మహా భక్త శిఖామణులు
24-మహా భక్త వాగ్గేయకారుడు – ఆలూరి వెంకటాద్రి స్వామి -2
భక్తులు వెంకటాద్రి ని ఆయన తిరునామాలు ,కుడి చేతిలో తంబురా,ఎడమ చేతిలో తాళాలు ,పారవశ్యం తో కీర్తనలు గానం చేస్తుంటే స్రవించే ఆనంద పరవశంగా వచ్చే ఆనంద బాష్పాలు చూసి ‘’ శ్రీ వెంకటాద్రి స్వామి’’ అని భక్తితో పిలవటం ప్రారంభించారు .ఒకసారి వరదరాజస్వామి వెంకటాద్రి కలలో కన్పించి ,తనకు వజ్ర కిరీటం చేయించి అమర్చమని ఆదేశించాడు .దీనికి చాలా డబ్బు ఖర్చు అవుతుదికనుక భూరి విరాళాలు సమర్పించే దాతలకోసం1835మన్మధ నామ సంవత్సర వైశాఖ శుద్దనవమి నాడు మద్రాస్ వెళ్ళారు స్వామి .కైరవానిలో స్నానించి ,శ్రీ పార్ధ సారధి స్వామిని దర్శించి కామాస్ రాగం లో ‘’పార్ధసారధి పదభజన చేయవే మనసా ‘’కీర్తన కూర్చి ఆర్తిగా పాడారు.ఈ ఆలయ అర్చకుడు శ్రీ షోల సింహపురం శేషా చార్య కు అతిధిగా ఉన్నారు .స్వామి వ్యక్తిత్వం అక్కడి వారు బాగా గ్రహించి వరదరాజ స్వామి వజ్ర కిరీటం కోసం విరాళాలు కురిపించారు .అర్చకస్వామి స్వయంగా 500 రూపాయలు సమర్పించగా ,కంచికి చెందిన వెంకట రంగం పిళ్ళై సుమారు పది తులాల స్వచ్చ బంగారం అందించాడు .అనుకున్న దానికంటే తక్కువ సమయం లోనే ధనం సమకూరటం వలన వెంకటాద్రి స్వామి పేరు ప్రఖ్యాతులు మద్రాస్ లో విశేష వ్యాప్తి చెందాయి .
వజ్ర కిరీటం తయారవగానే మద్రాస్ పురవీధులలో,సెవెన్ హిల్స్ ప్రాంతం లో ఊరేగించి,కంచికి చేరి ,తెల్లగొడుగు,ధ్వజం మేళతాళాలతో వేలాది పురజనులతో ఊరేగింపు జరిపి కనువిందు చేకూర్చారు .1858 కాళయుక్తి నామ సంవత్సర వైశాఖ పౌర్ణమి నాడు గరుడ సేవ రోజున శ్రీ కంచి వరద రాజ స్వామికి వజ్రకిరీటాన్ని సకల లాంచనాలతో అమర్చారు .ఆ సమయం లో వెంకటాద్రి స్వామి ఆనంద నృత్యం చేస్తూ ,కమాస్ రాగం లో ‘’నిగమ గోచరా స్వామీ ‘’ మధ్యమావతి రాగం లో ‘’పక్షి వాహనా స్వామీ ‘’కీర్తనలు రాసి సుమధురంగా గానం చేసి ధన్యత చెందారు.ఈనాటికీ ఆ వజ్రకిరీటాన్ని వెంకటాద్రి స్వామి సమర్పిత౦ గా భక్తులు చెప్పుకొంటారు .ఆ రోజు రాత్రి స్వామి స్వప్నం లో శ్రీ దేవి, భూదేవి కనిపించి తమకూ అలాంటి కిరీటాలే చేయించి పెట్టమని కోరారు .అచిరకాలం లోనే వారి కోరిక తీర్చారు వెంకటాద్రి స్వామి .వరదరాజ, శ్రీ దేవి భూదేవులు నగర వీధులలో ఊరేగింపు గా వజ్రకిరీటాలతో జగజ్జేగీయమానంగా ఊరేగుతుంటే జనాలకు చూడటానికి రెండు కళ్ళు చాలలేదు .ఆశోభకు కారణం వెంకటాద్రి స్వామియే.
ఇంతటి అంకిత భావం తో పెరుమాళ్ళ సేవ చేస్తున్న వెంకటాద్రి స్వామి సేవలకు తగిన ప్రతిఫలం ఇవ్వాలని శ్రీ దేవరాజ స్వామి భావించి ,అర్చకత్వ విధానం సాంప్రదాయ బద్ధం గా నిర్వహించటానికి ఆచార్య అంగీకారుని గా చేయాలని భావించాడు .వరదరాజ స్వామి వెంకటాద్రి స్వామి స్వప్నం లో దర్శనం అనుగ్రహించి ,వైష్ణవ సంప్రదాయ బద్ధమైన పంచ సంస్కారాలు పొందమని ఆదేశించాడు .స్వామి ఆజ్ఞా పాలనా నిమిత్తం కంచిలోని మనవాళ్ళ జీయర్ స్వామి ని దర్శించి సమాశ్రయనం అంటే పంచ సంస్కారాలు పొందారు .శ్రీ వెంకటాద్రి స్వామి .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -19-1-21-ఉయ్యూరు