మహా భక్త శిఖామణులు 25-ప్రతాప కోటయ్య శాస్త్రి-1

మహా భక్త శిఖామణులు

25-ప్రతాప కోటయ్య శాస్త్రి-1

గుంటూరు జిల్లా బాపట్లతాలూకా నాగండ్ల లో ప్రతాప కోటయ్య శాస్త్రి పుట్టాడు. తండ్రి జోగయ్య  శాస్త్రి .బాల్యం నుండి వైరాగ్య భావనతోనే ఉండేవాడు.వీధి బడిలో కొంతకాలం చదివినా చదువేమీ అబ్బలేదు .ఉపనయనం అయింది వేదం చదివాడో లేదో కూడా తెలీదు .దేనిపైనా ఆపేక్షా భావం లేదు .వినయ, సమత్వం మాత్రం అబ్బాయి .వ్యవసాయం మీదనే కుటుంబం గడుపుతోంది .పొలం పనులకు వెళ్ళినా పండించాలన్న ఆలోచన ,ఉత్సాహం పంటను చూసి ఆనందం ఏమీ ఉండేవి కావు .మెట్టపంటలే కనుక పండిన మొక్కజొన్న, జొన్న లను దారిన పోయే వారిని పిలిచి ఇచ్చేవాడు .పంటను పశువులు మేసినా పక్షులు వాలి తినేసినా పట్టేది కాదు .తమ పొలం వలన జీవ రాశులు బతుకుతున్నాయని సంతోష పడేవాడు .తల్లిదండ్రులు కోపించినా ఉదార బుద్ధి మారలేదు .

  కొటయ్యకు ఇరవై ఏళ్ళు వచ్చాయి. గొల్లపూడికి చెందిన కూరపాటి వెంకట్రాయుడు కూతురు మహాలక్ష్మమ్మ నిచ్చి పెళ్లి చేశాడు .కోడలు కాపురానికి వచ్చే సమయం రాగానే కొడుకుతో తండ్రి సోమరిగా ఉంటె సంసారం గడవదు కనుక ఎక్కడికైనా వెళ్లి డబ్బు సంపాదించుకొని రమ్మని చెప్పి కోటయ్య ను పంపాడు .డబ్బు సంపాదనకోసం ఆ రోజుల్లో అందరూ నైజాం పోవటం అలవాటు కనుక కోటయ్య కూడా నైజాం వెళ్ళాడు .సికందరాబాద్ సత్రం లో ఒక రాత్రి గడిపి ,మర్నాడు వీధుల్లో తిరుగుతుంటే ,గుర్రం నారాయణ అనే ధనవంతుడికి తీవ్రంగా జబ్బు చేసి ,ఎంతమంది డాక్టర్లు వచ్చి చూసి మందులు ఇచ్చినా తగ్గలేదు .అతనికుటు౦బ౦ ఆశ వదిలేసుకొన్నది .ఆ ఇంటి దగ్గర వచ్చే పోయే జనం తో మహా సందడిగా ఉంది .అందరితోపాటు కొటయ్యకూడా లోపలి వెళ్లి చూశాడు .కోటయ్య గొప్ప వైద్యుడనుకొని రోగి బంధువు ఈయన్ను మందు ఇవ్వమని కోరాడు .వైద్యం లో తనకు ఏమాత్రం ప్రవేశం లేదని నెత్తీ నోరూ మొత్తుకున్నా వినలేదు .తప్పని సరి పరిస్థితులలో దేవుడిపై భారం వేసి కోటయ్య శాస్త్రి ,తన దగ్గరున్న అక్షతల కుప్పె ను నీటిలో ఆరగ దీసి అదే సంజీవ తీర్ధం గా పని చేయాలని భగవంతుని ప్రార్ధించి రోగి నోటిలో పోశాడు .అక్కడే మూడు రోజులుండి తీర్ధమిచ్చాడు .నారాయణ కు స్వస్థత కలిగి ఆయనకు ఆయన బంధు మిత్రులకు కోటయ్య పై అమితమైన భక్తీ శ్రద్ధ కలిగాయి. నారాయణ గారి జబ్బు పూర్తిగా తగ్గాక వైద్య నారాయణ కోటయ్య శాస్త్రిని సత్కరించాలనుకొని ఆయనకు ఏం కావాలో కోరుకో మన్నాడు .ఏ రకమైన ధనా పేక్షా లేని శాస్త్రి తనను  కాశీ కి పంపమని కోరాడు.

  కోటయ్య అల్ప సంతోషానికి ఆశ్చర్యపడి నారాయణ అలాగే కాశీకి పంపి,కొంత డబ్బును కోటయ్య తండ్రికి పంపాడు ,కాశీ చేరి పరమపావని  గంగానదిలోని మణికర్ణిక ఘాట్ లో  పుణ్య స్నానం చేసి ,విశ్వేశ్వర సందర్శనం తో పులకించి నిత్యం అర్చిస్తూ ,తనకు ఈబాగ్యం కల్పించిన తండ్రికి  గుర్రం నారాయణకు కృతజ్ఞతలు చెబుతూ అన్నపూర్ణ సత్రానికి చేరాడు .అక్కడే ఉంటూ నిత్య గంగాస్నానం విశ్వేశ్వర దర్శనం తో కొన్ని నెలలు గడిపాడు .

  ఒక రోజు శ్రీ బాల సరస్వతి స్వామి కోటయ్య శాస్త్రి యోగ్యతను గుర్తించి ‘’నాయనా !నువ్వు దేవి అనుగ్రహానికి పాత్రుడవయ్యావు ‘’అని చెప్పి ,తన ఆశ్రమానికి తీసుకు వెళ్లి శ్రీ త్రిపుర సుందరి మహామంత్రం ఉపదేశించి అంగన్యాస కరన్యాసాలతో అభ్యాసం చేయించాడు .సద్గురు కటాక్షం వలన కోటయ్య కు మంత్రం సిద్ధి యోగ సిద్ధి కలిగాయి .పూర్వం కంటే అతి విరాగియై భక్తీ పెరిగి కొన్నేళ్ళ తర్వాత స్వగ్రామం రావటానికి ప్రయత్నం చేశాడు .కోటయ్య ఏమయ్యాడో అని తలిదండ్రులు అత్తమామలు అన్వేషణ సాగించారు .కోతకాలం తర్వాత కోటయ్య శాస్త్రి తండ్రి కోరినట్లు ధనంతో కాకుండా భక్తిజ్ఞాన ధన సంపన్నుడై ఇంటికి వచ్చి అందరికే పరమానందం కలిగించాడు .మామగారు తన ఇంటికి తీసుకు వెళ్ళాడు .ప్రపంచానికి పనికి వస్తాడు అని అతని శీల సౌశీల్యాదులను మెచ్చినా అసంతృప్తి తో ఉన్నాడు .

  భార్య కాపరానికి వచ్చినా కోటయ్య తామరాకు పై నీటి బొట్టు గానే ఉన్నాడు .అత్యంత నిష్టా గరిష్టుడైనాడు .వైరాగ్యం పెరిగిపోయింది .మొదటి కొడుకు పుట్టాడు.జన్మ నక్షత్రం మంచిది కాకపోవటం చేత శాంతి చేయాల్సి వచ్చింది .చేతిలో చిల్లిగవ్వ లేదు అధైర్యపడకుండా కాకుమానుకు చెందిన మాజేటి శేషయ్య అనే వర్తకు డి దగ్గరకు వెళ్లి నలభై రూపాయలు అప్పుగా ఇమ్మన్నాడు .తిరిగి తీర్చే స్తోమత అతడికి లేదని తెలిసి డబ్బు ఇవ్వలేదు .ఏమీ మాట్లాడకుండా గొల్లపూడి వెళ్ళాడు .శేషయ్య యధాప్రకారం ఆ సాయంత్రం శివాలయం కి వెళ్లి ఈశ్వర దర్శనం చేసి గుడి ముందు కాసేపు కూర్చున్నాడు .లోకోత్తర సౌందర్యవతి అయిన ఒక యువతి కనిపించి ‘’నా భక్తుడికి నలభై రూపాయలు అప్పు ఇవ్వనన్నావా ?’’అని అదృశ్యమైంది .ఆమె శాస్త్రిగారు ఉపాసించే లలితా పరమేశ్వరి  అమ్మవారు అని గ్రహించి శేషయ్య ,మర్నాడు ఉదయం కోటయ్య ఇంటికి వెళ్లి ‘’శాంతికోసం యెంతకావాలి శాస్త్రి గారూ ??’అని అడిగితే అ విషయాలేమీ తెలీని శాస్త్రి యాభై మందికి సరిపడా సామగ్రి కావాలి ‘’అని చెప్పగా  ఆ సామగ్రిని శాంతి నాటికీ గొల్లపూడికి చేర్పిస్తానని షావుకారు కోటయ్యకు  చెప్పి వెళ్ళాడు .

  అసలే ఉదా సీనంగా ఉండే కోటయ్య ,శేషయ్య పంపిస్తాడనే నమ్మకం కూడా ఉండటం తో ఏ ప్రయత్నమూ చెయ్యలేదు .శేషయ్య తానిచ్చిన వాగ్దానం మరచికోర్టు పనులతొందరలో  బాపట్ల వెళ్ళాడు .అందరూ మర్చిపోయినా అమ్మవారు మాత్రం మర్చిపోకుండా శేషయ్యకు గుర్తు చేసి’’వెంటనే వెళ్లి నీ వాగ్దానం తీర్చు ‘’అని ఆజ్ఞాపించింది .తనకేసు వాయిదా కోరామని ప్లీడరుకు చెప్పి ఆఘమేఘాలమీద ఇంటికి వెళ్లి ఆరాత్రే ధాన్యం దంపించి ,కావలసిన సామానుతో తానే బండీ లో సర్ది తెల్లవారే లోపు గొల్లపూడి బయల్దేరాడు .కోటయ్యగారు బ్రాహ్మణులను పిలవటానికి ఊళ్లోకి వెళ్ళాడు. ఇంతతంతు జరిపించే స్తోమత లేని కోటయ్య భార్యా వగైరా కాలూ చేయీ ఆడక అటూ ఇటూ ఇటూ తిరుగుంటే శేషయ్య బండీ సామానుతో దిగాడు. హమ్మయ్య అనుకోని ఊపిరి పీల్చుకున్నారు అందరూ .ఊరంతా తిరిగి కోటయ్య ఆలస్యంగా కొంపకు చేరాడు .శాంతి మాత్రం పూర్తయింది. బ్రాహ్మణ భోజనాలు జరగాలి .రెండు వందలమంది బ్రాహ్మణులు వచ్చారు. వంట మాత్రం యాభై మందికే చేయించారు. కోటయ్య గారి ఇల్లు నిప్పచ్చరంగా ఉండటం చూసి శేషయ్య ‘’ఎక్కడికైనా వెళ్లి బియ్యం తెమ్మంటారా ?’’అని కోటయ్య ను అడిగితే ఒక నవ్వు నవ్వి ‘’భయం లేదు అందరికీ సరిపోతుంది ‘’అని చెప్పి లోపలి వెళ్ళాడు .బ్రాహ్మణులు వరుసగా భోజనాలకు కూర్చున్నారు.వండిన పదార్ధాలు చాలవేమో అభాసు పాలౌతామేమో అని అనుమానిస్తూ విస్తళ్ళు వేయలేదు  కోటయ్య శాస్త్రి అన్నం రాశిని ఒక సారి చూసి ,తలూపి తనకు శాంతి పీటలపై అత్తవారు పెట్టిన కొత్త వస్త్రాన్ని నేతిగిన్నేలో ముంచి అగ్ని హోత్రం లో వేశాడు .హవ్యవాహనుడు సంతృప్తి చెందాడని కోటయ్యగారు సంతోషించారు .ఈ వెర్రి బాపని చూసి అందరూ నవ్వు కొన్నారు .కోటయ్య ఇదేమీ పట్టించుకోకుండా అమ్మవారికి అన్నపు రాశి నైవేద్యం పెట్టి మంత్రపుష్పం చెప్పి ‘’వడ్డన మొదలు పెట్టండి ‘’అని ఆనతిచ్ఛి తాను  అన్నం రాశి దగ్గరే నిలబడి పళ్ళాలనిండా అన్నం తోడి వడ్డించే వారికి అందించారు .యాభై మందికి మాత్రమె చేసిన పదార్ధాలు అందరికీ సంతృప్తిగా వడ్డించినా ఇంకా చాలా మిగిలిపోయి అందర్నీ ఆశ్చర్య చకితుల్ని చేసింది .కోటయ్య శాస్త్రిగారి భక్తీ మహాత్మ్యం అమ్మవారికి ఆయనపై ఉన్న అనుగ్రహం అందరూ ప్రత్యక్షం గా చూసి అప్పటి నుంచి ఆయన్ను ఆరాధనా భావంగా చూశారు .శేషయ్య కూడా సంతోషించి తన ఊరు వెళ్ళాడు.

  ఇంతటి నిర్లిప్తంగా ఉన్నా ,ద్వాదశి వ్రతం చేస్తూ ప్రతినెలా  ద్వాదశినాడు బ్రాహ్మణ సమారాధన చేసేవారు .తనకు నచ్చిన గృహస్తు నడిగి సంబారాలు తెచ్చి చేసేవాడు .ఈయన ముఖం చూసి లోభి కూడా ఉదారంగా సాయం చేసేవాడు .విద్య లేదు శాస్త్రజ్ఞానం లేదు డబ్బు లేదు వేష భాషలు ఆడంబరం ఏవీ లేకపోయినా  కోటయ్యను మహానుభావుడుగా భావించి ఆదరించేవారు ఊరిజనం .కొంతకాలానికి మన్నవ గ్రామ చేరారు అక్కడ బ్రాహ్మణ కుటుంబాలు ఎక్కువ .అందరూ వేదాధ్యయన సంపన్నులు కర్మిష్టులే ,అతిధి అభ్యాగత సేవా తత్పరులే .కోటయ్య శాస్త్రిగారిని ఆఊరి బ్రాహ్మణ్యం అత్యంత గౌరవాదరాలతో ఆహ్వానించి  ఘనంగా సత్కరించారు.తాను  నివసించటానికి ఇదే తగిన ఊరు అని నిశ్చయించి అక్కడే ఉండిపోవాలనుకొన్నారు .నిత్యం ఎవరో ఒక గృహస్తు పిలిచి భోజనం పెట్టి ఆతిధ్యమిచ్చేవాడు .

  కొన్ని నెలలు మన్నవ గ్రామం లో ఉండి,ఒక రోజు సప్తాహం చేయాలనే సంకల్పం కలుగగా బ్రాహ్మణ్యానికి  తెలిసి .ధాన్యరూపంగా చందాలు వేసుకొని కొంత ధాన్యం పోగేశారు .పూర్తిగా ధాన్యం సమకూరే దాకా ఉండలేకకోటయ్య శాస్త్రిగారు సప్తాహం మొదటి రోజు నుంచే అన్న సమారాధన ప్రారంభించారు .సప్తాహం పేరుతొ దీర్ఘ అన్నసత్రం జరిగింది .శాస్త్రి గారి మహత్తు గ్రహించి ఆయన భార్యాపిల్లల్నీ పిలిపించి మంచి ఇల్లు ఏర్పాటు చేసి కావలసిన జీవనం కల్పించారు .కుటుంబం ఇక్కడే ఉన్నా శాస్త్రిగారు గ్రామగ్రామం తిరుగుతూ ద్వాదశి సమారాధన మాత్రం నిరాటంకంగా సాగించేవారు .నల్లగా ఎత్తుగా లావుగా ఉండే శాస్త్రిగారు ప్రతి రోజూ ఉదయమే తటాక స్నానం చేసి  ,ఒడ్డున  కనులుమూసి ధ్యానమగ్నులై జపం చేసేవారు.అన్నికాలాల్లో అది క్రమ తప్పని విధి విధానం ఆయనది .చిన్న అన్గోస్త్రం లేక గోచి అదీ లేకపోతె దిగంబరంగా బాహ్య స్పృహ లేకుండా ధ్యానం లో గడిపేవారు .బీదవారు కనిపిస్తే తనకొల్లాయి గుడ్డ వారికిచ్చి దిగంబరం గా ఉండిపోయేవారు అంతటి నిరీహులాయన .ఆయన యోగ్యత గుర్తించి ఎవరైనా వస్త్రాలు ఇచ్చినా పేదలకే పంచి పెట్టేవారు .చీమలపుట్ట ల వద్ద బియ్యం చల్లేవారు కోపతాపాలకు కాదు దురాశ లేదు .ఉదార గుణ గరిష్టుడు .

 ఒక రోజు కొందరు బ్రాహ్మణులతో ఇంటికి వచ్చి భార్యను వంట అయిందా అని అడిగితె వండటానికి కొంపలో ఏమున్నాయి అని అనగా బ్రాహ్మణులని  చెరువుకు వెళ్లి  స్నానం చేసి రమ్మని పంపించి ,తనకు పరిచయమున్న మన్నవ బాపయ్య గారింటికి వెళ్లేసరికి రెండు జాములైంది .ఈయన వాలకం చూసి భోజనం చేసినట్లు లేదని గ్రహించి అడిగితె తన ఇంటికి నలుగురు బ్రాహ్మణులు వచ్చారు వారికి పెట్టకుండా ఎలా తింటాను అనగా మూడు తవ్వల బియ్యమిచ్చి పంపిస్తే ఇంటికి వెళ్లి భార్యకిచ్చి అన్నం వండించి చుట్టుప్రక్కల ఇళ్ళకు వెళ్లి పచ్చళ్ళు తెచ్చి  ఆబ్రాహ్మణులకు భోజనం పెట్టారు .ఇంట్లో ఏమీ లేకపోయినా దారిన పోయే బ్రాహ్మణులను పిలిచి ఏదో విధం గా భోజనం పెట్టేవారు కోటయ్య శాస్త్రి.

  సశేషం

మీ-గబ్బిట  దుర్గాప్రసాద్ -21-1-21-ఉయ్యూరు

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.