నీలాచలేశ్వర స్తవం
శ్రీ కపిల కృష్ణ శర్మ కవి ‘’కర్మశ్రీ ‘’నామధేయం తో ‘’నీలాచలేశ్వర స్తవం ‘’ రచించి సర్వ సమైక్య భావ గరిష్టుడు ,అనవతర పర సేవా తంత్రుడు ,సత్పుణ్య శాలి ,దాన సద్ధర్మాదిమానవీయ నియమ పాలనా రతుడైన తన తండ్రి కపిల కామేశ్వరునికి అంకిత మిచ్చాడు .ఈపుస్తకం నరసాపూర్ లోని కమలాకుటీర్ పవర్ ప్రెస్ లో 1962లో ప్రచురితమైనది .
కర్మశ్రీ కవి ‘’నా మనవి ‘’లో ‘’శివభక్త శిఖామణి కాకతి ప్రతాప రుద్ర దేవ చక్రవర్తి కాలం లో కోటలోనే కాకుండా ,ఊరూరా పల్లెపల్లెలా వీధి వీధినా శివాలయాలు నెలకొల్ప బడినాయనీ , ఆలాయాదీశుడైన జగద్రక్షకుని పర్య వేక్షణ లో భారత దేశం సుభిక్షం గా వర్దిల్లిందనీ ,ఆకాలం లోనే ‘’నీలాద్రి దుర్గం ‘’ వెలసిల్లిందనీ ,అంతులేని వైభవం సాటిలేని వస్తుసామాగ్రి తో ,విలువైన వస్తు వాహనాలలో నీలాద్రి దేదీప్యమాన వైభవంగా వెలిగిందని కాలక్రమంగా భక్త చక్రవర్తి పాలన ముగిసిందని చెప్పాడు .
నట్ట నడివి లో గుట్టలు రాళ్ళు పై ఉన్న ఈ దివ్య మూర్తిని దర్శించటానికి దారీ తెన్నూ లేకపోవటం తో భక్తులు గుంపులుగా అప్పుడప్పుడు వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళేవారు .సమర్ధులు ఉపేక్షిస్తే, అసమర్ధులు వాపోయేవారు .ఇలా ఎన్నో శతాబ్దాలు కాలగర్భం లో కలిసి పోయాయి .ప్రజల్లో స్వామి పై ఆలోచన రావటం ,స్వామి వైభవాన్ని గుర్తించటం ,రెట్టింపు ఉత్సాహంతో తిరునాళ్ళు నిర్వహించి ,పురాతన వైభవాన్ని మించిన వైభవం నీలాచలేశ్వరుని కి చేస్తూ ధన్యులయ్యారు .కవి గారు దర్శించి ,భక్త్యావేశం తో పులకించి ఈ స్తవ రూప కావ్యాన్ని రాశారు .కానీ తనకున్న కొద్దిపాటి సాహిత్య జ్ఞానం తో రాసిన కావ్యం కనుక తప్పులు సరి చేసి పరిష్కరించమని తండ్రిగారి ప్రేరణతో కవి భూషణ , కవిశేఖర ,శ్రీ శిష్టా వెంకట సుబ్బయ్య కవీంద్రుని ఆశ్రయించి అంద జేశారు.వారు అచిరకాలం లోనే శుద్ధి చేసి కవి గారికిచ్చారు .పుస్తకాన్ని బంధు మిత్ర హితుల సహాయంతో ముద్రించి పండితాభిప్రాయం సేకరించి కూర్చారు –శ్రీ శిష్టా వెంకట సుబ్బయ్యగారు –‘’18ఏళ్ళ బాలుడు ఇంతటి కవితా స్రవంతి ప్రవహింప జేశాడంటే ఆశ్చర్య పోయాను .భావాలు హృదయం గమాలు ,భగ వత్ప్రేరి తాలు కనుక వేదాంత విషయాలు కూడా చక్కగా ప్రకటించాడు .వ్యాకరణం పై ఇంకాస్త శ్రద్ధ చూపించాలి .ఈ కవి .దీనితర్వాత ‘’కృష్ణ శతకం ‘’కూడా అనర్గళ ధారా ప్రవాహంగా రాశాడు’’ .అని మెచ్చారు .
పాలకొల్లు వాసి శ్రీ ఆండ్ర శేషగిరి రావు –‘’ఆవేశ హృదయుడైన ఈ కవి నా ప్రియ శిష్యుడు ,చిన్నవాడు .సంస్కృతాంధ్రాలలో పెద్దగా ప్రవేశం లేకపోయినా పద్యాలలో అనర్గళ ధారా శుద్ధి ఉంది .ఈ పద్యాలు చదువుతుంటే నాకు తన్మయత్వం కలిగింది .అమేయ కవితాదురంధరుడు అవుతాడు .ఈఆవేశం తోనే శ్రీ వెంకటేశ్వర నక్షత్ర మాల ‘’కృష్ణ శతకం కూడా కూర్చాడు ‘’.అని కీర్తించారు .
ఆత్రేయ విద్వాన్మహా కవి పండిత శ్రీ పామర్తి సూర్య ప్రకాశ శర్మ –‘’ప్రాక్తన పుణ్య పరిపాకం చేత ఈకవి గొప్ప భక్తి కావ్యం రాశాడు .గురు శుశ్రూష లేకుండా నే ,ఈకవి నాలుకపై సరస్వతీ దేవి చిందులు త్రొక్కింది .విద్యా వినయ సంపన్నుడైన కర్మ శ్రీ కవి వ్యాకరణం క్షుణ్ణంగా నేర్చి ,విద్యా వైశద్యం ఆర్జించి భవిష్యత్తులో మరిన్ని ఉత్తమ కావ్యాలు రాయాలి ‘’అని ఆశీర్వదించారు. .
కవి శ్రీ కృష్ణ స్తుతి ,సరస్వతీప్రార్ధన,విఘ్నేశ్వర ,గురు సుకవి సంస్తుతి చేసి,ఆతర్వాత తన వంశ చరిత్ర చెప్పాడు –తనతండ్రి కామేశ్వరుడు కాశ్యప గోత్రుడు ,సర్వ శాస్త్ర పురాణ సాహిత్య నిష్ణాతుడు పండిత ప్రశస్తి పొందినవాడు ఆంద్ర ఆంగ్ల సారస్వత కోవిదుడు ,సూనృత వాక్య పాలకుడు ,శక్తికి మించి దానధర్మాలు చేసినవాడు .తల్లి అన్నపూర్ణ సంప్రదాయ పరిరక్షకురాలు .అన్న భాస్కరుడు వదిన వెంకట రామణా౦బ తనను భక్తి కావ్యం రాయమని ఎప్పుడూ ప్రోత్సహించేవారు .రామరాయ ,విజయ లక్ష్మణ రావు అన్నలు .సూర్యారావు ,లక్ష్మీ నరసింహారావు తమ్ములు .పెద్దవదినన విజయ లక్ష్మి చిన్నవదినన నిర్మల .కవి మధ్యముడు కృష్ణ శర్మ .
పిమ్మట నీలాచల విశేషాలు గద్యం లో చెప్పాడు –కీకారణ్యం లో నీలాచలం యోజనం దూరం వ్యాపించి ఉంటుంది .కదంబ కాదంబ క్రకచపత్ర మొదలైన వృక్షాలతో ,ఖడ్గ శరభ శార్దూలాది మృగాలతో ,చిలుక గోరింక పావురాది పక్షి సంతానం తో ,త్రాచు ,పింజర రక్త పింజరాది సర్పాలతో,రత్న వైడూర్య వజ్ర గోమేధికాది నిధి నిక్షేపాలతో ,యక్ష గరుడ కి౦ పురుషాది గణాలతో వ్యాపించి ఉంటుంది .అక్కడ ఏక శిలా ప్రాగ్భారం లో నాలుగుస్తంభాలపై ప్రాకారం తో నందీశ్వరుడు ముందు ధ్వజ స్తంభం ఉంటుంది .లోపల గర్భగుడిలో శ్రీ పరమేశ్వర ఆత్మలింగం నీలాచలేశ్వరుడు ,దానికి కుడివైపు పెద్ద పుట్ట ,దానిదగ్గర చతుర్గజం అనే శిల.దీని మధ్యలో రంధ్రం దానినుంచి నిరంతర జలప్రవాహం కనిపించి ఆశ్చర్య చకితుల్ని చేస్తాయి .మహా వైభవంగా శివరాత్రి ఉత్సవాలు జరుగుతాయి ,ఈ శివుడిని చూడగానే కవిగారిలో భక్తి పెల్లుబికి దండకం ఒకటి-‘’శ్రీ దేవా దేవా మహానుభావా ,శంభో జటాజూట దారీ ,పురద్వంసకా అర్ధనరీశ్వరా , సత్క్రుతాంబో నిధీ ‘’అంటూ ధారాపాతంగా వచ్చేసింది .ఆ రాత్రి అక్కడే నిద్ర చేసి మర్నాడు ఉదయం స్వామిని దర్శించి ,ఇంటికి వచ్చి ,ఈ స్తవాన్ని రాయటం మొదలు పెట్టాడు .ఆ స్తవ వైభవం చూద్దాం –మొదటి పద్యం –
‘’శ్రీ శ్రీ నమశ్శివాయా –సుశ్రీ విహరణ విలసిత సుక్షేత్రా –హే,శ్రీధర సంచయ భూ –షా శ్రీకైలాస వాస సద్గురు శంభో ‘’
‘’చంచలమైన దేహ మిల శాశ్వత –మంచును మూఢులౌచు –‘’అని అశాశ్వతాన్ని గురించి ఆలోచించే మనుసుల తీరు చెప్పి ,’’కాల కూట విషమ్ము కంఠమున ధరించి –సురకోటి కెవ్వాడు సుధ యొసంగె ‘’అని ఈశ్వరుని స్తుతించి ,మార్కండేయుని యముడి నుంచి కాపాడినవాడు –‘’కారుణ్య గుణాదికా ,అభవ హే రాకేందు సద్భూషణా-నీకు మ్రొక్కెద గావుమయ్య కరుణన్ –నీలాద్రి వాసా హరా ‘’అని ఆర్తిగా ప్రార్ధించాడు .తన అజ్ఞానాన్ని –‘’బాలుడ జూడగా దెలుగు బాసయు బూర్తిగ రాదయెట్లు శా-స్త్రాలను నేర్తు నేగతి-జ్ఞానము నూనుదు నాత్మశక్తిమై’’అని తన అశక్తత ప్రకటించుకొన్నాడు .ఒక భార్యనే భరించటం కష్టంగా ఉంటె గంగా పార్వతులతో ఎలా వేగుతున్నావని మేలమాడాడు .
‘’మృగనాభి పంకంబు బుగబుగల్ మెయి తోడ –నగ్ని జిమ్మెడు లలాటాక్షి తోడ-నిగనిగల్ వెదజల్లు నెమలి పి౦చము తోడ-పోలుపారు జాబిల్లి పూవు తోడ –గోప్యమై యొప్పు వైకుంఠ వాసము తోడ -మహిత కైలాస దామంబు తోడ ‘’అంటూ ధారాప్రవాహం తో పద్యాలు సాగించాడు ,భక్తి కుమ్మరించాడు .శంకరుడు ఉబ్బు లింగం అనే మాట నిజం అన్నాడు –‘’శంకర భక్త సంతతి వశంకర నీల గిరీశ్వరా హరా ‘’అన్నాడు .చివరగా –‘’ఆత్మ విశ్వాసమే ముఖ్య మందు రట్లు –గాన పూర్ణ విశ్వాసమున్ గడలు గొనగ –పల్కి నాడను నేనిట్లు పార్వ తీశ-నీలగిరి వాస కరుణా రసాలవాల ‘’అని చెప్పుకొని చివరి సీసపద్యం లో చివరగా –భావా తీత మనో నివాస నగజా –భామా మణీహృద్విహా-రావారాశి గభీర ధీర ముని హృ-ద్రమ్యాబ్జవాసా నమో ‘’అంటూ నీలాచల స్తుతి పూర్తి చేశాడు కవి కర్మశ్రీ .
‘’ఇది చక్రవరం వేంకట రామరాయ గురు కటాక్ష లబ్ధ కవితాదౌరేయ కాష్యపస గోత్ర పవిత్ర కపిల వంశా౦బుదీ సుధాకర శ్రీ కామేశ్వర సూర్య నారాయణార్య ప్రియ మధ్యమ పుత్రశ్రీ కృష్ణ శర్మ నామ ధేయ ప్రణీతంబగు శ్రీ నీలాచలేశ్వర స్తవము సర్వము –ఓం తత్సత్ ‘’అని పూర్తి చేశాడు . ఈ శతకం లోకం ప్రచారం లో ఉన్నట్లుగాలేదు .మంచి కవన వైభవానికి భక్తీ ఆర్తికి నిలయంగా పదహారేళ్ళ యువకవి రాసిన స్తుతికావ్యం .సమాదరణీయం .
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -16-1-21-ఉయ్యూరు