మహా భక్త శిఖామణులు
29-కృష్ణాన౦దావదూత
18వ శతాబ్దిలో నెల్లూరు జిల్లా లక్కవరం శివారు నాగ భొట్ల పాలెం70వ ఏట చేరిన కృష్ణానందుడు మాంచి దేహ పటిమ కలవాడు .రోజుకు మూడామడల దూరం సునాయాసంగా నడిచేవాడు .లక్కవర మల్లపరాజు శివరాత్రి ఉత్సవాన్ని చూడటానికి శ్రీ శైలం వెడుతూ ఈయన దగ్గరకు వస్తే ‘’శ్రీశైలం వెడుతున్నావా ?సంతోషం .మల్లికార్జున స్వామికి నా నమస్కారం తెలియ జేయి ‘’అని ఆశీర్వదించాడు .ఆయన ఆశ్చర్యపోయి ‘’స్వామీ ! నేనెవరినో ఎక్కడికి వెడుతున్నానో నేను చెప్పకుండానే మీరు అన్నీ చెప్పిన దైవజ్ఞులు .మేకు తెలియని విషయం ఉండదు ‘’అని కృతజ్ఞతావందనం చేసి వెళ్ళాడు .శ్రీగిరి చేరి ధూళి దర్శనంకోసం అధికారుల అనుమతిని అడుగుతుంటే ,మన కృష్ణావదూతగారు మల్లికార్జున దర్శనం చేసి మనరాజు గారికి ఎదురై ఆశ్చర్యం కలిగించారు . చిరు నవ్వుతో రాజు గారిని ‘’ఎంతసేపైంది వచ్చి మీతో ఎవరరెవరొచ్చారు ?’’అని ప్రశ్నిస్తే అవాక్కై నిలబడితే ‘’నేను కృష్ణావదూతను .మీవెనకాలే నేనూ బయల్దేరి వచ్చాను. శిఖరేశ్వరం దగ్గర మిమ్మల్ని చూశాను .నడవ లేనేమో అనే భయం తో అక్కడ కూర్చోలేదు ‘’అన్నారు .అవధూత సర్వజ్ఞత్వం అర్ధమై రాజు గారు ధూళి దర్శనంచేసి , అవధూత సర్వజ్ఞులని గ్రహించి శివరాత్రి ఉత్సవం కన్నుల పండువుగా చూసి అవదూతగారితో ఇంటికి చేరి,యాత్రా విశేషాలను అందరికీ ఆశ్చర్యం గా తెలియజేశారు .
అవదూతగారు రోజూ అర్ధరాత్రి బయల్దేరి ఋషుల ఆవాసభూమి అని పిలువబడే సీమకుర్తి కొండకు వెళ్లి ,మర్నాడు వేకువనే నాగభొట్ల పాలెం చేరేవారు .దీన్ని కనిపెట్టటానికి అన్నం భొట్లుశాస్త్రి ఆయనకు తెలీకుండా వెంట వెళ్ళేవాడు కానీ ఎప్పుడూ కనిపించ లేదు .ఒకసారి అవధూత పడుకున్న ఇంట్లోనే శాస్త్రి గారు. కూడా పడుకొన్నాడు .అవదూతగారు యధాప్రకారం అర్ధరాత్రి లేచి ఇంటి బయటకు వచ్చి ,తలుపు దగ్గిరికి వేసి వెళ్ళిపోయారు .శాస్త్రి ఆయన వెంట వెళ్ళటానికి వెడితే తలుపు బిగుసుకుపోయి యెంత ప్రయత్నించినాతెరుచుకో లేదు .అరుపులు కేకలతో చుట్టుప్రక్కలవారిని పిలిచే ప్రయత్నం చేసినా ,వాళ్ళు వచ్చి తలుపు తీసే ప్రయత్నం చేసినా తలుపులు తెరుచుకోలేదు .వేకువజామున పిట్టలు అరిచే సమయం లో తలుపులు వాటంతతికి అవే తెరుచుకొన్నాయి .శాస్త్రి అప్పుడు బయటికొచ్చి కొంప చేరాడు అవధూత గారు మామూలుగా వచ్చే సమయానికే వచ్చారు .
శాస్త్రి మర్నాడు రాత్రికూడా అవధూత వెంట వెళ్ళే ప్రయత్నం చేశాడు .ఆయన గమనం తెలీలేదుకాని ఒక పెద్ద భూతం కనిపించి భయపెడితే మూర్చపోయాడు అక్కడే .తెల్లారి నిద్ర లేచినట్లు మామూలుగా లేచి ,అవధూత దర్శనమై పాదాలపై వ్రాలి క్షమాపణ కోరాడు .క్షమించి మళ్ళీ అలాంటి ప్రయత్నం చేస్తే ప్రమాదం అని హెచ్చరించారు అవధూత .
ఒక సారి చలిజ్వరం తో బాధపడుతున్నఅవధూత గారిని చూడటానికి లక్కవరం గ్రామస్తులు కొందరు అవదూతగారి దగ్గరకు వచ్చారు .వాళ్ళని కూర్చోమని చెప్పి తనకు వాళ్లకు మధ్య అడ్డం గా ఒక కర్ర పడేశారు .కాసేపటికి ఆ కర్ర గజగజ వణకటం ప్రారంభించింది .అదేమీ విచిత్రం అని ఆయనను అడిగితే ‘’ప్రారబ్ధ వశాన నన్ను ఆశ్రయించిన జ్వరం ఈ కర్రలో ప్రవేశ పెట్టటం వలన అలా వణికింది నా చలిజ్వరం తగ్గి ,అది అనుభవించింది .పాపం మీరు నన్ను చూడటానికి వచ్చారు నా జబ్బు తగ్గిందని చూపటానికే ఇలా చేశాను .మాయ స్వాదీనమైతే ఏ బాధా ఉండదు మనం పొందే కష్టసుఖాలు మాయావినోదాలు .సహన శక్తి అందరూ అలవర్చుకోవాలి ‘’ ‘’అని బోధించారు . .
ఒక రోజు శిష్యులను పిలిచి తాము దేహ యాత్ర చాలిస్తున్నామని ,శరీరాన్ని లక్కవరం లోసమాది చేయమని చెప్పి ,కపాల భేదం చేసుకొని పరమపదం పొందారు అవదూతగారు .ఆయన కోరినట్లే గ్రామస్తులు శిష్యులు చేసి, వారి బృందావనానికి నిత్య ధూప దీప నైవేద్యాలకోసం గ్రామస్తులు 18ఎకరాల భూమి సమకూర్చారు .ప్రతి పుష్యమాసం శ్రీవారి వార్షికోత్సవం ఘనంగా నిర్వహిస్తారు .అవధూత గారి ముఖ్య శిష్యులు లక్కవరపు అయ్యపరాజు పంతులుగారు పొతకామూరు నివాసి అయినా ,లక్కవరం అనే పేరుతొ ఊరు నిర్మించి ,శివ ప్రతిష్ట చేసి నిత్య శివార్చన చేసిన పుణ్యమూర్తి .ఎనిమిది తరాలనుంచి ఈ వంశం వారు ఈ ఊళ్ళో ఉంటున్నారు .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -27-1-21-ఉయ్యూరు