తాటి కొండ గేయమాలిక
అడ్లూరి అయోధ్యరామకవి రచించిన ‘’తాటి కొండ గేయమాలిక ‘’విజ్ఞాన గ్రంధాలయం వారి ఆరవ ప్రచురణ గా వరంగల్ రంగాఆర్ట్ ప్రెస్ లో పార్ధివ జ్యేష్టం 1945లో ప్రచురింపబడింది .వెల పది అణాలు .పుస్తకప్రచురణకు మహారాజ ,రాజ ,సామాన్య పోషకులు ద్రవ్య సాయం చేశారు ఆంద్ర పితామహ శ్రీ మాడ పాటి హన్మంతరావు గారి షష్టిపూర్తికి వందన సమర్పణ గా అ౦కిత తమివ్వబడింది .
కవిగారి విజ్ఞప్తి మాటలలో తాను విశ్వనాథ వారి కిన్నెరసాని పాటలు చదివిన ప్రేరణ తో తాటికొండ గీతికలు రాసినట్లు ,గేయాలన్నీ ట్యూనింగ్ కు సెట్ అయినవే అని చెప్పారు .శతావధానులు శ్రీ శ్రీనివాస సోదరులు ము౦దుమాటలుగా తమ కవిపండితాభిప్రాయం తెలియ జేశారు –తాటి కొండ గ్రామం చుట్టూ తాడి చెట్లు నాలుగు వైపులా ఉన్నాయని ,ఇక్కడే రామ వనవాస ఘట్టం మొదటి ప్రదర్శన జరిగిందని ,నగరాజు తాళవృక్ష శిష్య బృందం తో సీతారామ లక్ష్మణులకు వనచారి ఆతిధ్యమిచ్చి ధన్యుడైనాడు .అతడు రుషి పుంగవుని గా నిల్చి నగపుటార్తి తెలిపినట్లు సీతాదేవికి కనిపించగా అక్కడే విడిది చేద్దామని సిఫార్సు చేసి ,అతడి తపస్సు ఫలించేట్లు చేసింది .
వినోదార్ధం సీతారాములు పచ్చీసు ఆట ఆడారు. నాలుగాటలలో సీతను రాముడు ఓడించినా ఆమె భర్త గెల్చినందుకు సంబర పడగా రాముడు అబ్బురపడ్డాడు .మర్నాడు కావాలని తానె ఓడిపోయాడు రాముడు .భర్త ఓడటం అమంగళ౦ గా ఆమె భావించి రోదించింది .ఇదీ ఇందులో విషయం. కవి అయోధ్యరామయ్య దీనితోపాటు తన వివిధ ఖండకావ్యాలలోని గేయాలనూ దీనికి జత చేశాడు .ఇవి అనేకరాగాలు వరుసలలో మనోహరంగా ఉన్నాయి ‘’అని కవి హృదయాన్ని చక్కగా ఆవిష్కరించారు .కవి సామ్రాట్ విశ్వనాధ సత్యనారాయణ గారు ‘’ఇది సీతా పాతివ్రత్య గుణ చిహ్నం .కవి భావుకుడు జాతీయవాది .గేయాలలో ‘’లచ్చిమొర’’చాలా బాగుంది .పల్లె సొగసు సమృద్ధి గొప్పగా వర్ణించాడు కవి .కవిత్వాన్ని కొంత మెరుగు పరచుకోవాలి ‘’‘’అని అభిప్రాయం రాశారు .
ఇందులో వనవాసం నాగరాజు ,నివాసం ,షోడశోపచారాలు ,చదరంగం ,సీత దుఖం ,వీడుకోలు ,వరము ,అనే శీర్షికలున్నాయి .చివరిదైన వరం –లో –‘’ఈ కొండ ఈ సెలయేరు ఈ వృక్షముల పంక్తి –ఎంతో ధన్యంబౌటచే –మనమిచట నివసించి –అనుపానమైన -మోదమున మూన్నాళ్ళు ముచ్చటగా గడుపుచూ –ఆడినా చదరం యాటా- దాని చే –నిరువురకు జరిగినా మాట-ముందు కలియుగమందు బుట్టెడి-స్త్రీపురుషులకు చిత్త శుద్ధి ని –కలుగ జేయుచు దంపతుల వి-ధ్యుక్త ధర్మంబూ జూపుచూ –ముక్తి దాయకమై ఇలా –సంపూజ్యమై ఒప్పున్ –మనమాడు చదరంగ –మును జ్ఞప్తి కేలయించు –యాకృతిన్ గ్రామం మొక-టై ఇతన బె౦పొ౦దు-దాని నామ౦బూ -తాడి కొండ యనన్-ధారుణిన్ కీర్తి గను చుండు ‘’అని వరం ఇచ్చి ఈగ్రామంలో ఒక కవి ఈ విషయాన్ని కావ్యంగా రాస్తాడని చెప్పారు ‘’ఈ సెలయేరు ప్రవహించి ప్రవహించి కృష్ణానదిన్ గలయు ‘’అనీ సెలవిచ్చారు ‘’భక్తులను బ్రోవగ ఈ చోట –మన రూపు లుండు –‘’
అనుబ౦ధ౦ గా ఉన్న గేయమాలిక లో –ఆంద్ర జాతీయ గేయము ,వినతి ,వలదు ,లచ్చిమొర,ఆగమనం ,ఎప్పుడు ,నేను నా దేశం ,ప్రార్ధన మొదలైన గీయాలున్నాయి .
కిన్నెరసాని ప్రేరణగా రాసినా ఈ ‘’తాటి కొండ ‘’ అంతగా ప్రజాదరణ పొందినట్లు లేదు .ఎవరూ ఉదాహరించిన దాఖలాలూ లేవు .ఆంద్ర దేశం లో సీతారాములు విహరించిన పవిత్ర స్థలాలు చాలాఉన్నాయి .రికార్డ్ కెక్కాయి .ఆపుణ్యం ఈ గ్రామానికి దక్కటం అదృష్టం.
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -27-1-21-ఉయ్యూరు