మహా భక్త శిఖామణులు
24-మహా భక్త వాగ్గేయకారుడు – ఆలూరి వెంకటాద్రి స్వామి
-భారద్వాజస గోత్రీకులైన ఆరువేల నియోగులు శ్రీఆలూరి వెంకయ్య ,శ్రీమతివెంకమ్మ దంపతులకు ఆలూరి వెంకటాద్రి ,ఉత్తర ఫల్గుణి నక్షత్రంలో ఫాల్గుణ పౌర్ణమి పర్వదినాన అక్షయ నామ సంవత్సరం 1806లో కృష్ణా జిల్లా జుజ్జూరు పరగణా ఆలూరు లో జన్మించారు .ఆగ్రామం లో వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి పై బాల్యం నుండీ అతి భక్తి ఉండేది .విద్యా గురువు లేకుండానే అనేక స్తోత్రాలు ,శాస్త్రాలు ఆబాల వెంకటాద్రికి అబ్బటం తలిదండ్రులను అమితాశ్చర్య చకితుల్ని చేసింది .తనకు సన్మార్గదర్శి దర్శి అయిన గురువు లభించాలని ఉబలాట పడుతున్న సమయం లో తూము నరసింహ దాసు గారి దర్శనం లభించి తారక నామ మంత్రోపదేశం చేసి ,హరినామ సంకీర్తన మార్గం లో ప్రవేశ పెట్టారు ..
దీన ,నిర్భాగ్యులను ఉద్ధరించే సత్సంకల్పమున్న వెంకటాద్రి స్వామి ,శాయశక్తుల వారికి సహాయ సహకారాలు అందించేవారు .వైష్ణవ సంప్రదాయం లో ఉన్నారుకనుక పవిత్ర వైష్ణవ క్షేత్ర దర్శనం చేసేవారు .అలా భద్రాచలం వెళ్లి అయిదేళ్ళు నిర్విరామం గా శ్రీహరి నామ సంకీర్తన తో మునిగిపోయారు .స్వామి భక్తి యెంత పటిష్టమైనది అంటే స్వప్నం లోనూ , ,సామాన్యంగానూ ఆయనకు శ్రీరామ చంద్రుడు సాక్షాత్కరించి సంభాషించి ఆయన గుణ గరిమను అభినంది౦చేవాడు .రామనామం కోటి దాకా రాసి ,కీర్తనలు రచించి తన్మయత్వంతో గానం చేసేవారు వెంకటాద్రి స్వామి .కల్యాణిరాగం లో వెంకటాద్రి స్వామి రచించిన ‘’శరణు శరణు ,శరణు శ్రీరామ రామ రామ చంద్ర ‘’కీర్తన లో శ్రీరామ వైభవం కళ్ళ ముందు నిలిపారు .పవిత్ర గోదావరి ,పరమ పవిత్ర అపర వైకుంఠంభద్రాద్రి ఆర్తత్రాణ శరణ్యుడు సీతారామ చంద్ర మూర్తి ని వదలి ఎక్కడికీ వెళ్లాలని అని పించేదికాదు స్వామికి.
ధారణ నామ సంవత్సరం 1824లో వెంకటాద్రి స్వామి చైత్ర బహుళ సప్తమి నాడు తిరుమల చేరి ,పెరుమాళ్ళ పూలంగి సేవలో అయిదు సంవత్సరాలు ఆనందంగా స్వామి వారి సేవ చేసి,దివ్యనామ సంకీర్తన చేస్తూ ధన్యులయ్యారు .’’ఇందిరా రమణ నీ విందు రారా ‘’కీర్తనను సహన రాగం లోరచించి భక్తి పారవశ్యం తో గానం చేశారు .పరమ ప్రీతి చెందిన శ్రీవారు స్వప్నం లో సాక్షాత్కరించి కంచి లో తన సేవ చేసుకోమని ఆదేశించారు .
భగవదాదేశం ప్రకారం వెంకటాద్రి స్వామి కాంచీపురం చేరి వేగవతి నదిలో పుణ్యస్నానం చేసి ,పేరుందేవి తాయార్ దర్శనం చేసి ‘’నిను నమ్మి ఉన్నా సేతమ్మ ‘’అని కాపీ రాగం లో కీర్తన రచించి ,గానం చేసి అమ్మవారికి అర్పించారు .వెంకటాద్రి స్వామి నిశ్చలభక్తికి మెచ్చిన వరదరాజ స్వామి శ్రీదేవీ భూ దేవీ సహితంగా వెంకటాద్రి స్వామికి దివ్య దర్శనమిచ్చాడు .పరవశం చెందిన వేంకటాద్రి స్వామి ఆనంద నృత్యం చేస్తూ నాట రాగం లో ‘’జయ జలధర శ్యామ ‘’ మరియు ‘’దేవ దేవ శౌరే మురారే ‘’కీర్తనలు గానం చేసి తరించి భక్తులను తరి౦పజేశారు .
పుష్ప కైంకర్యం నుంచి చందనం అలదటం కూడా చేస్తూ స్వామివారికి నిత్యం కాచిన పాలను అందించే ఏర్పాటు కూడా చేశారు వెంకటాద్రిస్వామి .బ్రహ్మ తీర్ధ తట౦ పై సేన ముదలియార్ సన్నిధిలో ఉంటూ సేవలు అందజేసేవారు. ఆయన ఉన్న ఆ గదిని ఇప్పటికీ వెంకటాద్రి స్వామి గదిగా పిలుస్తారు .ఒక రోజు స్వామి సేవకు పూలతోటలో పుష్పాలు కోయబోతుంటే ,ఒకపాము ఆయనకాలిపై కాటు వేసింది. ఏమాత్రం కంగారు పడకుండా నిబ్బరం గా పేరుందేవి సన్నిధికి వెళ్లి కమాస్ రాగం లో ‘’కాపాడరా నన్ను ‘’అని కీర్తన రాసి పాడుతూ ,ధ్వజస్థంభ సమీపం లో అపస్మారకంగా పాముకాటు ప్రభావం వలన నేలపై పడిపోయారు .కాసేపటికి తేరుకొని దేవరాజ సన్నిధి చేరి ,దర్శనం చేసి తీర్ధ ప్రసాదాలు తీసుకొని దైనందిన కృత్యం లో గానం లో కీర్తనలలో నిమగ్నమయ్యారు.
భిక్షాటనం లో జీవిస్తున్నా ,మహాదైశ్వర్య వంతులు,మహారాజులు కూడాఇవ్వలేనంత భూరి సంపాదన ను వరదరాజ స్వామి సేవకు అందజేసేవారు వెంకటాద్రి స్వామి .తన శక్తి సామర్ధ్యాల గురించి ఆలోచించకుండా భగవంతుని అపార కరుణా దృష్టిపైనే నమ్మకం తో మహాద్భుతకార్యాలు సాధించి కీర్తిపొందారు స్వామి .భగవంతుని కి౦కరుడిగా తాను చేస్తున్నాను అనే వినయం ఆయనది. అందులో తన గొప్ప దనం ఏమీ లేదు .తాను నిమిత్తమాత్రుడనే అను కొనేవారు .భక్తులు దాతలు అందజేసిన విరాళాలను జాగ్రత్త చేసి స్వామి కై౦కర్యాలకు అనువుగా ఖర్చు చేసేవారు.ఎక్కడా ఎప్పుడూ ఏ లోటు రానీయలేదు .
దివ్య దేశమైన కంచి లో జీర్ణోద్ధరణ కార్యక్రమాలు నిర్వహించారు వెంకటాద్రి స్వామి .అందులో ముఖ్యమైనది విలక్కోలి పెరుమాళ్ సన్నిధి మండపం ,గోపుర నిర్మాణం .వేదవిద్యా వాప్తికోసం బాలురకు వేదాభ్యాసం కోసం ధార్మిక సంస్థను నెలకొల్పారు స్వామి .భక్తుల కానుకలనతో భూమికొని ,ఆ స్వామి భూములపై వచ్చే ఆదాయం తో వేద విద్య నేర్పించారు .దూసి మామందూర్ లో ఆరోజుల్లో అత్యధిక ధరగా భావించే 5వేలరూపాయలతో పొలం కొని తాను ఏర్పాటు చేసిన ఎండోమెంట్ కు అందజేశారు .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -18-1-21-ఉయ్యూరు