మహా భక్త శిఖామణులు
27- భద్రాద్రి రామ భక్త శిఖామణి అమరవాది వెంకట రామానుజా చార్యులు
శ్రీరామార్పణ౦
గోల్కొండ రాజ్యాన్ని ఔరంగజేబు పాలించి భంగపడ్డాక,17వ శతాబ్దిలో భద్రాచలం జమీందారు పాలనలో ఉండేది .స్వామికార్యాలు అవిచ్చిన్నంగా జరిగేవి .ఆయన పేరు వగైరాలు ఎవరికీ తెలియవు .ఈ క్షేత్రం లో అమరవాది కామళ్ళ వెంకట రామానుజా చార్యులు అనే దివ్య పురుషుడు ఉండేవాడు .తలిదండ్రుల పేర్లు తెలియవు కానీ ఇప్పటికీ ఈ వంశం వారు అక్కడ ఉన్నారు ఇతడికి ముందుపుట్టిన పిల్లలు వెంటనే చని పోవటం చేత తలిదండ్రులు ఇతడిని శ్రీరాముడికి అర్పించారు .ఇతడు మధ్యాహ్న సమయం లో దేవుడికిచ్చే బలి మెతుకులు తిని,,రామ తీర్ధం తాగి జీవించేవాడు .
సహజ పాండిత్యం ,శ్రీ రామ దర్శనం, కళ్యానోత్సవ విధి విధాన రచన
సహజ పాండిత్యం అబ్బి ఉపనయనం జరిగి రామభక్తి మరింత పెరిగింది .సర్వావస్ద లలో రామనామం చేసేవాడు .ఉదయమే లేవటం స్నాన సంధ్యాదులు పూర్తి చేసి , రాముడికి షోడశోప చార పూజ చేసి ప్రసాదం తిని దూరంగా వెళ్లి తత్వ విచారం చేస్తూ తాను తరించి ,ఇతరులనూ తరింప జేసేవాడు .ఒకసారి సంప్రజ్ఞాత సమాధి లో శ్రీరామ దర్శనం కలిగి ,పులకితుడై స్తుతి చేసి ఆనంద పారవశ్యం పొందాడు .రాముడు ‘’వత్సా !నా ఉత్సవ ప్రక్రియ అంతా ఆగమ శాస్త్ర విధానం గా పొందుపరచి ,మూల గ్రంథానికి,ఖండ వరుస రాసి నా కోర్కె తీర్చు ‘’అని చెప్పి అదృశ్యమైనాడు .పండిత శ్రేష్టులకే అత్యంత కష్టమైన ఆపనిని సహజ పాండిత్యం తో పూర్తి చేసి శ్రీరామానుగ్రహం పొందాడు ఆయన రాసిన ఆ ప్రక్రియను అనుసరించే ఇప్పటికీ భద్రాద్రి సీతారామకల్యాణ విధి జరుగుతోంది .
పాల్వంచలో మట్టి సీతారామ విగ్రహ నిర్మాణం భద్రాద్రిలో అదృశ్యమైన శ్రీరాముడు
ఆలయ ధర్మకర్త ఒక సారి ఆలయానికి వస్తే ఈయన తగిన మర్యాద చేయలేదనే కోపం తో ,తనపాలనలో ఎక్కడా ఆయన ఉండకూడదనే చండ శాసనం చేశాడు .చేసేది లేక ,భద్రాద్రి వదిలేసి పాల్వంచ చేరి మట్టితో సీతారామ విగ్రహాలు చేసి ,ప్రాణ ప్రతిష్ట ,కళావాహనం చేసి,పలువిధాల స్తుతించి సుముఖుని చేసుకొన్నాడు .రాముడు సాక్షాత్కరించి ‘’నాయనా !నువ్వు లేని భద్రాద్రి లో నేనూ ఉండను .ఇక్కడే నీతో పాటు ఉంటాను ‘’అనగా పరమానందం పొందాడు .మర్నాడు భద్రాచలం లో పూజారులకు అర్చా మూర్తులు కనిపించలేదు .జమీందారుకు విషయం తెలిసి నడిచి పాల్వంచకు వచ్చి అమరవాది ఆచార్యుల పాదాలపై వ్రాలి క్షమించమని ప్రార్ధించగా ,మనసు కరిగి ఈ మట్టి విగ్రహాలు తీసుకొని భద్రాద్రి చేరాడు .
యవన సేన నుంచి భద్రాద్రి రాముని కాపాడిన విధం
ఒక సారి యవన భటులు భద్రగిరి ముట్టడించి ,ఆలయ ప్రవేశం చేయ బోతుండగా ,జమీందారు ఆచార్యులవారిని పిలిపించి ఈ ఆపద గట్టెక్కించమని కోరాడు .వారి వలన ఏ ప్రమాదం రాదనీ హామీ ఇచ్చారు ఆచార్యులు .ఆయన్ను పంపించేసి తానొక్కడే ఆలయం లో రామభజన చేస్తూ కూర్చున్నారు ఆచార్యస్వామి ..ఆలయం లో హడావిడి లేదుకనుక యవన భటులు ఇద్దరు మాత్రమే ఆలయం లోకి ప్రవేశించగా విగ్రహాలు కనిపించలేదు .ఇక్కడ విగ్రహాలు లేవని భావించి వాళ్ళు వెళ్ళిపోయారు .
గోదావరి లోదాచిన ఉత్సవవిగ్రహాల విషయం –ఫణిగిరి సీతా దేవి భద్రాద్రి చేరటం
ఒకసారి అర్చక బృందం ఆచార్యుల వారికి చెప్పకుండా ఉత్సవిగ్రహాలను గోదావరిలో దాచి యవ్వన బారి నుంచి కాపాడారు .గోదారి వరదలతో ఉధృతంగా ప్రవహించి ఉత్సవ మూర్తులను తీయటానికి అవకాశం కలగ లేదు .వరద తగ్గాక దాచిన చోట వెదికితే ఉత్సవ విగ్రహాలు కనిపించలేదు అర్చకులకు .ఈ విషయం జమీందారుకు చెబుతూ ‘’రోజూ అర్ధరాత్రి వేళ గోదావరి నీటిలో నుంచి తమల్ని పిలుస్తున్నట్లుగా శబ్దాలు వస్తున్నాయి కాని అంతు పట్టటం లేదు ‘’అని చెప్పారు .ఆలయం లో ‘’ఉత్సవ భీరం’’ లేదని అర్ధమయి ,శ్రీరాముడే గోదావరి నీటి లో నుంచి మాట్లాడుతున్నాడని గ్రహించి ,ఆచార్యులవారికి తెలియ జేశాడు .ఆయన ‘’భయం అక్కర లేదు రేపు మధ్యాహ్నం ఉత్సవ భీరం గోదావరి పై తేలుతూ కనిపిస్తాయి ‘’అని చెప్పారు .మర్నాడు పూజారులు వెళ్లి చూస్తె సీతా దేవి విగ్రహం మాత్రం కనిపించలేదు .ఆచార్యుల వారికీ విషయం చెబితే ‘’రాముడు సీతను గోదావరికి అర్పించాడు ఫణిగిరి ఆలయం లోని సీతా దేవి ఉత్సవ విగ్రహం తీసుకు రమ్మని చెప్పి పంపించగా అక్కడి జమీందార్లు ఒప్పుకోక భద్రగిరిపై దండ యాత్ర చేశారు ఫణిగిరి జమీందారు కలలో రాముడు కనిపించి ‘’అనవసరంగా అడ్డు చెప్పకు విగ్రహం ఇచ్చి పంపించు ‘’అని ఆనతి ఇవ్వగా ఇచ్చిపంపాడు .ఇప్పుడు భద్రాచలం లో శ్రీరాముని ప్రక్కన ఉన్న ఉత్సవిగ్రహం ఫణిగిరి నుంచి తెచ్చినదే .
మహా ప్రస్ధానం
ఈ విధంగా భద్రాచల రామాలయ ఉత్సవాలకు ఆగమ విధి విధానం ఏర్పాటు చేసి ఆలయాన్ని యవన బాధ నుంచి కాపాడి పోయిన సీతామ్మవారి విగ్రహాన్ని ఫణి గిరి నుంచి తెప్పించిన మహోన్నత భక్త శిఖామణులు శ్రీమాన్ అమరవాది రామ చంద్రాచార్యులవారు 70వ ఏట శ్రీరామ సన్నిధి చేరుకొన్నారు .
సశేషం
మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -25-1-21-ఉయ్యూరు