చింతలూరుశ్రీ వేంకటేశ్వర ఆయుర్వేద నిలయ సంస్థాపకులు –శ్రీ ద్విభాష్యం వెంకటేశ్వర్లు మద్రాస్‌లోని ఆచంట లక్ష్మీపతి గారి ,శ్రీ దీవి గోపాలాచార్యులు తర్వాత ఆంద్ర దేశం లో ఆయుర్వేద వైద్యానికి శక్తియుక్తులు ధార పోసి పోషించినవారు శ్రీ ద్విభాష్యం వెంకటేశ్వర్లు.ఈ ఆయుర్వేద భిషగ్వరుని జీవితం పై శ్రీ ఓలేటి సూర్యనారాయణ శాస్త్రి పుస్తకం రాస్తే ,ఆ ఆయుర్వేదనిలయం ప్రొప్రైటర్ శ్రీ ద్విభాష్యం వెంకట సూర్యనారాయణ మూర్తి కాకినాడ జార్జి ప్రెస్ లో 1951లో ముద్రించి లోకానికి అందించి మహోపకారం చేశారు .వెంకటేశ్వర్లుగారు 24-12-1884 న జన్మించి ,67సంవత్సరాలు సార్ధక జీవితం గడిపి 25-6-1949 న మరణించారు .
ఈ పుస్తకం లో శ్రీ నరసింహ దేవర సత్యనారాయణ రాసిన ముందు మాటలలో ‘’ వెంకటేశ్వర్లు గారు మా తండ్రిగారి పినతల్లి కుమారులు ..మా సన్నిహిత గ్రామ వాసులు చిన్నప్పటి నుంచి మా మధ్య మైత్రీ బంధం ఉంది .నా కంటే పదేళ్ళు పెద్ద .నాపై పుత్రవాత్సల్యమున్నవారు .కనుక వారి జీవిత చారిత్రకు తొలిపలుకులు పలకటం నా అదృష్టం.వారి వివాహానికి మా తలిదండ్రులతో తీపర్రు వెళ్లాను. ఆయన మేనమామ కూతురే భార్య .మా తండ్రి గారు సంస్కృత నాటక అలంకార సాహిత్యం లో ప్రసిద్దులై పాఠాలు చెప్పేవారు అప్పటికే వెంకటేశ్వర్లగారి తల్లి చనిపోయింది .తండ్రీ ఈయన ముగ్గురు సోదరులు చితలూరులో ఆయుర్వేద వైద్యం చేస్తూ జీవిస్తున్నారు .
భార్య కాపురానికి వచ్చిన వేళా విశేషం వలన వైద్యం దినదినాభి వృద్ధి చెంది సోదరుల౦తా సంపాదనా పరులై కుటుంబం లో సంపద పెరిగింది .వీరి అన్న బుచ్చయ్యగారూ గొప్ప వైద్యులే .ఆకుటుంబం వారు సుమారు 200ఎకరాల సుక్షేత్రమైన మాగాణి సంపాదించారు .ఔషధ వ్యాపారం వలన ఏటా సుమారు మూడు లక్షల రూపాయల ఆదాయం నలభై బ్రాంచీలతో మూడు పూలు ఆరుకాయలు లా వర్దిల్లింది . ఏడాదికి 30వేలు ఆదాయం పన్ను చెల్లించేవారు. గుమాస్తాలు పనివారలకు రోజు వారీగా కనీసం వంద రూపాయలు ఇచ్చేవారు .కొంతకాలం వైద్య వృత్తి చేసి తర్వాత పూర్తికాలం శాస్త్రీయ ఆయుర్వేద ఔషధ వ్యాప్తికే అంకితమ య్యారు .
ఆ శతాబ్దారంభం లో పండిత శ్రీ దీవి గోపాలాచార్యులు ప్రసిద్ధ ఆయుర్వేద ఔషధాలు నాణ్యంగా స్వయంగా తయారు చేయించి వ్యాప్తి చేసి ఆయుర్వేద గౌరవం పెంచారు .అల్లోపతి వైద్యులైన శ్రీ ఆచంట లక్ష్మీ పతి గారు ఆయుర్వేదం లోకి మారి ,ఫార్మసి స్థాపించి ,ఆయుర్వేద సంప్రదాయం ఔషధాలు ఖిలం కాకుండా గొప్ప కృషి చేశారు .పానగల్ ప్రధాని హయాం లో జిల్లా బోర్డు ,మునిసిపాలిటీ లలో ఆయుర్వేద ఆస్పత్రులు వెలిశాయి .అప్పుడే వెంకటేశ్వర్లుగారు ఆయుర్వేద ఔషధాలను విరివిగాకల్తీలేని తయారు ,ప్రదర్శనలూ నిర్వహించి గొప్ప పేరు పొందారు .అప్పటికే సుమారు 15రకాల ఔషధాలు తయారు చేస్తున్నా తృప్తి పడకుండా ,చరక సుశ్రుత యోగరత్నావళి మొదలైన గ్రంథాలలో ఉన్న రసౌషధాలు, ,లేహ్యాలు చూర్నాలు ఆసవాలు అరిస్టాలు,తైలాలు తయారు చేసి, ఏటా జరిగే అఖిలభారత ప్రదర్శనకు పంపేవారు .వీరి ఓషధ గుణాలను పరీక్షించి ప్రశంసించి ఎన్నెన్నో యోగ్యతాపత్రాలు అందించేవారు .
మొదటి ,రెండు ప్రపంచ యుద్దాలతర్వాత విదేశీ మందులకే గిరాకీ ఎక్కువగా ఉండేది .కాని అవి దొరకటం కష్టమైసామాన్యులకుదూరమయ్యాయి .అప్పుడు అందరి దృష్టి దేశీయమైన ఆయుర్వేదం పై పడింది ,అభిమానం పెరిగి అందుబాటులో ఉండటం వలన విశేష వ్యాప్తి చెందింది .
శ్రీ కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుగారి ‘’అమృతాంజనం’’ తలనిప్పికి క్లిక్ అయింది. కేసర్ గారు ‘’లోధ్ర ‘’ఔషధం తో ప్రసిద్ధి పొందారు .జమ్మి వారి ‘’లివర్ క్యూర్ ‘’చింతామణి అయింది కానీ వెంకటేశ్వర్లుగారి ప్రతి ఔషధమూ దివ్య గుణ భరితమైంది .దీనికి కారణం ఆయన సత్ప్రవర్తన నిర్మలహృదయం వినయం కృత్రిమత లేని సౌజన్యం మాయమర్మం లేని వ్యవహారం .మహా శ్రీమంతులైనా పేదల యెడ దయ సానుభూతి ఆపన్నులకు స్నేహ హస్తాలు చాచటం ఆర్తులపై కనికరం సేవకులపై వాత్సల్యం ఆపన్నులకు వితరణ పెరిగాయే కాని తరగ లేదు .
ఆయుర్వేద మూల పురుషుడు శ్రీ ధన్వంతరి కి చి౦తలూరులో వెంకటేశ్వర్లుగారు దేవాలయం నిర్మించి ,నిత్యపూజాదికాలకు నిర్విఘ్నంగా జరగటానికి ఏర్పాటు చేశారు. ఎనిమిది ఎకరాల భూమిని ఆ దేవాలయానికి పట్టారాసి సమర్పించిన అమృత హృదయులాయన. వింజరం గ్రామం లో వేదపాఠశాల కట్టించి ,విద్యావ్యాప్తికి కృషి చేసి పది వేలరూపాయలు శాశ్వత నిధి సమకూర్చారు .ఎన్నో సత్రాలు సావిడులు,బావులు ,ఆరామాలు నిర్మించారు విద్యార్ధులకు ఉపకార వేతనాలిచ్చేవారు .తండ్రికాలం నుంచి అందరికీ ఉచితవైద్యమే .వీరూ దాన్ని కొనసాగించి విశేషమైన పేరు పరపతి ,ప్రజాదరణ సాధించారు .వీరి సోదరుడు సుబ్బారాయుడుగారు కార్య దర్శిగా ఉంటూ ఆ సంస్థ వ్యాపారాన్ని ఏడాదికి 3లక్షలకు పెంచారు .
ఆవూరి కో ఆపరేటివ్ లాండ్ మార్ట్ గేజ్ బ్యాంక్ , ,కో ఆపరేటివ్ రూరల్ బ్యాంక్ ,ఉత్పత్తి కొనుగోలు దార్ల సంఘం,పశు సంపత్తి వృద్ధి సహకారసంఘం మొదలైన వాటిలో సభ్యులుగానే ఉన్నారు,కానిపదవులు కోరుకోలేదు.తమ సంస్థలో ఎందరికో ఉద్యోగాలిచ్చి ఆదుకొన్నారు .వేదపాఠశాలకిచ్చిన పది వేలరూపాయలు ఆలమూరు కోఆపరేటివ్ రూరల్ బ్యాంక్ లోనే డిపాజిట్ చేశారు .వివిధ బ్రాంచీలనుంచి వచ్చే డబ్బంతా డ్రాఫ్ట్ ల రూపంగానే ఈబాంక్ కి చేరేట్లు చేశారు .ఎంతోప్రాభవం పెరిగినా పల్లెటూరు చి౦తలూరు వదలలేదు .నిత్యం వేలాది రూపాయలు మనియార్డర్లు , డ్రాఫ్ట్ ల రూపం లో వస్తూనే ఉంటాయి .ఇంతటి ఆదర్శ పురుషుని జీవిత చరిత్ర రాసిన శ్రీ ఓలేటి సూర్యనారాయణ మూర్తి ధన్యులు .నాకు పరిచయమున్న వెంకటేశ్వర్లు గారి పుస్తకానికి నేను ముందుమాట రాయటం నా అదృష్టం-‘’అన్నారు నరసింహ దేవర సత్యనారాయణ .
‘’Lives of great men all remind us –We can make our lives sublime –And departing ,leave behind us –Foot prints on the sands of time –F00t prints that perhaps another –Sailing over life’s solemn aims –A forlorn and ship wrecked brother –Seeing all ,shall take heart again –Let us ,then be up and doing –With a heart for any fate –Still achieving ,still pursuing –Learn to labour and wait ‘’
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -29-1-21-ఉయ్యూరు