మహా భక్త శిఖామణులు
30-నృసింహ భక్తురాలు నిరతాన్న దాత -కైవారం బాలాంబ
కైవారం సుబ్బావధాని సత్యమార్గం లో నడిచే వాడు .మధురభాషి. ఎవ్వర్నీ చెయ్యి చాచి అడగని వాడు .నిర్లిప్తుడు .ఆయన భార్య ఉత్తమా ఇల్లాలు కైవారం బాలాంబ .దంపతులకు 18ఏళ్ళ దాంపత్య జీవితం లో సంతానం కలుగ లేదు .బావగారి కొడుకు నారాయణ ను అల్లారు ముద్దుగా పెంచారు .ఇతడు ఆటలాడు తూ జారి నూతిలో పడ్డాడు .ఎక్కడున్నాడో తెలీక ‘’లక్ష్మీ నృసింహ స్మరణ చేస్తూ ‘’నాయనా నారాయణా !ఎక్కడున్నావు తండ్రీ ‘’అని వాపోతుంటే ‘’అమ్మా భయం లేదు .ఎవరో దివ్యపురుషుడు నన్ను చేతులతో ఎత్తుకొని నూతి గట్టు మీద కూర్చోబెట్టి వెళ్ళిపోయాడు ‘’అని చెప్పాడు .భగవత్ లీలకు ఆశ్చర్యపడుతూ నారాయణ ను ఇంటికి తెప్పించింది .
1888లో తన నలభై వ ఏట భర్త సుబ్బావధాని మరణించగా ,శ్రద్ధగా అపరకర్మలు నిర్వహి౦పజేసి రోజూ రెండు సార్లు నృసింహస్వామి దర్శనం చేస్తూ మనశ్శాంతి పొందింది బాలమ్మ .బులుమళ్ళనరసింహా చారి వలన తిరు మంత్రోప దేశం పొంది ,మంత్రం సిద్ధి ,దివ్య సాక్షాత్కారం పొందింది . వైదిక విధానం లోకాక వైష్ణవ విధానం లో మంత్రోప దేశం పొందిందని సాటి బ్రాహ్మణులు పీఠాదిపతికి ఫిర్యాదు చేశారు .ఆయన బాలాంబ గారిని పిలిపించి స్వయంగా పరీక్షించి ఫిర్యాదీలను మందలించి తరిమేశారు .
ఒక రోజు కుంభ వృష్టి కురుస్తుంటే ,తలదాచుకోవటానికి ఒక గుహ దగ్గరకు వెళ్ళింది .గుహలోపలి నుంచి బురద నీరు ఒక్క సారిగా బయటికి రావటం ఆప్రవాహం ఆమెను ఈడ్చి కొట్టటం తో కింద గుంటలో పడి స్పృహ తప్పింది .వర్షం ఆగాక నీటితో ఆ గుంట నిండి పోయి ,ఆమె ఎవరికీ కనిపించలేదు .ప్రతి రోజఉదయమూ బాలాంబ గారి యోగ క్షేమాలు విచారించటానికి వచ్చే హనుంమంతయ్య గారు వచ్చి ,అమ్మగారు కనిపించకపోతే చుట్టుప్రక్కల వెతుకుతూ ఆ గుంటలో ఉన్నట్లు తెలుసుకొని మనుషులతో అందులోనుంచి బయటికి తీయించి ఉపచారాలు చేయించగా కొంత సేపటికి బాలాంబ గారికి స్మృతి కలిగింది .అందరూ సంతోషించారు .
మరోసారి బాలా౦బగారి నడవడిక పై ప్రత్యర్ధులు కొందరు లేని పోనీ ఆరోపణలు చేస్తే భరించలేక ప్రాణత్యాగం చేసుకోవటానికి లోతైన నూతి లోకి దూకగా భక్తవరదుడు లక్ష్మీ నృసింహస్వామి కాపాడి అంతర్హితు డయ్యాడు . ఇలా చాలా సార్లు ఆమె పై ఆరోపణలు రావటం నరసింహస్వామి కాపాడటం జరిగింది .ఒక సారి నరసింహస్వామి అయిదేళ్ళ బాలుడుగా కనిపించి ‘’అమ్మా !నాకు ఆకలిగా ఉంది అన్న౦ పెట్టు ‘’అని అడిగితే ,అమ్మ గ్రహించి చేతులు రెండూ జోడించి ‘’నరసింహ దేవా !ఈ అబలను పరిహసిచ టానికి బాలుడవై వచ్చావా ?విశ్వ గర్భుడవైన నీకు అన్నం పెట్టటానికి నేనెవరి నయ్యా “”అని పాదాలపై పడి స్మృతికోల్పోతే ,స్వామి నిజరూప దర్శనం అనుగ్రహించి ‘’అవ్వా !నీ వలన ఇక్కడ నిరతాన్న దానం అవిఘ్నంగా జరుగుతుంది .నీ దీక్ష నిర్విఘ్నంగా సాగు గాక ‘’అని చెప్పి అదృశ్యమయ్యాడు .
స్వామిఅనుగ్రహం తో నిరతాన్నదానం నిర్విఘ్నం గా సాగిపోతోంది.అడగకుండా నే భోజన పదార్ధాలు కుప్పలు తెప్పలుగా వచ్చి పడేవి.ఈ వైభవాన్ని కూడా జీర్ణించుకోలేని ప్రత్యర్ధులు ఆమె శిరోజాలు తీసేయకపోతే వెలి వేస్తామని బెదిరించారు .వారి బాధ భరించలేక మంగలిని పిలిపించి ము౦డనంచేయించుకోవటానికి సిద్ధపడింది .క్షురకుడు కత్తిపట్టుకొని జుట్టు గొరుగుదామని ప్రయత్నిస్తే , అమ్మ గారి బదులు సింహం కనిపించి వాడు భయం తో పారిపోయాడు .ఒకసారి ఒక రచయిత మల్లాది సుబ్బదాసు గారి జీవితచరిత్ర రాయాలనుకొని బాలా౦బగారిని విశేషాలు తెలియ జేయమనికోరితే వివరాలు చెప్పి ఆరోజులు మహాలయ పక్షం రోజులుకనుక పితృప్రీతికరం కనుక ఆ రాత్రి భోజనమా ఫలహారమా అని అడిగితె ఫలహారమే అని చెబితే ,పిండి చేయించనా అంటే సరే అనగా ,చేయించి పీట వేసి కూర్చోపెట్టగా ఆయన ప్రక్కన మరో పీట మీద ఇంకొక అతిధి కూర్చోగా ఇద్దరికీ అమ్మగారు దోసెడు దోసెడు అరిసెలు వడ్డించారు .రెండు అరిసెలతో కడుపు నిండిపోయింది .మళ్ళీ రెండు పెరుగు ఆవడలు ,రెండు లడ్డూలు వడ్డించారు .తినేలోపు ‘’పిండి చేయమన్నావుగా నాయనా ‘’అంటూ విస్తరిలో కుమ్మరించి ,చిక్కని మజ్జిగ పోసి తినమంటే ఆ రచయిత ‘’అమ్మా! అన్నదానం పేరుతొ అతిధుల ప్రాణాలు తీస్తున్నావు .ఇది కడుపు అనుకొన్నావా కళ్ళేపల్లి చెరువు అనుకొన్నావా? ఖాళీ ఉండద్దా తినటానికి ?’’అని సరదాగా అంటే ‘’నాయనా !నరసింహ నామ స్మరణ చెయ్యి అని మూడు సార్లు నామాన్ని అనిపించగా కడుపుఖాళీ అయి అన్నీ ఆబగా తినేశాడట .
మరో సారి సంక్రాంతి రోజున సత్రం లో బ్రాహ్మణులు భోజనాలు చేస్తుంటే ,బాలా౦బ గారు బంతులన్నిటినీ తిరుగుతూ పర్యవేక్షణ చేస్తుంటే ,వ౦టవాడు వచ్చి ‘’అమ్మా !దొడ్డి గుమ్మం నుంచి ఒక పంచముడు లోపలి వస్తుంటే బ్రాహ్మణ భోజనాలు అయ్యేదాకా ఆగమంటే ఆగటం లేదు’’ అని చెప్పగా వెంటనే అతడి దగ్గరకు వెళ్లి దొడ్లో ఒక చోట విస్తరి వేయించి వడ్డింప జేసి తృప్తిగా భోజనం పెట్టించారు బాలా౦బ గారు .అమ్మగారు చూస్తుండగానే అతడు అదృశ్యమయ్యాడు పానకాల నరసింహ స్వామి ఆ వేషం లో వచ్చాడని గ్రహించారు .ఒకసారి మంగళగిరి తిరునాళ్ళకు వేలాది మంది వస్తే ,18 మానికల బియ్యం బాలభోగానికి వండించారు .ఐదారువందలమంది బాలురు బాలభోగానికి వచ్చి కూర్చున్నారు .వండిన అన్నం సరిపోదని వంటవాళ్లు గుంజాటన పడుతుంటే ముసలితనంలో ఉన్న బాలాంబగారు వచ్చి అన్నం రాశి పోయించి గుడ్డ కప్పి కర్పూరహారతి పట్టి ,తానేఅన్నాన్ని పళ్ళాలలో నింపి ఇస్తుంటే ఎన్ని పళ్ళాలులు తీసినా రాశి తరగక అందర్నీ ఆశ్చర్యపరచింది .అదంతా నరసింహస్వామి ప్రభావం అని వినమ్రంగా అమ్మగారు చెప్పేవారు.
మరోసారి బ్రాహ్మణ సంతర్పణకు విపరీతంగా బ్రాహ్మణులు వచ్చారు .వడ్డనలు పూర్తయ్యాయి .అభేరించటానికి కూడా నెయ్యి లేదు .వడ్డనవారు గుసగుసలాడుతుంటే విని పళ్ళెం లో కర్పూం వెలిగించి వాకిట్లో నిలబడి నరసింహస్వామికి హారతిచ్చి నిలబడగా కర్నూలు నుంచి సెల్ఫ్ ఆర్డర్ తో నేతి డబ్బాల బండి వాకిట్లోకి వచ్చి ,అమ్మగారికి అప్పగించి రసీదు పొంది వెళ్ళిపోయాడు బాలా౦బగారి భక్తీ తపరతకుందరూ పొంగిపోయారు .ఈ నెయ్యి తో సంతర్పణ వైభవంగా పూర్తి చేశారు . నరసింహస్వామి వెంటఉండి నడిపిస్తున్న నిరతాన్న దానంతో తరించిన కైవారం బాలా౦బ గారు 79 వ ఏట నృసింహ స్వామిలో ఐక్యమయ్యారు .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -28-1-21-ఉయ్యూరు