మహా భక్త శిఖామణులు
31-మహర్షి పీరోజీ
రామనామ జపసిద్ధి పొందిన పీరోజీ 1829విరోధి ఆశాఢ శుద్ధ ఏకాదశి నాడు నర్సోజీ, నర్సూబాయ్ దంపతులకు జన్మించాడు .తమ్ముళ్ళు వెంకోజీ ,గోపాలరావు .చిన్ననాటనుంచే భగవధ్యానం భక్తీ అబ్బాయి .పదేళ్ళకే సంస్కృతం లో పాండిత్యం అబ్బింది .పన్నెండేళ్ళకే కవిత్వం రాశాడు .సహజ పాండిత్య ప్రకర్ష ఉన్నవాడు .ఒకరోజు అనుకోకుండా చిదానంద యోగి వచ్చి ఇతని అభిలాష గమనించి తారమంత్రం ఉపదేశించి వెళ్ళాడు .భక్తి శ్రద్ధలతో జపం చేసి సిద్ధి పొందాడు .
15వ ఏట వీరాబాయ్ తో పెళ్లి అయింది .ఆమె సాధ్వి సుశీల .భర్తకు అన్ని విధాలా సహకరించేది .సద్గ్రంథ రచన చేయాలనే కోరికతో పీరోజీభద్రాచలం వెళ్లి ఇష్టదైవం శ్రీరాముని దర్శించి ,పులకిత గాత్రుడై స్వీయ కృతులు రామునకర్పించి ధన్యుడయ్యాడు .తనకున్నజ్ఞానాన్ని శిష్యులకు బోధిస్తూ వారిని సన్మార్గం లో నడిపేవాడు .క్రమంగా శిష్యులు పెరిగి జమీందారు అభిమానమూ పొంది పేరుపొందాడు అపరాదత్తావతారం హుస్నాబాద్ నివాసి మాణిక్ ప్రభు పీరోజి శిష్యుడైనాడు .1889 జులై 9న విరోధి వత్సర ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు మహర్షి పీరోజి రామనామ స్మరణ చేస్తూ ,లింగోద్భవ కాలం లో పరమపదం చేరారు.
మహర్షి పీరోజీ 1-నవ కుసుమమాల 2పన్నగాచల నాయక శతకం 3-గజేంద్ర మోక్షం 4-పరమానంద సుధా లహరి 5-దశావతార దండకం 6-శేష గురు శతకం 7-నమశ్శివాయగేయాలు 8-సాత్రాజితీయం 9-పంచీకరణం 10-శ్రీరామ శతకం 11-స్వప్రకాశం 12-ఆచార్య శతకం 13-తత్వ సంగ్రహం 14-ప్రహ్లాద చరిత్ర రాశారు .
మహర్షి అనేక దివ్యమహిమలు చూపారు .బవిరి శెట్టి ఓబయ్య అనే వైశ్యుడు ,తన చేలో పశువులు పడి తిన్నాయనే కోపం తో పశులకాపరి తిట్టి ఆవులను బందలదొడ్డి లో పెడుతుంటే మహర్షి చూసి అతనికి వచ్చే ప్రమాదం తెలీకుండా ఉన్నాడని అతనిపై జాలిపడ్డారు.ఆ రాత్రి ఓబయ్య, భార్య విపరీతం గా పోట్లాడుకొని ,భార్యను బయటికి నెట్టి తలుపులు బిగించుకొని ఉరేసుకొని చనిపోయాడు .దీన్ని బట్టి పీరోజే మహర్షి త్రికాల వేది అనే నమ్మకం కలిగింది .మరోసారి పనిమీద వేశ్యా వీధినుంచి వెడుతూ ఉండగా శ్రీహరి అనే వేశ్య కామ చేష్టలతో మహర్షి ని ఇంట్లోకి రమ్మని కోరింది .లోపలి వెళ్ళగా ఉచితాసనం పై కూర్చోపెట్టి అన్ని రకాల సపర్యలు చేసి తన కోరిక వెళ్ళబెట్టింది .కోప పడకుండా చిరు నవ్వుతో సోదరీ భావం తో జ్ఞానబోధ చేసి ,ప్రేమ దృష్టి ప్రసాదించి ఆ రొంపి లో నుంచి ఉద్దరించారు .
మరోసారి అడవిలో మేసే జమీందారు గారి ఆవును ఒక పెద్దపులి పట్టుకోగా ఆమార్గాన భజన చేసుకొంటూ వెడుతున్న మహర్షి చూసి చేతికర్ర తోఝడిపించి ఇస్,ఇస్ అంటూ అదలించగా అది ఆవును వదిలి పోగా , వెంట ఉన్న భక్తులకు వారి సర్వజ్ఞత్వం అర్ధమైంది .ఒకసారి నీలిమందు వ్యాపారం చేసే కోట అప్పయ్య ‘’ఇప్పుడు నీలిమందు అమ్మితే లాభమా నష్టమా చెప్పండి ‘’అని అడిగితె ‘’లాభ నష్టాల మాట తర్వాత ముందు అర్జెంట్ గా గిడ్డంగి ఖాళీచేయించు ‘’అన్నారు .మహర్షి మాటపై నమ్మకం తో ఆరోజే ఖాళీ చేశాడు మర్నాడు అగ్ని ప్రమాదం లో అతడి నీలిమందు గోడౌన్ పూర్తిగా తగలబడింది .
పంధ్యా కోటప్ప అనే ఆయన ‘’దేవుడిని చూపించండి ‘’అని ‘’ పరిహాసంగా అడిగితె ‘’పిచ్చోడా పో పో ‘’అన్నారు .అంతే అతడు నిజంగానే పిచ్చివాడై తిరిగాడు .అతడి బంధుజనం వచ్చి కాళ్ళపై పడి ప్రార్ధిస్తే దయాళువై పిచ్చిని భక్తిగా మార్చి శిష్యుడిని చేసుకొని ఆదరించిన నిష్కళంకుడు పీరోజీ .భార్య నర్సూ బాయి కి కలరాసోకిందని ఉత్తరం వస్తే ,అమావాస్య రోజు చిలుకూరు నుంచి సత్తెనపల్లికి వెడుతుంటే నలుగురు దొంగలు అడ్డగించగా ,వారిని శ్రీరామ సోదరులుగా భావించి ‘’ఎంతో బ్రహ్మానందమాయెనే-మన చింతలన్నియు తీరిపోయేనే ‘’ అని పాడుతూ నృత్యం చేస్తే ,దొంగల బుద్ధిమారి ,తప్పులు మన్నించమని పాదాలపై పడితే కనికరిస్తే వాళ్ళు సత్తెనపల్లి దాకా తోడు వెళ్ళారు .తర్వాత శిష్యులయ్యారు కూడా .సత్తెనపల్లి చేరి మరణ శయ్యమీద ఉన్న భార్యను తల్లిపాలు లేక అలమటించే పిల్లాడిని చూసి ,కలరాభయం తో గజగాజలాడు తున్న ఊరి జన దీన వదనాలను చూసి వెంటనే చెరువుకు వెళ్లి స్నానం చేసి ఒడ్డునున్న చెట్టు కింద కూర్చుని తపం ప్రారంభించగా ఆ సాయంకాలానికే ఊళ్ళో కలరా తగ్గటం మొదలైంది .కలరానుంచి భార్యతో సహా అందరూ తేరుకొని సంపూర్ణారోగ్యం పొందారు .
ఒకసారి భద్రాచల యాత్రకు వెడుతుంటే దారిలో మొలకల పల్లి దగ్గర ఆగి వంట ప్రయత్నం చేస్తుంటే బండీ లో వేసిన బియ్యం బస్తాకనిపించలేదు .ఇంతలో ఒక కొత్తవ్యక్తి దారిలో బియ్యం బస్తా కనిపించిందని చెప్పి అప్పగించి వెళ్ళాడు .వంటలుపూర్తయి అందరూ హాయిగా భోజనాలు చేశారు .ఇది మహర్షి 54వ ఏట జరిగింది .’’యెంత దయార్ద్ర మానసుడవు –నే నెంత వేడిన గనపడవు ‘’అని ఆర్తిగా పాడుకొంటూ భద్రగిరి చేరి శ్రీరామ దర్శనం చేశారు మహర్షి పీరోజీ .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -30-1-21-ఉయ్యూరు