మహా భక్త శిఖామణులు
28- మువ్వ గోపాలకృష్ణ పద దాసు -శ్రీ పువ్వాడ శ్రీరామ దాసు
శ్రీ పువ్వాడ శ్రీరాములు గారు కృష్ణా జిల్లా దివితాలూకా మువ్వగోపాలుని మొవ్వ క్షేత్ర వాసి .మహా కృష్ణ భక్తులు .పదకవితలు రాసి చరితార్దులయ్యారు .’’ఆయనకీర్తన లలో భక్తి పారవశ్యత ప్రస్ఫుటం .శబ్ద సౌష్టవం ,కవితా స్వారస్యం తోపాటు శరణాగతి ఎక్కువగా కనిపిస్తుంది .జప తపో నిష్టులైన దాసుగారు మహామహిమాన్వితులు .ఒకరోజు పొలం లో తిరుగుతుంటే త్రాచు పాము కాటు వేసింది .లెక్క చేయకుండా ఇంటికి వచ్చిజపం లో మునిగిపోతే ఆ పామే ఇంటికి వచ్చి ఆ విషాన్ని పీల్చేసి ఆయనకు ఏ ప్రమాదం రాకుండా కాపాడి వెళ్ళింది .దాసుగారు కృష్ణ ,శివ కీర్తనలతో పాటు తెలుగు వారి కే ప్రత్యేకమైన జావళీలు కూడా రాశారు .మొవ్వవాసి క్షేత్రయ్య శృంగారం తో దున్నేస్తే, దాసుగారు భక్తీ ఆర్తీ శరణాగతి తో భావ బంధురంగా రాశారు ‘’అని ప్రసిద్ధ కవి శ్రీ పువ్వాడ తిక్కన సోమయాజి గారి తల్లిగారు శ్రీమతి పువ్వాడ అనసూయమ్మ గారు చెప్పారు .దాసుగారు సోమయాజిగారికి పెద తాతగారనీ ,దాసుగారి కీర్తనలకు తానె బాణీలు కట్టి పాడే దానినని ,శివరాత్రి జాగరణ లో వీటితో సంగీత నృత్యం కూడా చేయించానని ఆమె గుర్తు చేసుకొంటూ తమ కుమారుడు సోమయాజిగారు పెదతాతగారి పై పుస్తకం తెస్తూ అందులో వారికీర్తనలు చేర్చి ప్రచురించటం సంతోషంగా ఉందని తెలియజేశారు .
సుమారు 25ఏళ్ళ క్రితం మొవ్వలో మొవ్వ కాలేజి తెలుగు లెక్చరర్ డా.వై శ్రీలత గారు క్షేత్రయ్య పదకవితోత్సవం రెండు రోజులపాటు నభూతో గా జరిపి నప్పుడు ,సోమయాజి గారు నాప్రక్కన కూర్చుని శ్రీరాములు దాసుగారి గురించి కొంత చెప్పారు .రేడియో లో ఉదయం వచ్చే భక్తిరంజని కార్యక్రమం లో దాసు గారి కీర్తనలు వినేవాడిని .చాలా ప్రత్యేకంగానూ బాగున్నాయని అనిపించేవి .ఈ సభలో శ్రీమతి మంగళగిరి ప్రమీలా రాణి గారు కూడా పాల్గొన్నారు ఆమె నాకు బాగా పరిచయం అప్పుడప్పుడు ఫోన్ చేసి మాట్లాడేవారు కూడా .సుమారు నాలుగేళ్ళక్రితం ఆమె పరమపదించి పదకవితకు తీరని లోపం చేకూర్చారు .నిన్న సోమయాజి గారు తాము ప్రచురించిన దాసు గారి పుస్తకం పిడిఎఫ్ పంపుతూ ‘’ఇందులోని పదకర్త ను మీ దృష్టికి తేవటం నాకు ఆనందకరం ‘’అని చినుకు నర్మగర్భంగా చిలికారు. బహుశా నేను మహా భక్త శిఖామనులను గురించిఅంతర్జాలం లో రాస్తున్నందున నా దృష్టికి వారి పెద తాతగారు రాలేదేదనే అభి ప్రాయమూ ఉండి ఉండచ్చు లేక చనువుగా ‘’రాయండి ‘’అనే ఆదేశమైనా కావచ్చు .ఏదైనా ఒక మహా భక్తకవి గురించి పరిచయం చేయటం నా అదృష్టమే కాదు ధర్మం, విధి కూడా. అందుకు మహదానందంగా ఉంది .
ఈ పుస్తకానికి ముందుమాటలు రాసిన పద సంగీత పరిషత్ స్థాపకురాలు ,సాహిత్య రత్న డా శ్రీమతి మంగళగిరి ప్రమీలా రాణి పువ్వాడ శ్రీరాములుగారి తండ్రి శ్రీ గుర్రాజు గారు, తాతగారు వెంకటాచలం గారు అనీ వీరిది ‘’చికితస ‘’గోత్రం అనీ ,మొవ్వలోని కృష్ణునిపై ,భీమేశ్వరునిపై పదాలు రాసి శివ కేశవ భేదం లేని స్మార్తులనీ తెలియ జేశారు.’’నందీ వాహనుడై వచ్చే నమ్మా —మేల్ మేల్ భీమలింగా ‘’,జయరామ లింగ జయరామ లింగ ‘’పదాలు చాలా ప్రసిద్ధమైనవనీ విస్తృతంగా వ్యాప్తి చెందాయని చెప్పారు .దాసు గారి కీర్తనలలో బహు ముద్రలు ఉండటం ప్రత్యేకం అన్నారు .మువ్వ మువ్వ గోపాల ,శ్రీరామ దాస ,మువ్వ నివాస ‘’అనేవి ఆముద్రలు అన్నారు .’’ఎన్నడు చూడగ లేదు –ఈత డెవ డమ్మా-పన్నగ శయనుడు -మువ్వ గోపాలుడే కొమ్మా ‘’పదం దశావతార వర్ణనా ప్రాముఖ్యం కలది .ఇది ఇద్దరి స్త్రీల మధ్య సంవాదన గేయం కనుక నాటకీయత ఉండి,వినేవారికి విషయం తేలికగా అర్ధమౌతు౦దన్నారు ప్రమీలారాణి గారు .పదకర్త శ్రీరాములు దాసుగారు బాగా ప్రచారం లో ఉన్న బిలహరి, ఆనంద భైరవి,కేదార గౌళ ,మధ్యమావతి శ్రీరాగాలలో కీర్తనలు సంచరించారు .భగవత్చేవా పరాయణులైన దాసుగారు స్వామివార్లకు నిత్యోత్సవ సేవలు కడు భక్తితో నిర్వహించి తరించేవారు .’’యజ్ఞాది కర్మా చర.ణ కంటే నీ భక్తి భాగ్య సుధానిధి దే జన్మము ‘’అని నాదబ్రహ్మ త్యాగ రాజస్వామి జయమనోహరి రాగం లో రాసిన కృతి లోని భావాన్ని గ్రహించి భక్తి భావం తో పదకవితా స్రవంతిని ఆంధ్రులకు అందించిన శ్రీ పువ్వాడ శ్రీరాములు దాసు గారి జన్మ ధన్యం ‘’ అని నిండుమనసుతో కీర్తించిన పదకవితా ప్రచారక ప్రమీలారాణి గారి ముందుమాటలు సువర్ణానికి సువాసన అద్దాయి .పుస్తక గౌరవం మరింత పెరిగింది .ఈ చిరుపొత్తం 1991లో ప్రచురితమైంది. బహుశా వెల అమూల్యం .
ఇందులో శ్రీరామ దాసు గారు మువ్వ గోపాలునిపై 1-ఎక్కడ ఉన్నావు కృష్ణా నేనెంత వేడిన రావు ‘’2-ఎన్నడు చూడలేదు ఈత డెవరమ్మా ‘’3-అదుగో గోపాలుడు వచ్చే నమ్మలారా 4-రారా పోదామురారా లేచి రారా పోదాము 5-బాలెంతరాలనురా కృష్ణా –‘’అల్ల ‘’పని కోర్వ జాలనురా .కీర్తనలు ఉన్నాయి .భీమేశునిపై 6-మేల్ మేల్ భీమ లింగ 7-జయరామలింగ జయ రామ లింగ 8-నందీ వాహనుడై వచ్చెనమ్మా 9-దశరధ రామ పరాకు ‘’10-రామ సదానంద రామ గోవింద ‘’అనే శిధిలమై కాలగార్భాన కలిసిన వికాక మిగిలిన మొత్తం పది కీర్తనలే దక్కి ముద్రణ భాగ్యం పొందాయి. పెదతాతగారి పై అనన్య భక్తీ గౌరవాలున్న శ్రీ పువ్వాడ తిక్కన సోమయాజి గారు ఈ కరదీపిక ప్రచురించి ఆంధ్రలోకానికి మహోపకారం చేసి ,200 ఏళ్ళ తర్వాత మళ్ళీ మువ్వ గోపాలస్వామికి పద మంజీరాల ధ్వనులతో కనువిందు వీనులవిందు చేకూర్చి నందుకు అభినందనీయులు .ఇందులో పువ్వాడ వారి వంశ వృక్షం కూడా జతచేయటం మరో గొప్ప విషయం
సశేషం
రిపబ్లిక్ డే శుభాకాంక్షలతో
మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -26-1-21-ఉయ్యూరు