మహా భక్త శిఖామణులు
25-ప్రతాప కోటయ్య శాస్త్రి-2(చివరి భాగం )
కోటయ్య శాస్త్రి గారు ఒకసారి భార్యతో భద్రాద్రి వెళ్లి సీతారామ దర్శనం తో పులకించి ,కొన్నాళ్ళు ఉండి ఒక రోజు గౌతమి స్నానం చేస్తుంటే ,సికందరాబాద్ వ్యాపారి ఒకాయన దూడతో ఉన్న గోవు నుసద్బ్రాహ్మణుడికి దానం చేయాలన్న సంకల్పం తో ఉండగా శాస్త్రి గారు కనిపిస్తే ,గోదానం స్వీకరించమని కోరితే చిరునవ్వుతో అంగీకరించగా ద్రవ్యం తో సహా గోదానం చేసి ధన్యుడనయ్యానని ఆ వర్తకుడు సంతోషించాడు . తనసమీపం లోనే కూర్చుని జపం చేస్తున్న ఒక బీద బాపని చూసి శాస్త్రిగారు వినయంగా చేతులు జోడించి ,తానెప్పుడూ ఊరు వదిలి తిరుగుతు౦టానుకనుక ,తన గోవును భరించి పోషణ చేయమని కోరి ఆ స్వర్ణ సురభిని ఆయనకు సదక్షిణగా సంర్పించగా ,భార్య మహాలక్ష్మమ్మ గారు ‘’మనమూ బీద వారమే .అయాచితంగా లభించిన సువర్ణ సురభిని ఇతరులకు అర్పించటానికి మీ మనసు ఎలా ఒప్పింది ?మీ నిర్లిప్తత మన కుటుంబానికి ముప్పు తెస్తోంది .ధన సంపాదన ఆలోచన లేకపోతె కుటుంబం ఆలో లక్ష్మణా అని అఘోరించాలి ‘’అని నిండా క్లాస్ పీకితే .చిరునవ్వుతో శాస్త్రీజీ ‘’హరి యందు జగములున్డును –హరి రూపము సాచు పాత్ర మందుండుశివం –కర మగు పాత్రము కలిగిన –నరయగ నది పుణ్య దేశ మనఘ చరిత్రా ‘’అన్న భాగవత పద్యం చదివి ‘’సత్పాత్రత ఎప్పుడూ లభించదు దొరికినప్పుడు సత్పాత్ర దానం చేయాలి ,సంతాన పోషణకు మనం కర్తలమా ?’’రక్షకులు లేని వారల-రక్షించచెద ననుచు జక్రి రాజై ఉండన్ –రక్షింప మనుచు నొకనరు –వక్షము ప్రా ర్ధింప నేల యాత్మజ్ఞులకున్’’అని ,’’జనకు౦డెవ్వడు జాతు డెవ్వడు ‘’అనేపద్యం –‘’చెలియా మృత్యువు చుట్టమే యముడు ‘’అని మళ్ళీ పోతన గారి భాగవత పద్య౦ వినిపించి భార్యను సమాధాన పరచారు .కొన్ని రోజులు భద్రాద్రిలో గడిపి మళ్ళీ తన మన్నవ గ్రామానికి చేరారు .
మహిమ గలవారుగా శాస్స్త్రి గారు కనిపించరు .కాని ప్రజలకు ఆయన అద్భుత శక్తి పై విపరీత విశ్వాసం ఉన్నది .ఒకసారి వల్లూరు జగన్నాధ రావు గారింట్లో కలశం పెట్టి నవరాత్రి పూజ చేస్తున్నారు .అప్పుడే శాస్త్రిగారు వస్తే ఆహ్వానించి భోజనం చేసి వెళ్ళమని యజమాని కోరాడు .ఇప్పుడే వస్తాను అని చెప్పి శాస్త్రి గారు వెళ్లి యే వేళకూ రాకపోతే ,అప్పటిదాకా ఎదురు చూసి చెరువు స్నానానికి వెళ్ళారేమో అని అక్క డేమైనా ప్రమాదం జరిగిందేమో అనే అనుమానం కలిగి కారణం నాగేశ్వరరావు అనే ఆయన్ను వెదకటానికి పంపారు .అక్కడ ఒక మరుగ్గా ఉన్న ప్రదేశం లో శాస్త్రిగారు కనిపించారు .ఆయన కళ్ళుమూసుకొని బాహ్య స్పృహ లేకుండా ధ్యానం లో ఉన్నారు .శరీరం నిండా గండు చీమలు పాకి నాయి .రావు గారు చూసి ఆశ్చర్యపోయి భయపడి ఆయన్ను పలకరించేధైర్యం లేక ,ఇంటికి వెళ్లి విషయం వివరించాడు .కాసేపటికి సమాధి నుంచి లేచి చీమలు దులుపుకొని గ్రామం లోకి చేరారు .ఇలా అంతర్ముఖులు అయ్యేవారు శాస్త్రి గారు .
నిరపేక్షత ,సమత్వం ,సకలప్రాణులకు అన్నదానం అనే భాగవత ధర్మాలను చక్కగా ఆచరించేవారు కోటయ్య శాస్త్రి .ఆయన వెంట ఎప్పుడూ కుక్కలు ఉండేవి .నిత్య సంతుష్టి నిత్య సంతోషం ఆయన లక్షణాలు .కాశ్యా౦తు మరణం ముక్తిఅని గ్రహించిన శాస్త్రిగారు చివరి రోజులలో కాశీలో గడపాలని గర్భవతి అయిన భార్యతో బయల్దేరి చేరి గంగాస్నానం విశ్వేశ్వర దర్శనం చేసి కొన్ని రోజులుండి,త్రివేణీ సంగమం లో పవిత్ర స్నానాలు చేసి కొన్ని రోజులు ఉన్నారు .అయన వెంట వెళ్ళిన గ్రామకరణం పాండ్రంగి నాగేశ్వర రావు శాస్త్రిగారి అద్భుత శక్తి వివరించి చెప్పారు .ప్రయాగలో ఒక కరోజు ఒంటరిగా లోతైన చోటుకు వెళ్లి ,మనుషులకు అందని నీటిపై తేలి ధ్యాన మగ్నులై ఉన్నారని ఎంతసేపటికీ రాకపోతే తానూ వెడితే ఆ దృశ్యం కనిపించిందని చెప్పాడు .బయటికి రాగానే అంతలోతుకు ఎందుకు వెళ్ళారని రావు ప్రశ్నిస్తే ‘’అక్కడ అసలు లోతే లేదు ‘’అని శాస్త్రిగారి జవాబు .
త్రివేణీ సంగమం నుంచి గయ వెళ్ళారు .అక్కడ శాస్త్రి గారికి జ్వరం తగిలింది .నాలుగవ రోజు భార్యతో ‘’నేను ఈ శరీరం వదిలేస్తాను. విచారించకు.నీకు కూతురు పుడుతుంది ‘’అని చెబూతూ ఉండగానే బ్రహ్మ రంద్ర చేదన జరిగి పుణ్యాత్ముడు నిరీహుడు నిత్య సంతోషి శ్రీ ప్రతాప కోటయ్య శాస్త్రి గారు 1896గంగా పుష్కరాలకాలం లో నలభై రెండవ ఏట పరంధామ సన్నిధిని చేరారు .భార్యాపిల్లలు మన్నవ గ్రామం తిరిగి వచ్చారు .శాస్త్రిగారికి ఇద్దరుకొడుకులు ఒక కుమార్తె .ఇలాంటి పరమ యోగిని గురించి ఇంతకు ముందు మనం విని ఉ౦డలేదు .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -22-1-21-ఉయ్యూరు ,