ఆంధ్రా జాకీర్ హుస్సేన్- డా.హుస్సేన్ అహ్మద్
తణుకు కంటి డాక్టర్ డా .హుసేన్ అహ్మద్ జీవిత కథ ను తణుకు చారిత్రిక పరిశోధక బహు గ్రంథ రచయిత శ్రీ కానూరి బదరీ నాథ్’’ ప్రశాంత పథకుడు డా .హుస్సేన్ అహ్మద్’’గా రాసి ఆవిష్కారం అయిన మర్నాడే చర్లవారి పురస్కారం అందుకొన్న మల్లవరం లో మాకు జనవరి 10 ఆదివారం అందజేసి అభిప్రాయం రాయమని కోరారు .ఈ మధ్యాహ్నమే చదివి నా స్పందన తెలియ జేస్తున్నాను .
“మొత్తం భారతదేశం నా ఇల్లు, ప్రజలందరూ నా కుటుంబం’’అన్న భారత మూడవ రాష్ట్ర పతి ,మహా విద్యావేత్త ,బేసిక్ విద్యా నిపుణుడు ,ఉత్తమ దార్శనికుడు ,భారత విద్యా విభాగ మార్గ దర్శి ,తన సంపద సర్వస్వం భారత దేశానికి ధారపోసిన మహోన్నత ఆదర్శ మార్గదర్శి ,జాతీయ ముస్లిం విద్యాలయ స్థాపకుడు డా.జాకీర్ హుస్సేన్ జ్ఞాపకం వక్చరు ఈ పుస్తకం చదువుతుంటే .అందుకే నా సమీక్ష వ్యాసానికి శీర్షిక ‘’ ఆంధ్రా జాకీర్ హుస్సేన్- డా.హుస్సేన్ అహ్మద్ ‘’అని పెట్టాను .బడరిగారు ఇప్పటికే ఎన్నో చారిత్రిక పుస్తకాలు జీవిత చరిత్రలు రాసి గొప్ప పేరు పొందారు .ఆయన అనుక్షణ పరిశీలకుడు అని ,అదొక హాబీ గా అలవాటు చేసుకొన్న రచయిత అని మనకు తెలుస్తుంది .డాహుస్సేన్ గారి పుట్టుపూర్వోత్తరాలను త్రవ్వి తీసి ,ఆయన విద్యావ్యాసంగపు సోపానాలు వివరించి ,ఉద్యోగ ప్రయాణం తెలిపి, ఆయన ఆదర్శాలు మాటలలో కాకుండా చేతలలో ఎలా నిలబెట్టారో వివరించి ,ఆయన ఉత్తమ గుణ గరిష్టతను పలు కోణాల్లో ఆవిష్కరించి డాక్టర్ గార్ని మనకు సన్నిహితులను చేశారు . .ఈ పుస్తకం అందరి వద్ద ఉండడుకనుక సంక్షిప్తంగా డాక్టర్ గారి వ్యక్తిత్వం ఉద్యోగ సేవాకార్యక్రమాలు బద్రిగారి రచన ఆధారంగా మీముందు ఉంచి అలాంటి ఉత్తమ వ్యక్తిని తెలుసుకోవటం లో మనం మధురానుభూతి పొందాలని కోరుతున్నాను .
హుస్సేన్ షేక్ మున్షీ అబ్దుల్ ఖాదర్ ,హుస్ నారా బేగం లకు డాక్టర్ గారు 5-12-1948లో తణుకు లో జన్మించి ,అక్కడికమ్మవారు ఉండే పాతూరులో శ్రీ ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్ ఉండే నన్నయభట్టు మనుమడు కొమ్మనామాత్యుడి పేరున వెలసిన ‘’కొమ్మాయి చెరువు ‘’దగ్గర డాక్టర్ గారిది ఒక్కటే ముస్లిం కుటుంబం .అందుకే ప్రసాద్ గారితో వీరి కుటుంబానికి సత్సంబంధాలు ఏర్పడ్డాయి .తణుకు లో ప్రాధమిక విద్య ,హైస్కూల్ విద్యా పూర్తి చేసి ,12వ తరగతి 68శాతం మార్కులతోపాసై ,స్వయం ప్రతిభతో కాకినాడ రంగరాయ వైద్య కలాశాలలోచేరి ఉత్తీర్ణులై ,పిజి కోర్సు చేయాలనుకొంటే ఆర్ధిక స్తోమత లేదని తండ్రి అంటే స్కాలర్షిప్ తో చదువుతానని చెప్పి ,దేశంలోనే పెద్దది పేరు ప్రతిష్టలున్న ఉత్తర ప్రదేశ్ సీతా పూర్ ఇన్ ష్టి ట్యూట్ ఆఫ్ ఆఫ్త మాలజి లో చేరి ,నెలకు 900 రూపాయన ఉపకార వేతనం గా పొందుతూ మూడు వందలు మాత్రమే ఖర్చు చేసి ,మిగిలినది తండ్రిగారికి పంపుతూ కుటుంబానికి ఆసరాగా ఉన్నారు .1974లో పిజి పూర్తి చేసి అక్కడే అఫ్తమాలజిస్ట్ గా 1300 రూపాయల జీతం తో పని చేశారు .అక్కడే ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మన మాజీ గవర్నర్ నారాయణ్ దత్త తివారి తో మంచి పరిచయం కలిగి ,ఆయన సాయం సంస్థకు లభించేట్లు చేసి ,హాస్పిటల్ చీఫ్ గా ఉంటూ తివారీ సాయంతో హాస్పిటల్ అభి వృద్ధికి రెండు ఎకరాల స్థలం సాధించి తొలివిజయం పొందారు హుస్సేన్ జీ .1977లోషాహిదా బేగం ను పెళ్ళాడి, ఇద్దరు పుత్రులు ఒక కుమార్తెకు జన్మనిచ్చి వారిని విద్యలో ఆరి తేరిన వారిని చేసి వివాహాలు జరిపించారు .
1978లో సౌదీ అరేబియా వెళ్లి రియాద్ లో ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ లో కంటి డాక్టర్ గా చేరి 20ఏళ్ళు పనిచేసి నియమబద్ద జీవితం తో అందరి అభిమానం పొందారు .అక్కడి నుండి తణుకు చేరి ముళ్ళపూడి వెంకట రమణమ్మ మెమోరియల్ హాస్పిటల్ లో చేరి ఇక్కడా ఇర్వి ఏళ్ళు సేవ చేసి మొత్తం 40 సంవత్సరాలు వైద్య సేవలో ధన్యులయ్యారు .60వ ఏట పదవీ విరమణ చేసినా ,సంస్థ ఒత్తిడితో తో 73వ యేటకూడా సేవలందిస్తూనే ఉన్నారు సౌదీలో ఇండియన్ ఎంబసీతో కలిసి హుస్సేన్ దంపతులు ఒక స్కూలు స్థాపించిన అనుభవంతో తణుకు లోనూ వెనుకబడిన వారి విద్యావ్యాప్తికోసం 2001లో ఇండియన్ పబ్లిక్ స్కూల్ పెట్టి ,తర్వాత హైస్కూల్ గా అభి వృద్ధి చేసి , మోరల్ క్లాస్ లుకూడా నిర్వహిస్తూ ఆదర్శ విద్యాలయంగా తీర్చి దిద్దారు .మునిసిపాలిటి కో ఆప్షన్ సభ్యులై పాలనలో తమ అనుభవాన్ని అందించి తృప్తి చెందారు .సీనియర్ సిటిజెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏర్పాటు చేసి అధ్యక్షులై వయో వృద్ధులకు సంచార శకటం ఏర్పాటు చేసి ఇంటి వద్దే వైద్యం అందించారు .ఐఎం ఏ అధ్యక్షులుగా రెండేళ్ళు పని చేసి , ,లయన్స్ క్లబ్ మెంబర్ ,మానవత ,రామకృష్ణా సేవాసమితి వంటి సంస్థలలో సభ్యులై సేవలు అందించారు ‘
డా హుస్సేన్ గారికి ఏకేశ్వరోపాసన పై నమ్మకమెక్కువ .దీనివలన ఇహపర ప్రయోజనాలు కలుగుతాయని నమ్మారు .ఇంటివద్ద ముస్లిం పద్ధతులను చక్కగా పాటిస్తారు ఖురాన్ ను అనుసరిస్తారు .గాలిబ్ ,కబీర్ గురజాడ మార్గం లో ప్రయాణిస్తూ ‘’సర్వ మానవ సౌభ్రాతృత్వం ,మానవ సేవ అలవరచుకొని కొనసాగిస్తున్నారు .సుగుణాల రాశిగా ,మతసామరస్య సాధకుడిగా కీర్తి గడించారు .ఆయన మార్గం శాంతి పథం.అందుకే ఆపేరు మీదనే బద్రి గారు డాక్టర్ గారి జీవిత చరిత్రరాశారు .చివరలో ప్రముఖుల అభిప్రాయాలను గుది గుచ్చారు .దీనివలన హుస్సేన్ గారి బహుముఖీన వ్యక్తిత్వం అన్ని కోణాలలో అర్ధం చేసుకోవటానికి అవాశం కలిగింది .డా హుస్సేన్ శతాధిక ఆయురారోగ్యం తో వర్ధిల్లి మానవ సేవలో మాధవ సేవ చేయాలని ఆశిద్దాం .
రచయిత శ్రీ బద్రి తళుకు లీనే తణుకు చరిత్ర ,అక్కడిముస్లిం ల చరిత్ర త్రవ్వి తీసి రాశారు .ఏకేశ్వరోపాసన గురించి చెప్పటానికి విస్తృతంగా భగవద్గీత ,బైబిల్ ,ఖురాన్ అధ్యయనం చేసి సారం అందించారు .ప్రభావ శీలుర జీవిత విశేషాలు క్రోడీకరించారు .వ్యక్తిత్వ విశ్లేషణ సమర్ధం గా వివరించారు.పుస్తకం లో ప్రతి అంగుళం లోనూ బద్రిగారి అధ్యయన శీలం కనిపించి ఆశ్చర్య పరుస్తుంది. హుస్సేన్ గారి జీవితాన్ని చిత్రించటానికి ఇవన్నీ చక్కగా ఉపకరించి ,ఇద్దరికీ కీర్తి తెచ్చింది పుస్తకం .బద్రి గారిని అభినందిస్తూ మరిన్ని గొప్ప రచనలు ఆయన లేఖిని నుంచి వెలువడాలని ఆశిస్తున్నాను .
రేపు భోగి శుభా కాంక్షలతో
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -12-1-21-ఉయ్యూరు