మహా భక్త శిఖామణులు
24-మహా భక్త వాగ్గేయకారుడు – ఆలూరి వెంకటాద్రి స్వామి -3(చివరిభాగం )
కంచి వరద రాజ స్వామి సేవలో నిండా మునిగి ఉన్న సమయం లో ,శ్రీరంగం లోని శ్రీ రంగ నాథ స్వామి తనకు వెంకటాద్రి స్వామి సేవలు కావాలని అభిలషించాడు .ఒక రోజు స్వామికలలో కనిపించి తనకున్న అత్యంత విలువైన వజ్రకిరీటం దెబ్బతిన్నదని దాని స్థానం లో కొత్త కిరీటం తయారు చేయించే బాధ్యత వెంకటాద్రి స్వామి ఈ తీసుకోవాలని ఆదేశించాడు .ఆ కిరీటం కొలతలేమితో మన స్వామికి తెలియదు .ఏమి చెయ్యటానికీ పాలుపోక వరదరాజస్వామి పైనే భారం వేసి ,ఒక నమూనా కిరీటం తయారు చేయింఛి శ్రీరంగం తీసుకు వెళ్ళారు .తిరుక్కావేరిలో పవిత్ర స్నానం చేసి శ్రీరంగని దర్శించటానికి ఆలయానికి వెళ్ళారు .ఆలయం లో కోవిలన్నన్, భట్టార స్వామి మొదలైన ప్రముఖులు ఘన స్వాగతం ఇచ్చి స్వామి సన్నిధికి తీసుకు వెళ్ళారు .ఆలయం లో రంగనిపైనా ,అమ్మవారి పైనాపున్నాగ వరాళి రాగం లో ‘’నిన్ను కోరియున్నా ‘’ కీర్తన రాసి పరవశంతో గానం చేసి ,తను తెచ్చిన మోడల్ వజ్రకిరీటాన్ని శ్రీరంగనికి సమర్పించారు .ఆశ్చర్యంగా ఆయనకు సరిగ్గా చక్కగా సరిపోయి అందరికీ అద్భుతమని పించి వెంకటాద్రి స్వామి దైవభక్తికి ముగ్ధులయ్యారు .ఈ సంఘటనతో వెంకటాద్రి స్వామి కీర్తి శ్రీరంగం తో సహా అన్ని ప్రాంతాలలో మిన్న౦టి౦ది.
పాండ్య కిరీటం తయారీకి పూనుకున్న వెంకటాద్రి స్వామి దానికి కావలసిన ధనం కోసం ప్రయత్నిస్తూ ,రోజుకు కనీసం పది రూపాయల విరాళమైనా రాకపోతే నిరాహార దీక్ష చేస్తానని నిర్ణయం ప్రకటించారు .విరాళాలు రాని రోజున డేర్ హౌస్ వెంకటస్వామి నాయుడు ,పుదుచ్చేరి అప్పాస్వామి నాయుడు తామే పది రూపాయలు సమర్పిస్తూ స్వామి కి నిరాహార దీక్ష శ్రమ కలగకుండా చేశారు .విరాళాల వెల్లువ సాగగానే ,పాండ్య కిరీట నిర్మాణ పనులు మొదలు పెట్టారు స్వామి .ఈ కిరీటానికి అమర్చటానికి సరిపడే మరకత౦ అనే పచ్చ రాయి కావాల్సి వచ్చి ,ఎక్కడ దొరుకుందా అని నిర్వేదం లో పడిపోయారు వెంకటాద్రి స్వామి .ఒక రోజు రాత్రి స్వప్నం లో స్వామి దర్శనమిచ్చి పాండ్యకిరీటానికి సరిపోయే ఎమరాల్డ్ కలకత్తా లో మాధవ సేట్ వద్ద ఉన్న ఇనుప బీరువాలో ఉత్తర మూల ఉన్నది అని తెలియ జేశారు .వెంకటాద్రిస్వామి భక్తుడు సహాయకుడు కాశీదాస సావుకార్ కలకత్తాలోని మాధవ సేట్ కు ఉత్తరం ద్వారా విషయం తెలియ జేశాడు .ఉత్తరం చదివిన మాధవ సేట్,,తన బీరువాలో వెదికితే ఉత్తరం లో సూచించిన చోటులోనే పచ్చ కనపడగా మహాదాశ్చ పడి తన తండ్రి తనకు తన కుటుంబ సభ్యులకూ ఎవరికీ తెలియకుండా దాన్ని అలా దాచి ఉంచటం భగవల్లీల అని భావించాడు .వెంటనే ఆమరకతాన్ని ,దానితో పాటు తన విరాళం గా వెయ్యి రూపాయలను మద్రాస్ పంపాడు .
కిరీటం తయారు చేస్తున్న కంసాలి దురాశతో విలువైన ఆ మరకతం దాచేసుకొని సామాన్య రాయి అమర్చి తయారు చేశాడు .వెంకటాద్రి స్వామికలలో శ్రీరంగడు ప్రత్యక్షమై జరిగిన తప్పు చెప్పాడు .శిష్య బృందంతో ఆ కంసాలి ఇంటికి వెళ్లి గదమాయిస్తే ముందు అంతా అబద్ధం అని బూకరించి ,వెంకటాద్రిస్వామి శిష్యుడు అప్పా స్వామిరాజు వాడిని వీర బాదుడు బాదితే ,తప్పయిపోయిందని లెంపలేసుకొని క్షమాపణ కోరి ఆ అసలు పచ్చ రాయిని అప్పగించాడు .నకిలీ రాయిని తీసేసి అసలు మరకతాన్ని అందులో బిగి౦ప జేసి , శ్రీ రంగానికి శిష్యులతో సహా తీసుకు వెళ్ళారు .1863 రుధిరోద్గారి సంవత్సర మార్గశిర శుద్ధ ఏకాదశి అంటే పరమ పథ ఏకాదశి అనగా ముక్కోటి ఏకాదశినాడు రంగరంగ వైభవంగా శ్రీరంగానాథునికి పాండ్య కిరీటం అమర్చారు .
చేయించే భక్తులు తేరగా దొరికితే రంగడికి కొదవేముంది .మళ్ళీ వెంకటాద్రి స్వామి కలలో కనిపించి మకరకుండలాలు చేయించమని ఆజ్ఞ జారీచేస్తే చెన్నై నగర వాసుల విరాళాలతో అలాగే చేయించి స్వామికి 1867 ప్రభవ సంవత్సర నవమి నాడు సమర్పించారు . అయిదు శిఖరాలతో బంగారు విమానాన్ని నెల్లూరు శ్రీ రంగ నాద స్వామి పునరుద్ధరణ పనులలో చేయించి అర్పించారు శ్రీ వెంకటాద్రి స్వామి .అలాగే తిరుక్కూడాల్ మల్లై స్థలశయన పెరుమాళ్,తిరు విదా విందై తాయార్ ,ఆండాళ్ దేవాలయాల జీర్ణోద్ధారణ కూడా దగ్గరుండి జరిపించారు వెంకటాద్రి స్వామి .
వృద్ధాప్యం మీద పడుతుంటే శ్రీరంగంలోనే ఉండి,శ్రీరంగనాధ స్వామి సేవలో అందునా ,స్వయంగా తానే సానమీద గంధం నూరి చందనాలంకారం చేసేవారు .అతిరస ,వడ సురులమూడు ,పాలమూడు ప్రసాదాలు తానే వండి స్వామికి నైవేద్యం పెట్టేవారు వెంకటాద్రి నిత్యమూ .శ్రీరంగ నాచియార్ కు అరవన ప్రసాదం చేసి నిత్య నైవేద్యం పెట్టె ఏర్పాటు కూడా వెంకటాద్రి స్వామియే చేశారు .ఈ సేవలన్నీ నిరాటంకంగా జరగటానికి స్వామికి 25.35ఎకరాల మాగాణి ,రెండు మనాల మెట్ట భూమి 5,050 రూపాయలకుతిరుప్పరై తురి గ్రామం లో కొన్నారు వెంకటాద్రి .ఆలయ ధ్వజస్తంభం పై ఈ వివరాలన్నీ చెక్కించారు .రంగ నాచియార్ కు కిరీటం చేయిస్తుండగా గోవర్ధనం రంగాచారి అనే మహాత్ముడు వచ్చి అమ్మవారిని దర్శించగా అక్కడి అధికారులు అర్చకలు అందరూ ఆయనను అమ్మవారి కిరీటం తయారీలో సాయం చేయమని కోరగా ,సరే అని చెప్పి కొన్ని నెలలలోనే తయారు చేయించి పంపించి వెంకటాద్రిగారి కోరిక తీర్చారు .మధుర దగ్గర తిరుమలిం చోరి సోమ చంద్ర విమానం పనులు ,పాండ్య నాడు దివ్య దేశ౦ పనులు కూడా చేశారు వెంకటాద్రి స్వామి .
72 వ ఏట 1864 రక్తాక్షి సంవత్సర౦ లో వెంకటాద్రి స్వామి సన్యాసం స్వీకరించారు .త్రిదండం,కాషాయ వస్త్రాలు ధరించి ‘’తిరు వెంకట రామానుజ జియ్యర్ ‘’అయ్యారు ..స్వామి సేవ తప్ప ఇతర వ్యాపకాలు లేకుండా జీవితాన్ని ధన్యం చేసుకొన్నారు వెంకటాద్రి స్వామి .ఈయన ప్రేమ ఆదరణ పొందిన మహా మహులలో 1866-1872 లోస్వామి గొప్పతనాన్ని తెలుసుకొని సందర్శించిన మద్రాస్ గవర్నర్ లార్డ్ ఫ్రాన్సిస్ నేపియర్స్ ఉన్నాడు .గొప్ప వారు వచ్చినా ఆయన ఏమాత్రమూ తన సేవ తపస్సు ధ్యానం నుంచి బయటికి వచ్చేవారు కాదు .జీవిత చరమాంకం లో శ్రీరంగం లో శ్రీరంగని సేవలో పూర్తిగా గడిపారు వెంకటాద్రి జియ్యర్ స్వామి .ఇహ జీవితం చాలించాలనే ఇచ్ఛ గాఢ మవగా రంగడు కలలో కనిపించి ,ఆయన సాయుజ్యానికి సమయం వగైరాలన్నీ చెప్పి అందరికీ తెలియ జేయించాడు .
1877ధాతు నామ సంవత్సర సప్తమి సోమవారం అర్ధ రాత్రి అష్టాక్షర మంత్రం జపిస్తూండగా ,దివ్య జ్యోతి వెంకటాద్రి స్వామి వారి శిరస్సును చీల్చుకొని వెలువడి పరమాత్మలో కలిసిపోయింది .శ్రీరంగం దేవాలయం మహాత్మా వెంకటాద్రి స్వామివారి పార్ధివ దేహానికి విధి విధానంగా అంత్యక్రియలు నిర్వహించింది .ఈనాటికీ ఉత్సవాల సందర్భం లో రంగ నాయక దంపతులకు వెంకటాద్రి స్వామి తయారు చేయించిన కిరీటాలు అలంకరించి ఊరేగింపు జరుపుతారు .స్వామివారి ప్రసాద తీర్థాలను వెంకటాద్రి స్వామి వారి బృందావనానికి ఊరేగింపుగా తీసుకొని వెళ్లి సమర్పి౦చి మళ్ళీ ఆలయానికి చేరుస్తారు. కావేరీ నదీ తీరం లో అలవందార్ పడిత్తు రాయి లో వేంకటాద్రి స్వామి వారి స్మారక విగ్రహం ఏర్పాటు చేశారు .1977లో శతజయంతి ఉత్సవాలు ఘనం గా జరిపారు .నలనామ సంవత్సర మాఘ మాసం 28వ రోజు 11-3-77 వెంకటాద్రి స్వామి దివ్య తిది నిర్వహించారు .2006నుంచి మద్రాస్ ,లోకూడా ఆరాధన ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు .ఆంధ్ర దేశం లో అందునా ఉత్తర కృష్ణాజిల్లా జుజ్జూరు దగ్గర అల్లూరు లో జన్మించిన ఆలూరి వెంకటాద్రి శ్రీ వెంకటాద్రి జియ్య౦గార్ గా కీర్తిశిఖరాలు అందించి నిత్యం భవత్ దర్శనం తో తరించి స్వామి అడిగినవన్నీతయారు చేయించి కట్టు దిట్టమైన పూజ కైంకర్యవ్యవస్థ ఏర్పాట్లు చేసి న దివ్య పురుషులు .
సశేషం
మీ -గబ్బిట దుర్గాప్రసాద్ -20-1-21-ఉయ్యూరు