ,మురళి ,అరటి పువ్వు ,వివిధ ఆహారాలు వివరించి ,గురు స్మరణ చేశారు .’’పాపం, అన్యాయం చేయ వద్దని’’కరోనా సందేశంగా తెలిపారు .చివరగా లక్ష్మీ తులసిని ‘’సర్వ తీర్దాలు ,సకల దేవతలు సర్వ వేదాలు పురాణాలు ,అన్ని తీర్దాలు ‘’ఉన్నాయని ఆమె పూజ సకల సంపత్ దాయకమని ముగించారు .
3-సంగీత సాహిత్య రవళి –లో శ్రీమతి వాణీ ప్రభాకరి –తాను అయిదు వరల్డ్ రికార్డ్ అవార్డీ నని చెప్పుకొని విజయం దేశ పురోగతికి మూలమని ఉత్తమమార్గం లో నడవమని భారతీయుడికి హితవు చెప్పి ,వాట్సాప్ ,విశ్వరూపాన్ని వేయి విదాలమెచ్చి ,’’ఆనందమే అందము ,ఆరాధనే ఐశ్వర్యం ‘’అని ,జాతిని విజ్ఞాన వంతులుగా తీర్చే అధ్యాపకులకు వందనమొనర్చి ,విశ్వం లో శాంతి కాంతి విరబూయాలని ఆకాంక్షించారు .ప్రతి అక్షరం మనిషి ప్రాణమే అన్నారు .తమ తణుకు పట్టణాన్ని ‘’తళుకుల పురి ,తారకాపురి కవులకు కళలకు నిలయం ‘’ అని గొప్పగా చెప్పగా నాతో తణుకు నన్నయ పీఠం మూడు సార్లు సాహిత్యోపన్యాసం చేయించిన విజయబాంక్ ఆఫీసర్ జి .ఎల్ మూర్తి గారు గుర్తుకు వచ్చారు .ఆసభల్లోనే రసరాజు గారిని మొదటి సారి చూశాను .కట్నం లేకుండా పెళ్లి చేసుకొన్నతన అత్తింటి వారి మంచి తనాన్ని నారు మంచి వాణి గారు మననం చేసుకొని సహృదయతకు నీరాజనం పట్టారు .గూగుల్ ఆంటీ కి హాట్సాఫ్ చెప్పారు .ఆంధ్రుల ఆవకాయ కారానికి నమస్కారం పెట్టి ,ఇంటి వంటను మెచ్చి,శ్రమైక జీవన సౌందర్యాన్నిలాల్ సలాం పెట్టి ‘’జీవన వేదం నా సంగీత నాదం ‘’అని పలికి ,కళలు ,కలలు, కథలు సార్ధకం కావాలని కోరారు .జిహ్వను కీర్తించారు .తమగ్రామం కాకర పర్రు ‘’వేదం ,పండిత మడి,ఆచరణలకు పుట్టినిల్లు ‘’అన్నారు .తాతగారింటినీ అమ్మను,నాన్న, గురుదేవుడిని రైతన్నను సంస్మరించారు. సప్తవర్ణాలు కలిసి తెలుపు రంగు అయినట్లు అన్నిజాతులూ కలిస్తే ఒకే జాతి అని సైన్టిఫిక్ గా చెప్పారు , తిలక్ పోస్ట్ మాన్ పై కవిత్వం రాస్తే ఈమె పేపర్ బాయ్ ,పోస్ట్మన్ ,సూర్యగ్రహణ మేడే కార్మికులకు సహృదయ వందనం చేశారు .’’స్త్రీ వాదమే స్త్రీ వేదం –స్త్రీ నాదం ప్రగతికి జీవనాదం ‘’అన్నారు .కల్తీ ప్రపంచం చూసి కలవర పడ్డారు .అంతర్జాల కవిత్వానికి హారతి పట్టారు .’’సమాజ సేవలో ముఖ్యపాత్ర నవ్వుదే’’అని నవ్వు రహస్యం విప్పారు .సమాజం లో సంధించిన బాణం నేటి స్త్రీ .’’అవార్డ్స్ పంట వాణి ఇంట –సాహిత్య సంగీత చిత్ర కళ’’లలో ఎన్నో అవార్డులు రివార్డ్ లతో వాణి గారిల్లు తళతళా,మిలమిలా.మధ్య మావతి రాగం లా ఈ కవితలు మనోల్లాసం కళ ,సంస్కృతీ ,వైభవంగా ఉన్నాయి .
ఈ ముగ్గురు తమ కవితలకు సార్ధకమైన శీర్షికలు పెట్టి కమ్మని కవితలతో న్యాయం చేకూర్చి నందుకు అభినందనలు .అందమైన ముఖ చిత్రం కవిత్వాలకు మరింత వన్నె తెచ్చింది .అందరు చదివి ఆన౦దించాల్సిన పుస్తకం .
మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -11-1-21-ఉయ్యూరు
—